NCTE
-
మళ్లీ తెరపైకి ఏడాది బీఈడీ కోర్సు!
సాక్షి, న్యూఢిల్లీ: దాదాపు దశాబ్ద కాలం తర్వాత ఏడాది బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఈడీ) విధానాన్ని తిరిగి పునరుద్ధరించాలని నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ) నిర్ణయించింది. ఈ మేరకు ఇటీవల జరిగిన ఎన్సీటీఈ పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకుంది. తిరిగి ఏడాది బీఈడీ కోర్సును పునరుద్ధరిస్తే నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ) లేక రెండేళ్లు పోస్ట్ గ్రాడ్యుయేట్ (పీజీ) పూర్తి చేసిన విద్యార్థులకు ఇది వర్తించనుంది. పాఠశాలల్లో విద్యా నాణ్యతా ప్రమాణాలు పెంచాలన్న లక్ష్యంతో 2014 డిసెంబర్లో కేంద్రం ఏడాది బీఈడీ కోర్సును నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.2015–16 నుంచి రెండేళ్ల బీఈడీ కోర్సును ప్రవేశపెట్టింది. అయితే ఈ నెల 11న ఎన్సీటీఈ టీచర్స్ ఎడ్యుకేషన్ రెగ్యులేటర్ గవర్నింగ్ బాడీ సమావేశంలో టీచర్ ట్రైనింగ్ కోర్సులకు సంబంధించిన పలు నిర్ణయాలను ఆమోదించింది. ఇందులో బీ ఈడీ కోర్సు ఏడాది కాల పరిమితికి సంబంధించి నిర్ణయం చేసింది. ‘ఒక ఏడాది బీఈడీ ప్రోగ్రామ్ కేవలం నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు, రెండేళ్లు పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. మూడేళ్ల యూజీ ప్రోగ్రామ్‌లు పూర్తి చేసిన వారికి ఇది అందించబడదు, అలాంటివారు రెండేళ్ల బీఈడీ ప్రోగ్రామ్‌లో నమోదు చేసుకోవాలి. రెండేళ్ల బీఈడీ ప్రోగ్రామ్‌ను అందించే సంస్థలు 2028 నాటికి మల్టీడిసిప్లినరీ ఇన్స్టిట్యూట్లుగా మారాలి’ అని ఎన్సీటీఈ చైర్మన్ పంకజ్ అరోరా వెల్లడించారు.కమిషన్ కొన్ని నిర్ణయాలను కేంద్ర విద్యాశాఖతో చర్చిస్తోందని, పబ్లిక్ కన్సల్టేషన్ కోసం వాటిని ఎన్సీటీఈ నిబంధనలు– 2025 పేరుతో ముసాయిదాగా సమర్పించేందుకు కృషి చేస్తున్నామని అరోరా తెలిపారు. ఏడాది బీఈడీ ప్రోగ్రామ్‌తో సహా వివిధ కోర్సుల ఫ్రేమ్‌వర్క్‌ను ఖరారు చేయడానికి కమిషన్ సోమవారం ఎనిమిది మంది సభ్యుల ప్యానెల్‌ను సైతం ఏర్పాటు చేసింది. ఇక ఇప్పటికే ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ (ఐటీఈపీ) కింద చేపట్టిన నాలుగు సంవత్సరాల డ్యూయల్ డిగ్రీ గ్రాడ్యుయేట్ స్థాయి కోర్సును మరింత విస్తృతం చేయాలని పాలకమండలి భేటీలో నిర్ణయించారు. ప్రస్తుతం కోర్సు దేశ వ్యాప్తంగా 64 సంస్థల్లో బీఏ–బీఈడీ, బీకా మ్–బీఈడీ, బీఎస్సీ–బీఈడీ కోర్సులను అందిస్తుండగా, దీనిని యోగా ఎడ్యుకేషన్, ఫిజికల్ ఎడ్యుకేషన్, సంస్కృతం, ఫెర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఎడ్యుకేషన్‌కు విస్తరించాలని నిర్ణయించారు. -
విద్యా ‘దీక్ష’లో ఏపీ ఫస్ట్
సాక్షి, అమరావతి: విద్యా సంబంధిత విజ్ఞానాన్ని తెలుసుకోవడంలో ఆంధ్రప్రదేశ్ టాప్‌లో నిలిచింది. కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన ‘డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ నాలెడ్జ్ షేరింగ్(దీక్ష)’ పోర్టల్ వినియోగంలో ఏపీ మొదటి స్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మొత్తంగా 67 లక్షల మంది ఈ పోర్టల్‌ను వినియోగించారు. అలాగే 66 లక్షల మందితో రాజస్థాన్ రెండో స్థానంలో నిలవగా, 58 లక్షల మందితో ఉత్తరప్రదేశ్ మూడో స్థానంలో నిలిచింది. జాతీయ స్థాయిలో విద్యా సంబంధిత అంశాలను అందించేందుకు ‘ఒకే దేశం–ఒకే వేదిక’ లక్ష్యంగా నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్(ఎన్సీటీఈ), కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సంయుక్తంగా దీక్ష పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చాయి. దీనికి అనుసంధానంగా మన రాష్ట్ర ఉపాధ్యాయులు ఈ–కంటెంట్ తయారీ కోసం ఆంధ్రప్రదేశ్ ఈ–నాలెడ్జ్ ఎక్స్చేంజ్(అపెక్స్) వేదికగా పనిచేస్తున్నారు. ఇందులో ఉపాధ్యాయులు, విద్యార్థులకు అవసరమైన పాఠ్యాంశాలను వీడియో, ఆడియోలతో పాటు పీడీఎఫ్ రూపంలో అందుబాటులో ఉంచారు. అలాగే ఉపాధ్యాయుల వృత్తిపరమైన అభివృద్ధి కోసం ఆన్లైన్ కోర్సులు, ఇంటరాక్టివ్ అసెస్మెంట్ తదితరాలు కూడా ఉన్నాయి. వైఎస్ జగన్ సర్కార్.. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల కోసం బైలింగ్వుల్ టెక్ట్స్ బుక్స్‌ను అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఆయా పాఠాలకు జత చేసిన ‘క్యూఆర్ కోడ్’ను స్కాన్ చేసి నేరుగా సంబంధిత పాఠాలను విజువల్, ఆడియో రూపంలో పొందవచ్చు. అనంతరం ఈ నూతన విధానాన్ని ఎన్సీఈఆర్టీ అనుసరిస్తోంది. అంతేగాక దీక్ష ప్లాట్‌ఫామ్ ద్వారా ఉపాధ్యాయులకు ఆన్లైన్ శిక్షణను ప్రారంభించిన మొట్టమొదటి రాష్ట్రం కూడా ఏపీయేనని సమగ్ర శిక్ష ఎస్పీడీ శ్రీనివాసరావు ‘సాక్షి’కి తెలిపారు. ఏపీకి చెందిన 20 వేలకు పైగా అంశాలు నిక్షిప్తం.. ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ఏపీలో బోధిస్తున్న అన్ని సబ్జెక్టుల పాఠ్య పుస్తకాలను పీడీఎఫ్ రూపంలో దీక్ష పోర్టల్‌లో ఉంచారు. అలాగే అన్ని తరగతుల పాఠ్యాంశాలను ఆడియో, వీడియోల రూపంలో అప్లోడ్ చేశారు. ఇటీవల ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులోకి తెచ్చిన టోఫెల్ ప్రైమరీ, టోఫెల్ జూనియర్ శిక్షణకు అవసరమైన మెటీరియల్ కూడా ఇందులో అందుబాటులో ఉంచారు. మొత్తం 20,758 అంశాలను పోర్టల్‌లో అప్లోడ్ చేశారు. అత్యధిక అంశాలను అప్లోడ్ చేసిన రాష్ట్రాల్లో ఏపీ మూడో స్థానంలో నిలిచింది. ప్రభుత్వ పాఠశాలలకు అందించిన ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్‌ను దీక్ష పోర్టల్‌తో అనుసంధానం చేసి బోధనలో కొత్తదనాన్ని కూడా అవలంభించారు. ఈ పోర్టల్‌లో కేవలం ఏపీకి చెందిన బోధనాంశాలే కాకుండా, ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విద్యా బోధన, శిక్షణ తదితర అంశాలను కూడా ఉపాధ్యాయులు తెలుసుకోవచ్చు. విద్యార్థులు కూడా ఆయా సబ్జెక్టులపై ఆన్లైన్లోనే పరీక్ష రాసి, తమ ప్రతిభను పరీక్షించుకోవచ్చు. 2 లక్షల మందికి పైగా ఉపాధ్యాయులు, విద్యా శాఖ అధికారులు దీక్ష పోర్టల్ ద్వారా తమ సామర్థ్యాలను మెరుగుపరచుకుంటున్నారు. రాష్ట్రం నుంచి గత వారం రోజుల్లో ఫోన్, కంప్యూటర్ వంటి 1,31,421 డివైజ్‌ల ద్వారా ఈ–కంటెంట్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు. అలాగే 43,841 క్యూఆర్ కోడ్లు స్కాన్ చేసి విద్యార్థులు పాఠాలు నేర్చుకున్నారు. -
ఎన్సీటీఈ డిప్యూటీ కార్యదర్శికి నాన్ బెయిలబుల్ వారెంట్
సాక్షి, అమరావతి: కోర్టు ఆదేశాలున్నప్పటికీ విచారణకు గైర్హాజరు కావడం పట్ల జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) డిప్యూటీ కార్యదర్శిపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఆయనకు నాన్ బెయిలబుల్ వారెంట్ (ఎన్బీడబ్ల్యూ)) జారీ చేసింది. ఆయనను అరెస్ట్ చేసి తమ ముందు హాజరుపరచాలని పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఆదేశాలు జారీ చేశారు. తమ కాలేజీ గుర్తింపును రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలోని నెహ్రూ మెమోరియల్ ఎక్స్ సర్వీస్‌మెన్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ పీడీ చంద్రశేఖర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు విచారణ జరిపారు. గత విచారణ సమయంలో పిటిషనర్ తరఫు న్యాయవాది మతుకుమిల్లి శ్రీవిజయ్ వాదనలు వినిపిస్తూ.. గుర్తింపు రద్దు కోసం ఇచ్చిన షోకాజ్ నోటీసుకు వివరణ ఇచ్చామని, అయినా కూడా ఆ వివరణను పరిగణనలోకి తీసుకోకుండా గుర్తింపు రద్దు చేస్తూ జూలై 7, 2020లో ఉత్తర్వులు జారీ చేశారన్నారు. దీనిపై ఎన్సీటీఈ ముందు ఆన్లైన్లో అప్పీల్ దాఖలు చేశామని, చట్టం నిర్దేశించిన ఫీజు కూడా చెల్లించామన్నారు. అలాగే పోస్టు ద్వారా వినతిపత్రం కూడా పంపామని తెలిపారు. అయితే తమ ముందు ఎలాంటి అప్పీల్ దాఖలు చేయలేదని ఎన్సీటీఈ తరఫు న్యాయవాది కోర్టుకు నివేదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. ఎన్సీటీఈ డిప్యూటీ కార్యదర్శి ఈ నెల 18న స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని స్పష్టం చేశారు. శుక్రవారం జరిగిన విచారణకు డిప్యూటీ కార్యదర్శి రాలేదు. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను కొట్టేసిన న్యాయమూర్తి డిప్యూటీ కార్యదర్శికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. తదుపరి విచారణను వాయిదా వేశారు. -
కేంద్ర విద్యాశాఖ నిర్ణయం.. ఇక నాలుగేళ్ల కోర్సుగా బీఈడీ!
సాక్షి, హైదరాబాద్: మారుతున్న బోధన విధానాలకు అనుగుణంగా అధ్యాపకుల శైలిలోనూ మార్పులు తేవాలని కేంద్ర విద్యాశాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఈడీ) కోర్సుల స్వరూప స్వభావాన్ని మార్చాలని ప్రతిపాదించింది. ఇప్పుడున్న రెండేళ్ళ కాలపరిమితి స్థానంలో కోర్సును నాలుగేళ్ళకు పెంచబోతున్నారు. ఇప్పటికే బీఈడీ కోర్సుల మార్పులకు సంబంధించిన ముసాయిదా ప్రతిని రూపొందించారు. గత నెల 27న ఢిల్లీలో దీనిపై ప్రత్యేక సమావేశం జరిగింది. రాష్ట్రాలకు చెందిన ఉన్నత విద్యా మండళ్ళు, కేంద్ర విద్యాశాఖ అధికారులు ఇందులో పాల్గొన్నారు. నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్స్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ)కి బీఈడీలో కొత్త కోర్సుల రూపకల్పన బాధ్యతలను అప్పగించాలని నిర్ణయించారు. జాతీయ విద్యావిధానం–2020లో తీసుకొచ్చిన మార్పులను అనుగుణంగా ఉపాధ్యాయ వృత్తిలోనూ గుణాత్మక మార్పులతో ముసాయిదా రూపొందించారు. నవీన బోధన విధానం..: కాలానుగుణంగా వస్తున్న మార్పులతో నవీన బోధన విధానంతో కొత్త సబ్జెక్టులను బీఈడీలో చేర్చబోతున్నారు. విద్యార్థి సైకాలజీని అర్థం చేసుకుని, సునిశిత విశ్లేషణతో బోధించే మెళకువలు ఇందులో పొందుపర్చాలని నిర్ణయించారు. బోధన ప్రణాళికలో వర్చువల్, డిజిటల్ పద్ధతులకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వబోతున్నారు. వాస్తవ ప్రపంచంలోకి వెళ్ళి విద్యార్థి సముపార్జించే జ్ఞానాన్ని ఉపాధ్యాయుడు ఏ విధంగా గుర్తించాలనే అంశాలను బీఈడీలో చేర్చబోతున్నారు. ఆన్లైన్, డిజిటల్ ప్లాట్ ఫామ్‌కు అనుగుణంగా పుస్తకాల్లో ఉన్న సబ్జెక్టును విద్యారి్థకి అర్థమయ్యేలా టెక్నాలజీతో అందించే విధానాన్ని బీఈడీలో పాఠ్యాంశాలుగా చేర్చనున్నారు. -
టీచర్లుగా బీటెక్‌బాబులు వద్దా?
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: బీటెక్ చదివి టీచర్లు అవుదామనుకున్న వారి కలలు నెరవేరేలా లేవు. ఇంజనీరింగ్ పూర్తిచేసిన పలువురు అభ్యర్థులు తాజాగా గురుకులాల్లో టీచర్ల కోసం దరఖాస్తు చేసుకుందామని ప్రయత్నించి విఫలమవుతున్నారు. కారణం.. ఓటీఆర్‌లో విద్యార్హతల వద్ద బీఎస్సీ, బీఏ, బీకామ్ వంటి డిగ్రీలు ఉంచిన వెబ్సైట్లో.. బీటెక్ అన్న కాలమ్ అసలు పొందుపరచనే లేదు. తాము ఎంతో కష్టపడి రెండేళ్ల బీఈడీ కోర్సు పూర్తి చేశామని, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) పరీక్ష కూడా పాసయ్యామని, తీరా ఇపుడు తమకు దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పించకపోవడం అన్యాయమంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2019లో తెలంగాణ రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో టీచర్ పోస్టులకు తమను అనుమతించడం లేదంటూ కొందరు బీటెక్‌తోపాటు, బీఈడీ చేసిన అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. అపుడు కూడా ఇదే తరహాలో దరఖాస్తులో తమకు బీటెక్ కాలమ్ కనిపించ లేదని చెప్పారు. దీనికి ప్రభుత్వం సమాధానమిస్తూ.. నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ) 2010 మార్గదర్శకాల ప్రకారమే తాము నోటిఫికేషన్ జారీ చేశామని తేల్చిచెప్పింది. దీనిపై స్పందించిన హైకోర్టు ఎన్సీటీఈ–2014 మార్గదర్శకాల ప్రకారం.. బీటెక్‌తోపాటు బీఈడీ చేసినవారంతా టీజీటీ పోస్టులకు అర్హులేనని హైకోర్టు స్పష్టంచేసింది. ఈ మేరకు తగిన చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖాధిపతులను ఆదేశించింది. మళ్లీ ఇప్పుడూ అదే సమస్య గతంలో ఇదే వ్యవహారంపై హైకోర్టు వరకూ వెళ్లిన నేపథ్యంలో ఈసారి టీచర్ పోస్టులకు సంబంధించి వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని అనుకున్నారు. కానీ, తీరా దరఖాస్తు ఫారం ఓపెన్ చేసే సరికి తిరిగి అదే సమస్య పునరావృతమవడంతో తలలు పట్టుకుంటున్నారు. ఈ విషయమై పలువురు బీటెక్–బీఈడీ అభ్యర్థులు తొలుత గురుకుల కార్యాలయాలకు వరుసగా ఫోన్లు చేసినా.. ఎలాంటి ఫలితం లేకుండా పోయిందని వాపోయారు. కొందరు అధికారులు అయితే.. బీటెక్ బీఈడీ వారికి అసలు అర్హతే లేదని, మీరు దరఖాస్తు చేసుకోవద్దని చెబుతున్నారని వారు అంటున్నారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. -
AP: ఆగస్టులో ‘టెట్’
సాక్షి, అమరావతి: ప్రభుత్వ టీచర్ పోస్టుల భర్తీకి కీలకమైన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్ 2022) ఈ ఏడాది ఆగస్టులో నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది. పేపర్లవారీగా పరీక్షల తేదీలు, ఇతర సమాచారంతో త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనుంది. టెట్ రాసేందుకు అభ్యర్ధులు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు. జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి (ఎన్సీటీఈ) నిబంధనల ప్రకారం ఏటా రెండుసార్లు టెట్ నిర్వహించాల్సినా గత సర్కారు పట్టించుకోలేదు. అధికారంలో ఉండగా టెట్, డీఎస్సీ కలిపి టీచర్ ఎలిజిబులిటీ కమ్ టీచర్ రిక్రూట్మెంట్ టెస్టు (టెట్ కమ్ టెర్ట్) పేరుతో నిర్వహించినా క్వాలిఫైడ్ అభ్యర్థుల ధ్రువపత్రాలను ఏడేళ్లుగా కాకుండా ఆ పరీక్ష వరకు మాత్రమే పరిమితం చేసింది. ఇలా రెండు పరీక్షలు కలిపి నిర్వహించడంతో అభ్యర్ధులు నష్టపోయారు. 2018లో టెట్ నిర్వహించాల్సి ఉన్నా ఎన్నికలు రావడంతో నిలిచిపోయింది. డీఎస్సీలో 20 శాతం వెయిటేజీ దీర్ఘకాలంగా టెట్ నిర్వహించకపోవడంతో లక్షల సంఖ్యలో అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. టెట్ మార్కులకు ఉపాధ్యాయ నియామక పరీక్ష (డీఎస్సీ)లో వెయిటేజీ కల్పించడంతోపాటు బీఈడీ, ఎంఈడీ అభ్యర్థులను ఎస్ఏ పోస్టులకు కూడా అర్హులుగా ప్రకటించడంతో గతంలో క్వాలిఫై అయిన వారు సైతం మరోసారి రాసేందుకు సిద్ధమవుతున్నారు. టెట్ మార్కులకు డీఎస్సీలో 20 శాతం మేర వెయిటేజీ ఉన్నందున వీటికి ప్రాధాన్యత ఏర్పడింది. టెట్ ఉత్తీర్ణత సర్టిఫికెట్ చెల్లుబాటు గతంలో ఏడేళ్లు మాత్రమే ఉండగా గతేడాది ఎన్సీటీఈ దీన్ని సవరించి జీవితకాలం చెల్లుతుందని ప్రకటించింది. వెబ్సైట్లో ప్యాట్రన్, సిలబస్ టెట్ 2021 విధివిధానాలు, సిలబస్‌ను పాఠశాల విద్యాశాఖ గతంలో విడుదల చేసింది. సిలబస్‌ను https://aptet.apcfss.in వెబ్సైట్లో పొందుపరిచింది. టెట్‌లో రెండు పేపర్లు (పేపర్ 1, పేపర్ 2) ఉంటాయి. వీటిని 1 ఏ, 1 బీ, 2 ఏ, 2 బీ అని నిర్వహిస్తారు. అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఎన్సీటీఈ మార్పులు చేయడంతో ప్రభుత్వం ఆ మేరకు సవరణలు చేసింది. గతంలో టెట్‌కు సంబంధించి జారీ చేసిన జీవో 23కు సవరణలు చేస్తూ జీవో 27 విడుదల చేసింది. దీని ప్రకారం అభ్యర్ధులకు మేలు చేకూరేలా టెట్ నోటిఫికేషన్లో పొందుపర్చనున్నారు. ఎవరెవరు ఏ పరీక్ష రాయాలంటే.. ► రెగ్యులర్ స్కూళ్లలో 1 – 5 తరగతుల్లో టీచర్ పోస్టులకు పేపర్ 1ఏలో అర్హత సాధించాలి. ► దివ్యాంగులు, ఇతర విభిన్న ప్రతిభావంతులు స్పెషల్ స్కూళ్లలో 1 – 5 తరగతులు బోధించాలంటే పేపర్ 1బీలో అర్హత తప్పనిసరి. ► రెగ్యులర్ స్కూళ్లలో 6 – 8, ఆ పై తరగతులు బోధించాలంటే పేపర్ 2ఏలో అర్హత సాధించాలి. అలాగే స్పెషల్ స్కూళ్లలో ఇవే తరగతులకు పేపర్ 2బీలో అర్హత సాధించాల్సి ఉంటుంది. ► టెట్‌లో అర్హత మార్కులు గతంలో మాదిరిగానే ఉండనున్నాయి. జనరల్ అభ్యర్ధులకు 60 శాతం, బీసీ అభ్యర్ధులకు 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ, మాజీ సైనికోద్యోగుల పిల్లలు 40 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. టెట్ తరువాత డీఎస్సీపై దృష్టి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం టెట్ నిర్వహణపై పాఠశాల విద్యాశాఖ దృష్టి సారించింది. అయితే వెను వెంటనే కరోనా రావడంతో రెండేళ్లుగా టెట్ నిర్వహణ సాధ్యం కాలేదు. ఇప్పుడు సాధారణ పరిస్థితులు నెలకొనడంతో తొలుత టెట్ నిర్వహించి అనంతరం టీచర్ పోస్టుల భర్తీపై దృష్టి సారించేందుకు సన్నద్ధమవుతోంది. -
టెట్ ఇంకెప్పుడో..! అభ్యర్థుల్లో ఆందోళన
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ పోస్టుల నియామక పరీక్ష (టీఆర్టీ) రాయాలంటే కచ్చితంగా ఉండాల్సిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహణపై అడుగులు ముందుకు పడట్లేదు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సీఎం ఆదేశాలు జారీ చేసి నెల కావొస్తున్నా టెట్ నిర్వహణపై ఉన్నత స్థాయిలో ఎలాంటి కదలిక లేదు. టెట్ నిర్వహిస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పిన విషయం తెలిసిందే. అయితే అందుకు అవసరమైన కార్యాచరణ ఒక్కటీ మొదలు కాలేదు. దీంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రాకముందే టెట్ నిర్వహించాలని అభ్యర్థులకు కోరుతున్నా ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టట్లేదు. ఇప్పటికే ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి ఖాళీల వివరాలను విద్యా శాఖ ప్రభుత్వ ఆమోదం కోసం పంపింది. ఇప్పటివరకు వాటికి ఇంకా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ ఆమోదం వస్తే నోటిఫికేషన్ ఇవ్వాల్సి వస్తుంది. ప్రస్తుతం టెట్ నిర్వహించకుండా ముందుకు పోతే లక్షల మంది పోస్టుల భర్తీకి దూరం అయ్యే ప్రమాదం నెలకొంది. నెలన్నరలో వ్యాలిడిటీ ముగింపు.. జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) గతంలో జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం టెట్ వ్యాలిడిటీ ఏడేళ్లు. 2011 నుంచి రాష్ట్రంలో నిర్వహించిన ఆరు టెట్లలో మూడు టెట్ల (2011 ఒకసారి, 2012లో రెండుసార్లు) వ్యాలిడిటీ ఇప్పటికే ముగిసిపోయి 4 లక్షల మంది అభ్యర్థులు టెట్ అర్హత కోల్పోయారు. ఇక 2014 మార్చి 16న నిర్వహించిన టెట్ ఏడేళ్ల వ్యాలిడిటీ వచ్చే మార్చి 16వ తేదీతో ముగియనుంది. అందులోనూ మరో 1.5 లక్షల మంది అభ్యర్థులు అర్హతను కోల్పోతారు. మరోవైపు రాష్ట్రంలో 2015లో ఒకసారి టెట్ నిర్వహించగా, 2017లో చివరి టెట్‌ను నిర్వహించారు. ఏటా రెండు సార్లు నిర్వహించాల్సిన టెట్‌ను గత మూడేళ్లలో ఒక్కసారి కూడా నిర్వహించలేదు. దీంతో గడిచిన మూడేళ్లలోనూ మరో 1.5 లక్షల మంది బీఎడ్, డీఎడ్ అభ్యర్థులు అసలు టెట్ రాయలేదు. ఇప్పుడు వారంతా టెట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇలా మొత్తం దాదాపు 5.5 లక్షల మంది అభ్యర్యుర్థులకు టెట్ కోసం ఎదురుచూపులు తప్పట్లేదు. రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గత నెలలోనే ఓకే చెప్పిన నేపథ్యంలో వెంటనే టెట్ నిర్వహణకు చర్యలు చేపట్టాలని అభ్యర్థులు కోరుతున్నారు. టెట్ నిర్వహించకుండా టీఆర్టీ నోటిఫికేషన్ వస్తే తమకు అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూడు నెలలు అవసరం.. రాష్ట్రంలో టెట్ నోటిఫికేషన్ జారీ, దరఖాస్తుల స్వీకరణ, పరీక్ష నిర్వహణ, ఫలితాల వెల్లడికి కనీసం 3 నెలల సమయం పడుతుంది. అందుకే విద్యా శాఖ త్వరగా టెట్ నిర్వహణకు చర్యలు చేపడితేనే తమకు టీఆర్టీ రాసే అవకాశం వస్తుందని పేర్కొంటున్నారు. మార్చి తర్వాతే టీఆర్టీ నోటిఫికేషన్? టీఆర్టీ నోటిఫికేషన్ ఇప్పట్లో వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యా శాఖ ఇప్పటివరకు ఉన్న ఖాళీల వివరాలను ఆర్థిక శాఖకు పంపింది. ఇప్పటికిప్పుడు 8 వేల పోస్టులు భర్తీ చేయొచ్చని పేర్కొంది. మరోవైపు ఉపాధ్యాయుల పదోన్నతుల కోసం ప్రభుత్వ ఆమోదానికి ఫైలు పంపించింది. అందులో 8 వేలకు పైగా పోస్టుల్లో పదోన్నతులు కల్పించొచ్చని పేర్కొంది. పదోన్నతులు చేపట్టాక టీఆర్టీ నోటిఫికేషన్ ఇస్తే 15 వేలకు పైగా పోస్టులు భర్తీ చేసే వీలుంటుంది. అయితే పదోన్నతుల ప్రక్రియ చేపట్టేందుకు ప్రభుత్వం నుంచి విద్యా శాఖకు ఇంకా ఆమోదం రాలేదు. ఇప్పటికిప్పుడు ఆమోదం తెలిపినా పదోన్నతులు ఇచ్చేందుకు కనీసం 15 రోజుల సమయం పడుతుంది. ఆ తర్వాతే టీఆర్టీ నోటిఫికేషన్ ఇవ్వడం సాధ్యం అవుతుంది. అయితే ఫిబ్రవరి మొదటి వారంలో ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని అధికారులు భావిస్తున్నారు. అదే జరిగితే ఫిబ్రవరిలో టీఆర్టీ నోటిఫికేషన్ జారీ కుదరదు. ఇక మార్చి తర్వాతే టీఆర్టీ నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితుల్లో వీలైనంత త్వరగా టెట్ నిర్వహిస్తే తాము టీఆర్టీకి సిద్ధం అయ్యేందుకు సమయం దొరుకుతుందని అభ్యర్థులు పేర్కొంటున్నారు. -
టెట్ వ్యాలిడిటీ శాశ్వతం..
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) వ్యాలిడిటీని శాశ్వతం చేయాలని జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) పాలక మండలి నిర్ణయించింది. ఇప్పటివరకు టెట్ వ్యాలిడిటీ ఏడేళ్లు మాత్రమే ఉంది. ఇకపై దాన్ని జీవితకాలం వ్యాలిడిటీగా మార్చాలని నిర్ణయించింది. గత నెలలో జరిగిన ఎన్సీటీఈ పాలకమండలి సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకుంది. దీని ప్రకారం ఇకపై టెట్‌లో అర్హత సాధించిన వారు మళ్లీ మళ్లీ టెట్ రాయాల్సిన పనిలేదు. ఇప్పటికే టెట్‌లో అర్హత సాధించిన వారి విషయంలో న్యాయ సలహా తీసుకున్నాకే తుది నిర్ణయం తీసుకోవాలని ఎన్సీటీఈ భావిస్తోంది. 2010లో టెట్‌ను అమల్లోకి తెచ్చిన తర్వాత కొన్ని రాష్ట్రాలు ప్రతి 6 నెలలకోసారి టెట్ నిర్వహించగా, కొన్ని రాష్ట్రాలు రెండు మూడేళ్లకోసారి టెట్ నిర్వహించాయి. మొదట్లో నిర్వహించిన టెట్‌లో అర్హత సాధించిన లక్షల మందికి సంబంధించిన టెట్ వ్యాలిడిటీ ముగిసిపోయింది. అందుకే వారి విషయంలో ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై న్యాయ సలహా తీసుకోవాలని నిర్ణయించింది. వీరికీ వర్తిస్తుందా?: ఉమ్మడి ఏపీలో 4 సార్లు, తెలంగాణ వచ్చాక 2 సార్లు టెట్ నిర్వహించారు. మొదటిసారి టెట్‌ను 2011 జూలై 1న నిర్వహించగా, అందులో పేపర్–1లో 1,35,105 మంది, పేపర్–2లో 1,66,262 మంది అర్హత సాధించా రు. రెండో టెట్‌లో పేపర్–1లో 24,578 మంది, పేపర్–2లో 1,94,849 మంది అర్హత సాధించారు. మూడో టెట్‌లో పేపర్–1లో 26,382 మంది, పేపర్–2లో 1,94,849 మంది అర్హత సాధించారు. అయితే అందులో టెట్ స్కోర్ పెంచుకునేందుకు రెండోసారి మూడోసారి రాసిన వారు కూడా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో మొదటి మూడు టెట్లలో మొత్తంగా 7 లక్షల మందికి పైగా అర్హత సాధించగా, అందులో తెలంగాణ విద్యార్థులు 3 లక్షల మందికిపైగా ఉన్నారు. ఇప్పటికే వారందరి టెట్ వ్యాలిడిటీ ముగిసిపోయింది. వారి విషయంలో ఎన్సీటీఈ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాల్సిందే. -
ఫుల్లుగా సీట్లు భర్తీకి ఎడతెగని పాట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉపాధ్యాయ విద్యా కోర్సుల్లో చేరికల సంఖ్య దారుణంగా పడిపోతోంది. ఒకప్పుడు డీఎడ్, బీఎడ్ కాలేజీల్లో సీట్ల కోసం వేలాది మంది నిరీక్షించేవారు. ఇప్పుడు విద్యార్థుల కోసం కాలేజీలు నిరీక్షిస్తున్నాయి. డిమాండ్‌కు మించి కాలేజీలకు అనుమతులు ఇవ్వడం, సీట్లు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. కొత్త కాలేజీలకు అనుమతులు ఇవ్వొద్దని గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ పరిధిలోని జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలికి (ఎన్సీటీఈ) లేఖలు రాసింది. అయినా ఎన్సీటీఈ కొత్త కాలేజీలకు, అదనపు సీట్లకు విచ్చలవిడిగా అనుమతులు ఇచ్చేస్తోంది. ఎన్సీటీఈ అనుమతులు ఉన్నాయి కనుక రాష్ట్ర ప్రభుత్వం వాటికి తప్పనిసరి పరిస్థితుల్లో గుర్తింపు ఇవ్వాల్సి వస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు బీఈడీ కాలేజీలు 439 ఉండగా, వాటిలో 36,260 సీట్లున్నాయి. డీఈడీ కాలేజీలు 850 ఉండగా, వాటిలో 65,350 సీట్లున్నాయి. ప్రతిఏటా వేలాది మంది డీఈడీ, బీఈడీ కోర్సులు పూర్తిచేసుకుని, బయటకు వస్తున్నారు. వారందరికీ ఉద్యోగాలు దొరకడం లేదు. ప్రభుత్వం 2018లో నిర్వహించిన టీచర్ ఎలిజిబిలిటీ టెస్టుకు ఏకంగా 5.5 లక్షల మంది దరఖాస్తు చేశారు. డీఎస్సీకి కూడా ఇంతే సంఖ్యలో దరఖాస్తు చేశారు. ఉద్యోగావకాశాలు లేకపోవడంతో కొత్తగా కాలేజీల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపడం లేదు. గతంలో డీఈడీ, బీఈడీ కోర్సుల కాలపరిమితి జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి నిబంధనల ప్రకారం ఏడాది మాత్రమే ఉండేది. దాన్ని 2015–16 నుంచి రెండేళ్లకు పెంచారు. దీంతో ఈ కోర్సుల్లో చేరేందుకు చాలామంది ఇష్టపడడం లేదు. వేల సంఖ్యలో సీట్లు ఉంటే, చేరే వారు వందల మంది కూడా ఉండడం లేదు. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి కన్వీనర్ కోటా సీట్లు భర్తీ కాకపోతుండడంతో ఆయా కాలేజీల యాజమాన్యాలు లెఫ్ట్ ఓవర్ (మిగిలిపోయిన) సీట్ల భర్తీ పేరిట నిబంధనలకు తిలోదకాలు ఇస్తున్నాయి. ఒడిశా, పశ్చిమ బెంగాల్, బిహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో దళారులను నియమించుకుని, అక్కడి నుంచి అభ్యర్థులను రప్పిస్తున్నాయి. కాలేజీలకు రాకపోయినా ఫర్వాలేదు, మీ సర్టిఫికెట్లు ఇచ్చి చేరితే చాలు చివర్లో పరీక్షలు రాయడానికి వస్తే చాలంటూ మచ్చిక చేసుకుంటున్నాయి. సదరు అభ్యర్థుల నుంచి భారీగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. కొన్నిచోట్ల డమ్మీ అభ్యర్థులతో పరీక్షలు రాయిస్తూ కాలేజీల యాజమాన్యాలు ఈ కోర్సులను ఒక తంతులా మార్చేశాయన్న ఆరోపణలున్నాయి. తూతూమంత్రంగా తనిఖీలు డీఈడీ, బీఈడీ కాలేజీల నిర్వహణ ఎలాసాగుతోందో తనిఖీలు చేసే యంత్రాంగమే లేదు. డీఈడీ కాలేజీలను పర్యవేక్షించాల్సిన పాఠశాల విద్యాశాఖలో సిబ్బంది కొరత ఉంది. పైగా ఆయా కాలేజీల నుంచి ముడుపులు స్వీకరిస్తూ చూసీచూడనట్లు మిన్నకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. బీఈడీ కాలేజీలను పర్యవేక్షించాల్సిన వర్సిటీలు కూడా తూతూమంత్రంగా తనిఖీలను చేపడుతున్నాయి. ఫలితంగా ఎలాంటి తరగతుల నిర్వహణ లేకపోయినా... సిబ్బంది లేకపోయినా అంతా సవ్యంగా ఉన్నట్లుగా నివేదికలు వస్తున్నాయి. బోధనా సిబ్బందికి ఇచ్చే వేతనాలు అత్యల్పంగా ఉంటుండడంతో ఒకే లెక్చరర్ నాలుగైదు కాలేజీల్లో బోధిస్తున్న ఉదంతాలు కోకొల్లలుగా ఉన్నాయి. కాలేజీల్లో ప్రమాణాలు పెంచితేనే రాష్ట్రంలో డీఈడీ కాలేజీలు ఎక్కువగా ఉన్నాయి. గతంలో ఎస్జీటీ పోస్టులకు డీఈడీ చేసిన వారికి మాత్రమే అర్హత ఉండేది. అందువల్ల ఈ కోర్సుకు, కాలేజీలకు ఆదరణ లభించేది. ఎస్జీటీ పోస్టులకు బీఈడీ వారిని కూడా అర్హులుగా పరిగణిస్తూ జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి ఉత్తర్వులు ఇచ్చింది. దాంతో విద్యార్థులు బీఈడీ కోర్సుపై దృష్టి పెడుతున్నారు. ఫలితంగా డీఈడీ కోర్సులకు డిమాండ్ పడిపోతోంది. ప్రైవేట్ పాఠశాలల్లో ప్రైమరీ టీచర్లుగా డీఈడీ చేసిన వారినే నియమిస్తే డీఈడీ కోర్సుకు ఆదరణ పెరుగుతుంది. ప్రస్తుతం డీఈడీ, బీఈడీ కాలేజీల్లో ప్రమాణాలు దిగజారాయి. ప్రమాణాలు పెంచితే మళ్లీ ఆదరణ పెరగడం ఖాయం. – రవీందర్‌రెడ్డి, డైట్‌సెట్ కన్వీనర్ తనిఖీలు నిర్వహించాకే ప్రవేశాలకు అనుమతి ఇవ్వాలి ఉపాధ్యాయ విద్య మెరుగుపడాలంటే ప్రస్తుతం ఉన్న కాలేజీలను పటిష్టం చేయాలి. ప్రభుత్వం ఈ దిశగా చర్యలు చేపడితే పరిస్థితిలో మార్పు వస్తుంది. బీఈడీ కాలేజీల్లో బయోమెట్రిక్ విధానాన్ని తప్పనిసరి చేయాలి. కాలేజీల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి. కాలేజీల్లో తనిఖీలు నిర్వహించిన తరువాతే ప్రవేశాలకు అనుమతి ఇవ్వాలి. ప్రైవేట్ కాలేజీల్లో ప్రమాణాలు పెరిగితే డీఈడీ, బీఈడీ కోర్సులకు ఆదరణ దక్కే అవకాశం ఉంది. – ప్రొఫెసర్ కుమార స్వామి, ఎడ్‌సెట్ కన్వీనర్ -
ప్రమాణాలు లేకపోతే మూతే!
సాక్షి, అమరావతి : విద్యాబోధనలో కనీస ప్రమాణాలు కూడా పాటించని బీఈడీ కాలేజీలను మూసివేయించాలని జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) భావిస్తోంది. నిర్ణీత నిబంధనల మేరకు భవనాలు, బోధనా సిబ్బంది సహాఇతర కనీస ఏర్పాట్లు కూడా లేకుండా కేవలం కాగితాలకే పరిమితమైన వేలాది కాలేజీలకు ఇక మంగళం పాడనుంది. కుప్పలు తెప్పలుగా పెరిగిపోయిన ఈ కాలేజీల కారణంగా ఏటా దేశవ్యాప్తంగా లక్షల సంఖ్యలో టీచర్ అభ్యర్థులు బయటకు వస్తున్నారు. వీరిలో కనీస ప్రమాణాలు కూడా ఉండడంలేదని ఇటీవల ఎన్సీటీఈ నిర్వహించిన తనిఖీల్లో తేటతెల్లమైంది. బోధన చేయలేని ఇలాంటి టీచర్ల కారణంగా ఆయా స్కూళ్లలో చదువుతున్న విద్యార్థుల్లో ప్రమాణాలు పూర్తిగా అడుగంటిపోతున్నాయి. ఈ నేపథ్యంలో.. సరైన ప్రమాణాలు లేకుండా కొనసాగుతున్న బీఈడీ కాలేజీలను మూసివేయించేందుకు ఎన్సీటీఈ నిర్దిష్ట చర్యలకు ఉపక్రమించింది. ఇలాంటి కాలేజీలను ఉన్నత విద్యాశాఖ, ఉన్నత విద్యామండలి, యూనివర్సిటీలు గుర్తించాలని ఎన్సీటీఈ సభ్య కార్యదర్శి సంజయ్ అవస్థి అన్ని రాష్ట్రాలు, ప్రాంతీయ మండళ్లకు నోటీసులు జారీచేశారు. అలాగే, ఎన్సీటీఈ సదరన్ రీజనల్ కమిటీ రీజనల్ డైరక్టర్ డాక్టర్ అనిల్‌కుమార్ శర్మ రాష్ట్ర విద్యాశాఖ బాధ్యతలు చూస్తున్న ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్‌కు కూడా లేఖ ద్వారా తెలిపారు. 19వేల కాలేజీల పనితీరు పరిశీలన కాగా, దేశవ్యాప్తంగా 19వేల బీఈడీ కాలేజీల్లోని ప్రమాణాలు, ఇతర పరిస్థితులపై ఎన్సీటీఈ ఇటీవల జరిపిన పరిశీలనలో నివ్వెరపోయే అంశాలు వారి దృష్టికి వచ్చాయి. అవి.. - బీఈడీ డిగ్రీ అనేది టీచర్‌గా కాకుండా పెళ్లి కోసమో, స్టేటస్ కోసమో.. కేవలం సర్టిఫికెట్ కోసమో ఈ కాలేజీల్లో పలువురు చేరుతున్నట్లు గుర్తించింది. - వాస్తవానికి జాతీయ విద్యాహక్కు చట్టం ప్రకారం స్కూళ్లలో టీచర్, విద్యార్థుల నిష్పత్తి 1 : 27గా నిర్దేశించారు. ఈ లెక్కన దేశవ్యాప్తంగా పాఠశాలల్లోని విద్యార్థుల సంఖ్య 26 కోట్లుగా ఉంది. విద్యార్థి నిష్పత్తి ప్రకారం 90 లక్షల మంది టీచర్లుండాలి. ప్రస్తుతం స్కూళ్లలో ఉన్న టీచర్ల సంఖ్య పోను అవసరమైన మిగతా టీచర్ల సంఖ్య కేవలం 3 లక్షలు మాత్రమే. కానీ, ఏటా 19 లక్షల మంది బయటకు వస్తున్నారు. ఈ లెక్క ప్రకారం దేశవ్యాప్తంగా 10వేలకు పైగా కాలేజీలను మూసేసినా ఇంకా మూడు రెట్లు ఎక్కువగా ఏటా టీచర్ అభ్యర్థులు బయటకు రానున్నారు. అన్ని బీఈడీ కాలేజీల్లో బయోమెట్రిక్ ఇదిలా ఉంటే.. కాలేజీల్లో విద్యార్థుల హాజరు చాలా తక్కువగా ఉంటుండడంతో ఎన్సీటీఈ అన్ని కాలేజీల్లో బయోమెట్రిక్ విధానాన్ని విద్యార్థులకే కాక బోధనా సిబ్బందికీ తప్పనిసరి చేసింది. అలాగే, కాలేజీకి సంబంధించిన అన్ని వివరాలను వెబ్సైట్లో ప్రదర్శించాలని.. అధికారులు వాటిని వారం వారం పరిశీలిస్తారని.. ప్రమాణాలు లేని కాలేజీలు, నిబంధనలు పాటించని వాటి గుర్తింపును వెంటనే రద్దుచేయనున్నట్లు హెచ్చరించింది. రాష్ట్రంలో కనీస ప్రమాణాలు కరువు ఇక రాష్ట్రంలోని మొత్తం 431 బీఈడీ కాలేజీల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించే సంస్థలు నామమాత్రంగా ఉన్నాయి. వీటిల్లో కనీస సదుపాయాలూ కల్పించడంలేదు. కొన్నయితే సంబంధిత అధికారులకు ముడుపులు ముట్టజెబుతూ కేవలం కాగితాల్లోనే మాయచేస్తున్నాయి. ఒకే భవనంలో వేర్వేరు పేర్లతో కాలేజీలు నడిపిస్తున్న యాజమాన్యాలు కూడా ఉన్నాయి. కన్వీనర్ కోటా కింద భర్తీ అయ్యే సీట్ల సంఖ్య అరకొరగా ఉన్నా ఆ తరువాత స్పాట్ అడ్మిషన్ల కింద ఇతర రాష్ట్రాల నుంచి అభ్యర్థులను రప్పిస్తూ బీఈడీ కోర్సును ఒక దందాగా మార్చేశాయి. -
నో ట్రిక్.. ఇక బయోమెట్రిక్
సాక్షి, నెల్లూరు (టౌన్): విద్యా వ్యవస్థలో అవినీతి ప్రక్షాళనకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటికే పలు విద్యా కళాశాలలు స్కాలర్ షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను పక్కదారి పట్టిస్తున్నాయన్న కారణంతో డిగ్రీ, ఇంటర్ కళాశాలల్లో బయోమెట్రిక్ యంత్రాలను ఏర్పాటు చేశారు. తాజాగా బీఈడీ కళాశాలల్లో కూడా బయోమెట్రిక్ యంత్రాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. జిల్లాలో చాలా ప్రైవేట్ బీఈడీ కళాశాలల్లో విద్యార్థులు కళాశాలకు రాకుండానే హాజరు వేస్తున్న పరిస్థితి ఉంది. దీంతో పాటు అర్హత లేని అధ్యాపకులతో బోధన చేయిస్తున్నారు. పరీక్షల సమయంలో మాస్ కాపీయింగ్ జరుపుకోవచ్చన్న ఉద్దేశం ప్రైవేట్ కళాశాలల్లో ఉంది. బయోమెట్రిక్ యంత్రాల ద్వారా విద్యార్థులు, అధ్యాపకుల హాజరును పరిగణలోకి తీసుకోవాలన్న ప్రభుత్వ ఆదేశాలతో ప్రైవేట్ బీఈడీ కళాశాలల యాజమాన్యాల్లో ఆందోళన నెలకొంది. జిల్లాలో 21 బీఈడీ కళాశాలలు జిల్లాలో మొత్తం 21 బీఈడీ కళాశాలలు ఉన్నాయి. వీటిలో ఒక ప్రభుత్వ, 20 ప్రైవేట్ బీఈడీ కళాశాలలు ఉన్నాయి. ఈ కళాశాలల్లో మొత్తం 720 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రభుత్వ బీఈడీ కళాశాల, సిద్ధార్థ బీఈడీ కళాశాలల్లో 100 మంది విద్యార్థులు, మిగిలిన 19 బీఈడీ కళాశాలల్లో 50 మంది విద్యార్థులకు మాత్రమే అనుమతి ఉంది. బీఈడీ కళాశాలల్లో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.13,500 ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను చెల్లిస్తోంది. గత మూడేళ్ల నుంచి బీఈడీ కోర్సును రెండేళ్లు చేశారు. అయితే బీఈడీ కళాశాల ర్వహణలో లోపాలు, అక్రమాలపై నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ) దృష్టి సారించింది. వీటిని అరికట్టేందుకు ఎన్సీటీఈ ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. కొన్ని కళాశాలల్లో విద్యార్థులు రాకపోయినా ఇష్టారాజ్యంగా హాజరు వేసి పరీక్షలకు పంపిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. విద్యార్థులు రాకుండానే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను తమ ఖాతాల్లో వేసుకుంటున్నాయి. అమలు కాని నిబంధనలు జిల్లాలోని బీఈడీ కళాశాలల యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనలను పాటించడం లేదు. కళాశాలలో 50 మంది విద్యార్థులు ఉంటే ఒక ప్రిన్సిపల్, ఏడుగురు అధ్యాపకులు ఉండాలి. 100 మంది విద్యార్థులకు ఒక ప్రిన్సిపల్ 15 మంది అధ్యాపకులు ఉండాలి. ఎన్సీటీఈ నిబంధనలు ప్రకారం ప్రిన్సిపాల్‌కు బీఈడీ, ఎంఈడీతో పాటు పీహెచ్డీ ఉండాలి. పదేళ్లు అనుభవం ఉండాలి. పూర్తి స్థాయిలో తరగతి గదులు, సైకాలజీ ల్యాబ్, లైబ్రరీ ఉండాలి. చాలా కళాశాలల్లో ఇవి మచ్చుకు కూడా కనిపించడం లేదు. కళాశాలకు సొంత భవనంతో పాటు ఇతర మౌలిక సదుపాయాలు తప్పని సరిగా ఉండాలి. శిక్షణ సమయంలో విద్యార్థులతో బయట పాఠశాలల్లో బ్లాక్ టీచింగ్ చెప్పించాల్సి ఉంది. దీంతో పాటు 30 రికార్డులకు పైగా విద్యార్థులు రాయాల్సి ఉంది. వీటినింటిని చేసినట్టుగా చూపించినందుకు ప్రత్యేకంగా డబ్బులు వసూళ్లు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. విద్యార్థులు కళాశాలకు రెగ్యులర్‌గా రాకుండా హాజరు వేసినందుకు కళాశాలల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి కొత్త మొత్తాన్ని అదనంగా వసూలు చేస్తున్నారు. కన్నెత్తి చూడని వర్శిటీ అధికారులు బీఈడీ కళాశాలల్లో అవినీతి, అక్రమాలు చోటు చేసుకుంటున్నా యూనివర్శిటీ అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడటం లేదన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఏటా ఉన్నత విద్యామండలి తరఫున ఒకరు, యూనివర్సిటీ తరఫున మరొకరు బీఈడీ కళాశాలలను తనిఖీ చేయాల్సి ఉంది. బీఈడీ కళాశాలల్లో మౌలిక వసతులు, బోధనా సిబ్బంది సరిపడా ఉంటేనే అడ్మిషన్లుకు అవకాశం కల్పించాల్సి ఉంది. అయితే బీఈడీ కళాశాలలపై తనిఖీలు నామ మాత్రంగానే నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కొన్ని కళాశాలలు తనిఖీల సమయంలో హడావుడి చేసి మమ అనిపిస్తున్నారు. బీఈడీ కళాశాలలకు వసతులు సరిగా ఉన్నా లేకున్నా అడ్మిషన్లుకు అనుమతి ఇవ్వాలంటే అధికారులకు కొంత ముట్టజెప్పాల్సి ఉంటుంది. దీంతోనే వర్సిటీ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు. తప్పని సరిగా బయోమెట్రిక్ 2019–20 విద్యా సంవత్సరానికి సంబంధించి బీఈడీ కళాశాలల్లో తప్పని సరిగా బయోమెట్రిక్ యంత్రాలను బిగించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. బయోమెట్రిక్ యంత్రాలు ద్వారానే విద్యార్థులు, అధ్యాపకులు హాజరును తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో చాలా ప్రైవేట్ బీఈడీ కళాశాలల యాజమాన్యాలు బయోమెట్రిక్ ఏర్పాటు ఆదేశాలతో ఆందోళన పడుతున్నాయి. దీని వల్ల ప్రతి కళాశాలలో రెగ్యులర్‌గా విద్యార్థులు రావడం, బోధన చెప్పడం చేయాల్సి ఉంటుంది. ఫీజు రీయింబర్స్మెంట్ రావాలంటే విద్యార్థులు క్రమం తప్పకుండా తరగతులకు హాజరు కావాల్సి ఉంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులతోనే కళాశాలల్లోని సీట్లు నిండుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో బయోమెట్రిక్ యంత్రాలు బిగిస్తే అడ్మిషన్లపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని ఆయా ప్రైవేట్ యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి. బయోమెట్రిక్ యంత్రాలు బిగించాల్సిందే బీఈడీ కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి బయోమెట్రిక్ యంత్రాలు తప్పని సరిగా బిగించాలి. బయోమెట్రిక్ ద్వారా హాజరును పరిగణలోకి తీసుకున్న తర్వాత ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను విడుదల చేస్తారు. క్వాలిఫైడ్ అధ్యాపకులు, కళాశాలల్లో మౌలిక వసతులు తప్పనిసరిగా ఉండాలి. – విజయానందబాబు, డీన్, విక్రమ సింహపురి యూనివర్శిటీ -
రెండేళ్ల డీఈడీ రద్దు!
సాక్షి, హైదరాబాద్: ప్రాథమిక పాఠశాలల్లో బోధించేందుకు అవసరమైన రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈడీ) కోర్సు ఇకపై రద్దు కానుందా? దాని స్థానంలో నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (బీఈఎల్ఈడీ) అమల్లోకి రానుందా? ఈ దిశగా కేంద్రం కసరత్తు చేస్తోందని జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) వర్గాలు పేర్కొంటున్నాయి. డీఈడీ స్థాయి ప్రస్తుత విద్యార్థులకు సరిపోవడం లేదని, దాన్ని రద్దు చేసి డిగ్రీతో బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ విద్యను ప్రవేశపెట్టేందుకు కేంద్రం కార్యాచరణ రూపొందిస్తోంది. 2014లో ఉపాధ్యాయ విద్యా కోర్సుల్లో అనేక సంస్కరణలు తెచ్చిన ఎన్సీటీఈ అప్పుడే నాలుగేళ్ల డీఈఎల్ఈడీ కోర్సును రూపొందించినా అమల్లోకి రాలేదు. దాంతోపాటు నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఎడ్ కోర్సు కూడా రూపొందించినా అమలు చేయడం లేదు. భవిష్యత్తులో ప్రస్తుతం ఉన్న రెండేళ్ల బీఎడ్, డీఎడ్‌ను రద్దు చేసి నాలుగేళ్ల కోర్సులను అమలు చేసే అవకాశం ఉంది. అయితే రెండేళ్ల కోర్సులను వెంటనే రద్దు చేయాలా? 2018–19 నుంచి ఇంటిగ్రేటెడ్ కోర్సులను ప్రవేశపెట్టి, పాత కోర్సుల రద్దుకు ఒకట్రెండేళ్ల సమయం ఇవ్వాలా? అన్న దానిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. నాణ్యత పెంచేందుకే.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా లక్షల మంది డీఈడీ, బీఈడీ అభ్యర్థులున్నారు. 2014కు ముందు ఈ రెండు కోర్సులు ఏడాది పాటే ఉండటం, ఉపాధ్యాయ కొలువు అవకాశాలు ఎక్కువగా ఉండటంతో అనేక మంది వాటిల్లో చేరారు. ప్రత్యేక ఆసక్తి లేకపోయినా, చివరికి టీచర్ ఉద్యోగమైనా సంపాదించుకోవచ్చన్న యోచనతో లక్షల మంది ఈ కోర్సులను పూర్తిచేశారు. ఒక్క తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనే దాదాపు 8 లక్షల మంది డీఈడీ, బీఈడీ అభ్యర్థులు ఉన్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ పరిస్థితిలో మార్పు తేవడంతోపాటు ఉపాధ్యాయ విద్యలో నాణ్యతను పెంపొందించేందుకు ఇంటిగ్రేటెడ్ కోర్సులే శరణ్యమని కేంద్రం భావిస్తోంది. 2019–20 విద్యా సంవత్సరం నుంచి వాటిని అమల్లోకి తేవాలని యోచిస్తోంది. అసమానతలు తొలగించేలా.. ప్రస్తుతం ఎన్సీటీఈ నిబంధనల ప్రకారం.. ఇంటర్‌తో డీఈడీ చేసిన వారు ఒకటి నుంచి 5వ తరగతి వరకు బోధించేందుకు మాత్రమే అర్హులు. ఒకవేళ డిగ్రీ ఉంటే ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు (ఎలిమెంటరీ విద్య) బోధించవచ్చు. ఇక డిగ్రీతో బీఈడీ చేసిన వారు 8వ తరగతి నుంచి 12వ తరగతి వరకు బోధించేందుకు అర్హులు. ఉపాధ్యాయ అర్హత పరీక్షను (టెట్) కూడా ఇదే విధానంలో నిర్వహిస్తున్నారు. కానీ రాష్ట్రంలో ఇంటర్‌తో డీఈడీ కలిగిన వారిని ఐదో తరగతి వరకే పరిమితం చేస్తున్నారు. వారు కేవలం టెట్ పేపరు–1 రాసేందుకే ప్రభుత్వం అనుమతి ఇస్తోంది. అయితే వారితో 6, 7, 8 తరగతులకు కూడా అనధికారికంగా బోధన కొనసాగిస్తోంది. డిగ్రీ ఉన్నా 6, 7, 8 తరగతులకు అధికారికంగా బోధించే అవకాశం (టెట్ పేపరు–2 రాసే అర్హత) ఇవ్వడం లేదు. దీంతో వారు ఆందోళన చెందుతున్నారు. ఉన్నత పాఠశాలల్లోని 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు బోధించేందుకు డిగ్రీతో బీఎడ్ కలిగిన వారికి మాత్రమే టెట్ పేపరు–2 రాసే అవకాశం ఇస్తోంది. రాష్ట్రంలో 12వ తరగతి విధానం లేనందున వారు 10వ తరగతి వరకే పరిమితం అవుతున్నారు. ఈ నేపథ్యంలో పాఠశాలల్లో ఎలిమెంటరీ విద్య, ఉన్నత పాఠశాల విద్య విధానం అమలు చేయాలని కేంద్రం ఇప్పటికే ఆదేశించింది. ఆ దిశగా రాష్ట్రంలో కసరత్తు ప్రారంభించినా ఇంతవరకు ఆచరణకు నోచుకోలేదు. కోర్సుల పరంగా వ్యత్యాసాలు లేకుండా, నాణ్యమైన విద్యను అందించేందుకు ఇంటిగ్రేటెడ్ కోర్సులను ప్రవేశపెడితే ప్రయోజనం ఉంటుందని యోచిస్తోంది. ముందుగా ప్రభుత్వ, ఎయిడెడ్ కాలేజీల్లో.. ప్రస్తుతం ఉన్న రెండేళ్ల బీఈడీ కోర్సు స్థానంలో నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సును ప్రవేశపెడతామని బడ్జెట్ సందర్భంగా కేంద్రం ప్రకటించింది. ఆ మేరకు వచ్చే విద్యా సంవత్సరం(2019–20) నుంచి ప్రభుత్వ, ఎయిడెడ్ బీఈడీ కళాశాలల్లో బీఏ–బీఈడీ, బీఎస్సీ–బీఈడీ కోర్సులను ప్రవేశపెట్టాలని కేంద్రం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఆ తర్వాత ప్రైవేట్ బీఈడీ కాలేజీల్లో ఈ కోర్సులను ప్రవేశ పెట్టే ఆలోచనలు చేస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా బీఈడీ చదువుతున్నవారు ఉండటం, అలాగే డిగ్రీలో చేరి తర్వాత బీఈడీ చేయాలన్న ఆలోచన కలిగిన వారు ఉన్నందునా రెండేళ్ల బీఈడీ కోర్సును 2020–21 విద్యా సంవత్సరం వరకు కొనసాగిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలు చేస్తోంది. కాలేజీలు కూడా అందుకు సిద్ధం కావాల్సి ఉన్నందున మరికొన్నేళ్లు కొత్త కోర్సులతోపాటు పాత రెండేళ్ల కోర్సులను కూడా కొనసాగించాలని ఇటీవల నిపుణుల కమిటీ కూడా కేంద్రానికి సిఫారసు చేసినట్లు తెలిసింది. రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌లో ఇంటిగ్రేటెడ్ బీఎడ్‌ను ప్రవేశ పెట్టేందుకు రెండు కాలేజీలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్నా వాటికి అనుబంధ గుర్తింపు లభించకపోవడంతో అవి ప్రారంభానికి నోచుకోలేదు. -
బీఈడీ అభ్యర్థులకు తీపి కబురు
సాక్షి, హైదరాబాద్: బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్) అభ్యర్థులకు మళ్లీ మంచి రోజులు వచ్చాయి. ఎనిమిదేళ్లుగా సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులకు దూరమైన బీఎడ్ అభ్యర్థులకు మళ్లీ ఎస్జీటీ అవకాశాలు లభించనున్నాయి. ఈ మేరకు జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో రాష్ట్రంలోని దాదాపు 4 లక్షల మంది బీఎడ్ అభ్యర్థులు స్కూల్ అసిస్టెంట్ పోస్టులతోపాటు ఎస్జీటీ పోస్టులకూ అర్హులు కానున్నారు. అయితే ఒకటి నుంచి 5వ తరగతి వరకూ బోధించేందుకు టీచర్‌గా ఎంపికయ్యే బీఎడ్ అభ్యర్థి తాను నియామకం అయిన తేదీ నుంచి రెండేళ్లలోగా తాము గుర్తించిన విద్యా సంస్థ నుంచి ఎలిమెంటరీ విద్యలో ఆరు నెలల బ్రిడ్జి కోర్సు పూర్తి చేయాలని ఎన్సీటీఈ నోటిఫికేషన్లో స్పష్టం చేసింది. అసలేం జరిగిందంటే.. బీఎడ్‌లో చైల్డ్ సైకాలజీ లేదని, చిన్న పిల్లలకు వారు బోధించేందుకు అర్హులు కాదని, 1 నుంచి 5వ తరగతి వరకు ఉన్న ఎస్జీటీ పోస్టులకు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(డీఎడ్) అభ్యర్థులే అర్హులంటూ 2008లో డీఎడ్ అభ్యర్థుల సంఘం సుప్రీంకోర్టును ఆశ్రయిం చింది. వాదోపవాదాల తర్వాత 2010లో ఎస్జీటీ పోస్టులకు డీఎడ్ అభ్యర్థులే అర్హులని, బీఎడ్ అభ్యర్థులు అర్హులు కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. కోర్టు ఆదేశాల మేరకు 1 నుంచి 5వ తరగతి వరకు బోధించేందుకు బీఎడ్ వారు అర్హులు కాదని 2010 ఆగస్టు 23న ఎన్సీటీఈ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అప్పటి నుంచి రాష్ట్రంలో చేపట్టిన నియామకాల్లో ఎస్జీటీ పోస్టులకు బీఎడ్ అభ్యర్థులను తీసుకోలేదు. వారిని స్కూల్ అసిస్టెంట్ పోస్టులకే పరిమితం చేసింది. ఎస్జీటీ పోస్టులను డీఎడ్ అభ్యర్థులతోనే భర్తీ చేస్తూ వచ్చాయి. బీఎడ్ అభ్యర్థుల అభ్యర్థనతో.. 1 నుంచి 5వ తరగతి వరకు బోధించేందుకు తమకు అవకాశం ఇవ్వాలని, చైల్డ్ సైకాలజీ సబ్జెక్టును ప్రత్యేకంగా చదువుకుంటామని అనేకసార్లు బీఎడ్ అభ్యర్థులు ఎన్సీటీఈని, కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. దీంతో కేంద్రం ఆ దిశగా చర్యలు చేపట్టింది. 50 శాతం మార్కులతో డిగ్రీ, బీఎడ్ పూర్తి చేసిన వారు 1 నుంచి 5వ తరగతి వరకు బోధించేందుకు అర్హులేనని గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఎస్జీటీగా నియమితులైన రెండేళ్లలోగా ఎలిమెంటరీ విద్యలో 6 నెలల బ్రిడ్జి కోర్సును పూర్తి చేయాల్సి ఉంటుందని పేర్కొంది. అయితే ప్రస్తుతం ఎలిమెంటరీ విద్యలో బ్రిడ్జి కోర్సు లేదు. దానిని ఎన్సీటీఈ ప్రవేశ పెడుతుందని అధికారులు పేర్కొంటున్నారు. మరోవైపు డీఎడ్ అభ్యర్థులకు ఇప్పటివరకు ఎస్జీటీ పోస్టుల్లో ఉన్న పూర్తి అవకాశం తగ్గిపోనుంది. డీఎడ్, బీఎడ్ అభ్యర్థులు ఇద్దరికి వాటిల్లో అవకాశం ఉండనుంది. మళ్లీ పూర్వవైభవం వస్తుందా? ఒకప్పుడు ఏడాది కోర్సుగానే ఉన్న బీఎడ్‌ను ఎన్సీటీఈ 2014లో రెండేళ్ల కోర్సుగా మార్పు చేయడం, బీఎడ్ వారికి ఎస్జీటీ పోస్టుల్లో అవకాశం తొలగించడంతో బీఎడ్‌కు డిమాండ్ తగ్గిపోయింది. గతంలో బీఎడ్‌లో చేరేందుకు ఏటా లక్ష మందికిపైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా అది క్రమంగా తగ్గుతూ వచ్చింది. 2018–19లో బీఎడ్‌లో ప్రవేశాల కోసం ఎడ్‌సెట్‌కు 38 వేల మంది మాత్రమే హాజరయ్యారు. ఎన్సీటీఈ తాజా నిర్ణయంతో బీఎడ్‌కు మళ్లీ పూర్వ వైభవం వచ్చే అవకాశం ఉందని, ప్రైవేటు పాఠశాలల్లోనూ అవకాశాలు విస్తృతం అవుతాయని అధికారులు చెబుతున్నారు. -
బీఎడ్‌లో ప్రవేశాల షెడ్యూలు జారీ
ఈ నెల 30న నోటిఫికేషన్.. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్) కాలేజీల్లో బీఎడ్ ప్రవేశాల కోసం బుధవారం(30న) నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రవేశాల కమిటీ నిర్ణయించింది. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన సోమవారం ప్రవేశాల కమిటీ సమావేశం మండలి కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో షెడ్యూల్‌ను ప్రకటించారు. జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలికి (ఎన్సీటీఈ) అఫిడవిట్లు దాఖలు చేసిన కాలేజీల జాబితా ఈ నెల 31 తర్వాత వెల్లడికానున్న నేపథ్యంలో ఆ తర్వాత ప్రవేశాల కౌన్సెలింగ్ నిర్వహించేలా షెడ్యూల్‌ను ఖరారుచేశారు. ఇదీ షెడ్యూలు.. 7–9–2017 నుంచి 13–9–2017 వరకు అర్హులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ 9–9–2017 నుంచి 16–9–2017వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం 17–9–2017న వెబ్ ఆప్షన్లలో మార్పులకు అవకాశం 20–9–2017న సీట్లు కేటాయింపు 25–9–2017లోగా కాలేజీల్లో చేరికలు, అదేరోజు నుంచి క్లాసులు ప్రారంభం. -
అదనపు సీట్లు, కొత్త కాలేజీలు వద్దు
► ఎన్‌సీటీఈకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయ విద్యా కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు ఐదు లక్షల మందికిపైగా ఉన్నందున ఇకపై ఉపాధ్యాయ విద్యా కాలేజీలు, అదనపు సీట్లకు అనుమతులు ఇవ్వొద్దని రాష్ట్ర ప్రభుత్వం జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ)ని కోరింది. తాము అడిగే వరకు కొత్త కాలేజీల ప్రారంభాలకు అనుమతించవద్దని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఎన్‌సీటీఈకి సర్కారు లేఖ రాసింది. రాష్ట్రంలో 11 కొత్త డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్) కాలేజీలు, 17 బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్) కాలేజీలు, 20 ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీల ప్రారంభానికి తాత్కాలిక గుర్తింపు ఇవ్వడాన్ని లేఖలో ప్రస్తావించింది. రాష్ట్రంలో ఉన్న 330 ఉపాధ్యాయ విద్యా కాలేజీల (బీఎడ్-196, డీఎడ్-212, బీపీఈడీ-22) నుంచి ఏటా 30 వేల మంది అభ్యర్థులు బయటకు వస్తున్నారని, ఇవి కాకుండా పండిత శిక్షణ కాలేజీలు, మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉన్నాయని వివరించింది. వీటి నుంచే రా నున్న 15 ఏళ్లలో మరో 5 లక్షల మందికిపైగా అభ్యర్థులు ఉపాధ్యాయ విద్యను పూర్తి చేసుకొని బయటకు రానున్నారని...2030 నాటికి ఉపాధ్యాయ విద్య పూర్తి చేసుకున్న అ భ్యర్థుల సంఖ్య 10 లక్షలు దాటనుందని, వా రందరికీ సరిపడ ఉపాధ్యాయ పోస్టులు ప్రభు త్వ, ప్రైవేటు రంగాల్లో లేవని వివరించింది. కేవలం 44,842 పోస్టులు మాత్రమే వచ్చే అవకాశం ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో కొత్త కాలేజీలకు అనుమతులు ఇవ్వవద్దని కోరింది. -
ఉపాధ్యాయ విద్య
మారుతున్న స్వరూపం.. నాణ్యతకు ప్రాధాన్యం..విద్యా వ్యవస్థలో ఉపాధ్యాయులది గురుతర బాధ్యత. విద్యార్థులను పరిపూర్ణులుగా తీర్చిదిద్దడంలో టీచర్ల బోధన అమూల్యమైంది. అందుకే పిల్లల అవసరాలకు, వారి అభ్యసనానికి అనుగుణంగా స్పందించే ఉపాధ్యాయుల్ని తయారు చేయాలి. ఇలాంటి సదుద్దేశంతో ఇటీవల నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ).. కొత్త విధివిధానాలను రూపొందించింది. 2015-16 నుంచి వీటిని అమలు చేయాలని సూచించింది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ విద్య స్వరూపం, కెరీర్ పరంగా అవకాశాలపై స్పెషల్ ఫోకస్.. ఉపాధ్యాయ విద్య.. భావి తరాల బంగారు భవితకు మార్గ నిర్దేశనం చేసే బోధన రంగంలో అడుగులు వేసేందుకు సాధనం. వ్యక్తిగతంగా, వృత్తిగతంగా సంతృప్తినిచ్చే కెరీర్. అందుకే దేశంలో ఏటా లక్షల మంది యువత.. డీఈడీ, బీఈడీ, ఎంఈడీ తదితర టీచర్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో ప్రవేశానికి పోటీపడుతున్నారు. పరిస్థితి ఒకవైపు ఇలా ఉంటే మరోవైపు ప్రాథమిక విద్య మొదలు వృత్తి విద్యా సంస్థల వరకు అన్నింటిలోనూ నాణ్యమైన బోధనా సిబ్బంది కొరత వేధిస్తోందంటూ సంబంధిత వర్గాల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా కరిక్యులం, కోర్సుల స్వరూపాలు ప్రస్తుత సామాజిక పరిస్థితులకు అనుగుణంగా లేవనే అభిప్రాయాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్సీటీఈ ఉపాధ్యాయ విద్యా కోర్సుల స్వరూపాలను మార్చి.. నాణ్యత స్థాయిలను పెంచేందుకు ప్రణాళికలు రూపొందించింది. బోధన రంగంలో మెరుగైన నైపుణ్యాలు అందేలా ప్రాక్టికాలిటీకి పెద్దపీట వేయాలని నిర్ణయించింది. మార్పులేమిటి? ఉపాధ్యాయ విద్యకు సంబంధించి డీఈడీ నుంచి ఎంఈడీ వరకు దాదాపు 15 కోర్సుల స్వరూపాన్ని మార్చుతూ, వ్యవధిని పెంచుతూ ఎన్సీటీఈ నిర్ణయం తీసుకుంది.సాధారణ బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులు పోటీపడే కీలకమైన, ఏడాది వ్యవధి గల బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఈడీ) కోర్సును రెండేళ్లకు పెంచారు. పీజీ స్థాయిలో మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (ఎంఈడీ) కోర్సు వ్యవధిని రెండేళ్లకు పెంచారు. దేశ వ్యాప్తంగా వివిధ సంస్థల్లో అందుబాటులో ఉన్న డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్; డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్; డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్; బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్; మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్; డిప్లొమా ఇన్ ఆర్ట్స్ ఎడ్యుకేషన్; డిప్లొమా ఇన్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఎడ్యుకేషన్ కోర్సుల వ్యవధిని కూడా రెండేళ్లు తప్పనిసరి చేసింది. దూర విద్య కోర్సులను కూడా రెండేళ్లు చేసింది. కరిక్యులంలో మార్పులు ప్రతి కోర్సుకు ఒక విద్యా సంవత్సరంలో తప్పనిసరిగా ఉండాల్సిన టీచింగ్ అవర్స్, ప్రాక్టికల్స్ అవర్స్‌ను నిర్దేశించింది. ఉదాహరణకు బీఈడీ కోర్సులో ప్రతి విద్యా సంవత్సరంలో తప్పనిసరిగా 200 రోజుల బోధన ఉండాలి. ఇందులో తరగతి గది బోధన, ఇంటర్నల్స్, ప్రాక్టికల్స్‌కు వేర్వేరుగా నిర్దిష్ట గంటలు పేర్కొనడంతో విద్యార్థులకు పూర్తిస్థాయి నైపుణ్యాలు అందేందుకు ఆస్కారం లభించనుంది. జండర్ ఎడ్యుకేషన్, యోగా ఎడ్యుకేషన్‌ను తప్పనిసరి చేసింది. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ (ఐసీటీ) బోధన పద్ధతులపై అవగాహన పొందేందుకు దీన్ని ఒక సబ్జెక్ట్‌గా పొందుపర్చాలి. ప్రస్తుతం 40 రోజుల వ్యవధిలో ఉన్న స్కూల్ ఇంటర్న్‌షిప్ 140 రోజులకు పెరగనుంది. విద్యార్థులు పూర్తిస్థాయిలో క్షేత్ర నైపుణ్యాలు సాధించే దిశగా 90 శాతం హాజరును కూడా తప్పనిసరి చేసింది. ఇంటిగ్రేటెడ్ కోర్సుల దిశగా.. బోధన రంగంలో పెరుగుతున్న మానవ వనరుల డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుంటూ ఎన్సీటీఈ కొత్త కోర్సుల రూపకల్పన దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో ఇంటర్ అర్హతతో ప్రవేశం పొందేలా నాలుగేళ్ల వ్యవధిలో బీఎస్సీ-బీఈడీ, బీఏ-బీఈడీ అనే రెండు ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్సుల రూపకల్పనకు యోచిస్తోంది. అదే విధంగా పీజీ స్థాయిలో బీఏ-ఎంఈడీ కోర్సు ప్రారంభించాలని కూడా యోచిస్తోంది. ఇక.. స్పెషల్‌గా ఎంఈడీ ఎన్సీటీఈ తాజా నిర్ణయాలతో ఎంఈడీ కోర్సు కూడా స్పెషల్‌గా మారనుంది. ఇప్పటి వరకు అందరికి ఒకే మాదిరిగా ఉన్న ఎంఈడీ కోర్సులో ఇక నుంచి స్పెషలైజేషన్స్ అందుబాటులోకి రానున్నాయి. సెకండరీ, సీనియర్ సెకండరీ అనే రెండు స్పెషలైజేషన్స్‌ను ఎంఈడీలో ప్రవేశ పెట్టనున్నారు. బీఈడీ అర్హులు ఈ రెండు స్పెషలైజేషన్స్ ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. డీఈడీలో ఉత్తీర్ణత సాధించి తర్వాత బ్యాచిలర్ డిగ్రీ పొందిన విద్యార్థులకు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ స్పెషలైజేషన్ అందుబాటులో ఉంటుంది. సృజనాత్మకతను పెంపొందించేలా తాజా కరిక్యులం ఉద్దేశం ఎడ్యుకేషన్ కోర్సు ఔత్సాహికుల్లో సృజనాత్మకతను పెంపొందించడం. అందుకే మూల్యాంకనలో ఇంటర్న్‌షిప్ కోసం కేటాయించిన 40 శాతం మార్కుల్లో 20 శాతం మార్కులను ప్రత్యేకంగా ఇన్నోవేషన్, ఫీల్డ్ వర్క్, రీసెర్చ్, ప్రాక్టికల్స్‌కు నిర్దేశించింది. ఇటీవల కాలంలో అమలు చేస్తున్న నిరంతర సమగ్ర మూల్యాంకనం విధానం ప్రస్తుత ఉపాధ్యాయులకు చాలా క్లిష్టంగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి పరిష్కారంగా, ఉపాధ్యాయ విద్యా కోర్సుల్లో మార్పులు తీసుకొస్తున్నట్లు విద్యావేత్తల అభిప్రాయం. కెరీర్ కళకళలాడేలా ఉపాధ్యాయ విద్యలో తీసుకొస్తున్న ఈ మార్పులన్నీ కార్యరూపం దాల్చడంతోపాటు సమర్థంగా అమలైతే రానున్న నాలుగైదేళ్లలో టీచింగ్ కెరీర్ కళకళలాడుతుందని ఈ రంగంలోని నిపుణులు అంటున్నారు. ఈ విషయంలో ఇన్స్టిట్యూట్ల బాధ్యత కూడా ఎంతో ఉంది. ముఖ్యంగా మారిన కోర్సులకు అనుగుణంగా అవసరమైన మౌలిక సదుపాయాలు అందించాలి. దీనికి సంబంధించి కూడా ఎన్సీటీఈ సరికొత్త నిబంధనలు నిర్దేశించింది. ప్రతి కోర్సు విషయంలో ఒక ఇన్స్టిట్యూట్లో బ్లాక్ బోర్డ్ నుంచి లేబొరేటరీ వరకు అవసరమైన అన్ని కచ్చితమైన మౌలిక సదుపాయాల జాబితా రూపొందించింది. అంతేకాకుండా ఇక నుంచి టీచింగ్ ఇన్స్టిట్యూట్లకు కూడా నాక్ (నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్) గుర్తింపు తప్పనిసరి. విద్యార్థుల దృక్పథం మారాలి టీచర్ ఎడ్యుకేషన్ విద్యార్థుల దృక్పథం మారాలన్నది విద్యావేత్తల సూచన. తాజా మార్పులను ఆకళింపు చేసుకునేలా మానసికంగా ఉల్లాసంగా ఉండాలని, భవిష్యత్తులో ఒక ఆదాయ మార్గంగానే ఈ కోర్సులను భావించకుండా మార్పుల ఉద్దేశాలకు అనుగుణంగా నైపుణ్యాలు సొంతం చేసుకోవాలంటున్నారు. అప్పుడు అవకాశాలు వాటంతటవే లభిస్తాయని, ఆకర్షణీయ వేతనాలు పొందొచ్చని చెబుతున్నారు. మూస ధోరణికి ముగింపు! ప్రస్తుతం మనం బీటెక్, ఎంబీఏ, మెడిసిన్ వంటి వాటినే ప్రొఫెషనల్ కోర్సులుగా భావిస్తున్నాం. కానీ ఆ కోర్సుల దిశగా విద్యార్థులను తీర్చిదిద్దే ఉపాధ్యాయ కోర్సులు మాత్రం మూస ధోరణిలో సాగుతున్నాయి. అందుకే బీఈడీ, ఎంఈడీ కోర్సుల్లోనూ ప్రొఫెషనలిజానికి ప్రాధాన్యం ఇచ్చేందుకు మొదటి అడుగుగా తాజా మార్పులను పేర్కొనొచ్చు. ఇప్పటి వరకు ఉపాధ్యాయ విద్యలో టీచింగ్, ప్రాక్టికల్స్ (క్లాస్‌రూం ఇంటర్న్‌షిప్) రైలు పట్టాల మాదిరిగా వేర్వేరుగా ఉన్నాయి. వీటిని సమ్మిళితం చేసేలా కొత్త కరిక్యులంను రూపొందించారు. ఆయా కోర్సుల మొత్తం వ్యవధిలో నిరంతర ప్రక్రియగా ‘తరగతి గది పరిశీలన’ను రూపొందించడం ఎంతో మేలు చేస్తుంది. దీనివల్ల అకడమిక్‌గా ఒక అంశంపై అవగాహన పొందిన వెంటనే సంబంధిత బోధన పద్ధతులపైనా పరిజ్ఞానం లభిస్తుంది. అంతేకాకుండా కోర్సులో చదివే పలు సబ్జెక్ట్‌లను సమీకృతం చేసేలా పాఠ్య ప్రణాళికలను రూపొందించే అంశాలపై శిక్షణ ద్వారా విద్యార్థులకు మెరుగైన నైపుణ్యాలు లభిస్తాయి. ప్రపంచ వ్యాప్తంగా మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఉపాధ్యాయ విద్యలో మార్పులు అన్ని వర్గాల ఉన్నతికి దోహదం చేస్తాయి. - డాక్టర్ పి.సందీప్, ఎన్సీటీఈ సభ్యులు. -
ఉపాధ్యాయ కెరీర్‌కు తొలి మెట్టు.. సీటెట్
విద్యాహక్కు చట్టం ప్రకారం.. ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాలనుకునే వారు కొన్ని నిర్దేశిత ప్రమాణాలను అందుకోవాల్సిఉంటుంది.. దేశంలో ఉపాధ్యాయ విద్యను పర్యవేక్షించే నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ) కూడా ఆ మేరకు మార్గదర్శకాలను రూపొందించింది.. ఈ క్రమంలో టెట్ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) అమల్లోకి వచ్చింది.. దీన్ని రాష్ట్ర, కేంద్ర స్థాయిల్లో నిర్వహిస్తున్నారు.. ఈ నేపథ్యంలో ఇటీవల విడుదలైన సీబీఎస్ఈ సీటెట్ (సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) నోటిఫికేషన్ వివరాలు.. సెంట్రల్ స్కూల్స్‌లో ఉపాధ్యాయులుగా కెరీర్‌గా ప్రారంభించాలనుకునే వారు సీటెట్ (సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్)కు విధిగా హాజరు కావాల్సి ఉంటుంది. ఈ పరీక్షను సీబీఎస్ఈ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) నిర్వహిస్తుంది. రెండు పేపర్లుగా: సీటెట్ రెండు పేపర్లుగా ఉంటుంది. అవి.. పేపర్-1:1 నుంచి 5 తరగతులకు ఉద్దేశించింది. అంటే ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరాలనుకునే వారు ఈ పేపర్‌కు హాజరు కావాలి. అర్హత: 50 శాతం మార్కులతో సీనియర్ సెకండరీ పరీక్షలో ఉత్తీర్ణత/తత్సమానంతోపాటు రెండేళ్ల వ్యవధి ఉండే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (ఈ కోర్సును ఏ పేరుతో వ్యవహరించినా) లో ఉత్తీర్ణత. లేదా 45 శాతం మార్కులతో సీనియర్ సెకండరీ పరీక్షలో ఉత్తీర్ణత/ తత్సమానంతోపాటు రెండేళ్ల వ్యవధి గల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు లేదా 50 శాతం మార్కులతో సీనియర్ సెకండరీ పరీక్షలో ఉత్తీర్ణత/ తత్సమానంతోపాటు నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (బీఈఐఈడీ) ఉత్తీర్ణత/చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు లేదా 50 శాతం మార్కులతో సీనియర్ సెకండరీ పరీక్షలో ఉత్తీర్ణత/తత్సమానంతోపాటు రెండేళ్ల వ్యవధి ఉండే డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ ఉత్తీర్ణత/ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు లేదా గ్రాడ్యుయేషన్‌తోపాటు రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ ఉత్తీర్ణత/ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు.పేపర్-2:6 నుంచి 8 తరగతులకు ఉద్దేశించింది. అంటే ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరాలనుకునే వారు ఈ పేపర్‌కు హాజరు కావాలి. అర్హత: గ్రాడ్యుయేషన్‌తోపాటు రెండేళ్ల వ్యవధి ఉండే డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ ఉత్తీర్ణత/ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు లేదా 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్‌తోపాటు బీఈడీ పూర్తి చేసిన/ చదువుతున్న విద్యార్థులు లేదా 50 శాతం మార్కులతో సీనియర్ సెకండరీ పరీక్షలో ఉత్తీర్ణత/ తత్సమానంతోపాటు నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (బీఈఐఈడీ) ఉత్తీర్ణత/ చివరి సంవత్సరం చదువు తున్న విద్యార్థులు లేదా 50 శాతం మార్కులతో సీనియర్ సెకండరీ పరీక్షలో ఉత్తీర్ణత/ తత్సమానంతోపాటు బీఏ/ బీఎస్సీ బీఈడీ/ బీఏఎడ్/ బీఎస్సీఎడ్ ఉత్తీర్ణత/ చివరి సంవత్సరం చదువు తున్న విద్యార్థులు లేదా 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్‌తోపాటు బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్) చదువుతున్న విద్యార్థులు. పరీక్ష విధానం: పరీక్షను మల్టిపుల్ చాయిస్ విధానంలో నిర్వహిస్తారు. ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు కేటాయిస్తారు. నెగిటివ్ మార్కింగ్ లేదు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్/హిందీ భాషల్లో ఉంటుంది. సమాధానాలను గుర్తించడానికి 150 నిమిషాల సమయం కేటాయించారు. వివరాలు.. పేపర్-1 అంశం పశ్నలు మార్కులు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగీ 30 30 లాంగ్వేజ్-1 30 30 లాంగ్వేజ్-2 30 30 మ్యాథమెటిక్స్ 30 30 ఎన్విరాన్మెంటల్ స్టడీస్ 30 30 మొత్తం 150 150 పేపర్-2 అంశం పశ్నలు మార్కులు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగీ 30 30 లాంగ్వేజ్-1 30 30 లాంగ్వేజ్-2 30 30 ఎంచుకున్న సబ్జెక్ట్ 60 60 మొత్తం 150 150 ఎంచుకున్న సబ్జెక్ట్‌లో మ్యాథమెటిక్స్, సైన్స్ అభ్యర్థులకు మ్యాథమెటిక్స్, సైన్స్ నుంచి ప్రశ్నలు వస్తాయి. ఈ క్రమంలో మ్యాథమెటిక్స్, సైన్స్ సబ్జెక్ట్‌ల నుంచి 30 ప్రశ్నలు చొప్పున ఇస్తారు. సోషల్ స్టడీస్ అభ్యర్థులకు మాత్రం ఆ సబ్జెక్ట్ నుంచే ప్రశ్నలు అడుగుతారు. ప్రయోజనం: పరీక్షలో 60 శాతం కంటే ఎక్కువ స్కోర్ సాధించిన వారికి అర్హత సర్టిఫికెట్ ఇస్తారు. సీటెట్ స్కోర్ ఫలితాలు విడుదల చేసిన తేదీ నుంచి ఏడేళ్లపాటు చెల్లుబాటు అవుతుంది. సీటెట్‌లో అర్హత సాధిస్తే కేంద్ర ప్రభుత్వ పాఠశాలలు (కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ పాఠశాలలు, సెంట్రల్ టిబెటన్ స్కూల్స్ తదితర పాఠశాలలు), చండీగఢ్, దాద్రా-నగర్ హవేలీ, డయ్యూడామన్, అండమాన్ నికోబార్ ఐలాండ్స్, లక్షద్వీప్ వంటి కేంద్రపాలిత ప్రాంతాల్లోని పాఠశాలలు, నేషనల్ క్యాపిటల్ టెరీటరీ న్యూఢిల్లీ పరిధిలోని అన్ని ప్రభుత్వ,ప్రైవేటు పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వాలు/స్థానిక సంస్థల నిర్వహణలో ఉన్న పాఠశాలల్లోని ఉపాధ్యాయ పోస్టుల నియామకం కోసం సీటెట్ అభ్యర్థులను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. నోటిఫికేషన్ సమాచారం: దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్ట్ 4, 2014. పరీక్ష తేదీ: సెప్టెంబర్ 21, 2014. వివరాలకు: http://ctet.nic.in/ ప్రిపరేషన్ సీటెట్ రాష్ట్ర స్థాయిలో నిర్వహించే టెట్ మాదిరిగానే ఉంటుంది. కానీ టెట్‌తో పోల్చితే ప్రశ్నలు క్లిష్టంగా ఉంటాయి. ప్రశ్నలు ఇంగ్లిష్/హిందీ మాధ్యమంలో అడుగుతారు. కాబట్టి సంబంధిత సబ్జెక్ట్‌ల పదజాలంపై పట్టు ఉంటే మంచి స్కోర్ సాధించవచ్చు.సైకాలజీని అభ్యసనం చేసేటప్పుడు కీలక భావనలు, సాంకేతిక పదాలు, సిద్ధాంతాలు-సూత్రాలు, వాటిని ప్రతిపాదించిన శాస్త్రవేత్తలు, వారి గ్రంథాలు తదితర అంశాలను విశ్లేషణాత్మకంగా, సమన్వయం చేస్తూ చదవాలి. కీలకాంశాలైన శిశువు విద్యా ప్రణాళిక, బోధన పద్ధతులు, మూల్యాంకనం- నాయకత్వం- మార్గనిర్దేశకత్వం- మంత్రణం (కౌన్సెలింగ్)లను గత ప్రశ్నపత్రాల ఆధారంగా సిలబస్‌ను అనుసరించి విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేయాలి.లాంగ్వేజ్ విభాగంలో గ్రామర్‌కు సంబంధించి ప్రతి అంశాన్ని పరీక్షిస్తూ.. ప్రశ్నలు అడుగుతారు. ఈ నేపథ్యంలో.. బేసిక్ గ్రామర్ మీద పట్టు చాలా అవసరం. ఈ క్రమంలో.. పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఆర్టికల్స్, ప్రొవెర్బ్స్, కొశ్చన్స్ ట్యాగ్స్, యాక్టివ్ వాయిస్-ప్యాసివ్ వాయిస్, కాంప్రెహెన్షన్, ఫొనెటిక్స్, లెటర్ రైటింగ్, సింపుల్- కాంపౌండ్- కాంప్లెక్స్ సెంటెన్సెస్.. ఇలా గ్రామర్‌కు సంబంధించి ప్రతి అంశాన్ని ఔపోసన పట్టాలి. సబ్జెక్ట్‌ల విషయానికొస్తే.. ఎన్సీఆర్టీఈ పుస్తకాల ఆధారంగా ప్రశ్నలు ఉంటాయి. వీటిని అప్లికేషన్ పద్ధతిలో అడుగుతారు. కాబట్టి ఆయా అంశాలకు సంబంధించి ప్రాథమిక భావనలపై పట్టు ఉండాలి. పాఠ్యాంశాల చివరన ఇచ్చే ప్రాక్టీస్ బిట్స్ చదవాలి. కంటెంట్ చదివేటప్పుడు.. ఏదైనా ఒక అంశం 3, 4, 5 తరగతి పుస్తకాల్లో ఉండి.. 6, 7, 8, 9, 10 తరగతి పుస్తకాల్లో పునరావృతమైతే.. ఆ అంశాలన్నింటినీ ఒకేసారి చదవడం వల్ల సమన్వయం ఏర్పడుతుంది. తమ నేపథ్యానికి చెందని పాఠ్యాంశాలు (అంటే.. బయాలజీ వాళ్లు గణితం చదవడం, తెలుగు, ఇంగ్లిష్ అభ్యర్థులు సోషల్ స్టడీస్ చదవడం) చదివేటప్పుడు కొంత ఇబ్బందికి గురవడం సహజం. కాబట్టి ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠ్యాంశాల విషయంలో సిలబస్‌ను అనుసరిస్తూ.. ప్రతి పాఠ్యాంశం వెనుక ఇచ్చిన బిట్స్‌ను ఔపోసన పడితే సులభంగానే ఈ సమస్యను అధిగమించొచుెు్చథడాలజీ విషయంలో మెథడ్స్ ఆఫ్ టీచింగ్, ఎవాల్యుయేషన్, ల్యాబ్, రిలేషన్ టు అదర్ సబ్జెక్ట్స్, టీచర్ లెర్నింగ్ మెటీరియల్(టీఎల్ఎం), రీసెంట్ ట్రెండ్స్(ఇటీవలి కాలంలో విద్యా వ్యవస్థలో వచ్చిన మార్పులు/పథకాలు), డెవలప్మెంట్ ఆఫ్ కరికుల్యం వంటివి ప్రధాన అంశాలు.