Doctors Scams
-
డాక్టర్ల ఫొటోలే వైద్యం చేస్తుంటాయ్!
సాక్షి, హైదరాబాద్: ఆయన పేరు డాక్టర్ దేవేందర్ (పేరు మార్చాం). హైదరాబాద్ సమీపంలోని ఒక ఏరియా ఆసుపత్రిలో స్పెషలిస్ట్ వైద్యుడు. ఆయనకు నగరంలో ప్రైవేట్ ప్రాక్టీస్ ఉంది. దీంతో ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లకుండా మేనేజ్ చేస్తున్నారు. కా నీ, ఆయన రోజూ ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్నట్లుగా హాజరుంటుంది. బయోమెట్రిక్ హాజరున్నా తన మాయాజాలాన్ని ఉపయోగించారు. ఫేస్ రికగ్నేషన్ సందర్భంగా తన ముఖాన్ని కాకుండా ఫొటోను బయోమెట్రిక్ మెషీన్లో ఫీడ్ చేయించాడు. అతను వెళ్లకున్నా అక్కడి సిబ్బంది అతని ఫొటోను బయోమెట్రిక్ మెషీన్లో హాజరు కోసం ఉపయోగిస్తున్నారు. మరో డాక్టర్ శ్రవణ్ కుమార్ (పేరు మార్చాం). నిజామాబాద్ జిల్లాలోని ఒక ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. అతను వారానికి ఒకరోజు ఆసుపత్రికి వచ్చి కొద్దిసేపు ఉండి వెళ్తాడు. కానీ, అతను రోజూ వచ్చినట్లుగా హాజరుంటుంది. అతను వేలిముద్ర హాజరును దిద్దుబాటు చేశాడు. తన వేలి ముద్ర బదులుగా అక్కడ రోజూ వచ్చే ఇతర సిబ్బంది వేలిముద్రను ఫీడ్ చేశాడు. దీంతో అతను వెళ్లకుండానే హాజరుపడుతుంది. ఆమె పేరు డాక్టర్ రవళి(పేరు మార్చాం). రాష్ట్రంలోని ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తారు. ప్రతీ డాక్టర్ తాను పనిచేసినట్లుగా రోజూ ఫొటో తీసి అప్లోడ్ చేయాలని ఆ జిల్లాలో నిర్ణయం తీసుకున్నారు. కానీ, ఆమె మాత్రం ఒక రోజు వచ్చి తన వ్రస్తాలను ఐదారుసార్లు మార్చి ఇతర వస్త్రాలను ధరించడం, హెయిర్ స్టైల్‌ను కూడా మార్చి రోగులను చూసినట్లు ఫొటోలు దిగుతారు. వారంలో మిగిలిన రోజులు రాకుండానే ఆ ఫొటోలను అప్లోడ్ చేస్తారు. క్షేత్రస్థాయి తనిఖీల్లో వైద్యుల బండారం బట్టబయలు రాష్ట్రంలో వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో 48 ఏరియా ఆసుపత్రులు, 108 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, 33 జిల్లా ఆసుపత్రులు ఉన్నాయి. వాటిల్లో ఎండీ, ఇతర సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు వైద్యం చేస్తుంటారు. ఆర్థో, కార్డియాక్, గైనిక్, నెఫ్రాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జన్, గ్యాస్ట్రో వంటి ప్రత్యేక వైద్యం అందుబాటులో ఉంటుంది. కొందరు స్పెషలిస్ట్ వైద్యులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో విధులకు హాజరుకాకుండా హైదరాబాద్‌లోనూ, తాము పనిచేసే సమీప పెద్ద నగరాల్లోనూ ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇటీవల వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్‌కుమార్ క్షేత్రస్థాయి తనిఖీలకు వెళ్లినప్పుడు అనేకచోట్ల డాక్టర్లు విధులకు రాకపోవడాన్ని గుర్తించారు. ఈ మేరకు 50 మంది వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ చేసి, వివరణ కోరారు. హాజరైనట్లుగా తప్పుడు పద్ధతులు కొన్ని ఆసుపత్రుల్లో ఫేస్ రికగ్నేషన్ మెషీన్, కొన్నిచోట్ల వేలిముద్రల మెషీన్లను వైద్యవిధాన పరిషత్ ఏర్పాటు చేసింది. అయితే ఫేస్ రికగ్నేషన్ మెషీన్లో కొందరు డాక్టర్లు ముఖం కాకుండా ఫొటోలను ఫీడ్ చేశారు. ఆ ఫొటోను ఆ ఆసుపత్రిలో పనిచేసే వైద్యసిబ్బందికి ఇచ్చి, రోజూ ఫొటోను ఫేస్ రికగ్నేషన్ మెషీన్ ముందు పెట్టి హాజరు వేయిస్తుంటారు. కొందరు డాక్టర్లయితే వారాల తరబడి కూడా ఆసుపత్రుల ముఖం చూడటంలేదని తేలింది. కానీ, హాజరైనట్లుగా మెషీన్లో నమోదవుతుంది. కొన్నిచోట్ల తమకు బదులుగా అక్కడి సిబ్బంది వేలిముద్రలను మెషీన్లలో ఫీడ్ చేయించారు. సిబ్బంది వేలిముద్రల సహాయంతో హాజరైనట్లుగా నమోదు చేయించుకుంటున్నారు. కొందరు డాక్టర్లు మంత్రులు, ఎమ్మెల్యేలు, రాజకీయ నేతల కుటుంబసభ్యులకు వైద్యం చేస్తూ మెప్పు పొందుతున్నారు. ఇటువంటి వారిని ఏమీ అనలేని పరిస్థితి నెలకొందని ఉన్నతాధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఒక జిల్లాలో ఒక మహిళా ఎంబీబీఎస్ డాక్టర్ వారానికి ఒకసారి వచ్చి తన వ్రస్తాలను మార్చి మార్చి ఇతర వ్రస్తాలను ధరించి ఫొటోలు దిగి బయోమెట్రిక్ అటెండెన్స్‌లో ఫీడ్ చేసిన విషయం వెలుగు చూసింది. ఈ డాక్టర్‌పై చర్యలు తీసుకోవడానికి అధికారులు ప్రయత్నించగా కొందరు మంత్రుల ఆఫీసుల నుంచి ఫోన్లు చేసి అడ్డుకున్నట్లు తెలిసింది. మరోవైపు కొన్ని సంఘాలు కూడా ఇటువంటి డాక్టర్లకు వంతపాడుతున్నాయని ఉన్నతాధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
రోగిని తీసుకొస్తే ‘నీకింత... నాకింత’
‘‘కరీంనగర్ డాక్టర్స్ స్ట్రీట్‌లోని ఓ హాస్పిటల్‌కు జగిత్యాలలో రోడ్డు ప్రమాదంలో కాలు విరిగిన వ్యక్తిని బంధువులు, ఆర్ఎంపీ సహకారంతో తీసుకొచ్చారు. కాలు తొంటిభాగం విరగడంతో బాల్ రీప్లేస్మెంట్ చేయాలన్నాడు డాక్టర్. వెంటనే హాస్పిటల్ నిర్వాహకుడు రంగప్రవేశం చేశాడు. రూ.2 లక్షల ప్యాకేజీ కింద బేరం కుదిరింది. అడ్వాన్స్ చెల్లించి ఆసుపత్రిలో చేర్చారు. హాస్పిటల్ పీఆర్వో అక్కడికక్కడే 30 శాతం కమీషన్ రూ.60 వేలు ఆర్ఎంపీకి ఇచ్చేశాడు.’’ ‘‘ఓ గ్రామానికి చెందిన ఆర్ఎంపీ రిఫరెన్స్‌తో వచ్చిన రోగి నుంచి ఓ ప్రైవేటు హాస్పిటల్ వైద్యం కోసం లక్ష రూపాయలు వసూలు చేసింది. అయితే ఆర్ఎంపీకి ఇవ్వాల్సిన 30 శాతం కమీషన్ ఇవ్వలేదు. దీంతో సదరు ఆర్ఎంపీ సమస్యను వాళ్ల అసోసియేషన్ దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో హాస్పిటల్ యాజమాన్యం కొంత మొత్తాన్ని కమీషన్‌గా చేతిలో పెట్టి పంపించారు. తనకు రావలసిన పూర్తి కమీషన్ కోసం ఆయన చాలా కాలమే పోరాడాడు.’’ ‘‘1980–90 దశకంలో పీపుల్స్‌వార్ ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాల్లో మెడికల్ ప్రాక్టీషనర్లుగా రూ.లక్షల్లో సంపాదించిన వాళ్లు ఉమ్మడి కరీంనగర్లో ఉన్నారు. వైద్యంతోపాటు గర్భ విచ్చిత్తి స్పెషలిస్టుగా రూ.లక్షలు సంపాదించిన ఓ ప్రైవేటు మెడికల్ ప్రాక్టీషనర్ కరీంనగర్‌లోని ఓ సినిమా థియేటర్ సమీపంలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించాడు. ఈ అబార్షన్ స్పెషలిస్టు హాస్పిటల్‌పై గతంలో దాడి కూడా జరిగింది. కన్సల్టెంట్ డాక్టర్లతో, ఎలాంటి సర్టిఫికెట్ లేకపోయినా తాను కూడా వైద్యం చేస్తూ ఇప్పటికీ ‘క్యాష్పిటల్’ను నిర్వహిస్తున్నాడు. తాను వచ్చిన దారిలోనే మెడికల్ ప్రాక్టీషనర్లనే ఏజెంట్లుగా చేసుకుని వైద్య వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాడు.’’ సాక్షి, కరీంనగర్ : కరీంనగర్ పట్టణంలో హాస్పిటల్స్ డబ్బులు సంపాదించి పెట్టే ‘క్యాష్’పిటల్స్గా మారాయి. వైద్యం పక్కా వ్యాపారంగా తయారైంది. వైద్యుడే ఆసుపత్రి స్థాపించి రోగులకు సేవలు అందించే కాలం నుంచి వైద్యున్ని నియమించుకుని, ఆర్ఎంపీలు, అంబులెన్స్ డ్రైవర్లు, పీఆర్వోల సాయంతో వ్యాపారం చేసే పరిస్థితులు ఏర్పడ్డాయి. రోగం లేకపోయినా.. సృష్టించి వైద్యం చేసే స్థాయికి కరీంనగర్‌లోని ‘కాసు’పత్రులు దిగజారాయి. రోగి బాధను, భయాన్ని ‘క్యాష్’ చేసుకునే వ్యాపారం ప్రణాళికాబద్ధంగా సాగిపోతోంది. కొత్తగా ఏర్పాటైన దవాఖానాల నుంచి అంతో ఇంత పేరున్న హాస్పిటళ్ల వరకు గ్రామాలు, కోల్‌బెల్ట్ ఏరియాలోని మెడికల్ ప్రాక్టీషనర్ల పైనే ఆధారపడి వ్యాపారం సాగిస్తున్నాయి. రోగి చెల్లించే ఫీజుల నుంచి 30 నుంచి 60 శాతం వరకు కమీషన్లు ఇస్తున్నాయి. చివరకు ఒకటి రెండు కార్పొరేట్ ఆసుపత్రులు సైతం కమీషన్లు ఇచ్చి రోగులను ఆసుపత్రులకు రప్పించుకునే దయనీయ స్థితి కరీంనగర్లో నెలకొంది. రోగిని తీసుకొస్తే నీకింత... నాకింత అనే ధోరణిలో వైద్య వ్యాపారం సాగిపోతోంది. రోగుల డబ్బుతో హైఫై బతుకులు గ్రామీణ ప్రాంతాల్లోని ఆర్ఎంపీ(రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్), పీఎంపీ (ప్రైవేటు మెడికల్ ప్రాక్టీషనర్) నుంచి పట్టణాల్లోని పెద్ద డాక్టర్ల వరకు పేద, మధ్య తరగతి రోగుల నుంచి వసూలు చేసే డబ్బులతోనే బతుకుతున్నారనడంలో అతిశయోక్తి లేదు. ఇన్‌పేషంట్‌గా చేరినప్పుడే “రెఫర్ బై’ అనే కాలంలో సదరు మెడికల్ ప్రాక్టీషనర్ పేరును రాసుకుని వసూలు చేసిన మొత్తం నుంచి మాట్లాడుకున్న కమీషన్ ఇవ్వడం పరిపాటిగా మారింది. కరీంనగర్ జిల్లాలో జరిగే వైద్య వ్యాపారంలో మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల పేషెంట్లదే సింహభాగమని చెప్పవచ్చు. ఆయా ప్రాంతాల ఆర్ఎంపీలు నేరుగా కరీంనగర్‌లోని తమకు కమీషన్లు ఇచ్చే ఆసుపత్రులకు బలవంతంగా పంపిస్తున్నారు. ప్రొఫెషనల్ డాక్టర్ కూడా సంపాదించలేనంత సొమ్మును కేవలం రెఫరల్ కేసుల ద్వారా ఆర్ఎంపీలు సంపాదిస్తున్నారు. అలా సంపాదించిన డబ్బుతో డాక్టర్లను నియమించుకుని సొంతంగా హాస్పిటల్స్ ఏర్పాటు చేసుకున్నవారు కూడా ఉన్నారు. దీంతో కొన్ని ఆసుపత్రుల యాజమాన్యాలు పూర్తిగా ఆక్రమ మార్గంలోనే పయనిస్తున్నాయి. ఆసుపత్రుల యాజమాన్యాలు డాక్టర్లకు లక్షల రూపాయల వేతనాలు ఇస్తూ పోషిస్తున్నాయి. ఆ ఖర్చును సైతం రోగులపై రుద్దుతూ.. మరో వైపు డాక్టర్లకు సైతం రోగుల సంఖ్య పెంచేలా టార్గెట్లు నిర్దేశిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గ్రామాలు, సింగరేణి కోల్‌బెల్ట్‌లోని ఆర్ఎంపీలను ఆశ్రయిస్తున్నారు. ఆర్ఎంపీల ద్వారా వచ్చిన రోగుల నుంచి వసూలు చేసిన సొమ్మును అందరూ కలిసి పంచుకుంటున్నారు. ఇదంతా పెద్ద మాఫియాగా నడుస్తున్న వ్యవహారం. దీనిపై వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు దృష్టి సారించకపోవడంతో వీరి వ్యాపారం దిగ్విజయంగా సాగిపోతోంది. మెడికల్ టెర్మినాలజీ తెలియకున్నా... అక్షరం ముక్క మెడికల్ టెర్మినాలజీ రాని ఆర్ఎంపీలు, పీఎంపీలు డాక్టర్ల పేరుతో చలామణి అవుతున్నారు. ఇంటికి వచ్చి మందులు ఇచ్చే మెడికల్ ప్రాక్టీషనర్ల వెనుక పెద్ద మాఫియానే నడుస్తోంది. కమీషన్లు, గిఫ్టులు, వాటాలు, స్టార్ హోటళ్లలో విందులు, విదేశీయానాలు ఇలా చెప్పుకుంటూ పోతే... కొందరు ఆర్ఎంపీలు అనుభవిస్తున్న రాజభోగం అంతా ఇంతా కాదు. కరీంనగర్‌తోపాటు కొన్ని పట్టణాల్లోని ప్రైవేటు, కార్పొరేట్‡ ఆసుపత్రులు గ్రామీణ ప్రాంతాల్లోని ఆర్ఎంపీలకు 20 నుంచి 60 శాతం వరకు హాస్పిటళ్ల స్థాయిని బట్టి కమిషన్లు ఇచ్చి మరీ రోగులను ఆసుపత్రులకు రప్పించుకుంటున్నా రు. ఇలాంటి కమీషన్లకు ఆశపడుతున్న ఆర్ఎంపీలు రోగులను భయపెట్టి మరీ వారు చెప్పిన ప్రైవేటు ఆసుపత్రులకు పంపిస్తున్నారు. గ్రామీ ణ, పట్టణ ప్రాంతాల్లో చిన్నా చితకా వైద్యం చేసుకునే ప్రాక్టీషనర్లు ప్రైవేటు ఆసుపత్రులను, వైద్యులను శాసించే స్థాయికి ఎదిగారు. అవసరం లేకపోయినా రోగుల్ని ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులకు పంపించి అడ్డగోలు ఆపరేషన్లు చేయిస్తున్నారు. చిన్నపాటి జబ్బులకు కూడా రకరకాల పరీక్షలు చేయించి తమ వాటా తీసుకుంటున్నారు. ఇటీవల ఆర్ఎంపీలు ఏర్పా టు చేస్తున్న క్లినిక్‌ల సంఖ్య పెరుగుతోంది. వీళ్లకు కమీషన్లు ఇచ్చేందుకు ప్రతీ ఆసుపత్రిలో ప్రత్యేకంగా పీఆర్వో (పేషంట్ రిలేషన్ ఆఫీసర్)ను ఏర్పాటు చేసుకున్నారు. ఏ ఆపరేషన్‌కు ఎంత కమీషన్ ఇవ్వాలి, ఏ ఆర్ఎంపీలకు ఎంత ముట్టజెప్పాలో వీరు చూసుకుంటారు. అప్పుడప్పుడూ గ్రామాలకు వెళ్లి ఆర్ఎంపీలతో కొత్త డీల్స్ కుదుర్చుకుంటారు. జిల్లా వైద్యాధికారులు ఎవరూ పీఎంపీ, ఆర్ఎంపీల ద్వారా సాగుతున్న దందాపై కనీసం దృష్టి పెట్టడం లేదు. కోల్‌బెల్ట్ ఏరియాలో మాఫియాగా సింగరేణి ప్రాంతంలో మెడికల్ ప్రాక్టీషనర్ల దందా మాఫియాగా తయారైంది. బొగ్గు గనులు అధికంగా ఉన్న పెద్దపల్లి జిల్లాలోని గోదావరిఖ ని, యైటింక్లయిన్‌కాలనీ, సెంటినరీకాలనీ, బేగంపేటతోపాటు మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్, సీసీసీ, రవీంద్రఖని, రామకృష్ణాపూర్, మందమర్రి, బెల్లంపల్లి, కాసిపేట, తాండూరు, ఆసిఫాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మెడికల్ ప్రాక్టీస్ ద్వారా లక్షల్లో సంపాదించిన వారు ఉన్నారు. గని కార్మికుల కోసం సింగరేణి ఏరి యా ఆసుపత్రులు, ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నా మెడికల్ ప్రాక్టీషనర్లేనే ఆశ్రయించడం పరిపాటిగా మారింది. ప్రమాదాల నుంచి పెద్ద రోగాల వరకు సింగరేణి ఉచితంగా చికిత్స చేయించే అవకాశాలను కాదని, కార్మికులను ఏమార్చి చికిత్స కోసం ఆర్ఎంపీ, పీఎంపీలు కరీంనగర్‌లోని ప్రైవేటు ఆసుపత్రులకు పంపిస్తున్నారు. సింగరేణి నుంచి రిఫరల్ కేసులుగా వచ్చే రోగులకు సంబంధించి అధిక మొత్తంలో కమీషన్లు ముట్ట జెపుతున్నాయి కరీంనగర్ హాస్పిటళ్లు. వేల మంది మెడికల్ ప్రాక్టీషనర్ల ద్వారా... కరీంనగర్ జిల్లాలో 259 ప్రైవేటు ఆసుపత్రులు ఉన్నాయి. వీటిలో కరీంనగర్ పట్టణంలోనే 200 వరకు చిన్నా, పెద్ద ఆసుపత్రులున్నాయి. వీట న్నింటికీ అనుసంధానంగా సుమారు 3 వేల మంది ఆర్ఎంపీలు పనిచేస్తున్నారు. గ్రామాల్లో జ్వరం, దగ్గు, దమ్ము, ప్రాథమిక చికిత్స వరకు ఆర్ఎంపీ, పీఎంపీలు చేసే వైద్యంపై అభ్యంతరాలు ఏమీ ఉండవు. నిబంధనల ప్రకారం ఆర్ఎంపీలు ప్రాథమిక చికిత్స మినహా ఆపరేషన్లు చేయడం, స్టెరాయిడ్స్ ఇవ్వడం, యాంటీ బయోటిక్స్ వాడకూడదు. కరీంనగర్ గోదావరిఖని, జగిత్యాల, సిరిసిల్ల వంటి పట్టణాల్లో ప్రైవేటు ఆసుపత్రులకు ఆదాయాన్ని సమకూర్చిపెట్టే సాధనాలుగా వీరు మారిపోయారు. -
ధనార్జనే.. ధ్యేయంగా..
మిర్యాలగూడ అర్బన్ : వైద్యులు దేవుడితో సమానం అంటారు. కానీ మిర్యాలగూడలోని కొందరు డాక్టర్లు అలాకాదు. వీరికి ధనార్జనే ముఖ్యం. ఆస్పత్రులలో కనీస వసతులు కల్పించకున్నా ఆపరేషన్ల పేరుతో వేలకు వేలు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సహజ సిద్ధంగా జరగాల్సిన కాన్పులను సైతం ఆపరేషన్లు చేస్తూ వైద్యవత్తికే కళంకం తెస్తున్నారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. మహిళ గర్భం దాల్చిన నాటి నుంచి 9 నెలలు ప్రతినెలా ఆస్పత్రికి రావలసిందే. దీంతో ప్రతినెలా నానా రకాల టెస్టులు, స్కానింగ్లతో వారిని దోచుకోవడమే పరమావధిగా డాక్టర్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. నెలలు నిండేవరకు కొంత మంది డాక్టర్లు ఐదు సార్లు స్కానింగ్ చేయిస్తూ, మూడుసార్లు సర్జికల్ ప్రొఫైల్ టెస్టులు చేయిస్తున్నారని సమాచారం. సహజ సిద్ధంగా నార్మల్ డెలివరీ అయ్యే మహిళలకు కూడా ఆపరేషన్లు చేయడం డాక్టర్లకు ఆనవాయితీగా మారిందనే వాదనలూ లేకపోలేదు. దీంతో పట్టణంలోని ఒక్కో ఆస్పత్రిలో నెలకు సూమారు 80 నుంచి 120 ఆపరేషన్లు చేస్తున్నట్లు సమాచారం. కనీస వసతులు కరువు... పట్టణంలోని ఆస్పత్రుల్లో కనీస సౌకర్యాలు కల్పించడం లేదని రోగులు వాపోతున్నారు. చీకటిగదులు, తీవ్రమైన దుర్వాసనల మధ్యే రోగులను ఉంచుతున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదు. ఏదైన ఆస్పత్రిలో ఆపరేషన్ వికటించి రోగిమృతి చెందితే చాలు అక్కడ మధ్యదళారులు ప్రత్యక్షమైతున్నారు. పోయిన ప్రాణాలు తిరిగిరావుకదా..గొడవచేస్తే ఏంలాభం.. మీకే నష్టం..అంతో ఇంతో తీసుకొని వెల్లండంటూ బేరాలు కుదిరిస్తున్నారు. వినకుంటే బెదిరింపులకు కూడా దిగుతుట్లు సమాచారం. ఇటీవల ఓ ఆస్పత్రిలో ఆపరేషన్ చేసిన గర్భిణికి ఇన్ఫెక్షన్ సోకి చీముపట్టి తీవ్ర ఇబ్బందులకు గురైంది. దీంతో వారి బంధువులు గొడవకు దిగటంతో బేరసారాలు కుదుర్చుకున్నారు. నిబంధనలు ఇవీ.. పట్టణంలోని ఆస్పత్రులు కనీస నింధనలు పాటించడంలేదని ఆరోపణలు ఉన్నాయి. ప్రతి ఆస్పత్రికి అగ్నిమాపక యంత్రాలు ఉండాలి. ఫైర్ అలారం నీటి ట్యాంకులు తప్పనిసరి వాహనాల రాకపోకలకు అనువుగా ఉండాలి. కాలుష్యం నుంచి ఇబ్బంది లేదని సంబధిత ధ్రువపత్రం కలిగి ఉండాలి. ప్రతి ఐదు మంచాలకు ఒక నర్సును కేటాయించాలి. తగినంత వెలుతురు వచ్చేలా ఆస్పత్రి నిర్మాణాలు ఉండాలి. ఆపరేషన్ చేసే థియేటర్ పక్కాగా, ఆపరేషన్ చేసిన రోగికి ఎలాంటి ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండాలి. మిర్యాలగూడ పట్టణంలోని ఏ ఒక్క ఆస్పత్రిలో ఇవి కనిపించడంలేదు. మున్సిపాలిటీకి తప్పుడు సమాచారం... ప్రైవేటు ఆస్పత్రులలో అయ్యే కాన్పులకు అన్నింటికీ ఒక రికార్డు తయారు చేసి ప్రతినెలా మున్సిపాలిటీకి అందజేయాలని నిబంధనలు ఉన్నాయి. కానీ వీటిని ఆస్పత్రుల యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు. కొన్ని ఆస్పత్రులు సమాచారం ఇచ్చినా ఆపరేషన్ల సంఖ్యను తగ్గించి చూపిస్తున్నట్లు సమాచారం. ఒక్కో ఆస్పత్రిలో సుమారు 80నుంచి 120 ఆపరేషన్లు అవుతుండగా కేవలం 25నుంచి 30 మధ్యలోనే లెక్కలు చూపిస్తున్నట్లు సమాచారం. మరికొన్ని ఆస్పత్రులు స్థాపించిన నాటినుంచి కూడా కాన్పులు వివరాలను మన్సిపాలిటీకి అందిచడం లేదని సమాచారం. సంతాన సాఫల్యం పేరుతోనూ మోసాలు.... మెరుగైన వైద్యంతో సంతానం కల్పిస్తామంటు కొందరు వైద్యులు కొత్త రకం దోపిడీకీ తెరతీసినట్టు తెలిసింది. పట్టణ సమీపంలోని వెంకటాద్రిపాలెం గ్రామానికి చెందిన నాగరాజు, రేణుకలకు సంతానం లేకపోవడంతో స్థానిక ఓ ప్రైవేట్ ఆస్పత్రిని సంప్రదించారు. వీరిని పరీక్షించిన డాక్టర్ పిల్లలు అవుతారని చెప్పింది. దీంతో వారు ఆశగ ప్రతినెలా క్రమం తప్పకుండా ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. ప్రతి నెలా వివిధ రకాల పరీక్షలు చేసి, స్కానింగ్‌లు తీసి వేలాది రూపాయల మందులను వారికి అంటగట్టే వారు. 6నెలల పేరుమీద రూ.60వేలు ఖుర్చు చేశారు. ఇలా 6 నెలలు గడిచినా ఫలితం కనిపించలేదు దీంతో ఆ దంపతులు డాక్టర్‌ను ప్రశ్నించారు. పరిస్థితిని అర్థం చేసుకున్న సదరు డాక్టర్ మరో స్కానింగ్ తీసుకురావాలని బయట ఉన్న స్కానింగ్ సెంటర్‌కు రాసింది. స్కానింగ్ తీయించుకున్న అనంతరం గర్భసంచిలో నీటి బుడగలు ఉన్నాయని, వాటిని తొలగించడానికి హైదారాబాద్, నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి వెళ్లి లాప్రోస్కోపిక్ ఆపరేషన్ చేయాలని సెలవిచ్చారు. దీంతో ఆ దంపతులు ఒక్కసారిగ అవాక్కయ్యారు. 6నెలల కింద ఆస్పత్రికి వచ్చినప్పుడు తీసిన స్కానింగ్‌లో కూడా అదేవిదంగా రిపోర్టు వచ్చినా మందులు వాడించకుండా అప్పుడే ఎందుకు లాప్రోస్కోపిక్ ఆపరేషన్ చేయించుకోవాలని చెప్పలేదని వారు నిలదీశారు. మీకు పిల్లలు కావాలంటే పొండి లేకుంటే ఊరుకొండి అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పిందని ఆ దంపతులు వాపోయారు. 6నెలలు తమ వద్ద ఉన్న డబ్బులన్నీ అయిపోయిన తరువాత చెప్పి డాక్టర్ మమ్ములను మోసం చేసిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.