ఉపాధ్యాయ విద్య | National Council for Teacher Education Special Focus | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయ విద్య

Published Thu, Jan 22 2015 1:02 AM | Last Updated on Sat, Sep 2 2017 8:02 PM

ఉపాధ్యాయ విద్య

ఉపాధ్యాయ విద్య

 మారుతున్న స్వరూపం.. నాణ్యతకు ప్రాధాన్యం..విద్యా వ్యవస్థలో ఉపాధ్యాయులది గురుతర బాధ్యత. విద్యార్థులను పరిపూర్ణులుగా తీర్చిదిద్దడంలో టీచర్ల బోధన అమూల్యమైంది. అందుకే పిల్లల అవసరాలకు, వారి అభ్యసనానికి అనుగుణంగా స్పందించే ఉపాధ్యాయుల్ని తయారు చేయాలి. ఇలాంటి సదుద్దేశంతో ఇటీవల నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్‌సీటీఈ).. కొత్త విధివిధానాలను రూపొందించింది. 2015-16 నుంచి వీటిని అమలు చేయాలని సూచించింది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ విద్య స్వరూపం, కెరీర్ పరంగా అవకాశాలపై స్పెషల్ ఫోకస్..
 
 ఉపాధ్యాయ విద్య.. భావి తరాల బంగారు భవితకు మార్గ నిర్దేశనం చేసే బోధన రంగంలో అడుగులు వేసేందుకు సాధనం. వ్యక్తిగతంగా, వృత్తిగతంగా సంతృప్తినిచ్చే కెరీర్. అందుకే దేశంలో ఏటా లక్షల మంది యువత.. డీఈడీ, బీఈడీ, ఎంఈడీ తదితర టీచర్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో ప్రవేశానికి పోటీపడుతున్నారు. పరిస్థితి ఒకవైపు ఇలా ఉంటే మరోవైపు ప్రాథమిక విద్య మొదలు వృత్తి విద్యా సంస్థల వరకు అన్నింటిలోనూ నాణ్యమైన బోధనా సిబ్బంది కొరత వేధిస్తోందంటూ సంబంధిత వర్గాల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా కరిక్యులం, కోర్సుల స్వరూపాలు ప్రస్తుత సామాజిక పరిస్థితులకు అనుగుణంగా లేవనే అభిప్రాయాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్‌సీటీఈ ఉపాధ్యాయ విద్యా కోర్సుల స్వరూపాలను మార్చి.. నాణ్యత స్థాయిలను పెంచేందుకు ప్రణాళికలు రూపొందించింది. బోధన రంగంలో మెరుగైన నైపుణ్యాలు అందేలా ప్రాక్టికాలిటీకి పెద్దపీట వేయాలని నిర్ణయించింది.
 
 మార్పులేమిటి?
 ఉపాధ్యాయ విద్యకు సంబంధించి డీఈడీ నుంచి ఎంఈడీ వరకు దాదాపు 15 కోర్సుల స్వరూపాన్ని మార్చుతూ, వ్యవధిని పెంచుతూ ఎన్‌సీటీఈ నిర్ణయం తీసుకుంది.సాధారణ బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులు పోటీపడే కీలకమైన, ఏడాది వ్యవధి గల బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఈడీ) కోర్సును రెండేళ్లకు పెంచారు.
 
 పీజీ స్థాయిలో మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (ఎంఈడీ) కోర్సు వ్యవధిని రెండేళ్లకు పెంచారు.
 దేశ వ్యాప్తంగా వివిధ సంస్థల్లో అందుబాటులో ఉన్న డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్; డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్; డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్; బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్; మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్; డిప్లొమా ఇన్ ఆర్ట్స్ ఎడ్యుకేషన్; డిప్లొమా ఇన్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఎడ్యుకేషన్ కోర్సుల వ్యవధిని కూడా రెండేళ్లు తప్పనిసరి చేసింది. దూర విద్య కోర్సులను కూడా రెండేళ్లు చేసింది.
 
 కరిక్యులంలో మార్పులు
 ప్రతి కోర్సుకు ఒక విద్యా సంవత్సరంలో తప్పనిసరిగా ఉండాల్సిన టీచింగ్ అవర్స్, ప్రాక్టికల్స్ అవర్స్‌ను నిర్దేశించింది. ఉదాహరణకు బీఈడీ కోర్సులో ప్రతి విద్యా సంవత్సరంలో తప్పనిసరిగా 200 రోజుల బోధన ఉండాలి. ఇందులో తరగతి గది బోధన, ఇంటర్నల్స్, ప్రాక్టికల్స్‌కు వేర్వేరుగా నిర్దిష్ట గంటలు పేర్కొనడంతో విద్యార్థులకు పూర్తిస్థాయి నైపుణ్యాలు అందేందుకు ఆస్కారం లభించనుంది. జండర్ ఎడ్యుకేషన్, యోగా ఎడ్యుకేషన్‌ను తప్పనిసరి చేసింది. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ (ఐసీటీ) బోధన పద్ధతులపై అవగాహన పొందేందుకు దీన్ని ఒక సబ్జెక్ట్‌గా పొందుపర్చాలి.  ప్రస్తుతం 40 రోజుల వ్యవధిలో ఉన్న స్కూల్ ఇంటర్న్‌షిప్ 140 రోజులకు పెరగనుంది. విద్యార్థులు పూర్తిస్థాయిలో క్షేత్ర నైపుణ్యాలు సాధించే దిశగా 90 శాతం హాజరును కూడా తప్పనిసరి చేసింది.
 
 ఇంటిగ్రేటెడ్ కోర్సుల దిశగా..
 బోధన రంగంలో పెరుగుతున్న మానవ వనరుల డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుంటూ ఎన్‌సీటీఈ కొత్త కోర్సుల రూపకల్పన దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో ఇంటర్ అర్హతతో ప్రవేశం పొందేలా నాలుగేళ్ల వ్యవధిలో బీఎస్సీ-బీఈడీ, బీఏ-బీఈడీ అనే రెండు ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్సుల రూపకల్పనకు యోచిస్తోంది. అదే విధంగా పీజీ స్థాయిలో బీఏ-ఎంఈడీ కోర్సు ప్రారంభించాలని కూడా యోచిస్తోంది.
 
 ఇక.. స్పెషల్‌గా ఎంఈడీ
 ఎన్‌సీటీఈ తాజా నిర్ణయాలతో ఎంఈడీ కోర్సు కూడా స్పెషల్‌గా మారనుంది. ఇప్పటి వరకు అందరికి ఒకే మాదిరిగా ఉన్న ఎంఈడీ కోర్సులో ఇక నుంచి స్పెషలైజేషన్స్ అందుబాటులోకి రానున్నాయి. సెకండరీ, సీనియర్ సెకండరీ అనే రెండు స్పెషలైజేషన్స్‌ను ఎంఈడీలో ప్రవేశ పెట్టనున్నారు. బీఈడీ అర్హులు ఈ రెండు స్పెషలైజేషన్స్ ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. డీఈడీలో ఉత్తీర్ణత సాధించి తర్వాత బ్యాచిలర్ డిగ్రీ పొందిన విద్యార్థులకు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ స్పెషలైజేషన్ అందుబాటులో ఉంటుంది.
 
 సృజనాత్మకతను పెంపొందించేలా
 తాజా కరిక్యులం ఉద్దేశం ఎడ్యుకేషన్ కోర్సు ఔత్సాహికుల్లో సృజనాత్మకతను పెంపొందించడం. అందుకే మూల్యాంకనలో ఇంటర్న్‌షిప్ కోసం కేటాయించిన 40 శాతం మార్కుల్లో 20 శాతం మార్కులను ప్రత్యేకంగా ఇన్నోవేషన్, ఫీల్డ్ వర్క్, రీసెర్చ్, ప్రాక్టికల్స్‌కు నిర్దేశించింది. ఇటీవల కాలంలో అమలు చేస్తున్న నిరంతర సమగ్ర మూల్యాంకనం విధానం ప్రస్తుత ఉపాధ్యాయులకు చాలా క్లిష్టంగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి పరిష్కారంగా, ఉపాధ్యాయ విద్యా కోర్సుల్లో మార్పులు తీసుకొస్తున్నట్లు విద్యావేత్తల అభిప్రాయం.
 
