విద్యార్థులు, ఉపాధ్యాయులకు అనువుగా ‘దీక్ష’ పోర్టల్
పాఠ్య పుస్తకాల నుంచి టోఫెల్ మెటీరియల్ వరకు అన్నీ అందుబాటులో..
రాష్ట్రం నుంచి 67 లక్షల మంది వినియోగం
ఆ తర్వాతి స్థానాల్లో రాజస్థాన్, ఉత్తరప్రదేశ్
సాక్షి, అమరావతి: విద్యా సంబంధిత విజ్ఞానాన్ని తెలుసుకోవడంలో ఆంధ్రప్రదేశ్ టాప్‌లో నిలిచింది. కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన ‘డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ నాలెడ్జ్ షేరింగ్(దీక్ష)’ పోర్టల్ వినియోగంలో ఏపీ మొదటి స్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మొత్తంగా 67 లక్షల మంది ఈ పోర్టల్‌ను వినియోగించారు. అలాగే 66 లక్షల మందితో రాజస్థాన్ రెండో స్థానంలో నిలవగా, 58 లక్షల మందితో ఉత్తరప్రదేశ్ మూడో స్థానంలో నిలిచింది.
జాతీయ స్థాయిలో విద్యా సంబంధిత అంశాలను అందించేందుకు ‘ఒకే దేశం–ఒకే వేదిక’ లక్ష్యంగా నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్(ఎన్‌సీటీఈ), కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సంయుక్తంగా దీక్ష పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చాయి. దీనికి అనుసంధానంగా మన రాష్ట్ర ఉపాధ్యాయులు ఈ–కంటెంట్ తయారీ కోసం ఆంధ్రప్రదేశ్ ఈ–నాలెడ్జ్ ఎక్స్చేంజ్(అపెక్స్) వేదికగా పనిచేస్తున్నారు. ఇందులో ఉపాధ్యాయులు, విద్యార్థులకు అవసరమైన పాఠ్యాంశాలను వీడియో, ఆడియోలతో పాటు పీడీఎఫ్ రూపంలో అందుబాటులో ఉంచారు. అలాగే ఉపాధ్యాయుల వృత్తిపరమైన అభివృద్ధి కోసం ఆన్‌లైన్ కోర్సులు, ఇంటరాక్టివ్ అసెస్‌మెంట్ తదితరాలు కూడా ఉన్నాయి.
వైఎస్ జగన్ సర్కార్.. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల కోసం బైలింగ్వుల్ టెక్ట్స్ బుక్స్‌ను అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఆయా పాఠాలకు జత చేసిన ‘క్యూఆర్ కోడ్’ను స్కాన్ చేసి నేరుగా సంబంధిత పాఠాలను విజువల్, ఆడియో రూపంలో పొందవచ్చు. అనంతరం ఈ నూతన విధానాన్ని ఎన్సీఈఆర్టీ అనుసరిస్తోంది. అంతేగాక దీక్ష ప్లాట్‌ఫామ్ ద్వారా ఉపాధ్యాయులకు ఆన్‌లైన్ శిక్షణను ప్రారంభించిన మొట్టమొదటి రాష్ట్రం కూడా ఏపీయేనని సమగ్ర శిక్ష ఎస్పీడీ శ్రీనివాసరావు ‘సాక్షి’కి తెలిపారు.
ఏపీకి చెందిన 20 వేలకు పైగా అంశాలు నిక్షిప్తం..
ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ఏపీలో బోధిస్తున్న అన్ని సబ్జెక్టుల పాఠ్య పుస్తకాలను పీడీఎఫ్ రూపంలో దీక్ష పోర్టల్‌లో ఉంచారు. అలాగే అన్ని తరగతుల పాఠ్యాంశాలను ఆడియో, వీడియోల రూపంలో అప్‌లోడ్ చేశారు. ఇటీవల ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులోకి తెచ్చిన టోఫెల్ ప్రైమరీ, టోఫెల్ జూనియర్ శిక్షణకు అవసరమైన మెటీరియల్ కూడా ఇందులో అందుబాటులో ఉంచారు. మొత్తం 20,758 అంశాలను పోర్టల్‌లో అప్‌లోడ్ చేశారు. అత్యధిక అంశాలను అప్‌లోడ్ చేసిన రాష్ట్రాల్లో ఏపీ మూడో స్థానంలో నిలిచింది.
ప్రభుత్వ పాఠశాలలకు అందించిన ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్‌ను దీక్ష పోర్టల్‌తో అనుసంధానం చేసి బోధనలో కొత్తదనాన్ని కూడా అవలంభించారు. ఈ పోర్టల్‌లో కేవలం ఏపీకి చెందిన బోధనాంశాలే కాకుండా, ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విద్యా బోధన, శిక్షణ తదితర అంశాలను కూడా ఉపాధ్యాయులు తెలుసుకోవచ్చు. విద్యార్థులు కూడా ఆయా సబ్జెక్టులపై ఆన్‌లైన్‌లోనే పరీక్ష రాసి, తమ ప్రతిభను పరీక్షించుకోవచ్చు.
2 లక్షల మందికి పైగా ఉపాధ్యాయులు, విద్యా శాఖ అధికారులు దీక్ష పోర్టల్ ద్వారా తమ సామర్థ్యాలను మెరుగుపరచుకుంటున్నారు. రాష్ట్రం నుంచి గత వారం రోజుల్లో ఫోన్, కంప్యూటర్ వంటి 1,31,421 డివైజ్‌ల ద్వారా ఈ–కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు. అలాగే 43,841 క్యూఆర్ కోడ్‌లు స్కాన్ చేసి విద్యార్థులు పాఠాలు నేర్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment