National Council for Teacher Education
-
బీఈడీ రెండో దశ కౌన్సెలింగ్ లేనట్టే
హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంతో ప్రవేశాలు కష్టమే 8 వేల మంది విద్యార్థులకు తప్పని నిరాశ సాక్షి, హైదరాబాద్: బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఈడీ) కోర్సులో ప్రవేశాల కోసం ఎడ్‌సెట్–2016 రెండో దశ కౌన్సెలింగ్‌ను నిర్వహించాల్సిందేనన్న హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంతో రాష్ట్రంలోని బీఈడీ కాలేజీల్లో రెండో దశ ప్రవేశాలు చేపట్టే అవకాశం లేకుండాపోయింది. దీంతో బీఎడ్‌లో చేరాలనుకుంటున్న దాదాపు 8 వేల మంది విద్యా ర్థుల ఆశ నిరాశగానే మిగిలిపోయే పరిస్థితి నెలకొంది. 2016–17 విద్యా సంవత్సరంలో బీఈడీలో ప్రవేశాల కోసం గత జూన్‌లో నిర్వ హించిన ఎడ్‌సెట్ రాసేం దుకు 44,485 మంది దర ఖాస్తు చేసుకోగా అందులో 40,826 మంది అర్హత సాధించారు. వారికి గతే డాది సెప్టెంబర్ 8 నుంచి 11 వరకు వెబ్ ఆప్షన్లకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. అందులో 21,883 మంది ఆప్షన్లు ఇచ్చుకోగా అదే నెల 14న సీట్ల కేటా యింపు పూర్తయింది. రాష్ట్రంలోని 184 బీఈడీ కాలేజీల్లో కన్వీనర్ కోటా కింద 12,532 సీట్లుండగా అందులో 9,887 మందికి సీట్లు లభించాయి. అయితే కోరుకున్న కాలేజీల్లో సీట్లు దొరక్కపోవడంతో 5,131 మంది విద్యార్థులు కాలేజీల్లో చేరలేదు. మిగిలిన 4,756 మంది విద్యార్థులు మాత్రమే కాలేజీల్లో చేరారు. దీంతో మిగిలిన సీట్లకు ఆ తరువాత రెండో దశ కౌన్సెలింగ్ నిర్వహించాల్సి ఉంది. అదే సమయంలో మరో 11 కొత్త కాలేజీలకు జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) అనుమతి ఇవ్వడం వల్ల వాటిల్లోని సీట్లతోపాటు పాత కాలేజీల్లోని మిగిలిన సీట్లు కలుపుకొని 7,958 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. కానీ ప్రభుత్వం మాత్రం మిగిలిపోయిన సీట్లకు రెండో దశ కౌన్సెలింగ్ చేపట్టేందుకు నిరాకరించడంతో కొందరు విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు. నిబంధనల ప్రకారం రెండో దశ కౌన్సెలింగ్ నిర్వహించాలని హైకోర్టు గత నెలలో ఆదేశించగా ఈ ఉత్తర్వులను సవాల్‌చేస్తూ ఉన్నత విద్యాశాఖ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు తాజాగా స్టే విధించింది. -
డిగ్రీ, డీఎడ్ వారికి అవకాశమివ్వండి!
‘గురుకుల’ పోస్టుల భర్తీలో అభ్యర్థుల విజ్ఞప్తి ఎన్సీటీఈ నిబంధనల ప్రకారం ఇవ్వాల్సిందేనని వెల్లడి సాక్షి, హైదరాబాద్: గురుకులాల్లోని ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) పోస్టుల్లో డిగ్రీ, డీఎడ్ పూర్తి చేసినవారికి అవకాశం కల్పించాలని ఉపాధ్యాయ అభ్యర్థులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) నిబంధనల ప్రకారం 6, 7, 8 తరగతులకు బోధించే వారికి.. డిగ్రీతోపాటు రెండేళ్ల డీఎడ్ ఉంటే అవకాశం ఇవ్వవచ్చు. కానీ ‘గురుకుల’నోటిఫికేషన్లో వారికి అవకాశం ఇవ్వలేదు. తాజాగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాల నేపథ్యంలో జారీ చేయనున్న సవరణ నోటిఫికేషన్లో అయినా డిగ్రీ–డీఎడ్ అభ్యర్థులకు అవకాశమిస్తారా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. దీనిపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తులు వస్తున్నాయి. తద్వారా దాదాపు లక్ష మంది అభ్యర్థులకు న్యాయం జరుగుతుందని రాష్ట్ర డీఎడ్ అభ్యర్థుల సంఘం ప్రతినిధులు రామ్మోహన్‌రెడ్డి, శ్రీను నాయక్, సరస్వతి తదితరులు పేర్కొన్నారు. సాధారణ వయో పరిమితి పెంపు ఉంటుందా? గురుకుల పోస్టుల భర్తీకి సంబంధించి సాధారణ గరిష్ట వయో పరిమితిని 39 ఏళ్లకు పెంచాలనే విజ్ఞప్తులు వస్తున్నాయి. రాష్ట్రంలో యూనిఫాం పోస్టులు మినహా మిగతా ప్రభుత్వ ఉద్యోగాలకు సాధారణ గరిష్ట వయోపరిమితి 34 ఏళ్లుగా ఉంది. అప్పుడప్పుడు ప్రభుత్వాలు ఇచ్చే ప్రత్యేక సడలింపులు మినహా చాలా ఏళ్లుగా ఇదే అమలవుతోంది. ప్రభుత్వ స్కూళ్లలోని టీచర్ పోస్టులకు మాత్రం 39 ఏళ్ల సాధారణ గరిష్ట వయోపరిమితి ఉంది. ఇక మోడల్ స్కూళ్లలో టీజీటీ, పీజీటీ పోస్టుల భర్తీకి కూడా దీనిని వర్తింపజేసింది. అదనంగా సామాజిక వర్గాల రిజర్వేషన్‌ను అమలు చేసింది. అయితే గురుకుల టీచర్ పోస్టులకు 34 ఏళ్ల గరిష్ట వయోపరిమితి అమల్లో ఉంది. ఈ నేపథ్యంలో గురుకుల టీచర్ పోస్టుల భర్తీలోనూ 39 ఏళ్ల సాధారణ గరిష్ట వయోపరిమితిని కొనసాగిం చాలని అభ్యర్థులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తు న్నారు. రాష్ట్రంలో నాలుగేళ్లుగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ నోటిఫికేషన్ జారీ కానందున.. ప్రస్తుత నోటిఫికేషన్లో వయో పరిమితి పెంచి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. పదేళ్ల ప్రత్యేక సడలింపుతో.. ఉమ్మడి రాష్ట్రంలో 2011 తరువాత ప్రభుత్వ, జెడ్పీ పాఠశాలల్లో టీచర్ పోస్టులు, ఇతర శాఖల్లో పోస్టులను భర్తీ చేయలేదు. గతేడాది మాత్రం టీఎస్పీఎస్సీ ద్వారా గ్రూప్–2, ఇంజనీర్లు, ఇతర విభాగాల్లోని పలు పోస్టుల భర్తీ చేపట్టారు. అయితే ఉమ్మడి రాష్ట్రంలో పెద్దగా ఉద్యోగాల భర్తీ లేనందున పదేళ్ల గరిష్ట వయోపరిమితి సడలింపు ఇచ్చి.. 44 ఏళ్లకు పెంచారు. తాజాగా గురుకుల పోస్టులకు కూడా దీనిని వర్తింపజేస్తోంది. అయితే టీచర్ పోస్టులకు 39 ఏళ్ల సాధారణ గరిష్ట వయోపరిమితిని కొనసాగిస్తూనే.. తాజాగా ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యేక సడలింపును అమలు చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు. తద్వారా వేల మందికి అవకాశం కల్పించినట్లు అవుతుందని పేర్కొంటున్నారు. ఈ విçషయంలో ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. -
ఆ కాలేజీలకు అనుబంధ గుర్తింపునివ్వండి
రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) గుర్తింపు ఉన్న బీఈడీ కాలేజీలకు అనుబంధ గుర్తింపునివ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అనుబంధ గుర్తింపు ఇవ్వకపోవడాన్ని సవాలు చేస్తూ పలు బీఈడీ కాలేజీలు హైకోర్టును ఆశ్రయించాయి. వ్యాజ్యాలపై విచారణ చేపట్టిన జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు తీర్పు వెలువరించారు. కాలేజీల ఆర్థిక వనరులు, ఉన్న సౌకర్యాలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకునే ఎన్సీటీఈ గుర్తింపునిచ్చిందని న్యాయమూర్తి తెలిపారు. నిర్దిష్ట విధానంలో శిక్షణ పొందిన బోధన సిబ్బంది లేరన్న కారణంతో అనుబంధ గుర్తింపు తిరస్కరించడం సరికాదన్నారు. ఈ విద్యా సంవత్సరం జరిగే కౌన్సెలింగ్‌లో సంబంధిత కాలేజీలకు విద్యార్థులను కేటాయించాలని ఉన్నత విద్యా మండలిని న్యాయమూర్తి ఆదేశించారు. -
ఉద్యోగ సమాచారం
ఆయుర్వేద పరిశోధన సంస్థలో సీనియర్ కన్సల్టెంట్, ఎస్ఆర్ఎఫ్ విజయవాడలోని నేషనల్ ఆయుర్వేద రీసెర్చ ఇన్స్టిట్యూట్ ఫర్ వెక్టర్ బోర్న డిసీజెస్.. వివిధ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేసేందుకు ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. వివరాలు.. సీనియర్ కన్సల్టెంట్ (పాథాలజిస్ట్) (ఖాళీలు-1), ఎస్ఆర్ఎఫ్ (ఆయుర్వేద) (ఖాళీలు-3), డేటా ఎంట్రీ ఆపరేటర్ (ఖాళీలు-2), మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఖాళీలు-2). ఇంటర్వ్యూ తేది అక్టోబర్ 27. వివరాలకు http://www.ccras.nic.in చూడొచ్చు. వైఎస్సార్ కడప జిల్లా కోర్టులో స్టెనోగ్రాఫర్లు వైఎస్సార్ కడప జిల్లా కోర్టు.. స్టెనోగ్రాఫర్ గ్రేడ్-3 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు-7. వయసు 34 ఏళ్లకు మించకూడదు. దరఖాస్తుకు చివరి తేది నవంబర్ 7. వివరాలకు http://ecourts.gov.in చూడొచ్చు. హెచ్‌సీయూలో టెక్నికల్ అసిస్టెంట్లు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ .. తాత్కాలిక ప్రాతిపదికపై టెక్నికల్ అసిస్టెంట్ (ఇన్స్ట్రుమెంటేషన్) (కెమిస్ట్రీ, ఫిజిక్స్) (ఖాళీలు-2), టెక్నికల్ అసిస్టెంట్ (ఆర్ అండ్ డీ) (కెమిస్ట్రీ) (ఖాళీలు-2) పోస్టుల భర్తీకి అక్టోబర్ 28న ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. దరఖాస్తుకు చివరి తేది అక్టోబర్ 25. వివరాలకు www.uohyd.ac.in చూడొచ్చు. స్పేస్ అప్లికేషన్ సెంటర్లో అసిస్టెంట్లు అహ్మదాబాద్‌లోని స్పేస్ అప్లికేషన్ సెంటర్.. సైంటిఫిక్ అసిస్టెంట్ (ఖాళీలు-2), లైబ్రరీ అసిస్టెంట్-ఎ (ఖాళీలు-2), టెక్నికల్ అసిస్టెంట్ (ఎలక్ట్రికల్) (ఖాళీలు-4), టెక్నికల్ అసిస్టెంట్ (మెకట్రోనిక్స్) (ఖాళీలు-1), టెక్నీషియన్-బి (ఎలక్ట్రీషియన్) (ఖాళీలు-16), టెక్నీషియన్-బి (మెషినిస్ట్) (ఖాళీలు-1), టెక్నీషియన్-బి (ఎలక్ట్రానిక్స్/ఐటీ) (ఖాళీలు-1) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వయసు 35 ఏళ్లకు మించకూడదు. దరఖాస్తుకు చివరి తేది నవంబర్ 2. వివరాలకు www.sac.gov.in చూడొచ్చు. ఎన్‌సీటీఈలో కన్సల్టెంట్, రీసెర్చ అసిస్టెంట్స్ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ).. కాంట్రాక్టు పద్ధతిలో కన్సల్టెంట్ (ఖాళీలు-3), సీనియర్/చీఫ్ కన్సల్టెంట్ (ఖాళీలు-1), జూనియర్ కన్సల్టెంట్ (అకడమిక్) (ఖాళీలు-1), కన్సల్టెంట్ (ఫైనాన్స అండ్ అకౌంట్స్) (ఖాళీలు-1), కన్సల్టెంట్ (ఇ-గవర్నెన్స) (ఖాళీలు-1), కన్సల్టెంట్ (పబ్లిక్ రిలేషన్స అండ్ ప్రమోషన్స) (ఖాళీలు-1), రీసెర్చ అసిస్టెంట్స్ (ఖాళీలు-4) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దరఖాస్తుకు చివరి తేది అక్టోబర్ 20. వివరాలకు http://ncte-india.org చూడొచ్చు. ఓషియన్ రీసెర్చలో ప్రాజెక్ట్ సైంటిస్ట్,టెక్నికల్ అసిస్టెంట్ నేషనల్ సెంటర్ ఫర్ అంటార్కిటిక్ అండ్ ఓషియన్ రీసెర్చ.. తాత్కాలిక ప్రాతిపదికపై ప్రాజెక్ట్ సైంటిస్ట్-బి (ఖాళీలు-3), టెక్నికల్ ఆఫీసర్ (ఖాళీలు-1), సెక్షన్ ఆఫీసర్ (ఖాళీలు-2), టెక్నికల్ అసిస్టెంట్ (ఖాళీలు-4), అసిస్టెంట్ (ఖాళీలు-4), పర్సనల్ అసిస్టెంట్/స్టెనో గ్రేడ్-1 (ఖాళీలు-2) పోస్టుల భర్తీకి అక్టోబర్ 28 నుంచి 30 వరకు ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. వివరాలకు www.ncaor.gov.in చూడొచ్చు. -
బీఈడీ సీట్లలో భారీ కోత
సాక్షి, హైదరాబాద్: ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది బీఈడీ సీట్ల సంఖ్యలో భారీ కోత పడింది. సొంత భవనాలు లేని కళాశాలలకు అధికారులు అనుమతులు నిరాకరించారు. ఇప్పటికే నిబంధనలు కఠినతరం కావడంతో చాలా కళాశాలలు స్వచ్ఛందంగా సీట్ల సంఖ్యను తగ్గించుకున్నాయి. తాజాగా అద్దె భవనాల్లో కొనసాగుతున్న కాలేజీలు అనుబంధ గుర్తింపు నోచుకోలేదు. తెలంగాణలో ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, మహాత్మాగాంధీ, పాలమూరు, తెలంగాణ యూనివర్సిటీల పరిధిలోని దాదాపు 50 ప్రైవేటు బీఈడీ కళాశాలలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. తనిఖీల సమయంలో అధికారులు ఈ విషయాన్ని గుర్తించారు. నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్(ఎన్సీటీఈ) నిబంధనల మేరకు ప్రతి కళాశాలకు సొంత భవనం తప్పనిసరి. ఈ నిబంధనను ఈ ఏడాది పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ఈ దృష్ట్యా సొంత భవనాలు లేని ఆయా కళాశాలలకు అధికారులు వర్సిటీల అనుబంధ గుర్తింపు ఇవ్వడానికి నిరాకరించారు. ఫలితంగా 5 వేల సీట్లకు కోత పడింది. అలాగే ఎన్సీటీఈ సూచనల మేరకు వసతులను ఏర్పాటు చేసుకోలేమంటూ కొన్ని కళాశాలలు విద్యార్థుల సంఖ్యను తగ్గించుకున్నాయి. ఇలా రాష్ట్రంలోని ఆయా వర్సిటీల పరిధిలో దాదాపు 250 వర్సిటీ, ప్రైవేట్ బీ ఈడీ కళాశాలల్లో ఉన్న సీట్ల సంఖ్య 25 వేల నుంచి.. 18 వేలకు పడిపోయింది. 14 వరకు ఆప్షన్లకు గడువు... ప్రస్తుతం రాష్ట్రంలో వర్సిటీ కాలేజ్‌లు, ప్రైవేటు కళాశాలల్లో 18,189 బీఈడీ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఎడ్‌సెట్ -2015లో దాదాపు 57 వేల మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ నెల 9న సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ ముగిసింది. ఆయా మెథడాలజీలకు సంబంధించి మొత్తం 31,102 మంది అభ్యర్థులు వెరిఫికేషన్‌కు హాజరయ్యారు. ఈనెల 14 వరకు అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునేందుకు గడువు ఇచ్చినట్లు ఎడ్‌సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ పి. ప్రసాద్ తెలిపారు. 17న సీట్లను కేటాయించనున్నారు. 23వ తేదీలోగా సీట్లు పొందిన కళాశాలల్లో అభ్యర్ధులు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. 25వ తేదీ నుంచి తరగతులు ప్రారంభం అవుతాయి. మొదటి దశలో సీట్లు మిగిలితే.. రెండో దశలో వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇవ్వనున్నట్లు కన్వీనర్ పేర్కొన్నారు. -
మిథ్యా బోధన !
సమాజాన్ని ప్రభావితం చేసే సత్తా ఒక గురువుకే ఉంది. తన జీవిత కాలంలో వేల మంది విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దగల నేర్పు, ఓర్పు వీరి సొంతం. అటువంటి మహోన్నతమైన వృత్తిలోకి రాబోతున్న వారికి గుడ్డి శిక్షణ నిచ్చే కళాశాలలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. తరగతులకు డుమ్మా కొట్టే చక్కని అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఫీజుల రూపంలో వేల రూపాయలు పిండుతూ నిబంధనలకు తిలోదకాలిస్తున్నాయి. జిల్లాలో ప్రైవేట్ బీఈడీ, డీఈడీ కళాశాలల తీరు ఇది. ఆళ్లగడ్డ టౌన్ : ఉపాధ్యాయ ఉద్యోగం సాధించాలంటే కచ్చితంగా డీఈడీ (డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్) లేదంటే బీఈడీ(బ్యాచ్‌లర్ ఆఫ్ ఎడ్యుకేషన్) చదివి ఉండాలి. ఈ కోర్సులకు డిమాండ్ బాగా ఉంది. దీంతో ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయి. రికార్డుల పరంగా ఉన్న మార్కులను వీరు వజ్రాయుధంగా వాడుకుంటున్నారు. విద్యార్థుల నుంచి వేల రూపాయల్లో అక్రమంగా ఫీజులను దండుకుంటున్నారు. జిల్లాలో 63 సీట్లు ఉన్న ప్రైవేటు డీఎడ్ కళాశాలలు 50, వంద సీట్లు ఉన్న కళాశాలలు నాలుగు ఉన్నాయి. అలాగే ప్రైవేట్ బీఎడ్ కళాశాలలు 41 ఉన్నాయి. డైట్, ఎడ్ సెట్ అర్హత పరీక్ష రాసి కౌన్సెలింగ్‌లో సీటు సాధించిన వారికే ప్రవేశాలు ఉంటాయి. ప్రభుత్వ కళాశాలో రూ.230, ప్రైవేటు కళాశాలకు అయితే ఏడాదికి రూ. 12500 చొప్పున ఫీజు చెల్లించాలి అంతకు మించి ఒక్క రూపాయి కూడా ఎక్కువ వసూలు చేయకూడదని నిబంధనలున్నాయి. అయితే ప్రైవేట్ కళాశాలల్లో ఈ నిబంధనలు అమలు కావడం లేదు. ఇవీ నిబంధనలు.. ► నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ నిబంధనల ప్రకారం ప్రతి కళాశాలలలో పది గదులకు తక్కువ కాకుండా ఉండాలి. ► {పథమ సంవత్సరం పది, ద్వితీయ సంవత్సరం పది సబ్జెక్టులు ఉంటాయి. వీటిని బోధించేందుకు ఎంఎడ్ అర్హత కలిగిన ఒక ప్రిన్సిపాల్ సహా 14 మంది లెక్చరర్లు ఉండాలి. ► అర్హత కల్గిని లైబ్రేరియన్, ఫిజికల్ డెరైక్టర్, కంప్యూటర్ ఫ్యాకల్లీ, ల్యాబ్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, సూపరిండెంట్, స్వీపర్, వాచ్మెన్ తదితర సిబ్బంది ఉండాలి. అమలు ఇలా.. ► జిల్లాలోని దాదాపు అన్ని ప్రైవేట్ బీఈడీ, డీఈడీ కళాశాలల్లో ఎక్కడా వసతులు లేవు. ► ఒక్కో కళాశాలలో ఇద్దరు లేక ము గ్గురు మాత్రమే సిబ్బంది ఉంటూ అన్ని తామై విధులు దులు నిర్వహిస్తున్నారు. ► కొన్ని చోట్ల అటెండర్ నుంచి మొదులుకుని క్లర్క్, ప్రిన్సిపాల్, లెక్చరర్ అన్నీ వారే అవుతున్నారు. ► ఆళ్లగడ్డ పట్టణంలో ఒకేచోట ఉన్న ఒక బీఈడీ, రెండు డీఈడీ కళాశాల్లో మొత్తం మూడు కళాశాలలకు కలిపి ఇద్దరు సిబ్బంది ఉన్నారు. ► మరో చోట ఉన్న బీఈడీ, డీఈడీ రెండు కళాశాలకు కలుపుకొని ఒక్క రే ప్యూన్ నుంచి ప్రిన్సిపాల్ వరకు వ్యవహరిస్తున్నారు. ► కొన్ని కళాశాలల్లో కనీసం విద్యార్థులు కూర్చునేందుకు అవసరమైన బెంచీలు కూడా లేవు. ఇవీ ఆఫర్లు ► తరగతులకు రానవసరం లేదు. రికార్డులు రాయనవసరం లేదు. ప్రయోగ పరీక్షలు మేమే చేస్తాం. అయితే ఒక్కో విద్యార్థి రూ. 40 వేల నుంచి రూ. 60 వేలు చెల్లిస్తే చాలు అంటూ కొన్ని కళాశాలలు ఆఫర్లు ఇస్తున్నాయి. ► తరగతులకు రెగ్యులర్‌గా హాజరయ్యేవారు రూ. 100 కూడా చేయని రికార్డులను రూ. 6 వేల నుంచి రూ. 8 వేల వరకు వెచ్చించి కచ్చితంగా కొనుగోలు చేయాల్సిందే. -
ఉపాధ్యాయ విద్యలో కొత్త డిప్లొమాలొద్దు
- ఎన్‌సీటీఈకి రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ లేఖ - కోర్సులకు మార్గదర్శకాల రూపకల్పన పూర్తికాలేదని వెల్లడి - రెండేళ్లపాటు నోటిఫికేషన్ ఇవ్వొద్దని విజ్ఞప్తి - సానుకూలంగా స్పందించిన ఎన్సీటీఈ - 2016-17 వరకూ ఆ కోర్సులపై నిషేధం విధిస్తూ నోటీసులు సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ విద్యలో సంస్కరణల్లో భాగంగా జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) 2015-16 విద్యా సంవ త్సరం నుంచి ప్రారంభించేందుకు ప్రవేశపెట్టిన కొత్త డిప్లొమా కోర్సులు రెండేళ్ల వరకు రాష్ట్రంలో అమల్లోకి రావు. ఆయా కోర్సుల ప్రారంభానికి సంబంధించిన మార్గదర్శకాల రూపకల్పన ఇంకా పూర్తి కానందున వాటి అమలుకు నోటిఫికేషన్ ఇవ్వొద్దంటూ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఇటీవల ఎన్సీటీఈలకు లేఖలు రాసింది. మార్గదర్శకాల రూపకల్పన పూర్తయ్యేందుకు ఇంకా సమయం పడుతుందని పేర్కొంది. ముఖ్యంగా డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (ఓపెన్ డిస్టెన్స్ లర్నింగ్), డిప్లొమా ఇన్ ఫైన్ ఆర్ట్స్, డిప్లొమా ఇన్ విజువల్ ఆర్ట్స్, డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (డీపీఈడీ) వంటి రెండేళ్ల కాలవ్యవధిగల కోర్సుల ప్రారంభానికి నోటిఫికేషన్ ఇవ్వొద్దని పేర్కొంది. అప్పటివరకు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఎల్ఈడీ) కోర్సునే కొనసాగిస్తామని వివరించింది. మిగితా కోర్సులపై నిషేధం విధించాలని కోరింది. ఇందుకు అంగీకరించిన ఎన్సీటీఈ 2016-17 వరకూ ఆ కోర్సులపై నిషేధం విధిస్తూ నోటీసులు జారీ చేసింది. కోర్సులు వద్దనడానికి కారణాలు... కొత్త డిప్లొమా కోర్సులను విద్యాశాఖ వ్యతిరేకించడానికి కారణాలు ఏమిటంటే... ముందుగా ఏ కోర్సులో చేరితే ఏ ఉద్యోగానికి అర్హులన్నది రాష్ట్ర ప్రభుత్వం తేల్చాల్సి ఉండటం. ఉదాహరణకు రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో ఇంతవరకు ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ విధానమే లేదు. ఆ కోర్సును ప్రారంభిస్తే వారికి భవిష్యత్తులో అవకాశాలు ఏంటనేది సర్కారు నిర్ణయించాలి. కేజీ టు పీజీలో ఆ కోర్సుల అవసరంపై ప్రభుత్వ స్థాయిలో నిర్ణయం జరగాలి. డిప్లొమా ఇన్ ఆర్ట్, డిప్లొమా ఇన్ విజువల్ ఆర్ట్ వంటి కోర్సులు చేస్తే ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉంటాయనేది తేల్చాలి. ఇప్పటికే క్రాఫ్ట్, డ్రాయింగ్ టీచర్ల భర్తీని నిలిపేసిన ప్రభుత్వం భవిష్యత్తులో వాటిని భర్తీ చేస్తుందో లేదో స్పష్టం చేయాలి. అలాగే డిస్టెన్స్ విధానంలో డిప్లొమా కోర్సును అనుమతిస్తుందో లేదో పేర్కొనాలి. బ్యాచిలర్ కోర్సులపై దృష్టి లేదు.. బ్యాచిలర్ డిగ్రీలో కొత్తగా ప్రవేశపెట్టిన వివిధ కోర్సులకు సంబంధించిన అంశాలపై రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఇంతవరకు దృష్టి సారించలేదు. వాటికి సంబంధించిన విధి విధానాల రూపకల్పన, ఆయా కోర్సులను 2015-16 విద్యా సంవత్సరంలో ప్రారంభిస్తారా? లేదా అన్న అంశాలపై యూనివర్సిటీలు, ఉన్నత విద్యా మండలి పట్టించుకోకపోవడంతో గందరగోళం నెలకొంది. ఎన్సీటీఈ ఆదేశాల మేరకు బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్), మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (ఎంఎడ్) కోర్సులను రెండేళ్లు చేయాలన్న నిబంధ నను, బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (బీపీఎడ్) కోర్సును కొనసాగించే నిబంధనల అమలుకు విద్యా మండలి చర్యలు చేపట్టింది. వాటికి సంబంధించిన ప్రవేశాలు చేపట్టేందుకు వీలుగా నోటిఫికేషన్ల జారీకి చర్యలు చేపట్టింది. ప్రారంభిస్తారా.. లేదా.. తేల్చని కోర్సులు బీఈఎల్ఈడీ: బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. నాలుగేళ్ల ప్రొఫెషనల్ డిగ్రీ. బీఎస్సీ-బీఎడ్/బీఏ-బీఎడ్: నాలుగేళ్ల కోర్సు ఇంటిగ్రేటెడ్ బీఎడ్ఎంఎడ్: మూడేళ్ల కోర్సు. బీఎడ్ పార్ట్ టైం: మూడేళ్ల కోర్సు. డిస్టెన్స్ బీఎడ్: రెండేళ్ల కోర్సు. యూజీ డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్: ఏడాది కోర్సు కాలపరిమితి పెంపు కోర్సులు డీఈఎల్ఈడీ: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. రెండేళ్ల కోర్సు. బీఎడ్: ఏడాది కోర్సుగా ఉన్న బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇకపై రెండేళ్ల కోర్సు. ఎంఎడ్: ఏడాది మాత్రమే ఉన్న మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్‌ను ఇకపై రెండేళ్ల కోర్సు. బీపీఈడీ: ఏడాది మాత్రమే ఉన్న బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇకపై రెండేళ్ల కోర్సు. ఎంపీఈడీ: ఏడాది కోర్సుగానే ఉన్న మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇకపై రెండేళ్ల కోర్సు. -
డీఈడీలకు మళ్లీ అన్యాయం
సాక్షి, రాజమండ్రి :డీఎస్సీలో డీఈడీ అభ్యర్థులకు మళ్లీ అన్యాయం జరిగింది. ప్రభుత్వ విధానాల కారణంగా 2008లో డీఎస్సీ రాయలేక పోయిన డీఈడీ అభ్యర్థులకు వయసు మీరిపోయినా కోర్టు మూడేళ్ల వరకూ అవకాశం కల్పించింది. దీంతో అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకునేందుకు వెళ్లగా వయసు సడలింపును వెబ్సైట్లు అనుమతించలేదు. దీంతో ఆన్లైన్లో సవరణ చేయాలని ముగ్గురు అభ్యర్థులు మళ్లీ కోర్టుకు వెళ్లారు. కోర్టు వారికి నేరుగా దరఖాస్తు చేసుకునే వీలు కల్పించాలని ఆదేశించింది. బుధవారంతో దరఖాస్తు గడువు ముగుస్తుండగా.. ఆన్లైన్లో, ఈ సేవా కేంద్రాల్లో ఫీజు చెల్లించేందుకు వెళితే సాఫ్ట్వేర్ తీసుకోవడం లేదంటున్నారని అభ్యర్థులు వాపోతున్నారు. పూర్వాపరాలు ఇవీ.. డీఎస్సీ ద్వారా నియమించే సెకండరీ గ్రేడ్ టీచర్లకు డీఈడీ అభ్యర్థుల్ని అనుమతించాలన్న జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి నిబంధనను 2008 డీఎస్సీలో ప్రభుత్వం పాటించలేదు. దీంతో అర్హత ఉన్న అభ్యర్థులు కూడా డీఎస్సీలో పాల్గొనలేకపోయారు. వారిలో వయో పరిమితి దాటిన వారు గత ఏడాది నాటికి రాష్ట్రంలో 2000 మంది ఉన్నారని అంచనా. వీరిలో 200 మందికి పైగా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. నష్టపోయిన అభ్యర్థులకు మూడేళ్ల వయో పరిమితి సడలింపు ఇస్తూ డీఎస్సీకి హాజరయ్యేందుకు అవకాశం ఇవ్వాలని సుప్రీంకోర్టు 2012లో ఆదేశించింది. ఈ మేరకు 2013 నుంచి 2016లోగా జరిగే డీఎస్సీల్లో పాల్గొనే అవకాశం డీఈడీ అభ్యర్థులకు కల్పిస్తామంటూ 2013 నవంబరులో రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉత్తర్వు జారీ చేసింది. ప్రస్తుతం డీఎస్సీ దరఖాస్తులను ఆన్లైన్లో భర్తీ చేస్తున్నందున వయసు రాయతీని సాఫ్ట్వేర్ అనుమతించడం లేదని జిల్లాకు చెందిన నాగేశ్వరరావు, పశ్చిమగోదావరికి చెందిన డానియేలు, విజయనగరానికి చెందిన అప్పలరాజు హైకోర్టుకు వెళ్లారు. వీరి దరఖాస్తులను తీసుకోవాలని ఆదేశాలిస్తూ ఈ నెల 8న కోర్టు తీర్పు ఇచ్చింది. ఆ ఆర్డరుతో అభ్యర్థులు డీఈఓ కార్యాలయాలకు వెళితే ఫీజు ఆన్లైన్లో చెల్లించి రశీదుతో పా టు దరఖాస్తులు సమర్పించమని చెప్పారు. తీరా ఆన్లైన్లో ఫీజు చెల్లించబోగా పుట్టిన తేదీని సాఫ్ట్వేర్ అంగీకరించడం లేదు. బుధవారంతో గడువు ము గుస్తున్నా నేరుగా ఫీజు కట్టే అవకాశం కల్పించనూ లేదు, ఆన్లైన్లో సవరణా చేయలేదు. కోర్టు ఆదేశించినా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించకపోవడాన్ని నిరసిస్తూ అభ్యర్థులు న్యాయ పోరాటం చేస్తామంటున్నారు. -
ఉపాధ్యాయ విద్య
మారుతున్న స్వరూపం.. నాణ్యతకు ప్రాధాన్యం..విద్యా వ్యవస్థలో ఉపాధ్యాయులది గురుతర బాధ్యత. విద్యార్థులను పరిపూర్ణులుగా తీర్చిదిద్దడంలో టీచర్ల బోధన అమూల్యమైంది. అందుకే పిల్లల అవసరాలకు, వారి అభ్యసనానికి అనుగుణంగా స్పందించే ఉపాధ్యాయుల్ని తయారు చేయాలి. ఇలాంటి సదుద్దేశంతో ఇటీవల నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ).. కొత్త విధివిధానాలను రూపొందించింది. 2015-16 నుంచి వీటిని అమలు చేయాలని సూచించింది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ విద్య స్వరూపం, కెరీర్ పరంగా అవకాశాలపై స్పెషల్ ఫోకస్.. ఉపాధ్యాయ విద్య.. భావి తరాల బంగారు భవితకు మార్గ నిర్దేశనం చేసే బోధన రంగంలో అడుగులు వేసేందుకు సాధనం. వ్యక్తిగతంగా, వృత్తిగతంగా సంతృప్తినిచ్చే కెరీర్. అందుకే దేశంలో ఏటా లక్షల మంది యువత.. డీఈడీ, బీఈడీ, ఎంఈడీ తదితర టీచర్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో ప్రవేశానికి పోటీపడుతున్నారు. పరిస్థితి ఒకవైపు ఇలా ఉంటే మరోవైపు ప్రాథమిక విద్య మొదలు వృత్తి విద్యా సంస్థల వరకు అన్నింటిలోనూ నాణ్యమైన బోధనా సిబ్బంది కొరత వేధిస్తోందంటూ సంబంధిత వర్గాల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా కరిక్యులం, కోర్సుల స్వరూపాలు ప్రస్తుత సామాజిక పరిస్థితులకు అనుగుణంగా లేవనే అభిప్రాయాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్సీటీఈ ఉపాధ్యాయ విద్యా కోర్సుల స్వరూపాలను మార్చి.. నాణ్యత స్థాయిలను పెంచేందుకు ప్రణాళికలు రూపొందించింది. బోధన రంగంలో మెరుగైన నైపుణ్యాలు అందేలా ప్రాక్టికాలిటీకి పెద్దపీట వేయాలని నిర్ణయించింది. మార్పులేమిటి? ఉపాధ్యాయ విద్యకు సంబంధించి డీఈడీ నుంచి ఎంఈడీ వరకు దాదాపు 15 కోర్సుల స్వరూపాన్ని మార్చుతూ, వ్యవధిని పెంచుతూ ఎన్సీటీఈ నిర్ణయం తీసుకుంది.సాధారణ బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులు పోటీపడే కీలకమైన, ఏడాది వ్యవధి గల బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఈడీ) కోర్సును రెండేళ్లకు పెంచారు. పీజీ స్థాయిలో మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (ఎంఈడీ) కోర్సు వ్యవధిని రెండేళ్లకు పెంచారు. దేశ వ్యాప్తంగా వివిధ సంస్థల్లో అందుబాటులో ఉన్న డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్; డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్; డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్; బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్; మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్; డిప్లొమా ఇన్ ఆర్ట్స్ ఎడ్యుకేషన్; డిప్లొమా ఇన్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఎడ్యుకేషన్ కోర్సుల వ్యవధిని కూడా రెండేళ్లు తప్పనిసరి చేసింది. దూర విద్య కోర్సులను కూడా రెండేళ్లు చేసింది. కరిక్యులంలో మార్పులు ప్రతి కోర్సుకు ఒక విద్యా సంవత్సరంలో తప్పనిసరిగా ఉండాల్సిన టీచింగ్ అవర్స్, ప్రాక్టికల్స్ అవర్స్‌ను నిర్దేశించింది. ఉదాహరణకు బీఈడీ కోర్సులో ప్రతి విద్యా సంవత్సరంలో తప్పనిసరిగా 200 రోజుల బోధన ఉండాలి. ఇందులో తరగతి గది బోధన, ఇంటర్నల్స్, ప్రాక్టికల్స్‌కు వేర్వేరుగా నిర్దిష్ట గంటలు పేర్కొనడంతో విద్యార్థులకు పూర్తిస్థాయి నైపుణ్యాలు అందేందుకు ఆస్కారం లభించనుంది. జండర్ ఎడ్యుకేషన్, యోగా ఎడ్యుకేషన్‌ను తప్పనిసరి చేసింది. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ (ఐసీటీ) బోధన పద్ధతులపై అవగాహన పొందేందుకు దీన్ని ఒక సబ్జెక్ట్‌గా పొందుపర్చాలి. ప్రస్తుతం 40 రోజుల వ్యవధిలో ఉన్న స్కూల్ ఇంటర్న్‌షిప్ 140 రోజులకు పెరగనుంది. విద్యార్థులు పూర్తిస్థాయిలో క్షేత్ర నైపుణ్యాలు సాధించే దిశగా 90 శాతం హాజరును కూడా తప్పనిసరి చేసింది. ఇంటిగ్రేటెడ్ కోర్సుల దిశగా.. బోధన రంగంలో పెరుగుతున్న మానవ వనరుల డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుంటూ ఎన్సీటీఈ కొత్త కోర్సుల రూపకల్పన దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో ఇంటర్ అర్హతతో ప్రవేశం పొందేలా నాలుగేళ్ల వ్యవధిలో బీఎస్సీ-బీఈడీ, బీఏ-బీఈడీ అనే రెండు ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్సుల రూపకల్పనకు యోచిస్తోంది. అదే విధంగా పీజీ స్థాయిలో బీఏ-ఎంఈడీ కోర్సు ప్రారంభించాలని కూడా యోచిస్తోంది. ఇక.. స్పెషల్‌గా ఎంఈడీ ఎన్సీటీఈ తాజా నిర్ణయాలతో ఎంఈడీ కోర్సు కూడా స్పెషల్‌గా మారనుంది. ఇప్పటి వరకు అందరికి ఒకే మాదిరిగా ఉన్న ఎంఈడీ కోర్సులో ఇక నుంచి స్పెషలైజేషన్స్ అందుబాటులోకి రానున్నాయి. సెకండరీ, సీనియర్ సెకండరీ అనే రెండు స్పెషలైజేషన్స్‌ను ఎంఈడీలో ప్రవేశ పెట్టనున్నారు. బీఈడీ అర్హులు ఈ రెండు స్పెషలైజేషన్స్ ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. డీఈడీలో ఉత్తీర్ణత సాధించి తర్వాత బ్యాచిలర్ డిగ్రీ పొందిన విద్యార్థులకు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ స్పెషలైజేషన్ అందుబాటులో ఉంటుంది. సృజనాత్మకతను పెంపొందించేలా తాజా కరిక్యులం ఉద్దేశం ఎడ్యుకేషన్ కోర్సు ఔత్సాహికుల్లో సృజనాత్మకతను పెంపొందించడం. అందుకే మూల్యాంకనలో ఇంటర్న్‌షిప్ కోసం కేటాయించిన 40 శాతం మార్కుల్లో 20 శాతం మార్కులను ప్రత్యేకంగా ఇన్నోవేషన్, ఫీల్డ్ వర్క్, రీసెర్చ్, ప్రాక్టికల్స్‌కు నిర్దేశించింది. ఇటీవల కాలంలో అమలు చేస్తున్న నిరంతర సమగ్ర మూల్యాంకనం విధానం ప్రస్తుత ఉపాధ్యాయులకు చాలా క్లిష్టంగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి పరిష్కారంగా, ఉపాధ్యాయ విద్యా కోర్సుల్లో మార్పులు తీసుకొస్తున్నట్లు విద్యావేత్తల అభిప్రాయం. కెరీర్ కళకళలాడేలా ఉపాధ్యాయ విద్యలో తీసుకొస్తున్న ఈ మార్పులన్నీ కార్యరూపం దాల్చడంతోపాటు సమర్థంగా అమలైతే రానున్న నాలుగైదేళ్లలో టీచింగ్ కెరీర్ కళకళలాడుతుందని ఈ రంగంలోని నిపుణులు అంటున్నారు. ఈ విషయంలో ఇన్స్టిట్యూట్ల బాధ్యత కూడా ఎంతో ఉంది. ముఖ్యంగా మారిన కోర్సులకు అనుగుణంగా అవసరమైన మౌలిక సదుపాయాలు అందించాలి. దీనికి సంబంధించి కూడా ఎన్సీటీఈ సరికొత్త నిబంధనలు నిర్దేశించింది. ప్రతి కోర్సు విషయంలో ఒక ఇన్స్టిట్యూట్లో బ్లాక్ బోర్డ్ నుంచి లేబొరేటరీ వరకు అవసరమైన అన్ని కచ్చితమైన మౌలిక సదుపాయాల జాబితా రూపొందించింది. అంతేకాకుండా ఇక నుంచి టీచింగ్ ఇన్స్టిట్యూట్లకు కూడా నాక్ (నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్) గుర్తింపు తప్పనిసరి. విద్యార్థుల దృక్పథం మారాలి టీచర్ ఎడ్యుకేషన్ విద్యార్థుల దృక్పథం మారాలన్నది విద్యావేత్తల సూచన. తాజా మార్పులను ఆకళింపు చేసుకునేలా మానసికంగా ఉల్లాసంగా ఉండాలని, భవిష్యత్తులో ఒక ఆదాయ మార్గంగానే ఈ కోర్సులను భావించకుండా మార్పుల ఉద్దేశాలకు అనుగుణంగా నైపుణ్యాలు సొంతం చేసుకోవాలంటున్నారు. అప్పుడు అవకాశాలు వాటంతటవే లభిస్తాయని, ఆకర్షణీయ వేతనాలు పొందొచ్చని చెబుతున్నారు. మూస ధోరణికి ముగింపు! ప్రస్తుతం మనం బీటెక్, ఎంబీఏ, మెడిసిన్ వంటి వాటినే ప్రొఫెషనల్ కోర్సులుగా భావిస్తున్నాం. కానీ ఆ కోర్సుల దిశగా విద్యార్థులను తీర్చిదిద్దే ఉపాధ్యాయ కోర్సులు మాత్రం మూస ధోరణిలో సాగుతున్నాయి. అందుకే బీఈడీ, ఎంఈడీ కోర్సుల్లోనూ ప్రొఫెషనలిజానికి ప్రాధాన్యం ఇచ్చేందుకు మొదటి అడుగుగా తాజా మార్పులను పేర్కొనొచ్చు. ఇప్పటి వరకు ఉపాధ్యాయ విద్యలో టీచింగ్, ప్రాక్టికల్స్ (క్లాస్‌రూం ఇంటర్న్‌షిప్) రైలు పట్టాల మాదిరిగా వేర్వేరుగా ఉన్నాయి. వీటిని సమ్మిళితం చేసేలా కొత్త కరిక్యులంను రూపొందించారు. ఆయా కోర్సుల మొత్తం వ్యవధిలో నిరంతర ప్రక్రియగా ‘తరగతి గది పరిశీలన’ను రూపొందించడం ఎంతో మేలు చేస్తుంది. దీనివల్ల అకడమిక్‌గా ఒక అంశంపై అవగాహన పొందిన వెంటనే సంబంధిత బోధన పద్ధతులపైనా పరిజ్ఞానం లభిస్తుంది. అంతేకాకుండా కోర్సులో చదివే పలు సబ్జెక్ట్‌లను సమీకృతం చేసేలా పాఠ్య ప్రణాళికలను రూపొందించే అంశాలపై శిక్షణ ద్వారా విద్యార్థులకు మెరుగైన నైపుణ్యాలు లభిస్తాయి. ప్రపంచ వ్యాప్తంగా మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఉపాధ్యాయ విద్యలో మార్పులు అన్ని వర్గాల ఉన్నతికి దోహదం చేస్తాయి. - డాక్టర్ పి.సందీప్, ఎన్సీటీఈ సభ్యులు.