సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని బీఈడీ (బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్) కళాశాలలు సీట్ల సంఖ్య తగ్గించుకునే పనిలో పడ్డాయి. ఈ ఏడాది బీఈడీకి ఆదరణ తగ్గడం, నిబంధనలు కఠినతరం కావడమే అందుకు ప్రధాన కారణమని స్పష్టంగా తెలుస్తోంది. వాస్తవంగా ఇంతకుముందు బీఈడీకి ఎనలేని డిమాండ్ ఉండేది. రాష్ట్రంలో 250 బీఈడీ కళాశాలలు ఉండగా.. వాటిలో మొత్తం సీట్లు 25 వేలు. ఈ సీట్లను పొందేందుకు ఏటా లక్ష మందికి పైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకునేవారు. అయితే ఈ ఏడాది 2015-16 విద్యా సంవత్సరం నుంచి బీఈడీని రెండేళ్ల కోర్సుగా ఎన్‌సీటీఈ అమలు చేస్తోంది.
దీంతో రెండేళ్ల ఈ కోర్సు పట్ల విద్యార్థులు పెద్దగా ఆసక్తి కనబర్చడం లేదు. ఈ ఏడాది 64 వేల పైచిలుకు అభ్యర్థులు మాత్రమే ఎడ్‌సెట్-2015కు దరఖాస్తు చేసుకున్నారు. మరోపక్క ఎన్‌సీటీఈ నిబంధనలు కఠినతరం కావడంతో యాజమాన్యాలు కూడా వెనకడుగు వేస్తున్నాయి. గత విద్యాసంవత్సరం వరకు 100 మంది విద్యార్థులకు సరిపడా ప్రతి కళాశాల 16 వేల చదరపు అడుగుల స్లాబ్ ఏరియా కలిగి ఉంటే సరిపోయేది.
వారికి బోధించడానికి ఏడుగురు అధ్యాపకులు ఉండాలన్న నిబంధన ఉంది. తాజాగా ఎన్‌సీటీఈ వంద మంది విద్యార్థులకు 21 వేల చదరపు అడుగుల స్లాబ్ ఏరియాతోపాటు 16 మంది ఫుల్ టైం అధ్యాపకులను తప్పనిసరి చేసింది. ఈ నిర్ణయం కళాశాలల యాజమాన్యాలకు శరాఘాతంగా మారింది.
వెయ్యి సీట్లు తగ్గొచ్చు
ఎన్‌సీటీఈ నిబంధన మేరకు అధ్యాపకులను చేర్చుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో వారికి నెలనెలా జీతాలు చెల్లించలేమని యాజమాన్యాలు స్పష్టం చేస్తున్నాయి. పైగా ఫీజు రీయింబర్స్‌మెంట్ కూడా సకాలంలో ప్రభుత్వం నుంచి అందడం లేదు. ఈ నేపథ్యంలో సీట్ల సంఖ్య తగ్గించుకునేందుకు కళాశాలలు వరుస కడుతున్నాయి.
ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పుడున్న 25 వేలల్లో... దాదాపు వెయ్యి సీట్లు తగ్గే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మార్చిన నిబంధనల అమలుకు ఈ ఏడాది మినహాయింపు ఇవ్వాలని కళాశాలల యాజమాన్యాలు కోరుతున్నాయి. ఆర్థిక భారం భరించలేని మరి కొన్ని కళాశాలలు మాత్రం నిర్ద్వందంగా సీట్లు తగ్గించుకుంటున్నాయి.
బీఈడీ సీట్లు మాకొద్దు!
Published Sat, Aug 15 2015 1:56 AM | Last Updated on Sun, Sep 3 2017 7:27 AM
Advertisement
Advertisement