నేటితో ముగియనున్న ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ఆప్షన్లు
ఆఖరి నిమిషం వరకూ కసరత్తు ముఖ్యం.. 19న తొలి విడత సీట్ల కేటాయింపు
71 వేల సీట్లకు 98 వేల మంది పోటీ.. లక్షల్లో ఆప్షన్లు ఇచి్చన విద్యార్థులు
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ తొలి విడత కౌన్సెలింగ్‌లో ఆప్షన్ల ప్రక్రియ సోమవారంతో ముగియనుంది. ఏవైనా మార్పులు చేర్పులకు చివరి అవకాశం ఇదే. కనీ్వనర్ కోటాలో 71వేల సీట్లు ఉండగా, ఇప్పటివరకూ కౌన్సెలింగ్‌కు దాదాపు 98,238 మంది దరఖాస్తు చేశారు. వీరిలో 82 వేల మంది ఆప్షన్లు ఇచ్చారు. గత రెండు రోజుల్లో ధ్రువపత్రాల పరిశీలనకు వెళ్లిన విద్యార్థులు సోమవారం ఆప్షన్లు ఇచ్చే వీలుంది.
మొత్తం మీద 90వేల మందికిపైగా విద్యార్థులు ఆప్షన్లు ఇవ్వొచ్చని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆదివారం సాయంత్రం వరకూ దాదాపు 46 లక్షలకుపైగా ఆప్షన్లు అందినట్టు ఆ వర్గాలు తెలిపాయి. ఒక్కో విద్యార్థి బ్రాంచీలు, కాలేజీలతో వందకుపైగానే ఆప్షన్లు ఇస్తున్నారు. కౌన్సెలింగ్‌కు కొత్తగా సీట్లు వస్తాయని ఆశించినా ప్రభుత్వం అనుమతి ఇచ్చే అవకాశం కని్పంచడం లేదు. తాజాగా జేఎన్‌టీయూహెచ్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ కోర్సులను తగ్గించడానికి తాము అంగీకరించడం లేదని చెప్పారు. దీన్నిబట్టి ఐవోటీ వంటి బ్రాంచీలను రద్దు చేసుకున్న వారికి మాత్రమే అదనపు సీట్లు వస్తాయని భావిస్తున్నారు.
ఇప్పుడే కీలకం
విద్యార్థులు ఆప్షన్లు ఇచ్చేప్పుడు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఆఖరి నిమిషం వరకూ కసరత్తు చేయాలని సూచిస్తున్నారు. తొలి విడత కౌన్సెలింగ్‌లో వచ్చే సీట్లలో ఎక్కువ మంది చేరే అవకాశం ఉంటుంది. కేవలం జేఈఈ టాపర్లు మాత్రమే దూరంగా ఉండే అవకాశం ఉంటుంది. వాళ్లు కూడా ఆఖరి కౌన్సెలింగ్ వరకూ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినా, సీటును రద్దు చేసుకోరు. కాబట్టి మొదటి కౌన్సెలింగ్‌లో కాకపోయినా రెండో విడతలో కోరుకున్న సీటు వస్తుందనే ఆశ సరికాదని చెబుతున్నారు.
చాలామంది తమ ర్యాంకును బట్టి, ఏయే కాలేజీలో ఏయే బ్రాంచీలో సీటొస్తుందో ఓ అంచనాకు రావాల్సి ఉంటుంది. దీని ప్రకారం ప్రాధాన్యత క్రమాన్ని ఎంచుకుంటే బాగుంటుందని సూచిస్తున్నారు. ఉదాహరణకు ఐటీలో తమకు దగ్గర్లోని కాలేజీలో సీటు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ దాన్ని ప్రా«ధాన్యతల్లో చేర్చడం లేదు. దీనివల్ల ఆ సీటు వేరే వాళ్లకు వెళ్తుంది. తర్వాత కౌన్సెలింగ్‌ల్లో కోరుకున్నా సీటు వచ్చే అవకాశం ఉండదు.
కసరత్తు చేయాలి: ఎంఎన్ రావు (గణిత శాస్త్ర నిపుణుడు)
ఆప్షన్లు ఇచ్చేప్పుడు విద్యార్థులు ఆఖరి నిమిషం వరకూ కసరత్తు చేయాలి. అవసరం అనుకుంటే ఆప్షన్లు మార్చుకునే వెసులుబాటు ఉంటుంది. ర్యాంకుకు దగ్గరగా ఉండే కాలేజీలకు ప్రాధాన్యం ఇవ్వడం ముఖ్యం. ఏ ర్యాంకు వరకూ ఫీజు రీయింబర్స్‌మెంట్ వస్తుందనేది పరిశీలించాలి. తొలి విడత ఆప్షన్లు చాలా కీలకమనే విషయాన్ని విద్యార్థులు గుర్తించాలి.
అన్ని వివరాలు పరిశీలించాలి...
గత ఏడాది ప్రతీ కాలేజీలో కటాఫ్ ఏ విధంగా ఉందనే వివరాలను సాంకేతిక విద్య విభాగం వెబ్‌సైట్‌లో ఉంచింది. 2023–24లో 86,671 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో కన్వీనర్ కోటా కింద 70 శాతం భర్తీ చేయాలి. కానీ 81 శాతం మాత్రమే భర్తీ అయ్యాయి. ఈసారి స్లైడింగ్ సీట్లు పెరిగినా 10 వేల సీట్లు అదనంగా వచ్చే వీలుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని గత ఏడాది కన్నా కొంత అటూ ఇటూగా కటాఫ్‌ను అంచనా వేయొచ్చని నిపుణులు అంటున్నారు. బ్రాంచీకి ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటే, కాలేజీ విషయాన్ని రెండో ఐచి్ఛకంగా చూడటం ఉత్తమం. కాలేజీ ప్రాధాన్యత అనుకుంటే ఏ బ్రాంచీలో సీటు వస్తుందనేది అంచనా వేసి ఆప్షన్ పెట్టడం మంచిది. ఆప్షన్లు ఇచ్చేటప్పుడు కాలేజీల ఫీజు, రీయింబర్స్‌మెంట్ వివరాలు, దగ్గర్లో ఉన్న కాలేజీ ఏంటి? అనే వివరాలను పరిశీలించి ఆప్షన్లు ఇవ్వడం మంచిదని నిపుణులు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment