బయోమెట్రిక్‌ను పక్కాగా అమలు చేయండి | Vidadala Rajini directive to medical department officials | Sakshi
Sakshi News home page

బయోమెట్రిక్‌ను పక్కాగా అమలు చేయండి

Published Tue, Aug 30 2022 4:06 AM | Last Updated on Tue, Aug 30 2022 2:47 PM

Vidadala Rajini directive to medical department officials - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సెప్టెంబర్‌ ఒకటో తేదీ నుంచి బయోమెట్రిక్‌ హాజరు విధానాన్ని పక్కాగా అమలుచేయాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులను మంత్రి విడదల రజని ఆదేశించారు. మంగళగిరిలోని వైద్య, ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయంలో ఆ శాఖ ఉన్నతాధికారులు, వివిధ విభాగాల అధిపతులతో సోమవారం మంత్రి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకంలో చికిత్సల సంఖ్యను ప్రభుత్వం గణనీయంగా పెంచిందని, అర్హులైన ప్రజలకు సరైన చికిత్స అందేలా చూడాలన్నారు.

ఆయుష్‌ డిస్పెన్సరీలను పెంచేందుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు అన్ని పరీక్షలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, మందుల కొరత లేకుండా చూడాలన్నారు. ఏపీఎంఎస్‌ఐడీసీ చైర్మన్‌ చంద్రశేఖర్‌ రెడ్డి, వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శులు ఎంటీ కృష్ణబాబు, ముద్దాడ రవిచంద్ర, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ జె.నివాస్, ఏపీవీవీపీ కమిషనర్‌ వినోద్‌కుమార్, ఏపీఎంఎస్‌ఐడీసీ ఎండీ మురళీధర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

వైద్య శాఖలో బోధనాస్పత్రుల పాత్ర కీలకం 
పేద, మధ్య తరగతి ప్రజలకు మెరుగైన వైద్యం అందించే విషయంలో ప్రభుత్వ బోధనాస్పత్రుల పాత్ర కీలకమని మంత్రి విడదల రజని చెప్పారు. డీఎంఈ పరిధిలోని వైద్య కళాశాలలు, బోధనాస్పత్రుల ప్రిన్సిపాళ్లు, సూపరింటెండెంట్‌లతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఆమె మాట్లాడుతూ ఆస్పత్రుల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు వైద్యులు విధుల్లో ఉండేలా చూడాల్సిన బాధ్యత సూపరింటెండెంట్లు, ప్రిన్సిపాళ్లదేనని స్పష్టంచేశారు. ప్రభుత్వాస్పత్రుల్లో సెక్యూరిటీ, శానిటేషన్, పెస్ట్‌ కంట్రోల్‌ ఏజెన్సీల పనితీరును మెరుగుపరచాలని, ఈ మూడు ఏజెన్సీల సిబ్బందికి కూడా సెప్టెంబర్‌ ఒకటో తేదీ నుంచి బయోమెట్రిక్‌ను తప్పనిసరి చేయాలని చెప్పారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement