ధనార్జనే.. ధ్యేయంగా.. | Doctors Scams in Miryalaguda | Sakshi
Sakshi News home page

ధనార్జనే.. ధ్యేయంగా..

Published Wed, Mar 11 2015 12:33 AM | Last Updated on Sat, Sep 2 2017 10:36 PM

Doctors  Scams in Miryalaguda

 మిర్యాలగూడ అర్బన్ : వైద్యులు దేవుడితో సమానం అంటారు. కానీ మిర్యాలగూడలోని కొందరు డాక్టర్లు అలాకాదు. వీరికి ధనార్జనే ముఖ్యం. ఆస్పత్రులలో కనీస వసతులు కల్పించకున్నా ఆపరేషన్ల పేరుతో వేలకు వేలు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సహజ సిద్ధంగా జరగాల్సిన కాన్పులను సైతం ఆపరేషన్లు చేస్తూ వైద్యవత్తికే కళంకం తెస్తున్నారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. మహిళ గర్భం దాల్చిన నాటి నుంచి 9 నెలలు ప్రతినెలా ఆస్పత్రికి రావలసిందే. దీంతో ప్రతినెలా నానా రకాల టెస్టులు, స్కానింగ్‌లతో వారిని దోచుకోవడమే పరమావధిగా డాక్టర్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. నెలలు నిండేవరకు కొంత మంది డాక్టర్లు ఐదు సార్లు స్కానింగ్ చేయిస్తూ, మూడుసార్లు సర్జికల్ ప్రొఫైల్ టెస్టులు చేయిస్తున్నారని సమాచారం. సహజ సిద్ధంగా నార్మల్ డెలివరీ అయ్యే మహిళలకు కూడా ఆపరేషన్లు చేయడం డాక్టర్లకు ఆనవాయితీగా మారిందనే వాదనలూ లేకపోలేదు. దీంతో పట్టణంలోని ఒక్కో ఆస్పత్రిలో నెలకు సూమారు 80 నుంచి 120 ఆపరేషన్లు చేస్తున్నట్లు సమాచారం.
 
 కనీస వసతులు కరువు...
 పట్టణంలోని ఆస్పత్రుల్లో కనీస సౌకర్యాలు కల్పించడం లేదని రోగులు వాపోతున్నారు. చీకటిగదులు, తీవ్రమైన దుర్వాసనల మధ్యే రోగులను ఉంచుతున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదు.  ఏదైన ఆస్పత్రిలో ఆపరేషన్ వికటించి రోగిమృతి చెందితే చాలు అక్కడ మధ్యదళారులు ప్రత్యక్షమైతున్నారు. పోయిన ప్రాణాలు తిరిగిరావుకదా..గొడవచేస్తే ఏంలాభం.. మీకే నష్టం..అంతో ఇంతో తీసుకొని వెల్లండంటూ బేరాలు కుదిరిస్తున్నారు. వినకుంటే బెదిరింపులకు కూడా దిగుతుట్లు సమాచారం. ఇటీవల ఓ ఆస్పత్రిలో ఆపరేషన్ చేసిన గర్భిణికి ఇన్ఫెక్షన్ సోకి చీముపట్టి తీవ్ర ఇబ్బందులకు గురైంది. దీంతో వారి బంధువులు గొడవకు దిగటంతో బేరసారాలు కుదుర్చుకున్నారు.
 
 నిబంధనలు ఇవీ..
 పట్టణంలోని ఆస్పత్రులు కనీస నింధనలు పాటించడంలేదని ఆరోపణలు ఉన్నాయి.
 ప్రతి ఆస్పత్రికి అగ్నిమాపక యంత్రాలు ఉండాలి.
 ఫైర్ అలారం నీటి ట్యాంకులు తప్పనిసరి
 వాహనాల రాకపోకలకు అనువుగా ఉండాలి.
 కాలుష్యం నుంచి ఇబ్బంది లేదని సంబధిత  ధ్రువపత్రం కలిగి ఉండాలి.
 ప్రతి ఐదు మంచాలకు ఒక నర్సును కేటాయించాలి.
 తగినంత వెలుతురు వచ్చేలా ఆస్పత్రి నిర్మాణాలు ఉండాలి.
 ఆపరేషన్ చేసే థియేటర్ పక్కాగా, ఆపరేషన్ చేసిన రోగికి ఎలాంటి ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండాలి. మిర్యాలగూడ పట్టణంలోని ఏ ఒక్క ఆస్పత్రిలో ఇవి కనిపించడంలేదు.
 
