Bed Seats
-
బీఈడీ సీట్లలో భారీ కోత
సాక్షి, హైదరాబాద్: ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది బీఈడీ సీట్ల సంఖ్యలో భారీ కోత పడింది. సొంత భవనాలు లేని కళాశాలలకు అధికారులు అనుమతులు నిరాకరించారు. ఇప్పటికే నిబంధనలు కఠినతరం కావడంతో చాలా కళాశాలలు స్వచ్ఛందంగా సీట్ల సంఖ్యను తగ్గించుకున్నాయి. తాజాగా అద్దె భవనాల్లో కొనసాగుతున్న కాలేజీలు అనుబంధ గుర్తింపు నోచుకోలేదు. తెలంగాణలో ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, మహాత్మాగాంధీ, పాలమూరు, తెలంగాణ యూనివర్సిటీల పరిధిలోని దాదాపు 50 ప్రైవేటు బీఈడీ కళాశాలలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. తనిఖీల సమయంలో అధికారులు ఈ విషయాన్ని గుర్తించారు. నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్(ఎన్సీటీఈ) నిబంధనల మేరకు ప్రతి కళాశాలకు సొంత భవనం తప్పనిసరి. ఈ నిబంధనను ఈ ఏడాది పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ఈ దృష్ట్యా సొంత భవనాలు లేని ఆయా కళాశాలలకు అధికారులు వర్సిటీల అనుబంధ గుర్తింపు ఇవ్వడానికి నిరాకరించారు. ఫలితంగా 5 వేల సీట్లకు కోత పడింది. అలాగే ఎన్సీటీఈ సూచనల మేరకు వసతులను ఏర్పాటు చేసుకోలేమంటూ కొన్ని కళాశాలలు విద్యార్థుల సంఖ్యను తగ్గించుకున్నాయి. ఇలా రాష్ట్రంలోని ఆయా వర్సిటీల పరిధిలో దాదాపు 250 వర్సిటీ, ప్రైవేట్ బీ ఈడీ కళాశాలల్లో ఉన్న సీట్ల సంఖ్య 25 వేల నుంచి.. 18 వేలకు పడిపోయింది. 14 వరకు ఆప్షన్లకు గడువు... ప్రస్తుతం రాష్ట్రంలో వర్సిటీ కాలేజ్‌లు, ప్రైవేటు కళాశాలల్లో 18,189 బీఈడీ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఎడ్‌సెట్ -2015లో దాదాపు 57 వేల మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ నెల 9న సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ ముగిసింది. ఆయా మెథడాలజీలకు సంబంధించి మొత్తం 31,102 మంది అభ్యర్థులు వెరిఫికేషన్‌కు హాజరయ్యారు. ఈనెల 14 వరకు అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునేందుకు గడువు ఇచ్చినట్లు ఎడ్‌సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ పి. ప్రసాద్ తెలిపారు. 17న సీట్లను కేటాయించనున్నారు. 23వ తేదీలోగా సీట్లు పొందిన కళాశాలల్లో అభ్యర్ధులు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. 25వ తేదీ నుంచి తరగతులు ప్రారంభం అవుతాయి. మొదటి దశలో సీట్లు మిగిలితే.. రెండో దశలో వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇవ్వనున్నట్లు కన్వీనర్ పేర్కొన్నారు. -
బీఈడీ సీట్లు మాకొద్దు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని బీఈడీ (బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్) కళాశాలలు సీట్ల సంఖ్య తగ్గించుకునే పనిలో పడ్డాయి. ఈ ఏడాది బీఈడీకి ఆదరణ తగ్గడం, నిబంధనలు కఠినతరం కావడమే అందుకు ప్రధాన కారణమని స్పష్టంగా తెలుస్తోంది. వాస్తవంగా ఇంతకుముందు బీఈడీకి ఎనలేని డిమాండ్ ఉండేది. రాష్ట్రంలో 250 బీఈడీ కళాశాలలు ఉండగా.. వాటిలో మొత్తం సీట్లు 25 వేలు. ఈ సీట్లను పొందేందుకు ఏటా లక్ష మందికి పైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకునేవారు. అయితే ఈ ఏడాది 2015-16 విద్యా సంవత్సరం నుంచి బీఈడీని రెండేళ్ల కోర్సుగా ఎన్సీటీఈ అమలు చేస్తోంది. దీంతో రెండేళ్ల ఈ కోర్సు పట్ల విద్యార్థులు పెద్దగా ఆసక్తి కనబర్చడం లేదు. ఈ ఏడాది 64 వేల పైచిలుకు అభ్యర్థులు మాత్రమే ఎడ్‌సెట్-2015కు దరఖాస్తు చేసుకున్నారు. మరోపక్క ఎన్సీటీఈ నిబంధనలు కఠినతరం కావడంతో యాజమాన్యాలు కూడా వెనకడుగు వేస్తున్నాయి. గత విద్యాసంవత్సరం వరకు 100 మంది విద్యార్థులకు సరిపడా ప్రతి కళాశాల 16 వేల చదరపు అడుగుల స్లాబ్ ఏరియా కలిగి ఉంటే సరిపోయేది. వారికి బోధించడానికి ఏడుగురు అధ్యాపకులు ఉండాలన్న నిబంధన ఉంది. తాజాగా ఎన్సీటీఈ వంద మంది విద్యార్థులకు 21 వేల చదరపు అడుగుల స్లాబ్ ఏరియాతోపాటు 16 మంది ఫుల్ టైం అధ్యాపకులను తప్పనిసరి చేసింది. ఈ నిర్ణయం కళాశాలల యాజమాన్యాలకు శరాఘాతంగా మారింది. వెయ్యి సీట్లు తగ్గొచ్చు ఎన్సీటీఈ నిబంధన మేరకు అధ్యాపకులను చేర్చుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో వారికి నెలనెలా జీతాలు చెల్లించలేమని యాజమాన్యాలు స్పష్టం చేస్తున్నాయి. పైగా ఫీజు రీయింబర్స్మెంట్ కూడా సకాలంలో ప్రభుత్వం నుంచి అందడం లేదు. ఈ నేపథ్యంలో సీట్ల సంఖ్య తగ్గించుకునేందుకు కళాశాలలు వరుస కడుతున్నాయి. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పుడున్న 25 వేలల్లో... దాదాపు వెయ్యి సీట్లు తగ్గే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మార్చిన నిబంధనల అమలుకు ఈ ఏడాది మినహాయింపు ఇవ్వాలని కళాశాలల యాజమాన్యాలు కోరుతున్నాయి. ఆర్థిక భారం భరించలేని మరి కొన్ని కళాశాలలు మాత్రం నిర్ద్వందంగా సీట్లు తగ్గించుకుంటున్నాయి. -
మేనేజ్మెంట్ కోటా సీట్లు అన్నీ ఇతర రాష్ట్రాల వారికే!
హైదరాబాద్: ప్రైవేటు బీఈడీ కాలేజీల అక్రమాలకు అంతూపొంతూ లేకుండా పోతోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం 310 కాలేజీల్లో 200 కాలేజీల్లో మేనేజ్మెంటు కోటా సీట్లన్నిటినీ అత్యధికంగా బీహార్ రాష్ట్రానికి చెందిన విద్యార్ధులతో నింపేశారు. కొన్ని కాలేజీలు మణిపూర్, ఒడిస్సా, చత్తీస్‌ఘడ్‌కు చెందిన వారితో భర్తీచేశాయి. నిబంధనల పకారం మేనేజ్మెంటు కోటా సీట్లను కన్వీనర్ నిర్దేశించిన ఎడ్‌సెట్ ర్యాంకుల వారికి ఇవ్వాలి. ముందుగా రాష్ట్రానికి చెందిన విద్యార్ధులకు ప్రాధాన్యమివ్వాలి. వారు ముందుకు రాని పక్షంలో ప్రభుత్వ అనుమతి తీసుకొని ఇతర రాష్ట్రాల వారితో భర్తీచేయాలి. అన్ని రాష్ట్రాల వారికి తెలిసేలా ప్రముఖ పతికల్లో జాతీయస్థాయిలో ప్రకటనలు విడుదల చేయాలి. కానీ కాలేజీలు పభుత్వంతో సంబంధం లేకుండా, ప్రకటనలు కూడా చేయకుండా బీహార్, మణిపూర్ విద్యార్ధులతో ఈ సీట్లను భర్తీ చేశాయి. ఈ కాలేజీలు అందించిన పత్రాల ఆధారంగా కాలేజీల్లోని ప్రవేశాలపై పూర్తిస్థాయి పరిశీలన చేసేందుకు నిపుణులతో ద్విసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. ఆయా కాలేజీల్లోని ప్రవేశాల తీరును పరిశీలించిన ఈ కమిటీ తన నివేదికను శనివారం ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వేణుగోపాలరెడ్డికి అందించింది.