 కెరీర్ కళకళలాడేలా
 ఉపాధ్యాయ విద్యలో తీసుకొస్తున్న ఈ మార్పులన్నీ కార్యరూపం దాల్చడంతోపాటు సమర్థంగా అమలైతే రానున్న నాలుగైదేళ్లలో టీచింగ్ కెరీర్ కళకళలాడుతుందని ఈ రంగంలోని నిపుణులు అంటున్నారు. ఈ విషయంలో ఇన్‌స్టిట్యూట్‌ల బాధ్యత కూడా ఎంతో ఉంది. ముఖ్యంగా మారిన కోర్సులకు అనుగుణంగా అవసరమైన మౌలిక సదుపాయాలు అందించాలి. దీనికి సంబంధించి కూడా ఎన్‌సీటీఈ సరికొత్త నిబంధనలు నిర్దేశించింది. ప్రతి కోర్సు విషయంలో ఒక ఇన్‌స్టిట్యూట్‌లో బ్లాక్ బోర్డ్ నుంచి లేబొరేటరీ వరకు అవసరమైన అన్ని కచ్చితమైన మౌలిక సదుపాయాల జాబితా రూపొందించింది. అంతేకాకుండా ఇక నుంచి టీచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లకు కూడా నాక్ (నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రెడిటేషన్) గుర్తింపు తప్పనిసరి.
 
 విద్యార్థుల దృక్పథం మారాలి
 టీచర్ ఎడ్యుకేషన్ విద్యార్థుల దృక్పథం మారాలన్నది విద్యావేత్తల సూచన. తాజా మార్పులను ఆకళింపు చేసుకునేలా మానసికంగా ఉల్లాసంగా ఉండాలని, భవిష్యత్తులో ఒక ఆదాయ మార్గంగానే ఈ కోర్సులను భావించకుండా మార్పుల ఉద్దేశాలకు అనుగుణంగా నైపుణ్యాలు సొంతం చేసుకోవాలంటున్నారు. అప్పుడు అవకాశాలు వాటంతటవే లభిస్తాయని, ఆకర్షణీయ వేతనాలు పొందొచ్చని చెబుతున్నారు.
 
 మూస ధోరణికి ముగింపు!
 ప్రస్తుతం మనం బీటెక్, ఎంబీఏ, మెడిసిన్ వంటి వాటినే ప్రొఫెషనల్ కోర్సులుగా భావిస్తున్నాం. కానీ ఆ కోర్సుల దిశగా విద్యార్థులను తీర్చిదిద్దే ఉపాధ్యాయ కోర్సులు మాత్రం మూస ధోరణిలో సాగుతున్నాయి. అందుకే బీఈడీ, ఎంఈడీ కోర్సుల్లోనూ ప్రొఫెషనలిజానికి ప్రాధాన్యం ఇచ్చేందుకు మొదటి అడుగుగా తాజా మార్పులను పేర్కొనొచ్చు. ఇప్పటి వరకు ఉపాధ్యాయ విద్యలో టీచింగ్, ప్రాక్టికల్స్ (క్లాస్‌రూం ఇంటర్న్‌షిప్) రైలు పట్టాల మాదిరిగా వేర్వేరుగా ఉన్నాయి. వీటిని సమ్మిళితం చేసేలా కొత్త కరిక్యులంను రూపొందించారు. ఆయా కోర్సుల మొత్తం వ్యవధిలో నిరంతర ప్రక్రియగా ‘తరగతి గది పరిశీలన’ను రూపొందించడం ఎంతో మేలు చేస్తుంది. దీనివల్ల అకడమిక్‌గా ఒక అంశంపై అవగాహన పొందిన వెంటనే సంబంధిత బోధన పద్ధతులపైనా పరిజ్ఞానం లభిస్తుంది. అంతేకాకుండా కోర్సులో చదివే పలు సబ్జెక్ట్‌లను సమీకృతం చేసేలా పాఠ్య ప్రణాళికలను రూపొందించే అంశాలపై శిక్షణ ద్వారా విద్యార్థులకు మెరుగైన నైపుణ్యాలు లభిస్తాయి. ప్రపంచ వ్యాప్తంగా మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఉపాధ్యాయ విద్యలో మార్పులు అన్ని వర్గాల ఉన్నతికి దోహదం చేస్తాయి.    
 - డాక్టర్ పి.సందీప్,
 ఎన్‌సీటీఈ సభ్యులు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement