సాక్షి, హైదరాబాద్: ప్రాథమిక పాఠశాలల్లో బోధించేందుకు అవసరమైన రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈడీ) కోర్సు ఇకపై రద్దు కానుందా? దాని స్థానంలో నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (బీఈఎల్‌ఈడీ) అమల్లోకి రానుందా? ఈ దిశగా కేంద్రం కసరత్తు చేస్తోందని జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్‌సీటీఈ) వర్గాలు పేర్కొంటున్నాయి. డీఈడీ స్థాయి ప్రస్తుత విద్యార్థులకు సరిపోవడం లేదని, దాన్ని రద్దు చేసి డిగ్రీతో బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ విద్యను ప్రవేశపెట్టేందుకు కేంద్రం కార్యాచరణ రూపొందిస్తోంది.
2014లో ఉపాధ్యాయ విద్యా కోర్సుల్లో అనేక సంస్కరణలు తెచ్చిన ఎన్‌సీటీఈ అప్పుడే నాలుగేళ్ల డీఈఎల్‌ఈడీ కోర్సును రూపొందించినా అమల్లోకి రాలేదు. దాంతోపాటు నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఎడ్ కోర్సు కూడా రూపొందించినా అమలు చేయడం లేదు. భవిష్యత్తులో ప్రస్తుతం ఉన్న రెండేళ్ల బీఎడ్, డీఎడ్‌ను రద్దు చేసి నాలుగేళ్ల కోర్సులను అమలు చేసే అవకాశం ఉంది. అయితే రెండేళ్ల కోర్సులను వెంటనే రద్దు చేయాలా? 2018–19 నుంచి ఇంటిగ్రేటెడ్ కోర్సులను ప్రవేశపెట్టి, పాత కోర్సుల రద్దుకు ఒకట్రెండేళ్ల సమయం ఇవ్వాలా? అన్న దానిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
నాణ్యత పెంచేందుకే..
ప్రస్తుతం దేశవ్యాప్తంగా లక్షల మంది డీఈడీ, బీఈడీ అభ్యర్థులున్నారు. 2014కు ముందు ఈ రెండు కోర్సులు ఏడాది పాటే ఉండటం, ఉపాధ్యాయ కొలువు అవకాశాలు ఎక్కువగా ఉండటంతో అనేక మంది వాటిల్లో చేరారు. ప్రత్యేక ఆసక్తి లేకపోయినా, చివరికి టీచర్ ఉద్యోగమైనా సంపాదించుకోవచ్చన్న యోచనతో లక్షల మంది ఈ కోర్సులను పూర్తిచేశారు.
ఒక్క తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనే దాదాపు 8 లక్షల మంది డీఈడీ, బీఈడీ అభ్యర్థులు ఉన్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ పరిస్థితిలో మార్పు తేవడంతోపాటు ఉపాధ్యాయ విద్యలో నాణ్యతను పెంపొందించేందుకు ఇంటిగ్రేటెడ్ కోర్సులే శరణ్యమని కేంద్రం భావిస్తోంది. 2019–20 విద్యా సంవత్సరం నుంచి వాటిని అమల్లోకి తేవాలని యోచిస్తోంది.
అసమానతలు తొలగించేలా..
ప్రస్తుతం ఎన్‌సీటీఈ నిబంధనల ప్రకారం.. ఇంటర్‌తో డీఈడీ చేసిన వారు ఒకటి నుంచి 5వ తరగతి వరకు బోధించేందుకు మాత్రమే అర్హులు. ఒకవేళ డిగ్రీ ఉంటే ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు (ఎలిమెంటరీ విద్య) బోధించవచ్చు. ఇక డిగ్రీతో బీఈడీ చేసిన వారు 8వ తరగతి నుంచి 12వ తరగతి వరకు బోధించేందుకు అర్హులు. ఉపాధ్యాయ అర్హత పరీక్షను (టెట్) కూడా ఇదే విధానంలో నిర్వహిస్తున్నారు. కానీ రాష్ట్రంలో ఇంటర్‌తో డీఈడీ కలిగిన వారిని ఐదో తరగతి వరకే పరిమితం చేస్తున్నారు.
వారు కేవలం టెట్ పేపరు–1 రాసేందుకే ప్రభుత్వం అనుమతి ఇస్తోంది. అయితే వారితో 6, 7, 8 తరగతులకు కూడా అనధికారికంగా బోధన కొనసాగిస్తోంది. డిగ్రీ ఉన్నా 6, 7, 8 తరగతులకు అధికారికంగా బోధించే అవకాశం (టెట్ పేపరు–2 రాసే అర్హత) ఇవ్వడం లేదు. దీంతో వారు ఆందోళన చెందుతున్నారు. ఉన్నత పాఠశాలల్లోని 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు బోధించేందుకు డిగ్రీతో బీఎడ్ కలిగిన వారికి మాత్రమే టెట్ పేపరు–2 రాసే అవకాశం ఇస్తోంది.
రాష్ట్రంలో 12వ తరగతి విధానం లేనందున వారు 10వ తరగతి వరకే పరిమితం అవుతున్నారు. ఈ నేపథ్యంలో పాఠశాలల్లో ఎలిమెంటరీ విద్య, ఉన్నత పాఠశాల విద్య విధానం అమలు చేయాలని కేంద్రం ఇప్పటికే ఆదేశించింది. ఆ దిశగా రాష్ట్రంలో కసరత్తు ప్రారంభించినా ఇంతవరకు ఆచరణకు నోచుకోలేదు. కోర్సుల పరంగా వ్యత్యాసాలు లేకుండా, నాణ్యమైన విద్యను అందించేందుకు ఇంటిగ్రేటెడ్ కోర్సులను ప్రవేశపెడితే ప్రయోజనం ఉంటుందని యోచిస్తోంది.
ముందుగా ప్రభుత్వ, ఎయిడెడ్ కాలేజీల్లో..
ప్రస్తుతం ఉన్న రెండేళ్ల బీఈడీ కోర్సు స్థానంలో నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సును ప్రవేశపెడతామని బడ్జెట్ సందర్భంగా కేంద్రం ప్రకటించింది. ఆ మేరకు వచ్చే విద్యా సంవత్సరం(2019–20) నుంచి ప్రభుత్వ, ఎయిడెడ్ బీఈడీ కళాశాలల్లో బీఏ–బీఈడీ, బీఎస్‌సీ–బీఈడీ కోర్సులను ప్రవేశపెట్టాలని కేంద్రం సూత్రప్రాయంగా నిర్ణయించింది.
ఆ తర్వాత ప్రైవేట్ బీఈడీ కాలేజీల్లో ఈ కోర్సులను ప్రవేశ పెట్టే ఆలోచనలు చేస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా బీఈడీ చదువుతున్నవారు ఉండటం, అలాగే డిగ్రీలో చేరి తర్వాత బీఈడీ చేయాలన్న ఆలోచన కలిగిన వారు ఉన్నందునా రెండేళ్ల బీఈడీ కోర్సును 2020–21 విద్యా సంవత్సరం వరకు కొనసాగిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలు చేస్తోంది.
కాలేజీలు కూడా అందుకు సిద్ధం కావాల్సి ఉన్నందున మరికొన్నేళ్లు కొత్త కోర్సులతోపాటు పాత రెండేళ్ల కోర్సులను కూడా కొనసాగించాలని ఇటీవల నిపుణుల కమిటీ కూడా కేంద్రానికి సిఫారసు చేసినట్లు తెలిసింది. రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌లో ఇంటిగ్రేటెడ్ బీఎడ్‌ను ప్రవేశ పెట్టేందుకు రెండు కాలేజీలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్నా వాటికి అనుబంధ గుర్తింపు లభించకపోవడంతో అవి ప్రారంభానికి నోచుకోలేదు.
Comments
Please login to add a commentAdd a comment