 మున్సిపాలిటీకి తప్పుడు సమాచారం...
 ప్రైవేటు ఆస్పత్రులలో అయ్యే కాన్పులకు అన్నింటికీ ఒక రికార్డు తయారు చేసి ప్రతినెలా మున్సిపాలిటీకి అందజేయాలని నిబంధనలు ఉన్నాయి. కానీ వీటిని ఆస్పత్రుల యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు. కొన్ని ఆస్పత్రులు సమాచారం ఇచ్చినా ఆపరేషన్ల సంఖ్యను తగ్గించి చూపిస్తున్నట్లు సమాచారం. ఒక్కో ఆస్పత్రిలో సుమారు 80నుంచి 120 ఆపరేషన్లు అవుతుండగా కేవలం 25నుంచి 30 మధ్యలోనే లెక్కలు చూపిస్తున్నట్లు సమాచారం. మరికొన్ని ఆస్పత్రులు స్థాపించిన నాటినుంచి కూడా కాన్పులు వివరాలను మన్సిపాలిటీకి అందిచడం లేదని సమాచారం.

సంతాన సాఫల్యం పేరుతోనూ మోసాలు....
 మెరుగైన వైద్యంతో సంతానం కల్పిస్తామంటు కొందరు వైద్యులు కొత్త రకం దోపిడీకీ తెరతీసినట్టు తెలిసింది. పట్టణ సమీపంలోని వెంకటాద్రిపాలెం గ్రామానికి చెందిన నాగరాజు, రేణుకలకు సంతానం లేకపోవడంతో స్థానిక ఓ ప్రైవేట్ ఆస్పత్రిని సంప్రదించారు. వీరిని పరీక్షించిన డాక్టర్ పిల్లలు అవుతారని  చెప్పింది. దీంతో వారు ఆశగ ప్రతినెలా క్రమం తప్పకుండా ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. ప్రతి నెలా వివిధ రకాల పరీక్షలు చేసి, స్కానింగ్‌లు తీసి వేలాది రూపాయల మందులను వారికి అంటగట్టే వారు. 6నెలల పేరుమీద రూ.60వేలు ఖుర్చు చేశారు. ఇలా 6 నెలలు గడిచినా ఫలితం కనిపించలేదు దీంతో ఆ దంపతులు డాక్టర్‌ను ప్రశ్నించారు. పరిస్థితిని అర్థం చేసుకున్న సదరు డాక్టర్ మరో స్కానింగ్ తీసుకురావాలని బయట ఉన్న స్కానింగ్ సెంటర్‌కు రాసింది.
 
 స్కానింగ్ తీయించుకున్న అనంతరం గర్భసంచిలో నీటి బుడగలు ఉన్నాయని, వాటిని తొలగించడానికి హైదారాబాద్, నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి వెళ్లి లాప్రోస్కోపిక్ ఆపరేషన్ చేయాలని సెలవిచ్చారు. దీంతో ఆ దంపతులు ఒక్కసారిగ అవాక్కయ్యారు. 6నెలల కింద ఆస్పత్రికి వచ్చినప్పుడు తీసిన స్కానింగ్‌లో కూడా అదేవిదంగా రిపోర్టు వచ్చినా మందులు వాడించకుండా అప్పుడే ఎందుకు లాప్రోస్కోపిక్ ఆపరేషన్ చేయించుకోవాలని చెప్పలేదని వారు నిలదీశారు. మీకు పిల్లలు కావాలంటే పొండి లేకుంటే ఊరుకొండి అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పిందని ఆ దంపతులు వాపోయారు. 6నెలలు తమ వద్ద ఉన్న డబ్బులన్నీ అయిపోయిన తరువాత చెప్పి డాక్టర్ మమ్ములను మోసం చేసిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement