ఇంత దారుణమా! | Vigilance Attacks On Welfare accommodation PSR Nellore | Sakshi
Sakshi News home page

ఇంత దారుణమా!

Published Fri, Sep 7 2018 1:55 PM | Last Updated on Fri, Sep 7 2018 1:55 PM

Vigilance Attacks On Welfare accommodation PSR Nellore - Sakshi

కోట మండలం చిట్టేడు ఎస్సీ బాలికల వసతి గృహంలో మరుగుదొడ్లను పరిశీలిస్తున్న విజిలెన్స్‌ అధికారి దివాకర్‌

జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లలో నెలకొన్న పరిస్థితులను చూసి విజిలెన్స్‌ అధికారులు విస్తుపోయారు.మెనూ సక్రమంగా పాటించకపోవడం..నాసిరకం భోజనం.. దుస్థితిలో వంట గదులు.. అధ్వానంగా మరుగుదొడ్లు.. నీటి సమస్యతో విద్యార్థుల అవస్థలు.. హాజరు పట్టిలో మాయాజాలం.. బయోమెట్రిక్‌ మెషిన్లు మూలన పెట్టేసి విద్యార్థుల సంఖ్యను ఎక్కువగా చూపించడంపై తనిఖీ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు స్వచ్ఛమైన నీరు అందించాల్సిన ఆర్వో మెషిన్లు మూలన పడ్డాయి. అద్దె భవనాలు.. ఇరుకు గదుల్లో చదువులపై గురువారం తెల్లవారు జాము నుంచి విజిలెన్స్‌ అధికారులు ఎనిమిది హాస్టళ్లను తనిఖీ చేశారు. అక్కడ విద్యార్థులు పడుతున్న అవస్థలను కళ్లారా చూసి నిర్వాహకులపైఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస వసతులు సైతంలేవని తనిఖీ బృందం గుర్తించింది.

నెల్లూరు రూరల్‌:  జిల్లాలోని ఎస్సీ వసతి గృహాల్లో సౌకర్యాలపై గురువారం తెల్లవారుజాము నుంచే విజిలెన్స్‌ అధికారులు ఎనిమిది బృందాలుగా విడిపోయి బాలాయపల్లి, వెంకటగిరి, చిట్టేడు, మర్రిపాడు, కంపసముద్రం, చిట్టమూరు, వింజమూరు, సిద్ధనకొండూరు ప్రాంతాల్లోని సాంఘిక సంక్షేమ శాఖ హాస్టళ్లల్లో తనిఖీ చేశారు. ఆయా వసతి గృహాల్లో వసతులు, నిత్యావసర సరుకుల కొనుగోలు, వస్తువుల వినియోగం, పారిశుద్ధ్యం, మౌలిక వసతులు, విద్యార్థుల సంఖ్య ఇలా అన్నింటిని తనిఖీలు చేశారు. రికార్డుల ప్రకారం నమోదు చేసుకున్న వివరాలు కూడా పరిశీలించారు. ప్రస్తుతం హాస్టళ్లల్లో ఉన్న విద్యార్థుల సంఖ్యకు, హాజరు పట్టికలోని విద్యార్థుల సంఖ్యకు వ్యత్యాసం ఉన్నట్లుగుర్తించారు. బయోమెట్రిక్‌ మెషిన్లు వినియోగించకుండా ఎక్కువ మంది విద్యార్థులను చూపిస్తూ నిధులు దుర్వినియోగానికి పాల్పడుతున్నట్లు తేల్చారు. హాస్టల్‌ వార్డెన్లు నాసిరకం వస్తువులు వినియోగించి విద్యార్థులకు భోజనం పెడుతూ నిధులు స్వాహా చేసినట్లు గుర్తించారు. హాస్టల్‌లో నిల్వ చేసిన వేరుశనగ విత్తనాలు, పప్పు దినుసులు పుచ్చిపోయి పురుగులు కనిపిస్తున్నా.. వాటితో చట్నీ చేసి విద్యార్థులకు వడ్డించినట్లు తేల్చారు. కూరగాయలు వాడిపోయి ఉన్నవి. ఇక అన్ని వంటల్లో వినియోగించే ఉప్పు, నూనెలు కాలం తీరినవే ఉన్నాయి. అన్నం పూర్తిగా ముద్దగా మారడమే కాకుండా ఉంటలు కట్టి ఉంది. ఉదయం టిఫిన్‌గా గోధుమ రవ్వతో ఉప్మా చేయాల్సి ఉండగా పులి హోరాతో సరిపెట్టారు. కోడిగుడ్డు ఇవ్వాల్సి ఉన్నా ఇవ్వనే లేదు. అన్ని చోట్లా నిబంధనలు ఉల్లంఘిస్తున్న విషయం వెలుగు చూసింది. 

తాగునీరు..పారిశుద్ధ్యం అధ్వానం
హాస్టల్‌లో తాగునీటిని బయట నుంచి కొనుగోలు చేస్తుండగా, మరుగుదొడ్లు, బాత్‌రూమ్‌లు చాలా దారుణంగా ఉన్నాయి. వాటిలో ఒకదానికి కూడా సరిగా తలుపులు సరిగా లేవు. వీటిని శుభ్రం చేసేవారు లేకపోవడంతో దుర్వాసన వెదజల్లుతున్నాయి. దీంతో విద్యార్థులు ఆరు బయటకు వెళ్లాల్సి వస్తున్నట్లు అధికారులు గుర్తించారు. హాస్టళ్ల పరిస్థితి, స్వచ్ఛమైన నీరు ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన ఆర్వో మిషన్లు పనిచేయడం లేదని దీంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకున్నారు. సౌకర్యాలు, అధికారుల పనితీరుపై ఓ నివేదికను ప్రభుత్వానికి పంపి, బాధ్యులపై చర్యలకు సిఫారస్సు చేసినట్లు విజిలెన్స్‌ అధికారులు తెలిపారు.

జిల్లా అంతటా ఇంతే!
పేద విద్యార్థులకు సౌకర్యాలతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తామని ఊదరకొడుతున్న టీడీపీ ప్రభుత్వం ఆ దిశగా  చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. జిల్లాలో 73 ఎస్సీ హాస్టళ్లు, 79 బీసీ హాస్టళ్లు, 23 ఎస్టీ హాస్టళ్లు ఉన్నాయి. వీటిలో 19,645 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. నేటికి అద్దె భవనాల్లో చాలీచాలని గదుల్లో చదువుతూ కాలం వెల్లదీస్తున్నారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, బాత్‌రూంలు, మరుగుదొడ్ల మరమ్మతుల కోసం నిధుల విడుదలలో జాప్యం వల్ల హాస్టళ్ల పరిస్థితి అధ్వానంగా మారింది. విద్యార్థుల సమస్యలు పరిష్కరించడంలో పాలకులు, అధికారులు విఫలమయ్యారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

సిద్ధనకొండూరులోని వసతిగృహానికి ప్రహరీ లేదు. నీటి సమస్య తీవ్రంగా ఉంది. వసతిగృహం భవనాలు ఉరుస్తున్నాయి.
కోట బాలికల వసతి గృహంలో నీటి వసతి సరిగాలేదు. మరుగుదొడ్లకు తలుపుల్లేవు. వార్డెన్‌కు మందలింపు, సిబ్బందిపై ఆగ్రహం.
వెంకటగిరిలో అధ్వానంగా వంట గది, పని చేయని ఆర్వో మెషిన్లు, డ్రైనేజీ వ్యవస్థ సరిగాలేదు. బాత్‌రూమ్‌లు సరిపడా లేవు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement