సాక్షి, హైదరాబాద్: ఆయన పేరు డాక్టర్ దేవేందర్ (పేరు మార్చాం). హైదరాబాద్ సమీపంలోని ఒక ఏరియా ఆసుపత్రిలో స్పెషలిస్ట్ వైద్యుడు. ఆయనకు నగరంలో ప్రైవేట్ ప్రాక్టీస్ ఉంది. దీంతో ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లకుండా మేనేజ్ చేస్తున్నారు. కా నీ, ఆయన రోజూ ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్నట్లుగా హాజరుంటుంది. బయోమెట్రిక్ హాజరున్నా తన మాయాజాలాన్ని ఉపయోగించారు. ఫేస్ రికగ్నేషన్ సందర్భంగా తన ముఖాన్ని కాకుండా ఫొటోను బయోమెట్రిక్ మెషీన్‌లో ఫీడ్ చేయించాడు. అతను వెళ్లకున్నా అక్కడి సిబ్బంది అతని ఫొటోను బయోమెట్రిక్ మెషీన్‌లో హాజరు కోసం ఉపయోగిస్తున్నారు.
మరో డాక్టర్ శ్రవణ్ కుమార్ (పేరు మార్చాం). నిజామాబాద్ జిల్లాలోని ఒక ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. అతను వారానికి ఒకరోజు ఆసుపత్రికి వచ్చి కొద్దిసేపు ఉండి వెళ్తాడు. కానీ, అతను రోజూ వచ్చినట్లుగా హాజరుంటుంది. అతను వేలిముద్ర హాజరును దిద్దుబాటు చేశాడు. తన వేలి ముద్ర బదులుగా అక్కడ రోజూ వచ్చే ఇతర సిబ్బంది వేలిముద్రను ఫీడ్ చేశాడు. దీంతో అతను వెళ్లకుండానే హాజరుపడుతుంది.
ఆమె పేరు డాక్టర్ రవళి(పేరు మార్చాం). రాష్ట్రంలోని ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తారు. ప్రతీ డాక్టర్ తాను పనిచేసినట్లుగా రోజూ ఫొటో తీసి అప్‌లోడ్ చేయాలని ఆ జిల్లాలో నిర్ణయం తీసుకున్నారు. కానీ, ఆమె మాత్రం ఒక రోజు వచ్చి తన వ్రస్తాలను ఐదారుసార్లు మార్చి ఇతర వస్త్రాలను ధరించడం, హెయిర్ స్టైల్‌ను కూడా మార్చి రోగులను చూసినట్లు ఫొటోలు దిగుతారు. వారంలో మిగిలిన రోజులు రాకుండానే ఆ ఫొటోలను అప్‌లోడ్ చేస్తారు.
క్షేత్రస్థాయి తనిఖీల్లో వైద్యుల బండారం బట్టబయలు
రాష్ట్రంలో వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో 48 ఏరియా ఆసుపత్రులు, 108 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, 33 జిల్లా ఆసుపత్రులు ఉన్నాయి. వాటిల్లో ఎండీ, ఇతర సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు వైద్యం చేస్తుంటారు. ఆర్థో, కార్డియాక్, గైనిక్, నెఫ్రాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జన్, గ్యాస్ట్రో వంటి ప్రత్యేక వైద్యం అందుబాటులో ఉంటుంది. కొందరు స్పెషలిస్ట్ వైద్యులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో విధులకు హాజరుకాకుండా హైదరాబాద్‌లోనూ, తాము పనిచేసే సమీప పెద్ద నగరాల్లోనూ ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇటీవల వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్‌కుమార్ క్షేత్రస్థాయి తనిఖీలకు వెళ్లినప్పుడు అనేకచోట్ల డాక్టర్లు విధులకు రాకపోవడాన్ని గుర్తించారు. ఈ మేరకు 50 మంది వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ చేసి, వివరణ కోరారు.
హాజరైనట్లుగా తప్పుడు పద్ధతులు
కొన్ని ఆసుపత్రుల్లో ఫేస్ రికగ్నేషన్ మెషీన్, కొన్నిచోట్ల వేలిముద్రల మెషీన్లను వైద్యవిధాన పరిషత్ ఏర్పాటు చేసింది. అయితే ఫేస్ రికగ్నేషన్ మెషీన్‌లో కొందరు డాక్టర్లు ముఖం కాకుండా ఫొటోలను ఫీడ్ చేశారు. ఆ ఫొటోను ఆ ఆసుపత్రిలో పనిచేసే వైద్యసిబ్బందికి ఇచ్చి, రోజూ ఫొటోను ఫేస్ రికగ్నేషన్ మెషీన్ ముందు పెట్టి హాజరు వేయిస్తుంటారు. కొందరు డాక్టర్లయితే వారాల తరబడి కూడా ఆసుపత్రుల ముఖం చూడటంలేదని తేలింది. కానీ, హాజరైనట్లుగా మెషీన్లో నమోదవుతుంది. కొన్నిచోట్ల తమకు బదులుగా అక్కడి సిబ్బంది వేలిముద్రలను మెషీన్లలో ఫీడ్ చేయించారు. సిబ్బంది వేలిముద్రల సహాయంతో హాజరైనట్లుగా నమోదు చేయించుకుంటున్నారు.
కొందరు డాక్టర్లు మంత్రులు, ఎమ్మెల్యేలు, రాజకీయ నేతల కుటుంబసభ్యులకు వైద్యం చేస్తూ మెప్పు పొందుతున్నారు. ఇటువంటి వారిని ఏమీ అనలేని పరిస్థితి నెలకొందని ఉన్నతాధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఒక జిల్లాలో ఒక మహిళా ఎంబీబీఎస్ డాక్టర్ వారానికి ఒకసారి వచ్చి తన వ్రస్తాలను మార్చి మార్చి ఇతర వ్రస్తాలను ధరించి ఫొటోలు దిగి బయోమెట్రిక్ అటెండెన్స్‌లో ఫీడ్ చేసిన విషయం వెలుగు చూసింది. ఈ డాక్టర్‌పై చర్యలు తీసుకోవడానికి అధికారులు ప్రయత్నించగా కొందరు మంత్రుల ఆఫీసుల నుంచి ఫోన్లు చేసి అడ్డుకున్నట్లు తెలిసింది. మరోవైపు కొన్ని సంఘాలు కూడా ఇటువంటి డాక్టర్లకు వంతపాడుతున్నాయని ఉన్నతాధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment