సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయుల కేటాయింపుల్లో సీనియారిటీని ప్రాతిపదికగా తీసుకోకపోవడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. సీనియారిటీ ప్రాతిపదికన టీచర్ల నుంచి అభ్యంతరాలు తీసుకొని ప్రభుత్వానికి పంపాలని డీఈవోలను ఆదేశించింది. ఆ అభ్యంతరాలను పునః పరిశీలించి ఈ నెల 30వ తేదీలోగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ అభినంద్‌కుమార్ షావలి ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు.
సీనియారిటీకి విరుద్ధంగా తనను జోగుళాంబ గద్వాల జిల్లాకు కేటాయించారంటూ రంగారెడ్డి జిల్లా ఫరూక్‌నగర్ మండలం బూర్గుల జీపీహెచ్‌ఎస్‌లో స్కూల్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న జయప్రదతో పాటు మరికొందరు దాఖలు చేసిన పిటిషన్లను న్యాయమూర్తి విచారించారు. సీనియారిటీ ఆధారంగా పిటిషనర్‌ను రంగారెడ్డి జిల్లాకు కేటాయించాల్సి ఉందని ఆమె తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.
కేటాయింపులు సీనియారిటీ ఆధారంగా ఉంటాయని మార్గదర్శకాల్లో పేర్కొన్నా అందుకు విరుద్ధంగా చేశారని వివరించారు. తనను రంగారెడ్డి జిల్లాకు కేటాయించాలని ఈ నెల 22న డీఈవోకు పిటిషనర్ వినతిపత్రం సమర్పించారని తెలిపారు. ఆ అభ్యంతరాలను పరిశీలించి సీనియారిటీ ఆధారంగా కేటాయింపులు చేస్తామని ప్రభుత్వ న్యాయవాది నివేదించారు. సీనియారిటీ ఆధారంగా కేటాయింపులు ఉండేలా చూడాలని సర్కారును న్యాయమూర్తి ఆదేశిస్తూ తీర్పునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment