![There was no BTech column in the gurukul teacher application - Sakshi](/styles/webp/s3/article_images/2023/04/29/hc.jpg.webp?itok=Blo0ilVT)
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: బీటెక్ చదివి టీచర్లు అవుదామనుకున్న వారి కలలు నెరవేరేలా లేవు. ఇంజనీరింగ్ పూర్తిచేసిన పలువురు అభ్యర్థులు తాజాగా గురుకులాల్లో టీచర్ల కోసం దరఖాస్తు చేసుకుందామని ప్రయత్నించి విఫలమవుతున్నారు. కారణం.. ఓటీఆర్‌లో విద్యార్హతల వద్ద బీఎస్సీ, బీఏ, బీకామ్ వంటి డిగ్రీలు ఉంచిన వెబ్‌సైట్‌లో.. బీటెక్ అన్న కాలమ్ అసలు పొందుపరచనే లేదు. తాము ఎంతో కష్టపడి రెండేళ్ల బీఈడీ కోర్సు పూర్తి చేశామని, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) పరీక్ష కూడా పాసయ్యామని, తీరా ఇపుడు తమకు దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పించకపోవడం అన్యాయమంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
2019లో తెలంగాణ రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో టీచర్ పోస్టులకు తమను అనుమతించడం లేదంటూ కొందరు బీటెక్‌తోపాటు, బీఈడీ చేసిన అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. అపుడు కూడా ఇదే తరహాలో దరఖాస్తులో తమకు బీటెక్ కాలమ్ కనిపించ లేదని చెప్పారు. దీనికి ప్రభుత్వం సమాధానమిస్తూ.. నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్‌సీటీఈ) 2010 మార్గదర్శకాల ప్రకారమే తాము నోటిఫికేషన్ జారీ చేశామని తేల్చిచెప్పింది. దీనిపై స్పందించిన హైకోర్టు ఎన్‌సీటీఈ–2014 మార్గదర్శకాల ప్రకారం.. బీటెక్‌తోపాటు బీఈడీ చేసినవారంతా టీజీటీ పోస్టులకు అర్హులేనని హైకోర్టు స్పష్టంచేసింది. ఈ మేరకు తగిన చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖాధిపతులను ఆదేశించింది.
మళ్లీ ఇప్పుడూ అదే సమస్య
గతంలో ఇదే వ్యవహారంపై హైకోర్టు వరకూ వెళ్లిన నేపథ్యంలో ఈసారి టీచర్ పోస్టులకు సంబంధించి వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని అనుకున్నారు. కానీ, తీరా దరఖాస్తు ఫారం ఓపెన్ చేసే సరికి తిరిగి అదే సమస్య పునరావృతమవడంతో తలలు పట్టుకుంటున్నారు.
ఈ విషయమై పలువురు బీటెక్–బీఈడీ అభ్యర్థులు తొలుత గురుకుల కార్యాలయాలకు వరుసగా ఫోన్లు చేసినా.. ఎలాంటి ఫలితం లేకుండా పోయిందని వాపోయారు. కొందరు అధికారులు అయితే.. బీటెక్ బీఈడీ వారికి అసలు అర్హతే లేదని, మీరు దరఖాస్తు చేసుకోవద్దని చెబుతున్నారని వారు అంటున్నారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment