సాక్షి, హైదరాబాద్: ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది బీఈడీ సీట్ల సంఖ్యలో భారీ కోత పడింది. సొంత భవనాలు లేని కళాశాలలకు అధికారులు అనుమతులు నిరాకరించారు. ఇప్పటికే నిబంధనలు కఠినతరం కావడంతో చాలా కళాశాలలు స్వచ్ఛందంగా సీట్ల సంఖ్యను తగ్గించుకున్నాయి. తాజాగా అద్దె భవనాల్లో కొనసాగుతున్న కాలేజీలు అనుబంధ గుర్తింపు నోచుకోలేదు. తెలంగాణలో ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, మహాత్మాగాంధీ, పాలమూరు, తెలంగాణ యూనివర్సిటీల పరిధిలోని దాదాపు 50 ప్రైవేటు బీఈడీ కళాశాలలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. తనిఖీల సమయంలో అధికారులు ఈ విషయాన్ని గుర్తించారు.
నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్(ఎన్‌సీటీఈ) నిబంధనల మేరకు ప్రతి కళాశాలకు సొంత భవనం తప్పనిసరి. ఈ నిబంధనను ఈ ఏడాది పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ఈ దృష్ట్యా సొంత భవనాలు లేని ఆయా కళాశాలలకు అధికారులు వర్సిటీల అనుబంధ గుర్తింపు ఇవ్వడానికి నిరాకరించారు. ఫలితంగా 5 వేల సీట్లకు కోత పడింది. అలాగే ఎన్‌సీటీఈ సూచనల మేరకు వసతులను ఏర్పాటు చేసుకోలేమంటూ కొన్ని కళాశాలలు విద్యార్థుల సంఖ్యను తగ్గించుకున్నాయి. ఇలా రాష్ట్రంలోని ఆయా వర్సిటీల పరిధిలో దాదాపు 250 వర్సిటీ, ప్రైవేట్ బీ ఈడీ కళాశాలల్లో ఉన్న సీట్ల సంఖ్య 25 వేల నుంచి.. 18 వేలకు పడిపోయింది.
14 వరకు ఆప్షన్లకు గడువు...
ప్రస్తుతం రాష్ట్రంలో వర్సిటీ కాలేజ్‌లు, ప్రైవేటు కళాశాలల్లో 18,189 బీఈడీ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఎడ్‌సెట్ -2015లో దాదాపు 57 వేల మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ నెల 9న సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ ముగిసింది. ఆయా మెథడాలజీలకు సంబంధించి మొత్తం 31,102 మంది అభ్యర్థులు వెరిఫికేషన్‌కు హాజరయ్యారు.
ఈనెల 14 వరకు అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునేందుకు గడువు ఇచ్చినట్లు ఎడ్‌సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ పి. ప్రసాద్ తెలిపారు. 17న సీట్లను కేటాయించనున్నారు. 23వ తేదీలోగా సీట్లు పొందిన కళాశాలల్లో అభ్యర్ధులు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. 25వ తేదీ నుంచి తరగతులు ప్రారంభం అవుతాయి. మొదటి దశలో సీట్లు మిగిలితే.. రెండో దశలో వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇవ్వనున్నట్లు కన్వీనర్ పేర్కొన్నారు.
బీఈడీ సీట్లలో భారీ కోత
Published Sat, Sep 12 2015 3:34 AM | Last Updated on Sun, Sep 3 2017 9:12 AM
Advertisement
Advertisement