నేడు ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు | Arrangements for MLC Election Counting Completed in Telangana | Sakshi
Sakshi News home page

నేడు ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు

Published Mon, Mar 3 2025 3:44 AM | Last Updated on Mon, Mar 3 2025 3:46 AM

Arrangements for MLC Election Counting Completed in Telangana

సిబ్బందికి అవగాహన కల్పిస్తున్న కలెక్టర్‌ పమేలా సత్పతి

కరీంనగర్, నల్లగొండలో కౌంటింగ్‌కు ఏర్పాట్లు  

సాయంత్రానికి తేలనున్న రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీల ఫలితం 

గ్రాడ్యుయేట్‌ ఫలితానికి రెండు రోజుల సమయం!

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌/నల్లగొండ: ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌కు ఏర్పాటు పూర్తయ్యాయి. ఈ మేరకు కరీంనగర్, నల్లగొండలలో ఓట్ల లెక్కింపునకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఫలితాలు సోమవారం సాయంత్రం లోగా వెల్లడికానున్నాయి. పట్టుభద్రుల ఓట్ల లెక్కింపు ఫలితం రావడానికి రెండు రోజుల సమయం పట్టే అవకాశముంది.  

కరీంనగర్‌–ఆదిలాబాద్‌–నిజామాబాద్‌–మెదక్‌ పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటల నుంచి కరీంనగర్‌ జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్‌ ఇండోర్‌ స్టేడియంలో ప్రారంభం కానుంది. దీనికోసం మొత్తం 35 టేబుళ్లు వినియోగించనున్నారు. ఇందులో 21 పట్టభద్రుల ఓట్ల కోసం, 14 టేబుళ్లు ఉపాధ్యాయుల ఓట్లు కోసం కేటాయించారు. 

ఒక్కో టేబుల్‌ వద్ద నలుగురు సిబ్బంది విధులు నిర్వర్తించనుండగా, ఇందులో ఒక మైక్రో అబ్జర్వర్, ఒక సూపర్‌వైజర్, ఇద్దరు లెక్కింపు అసిస్టెంట్లు ఉన్నారు. వీరందరికీ శనివారం అధికారులు శిక్షణ ఇచ్చారు. లెక్కింపు కోసం మొత్తం 800 మంది సిబ్బందిని వినియోగించనున్నారు. ఇందులో 20 శాతం రిజర్వ్‌ సిబ్బందిని నియమించారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఎన్నికల అధికారులు మాక్‌ కౌంటింగ్‌ చేపట్టారు. 

ఈ మాక్‌ కౌంటింగ్‌లో కలెక్టర్‌ పమేలా సత్పతి, అడిషనల్‌ కలెక్టర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌ కౌంటింగ్‌ సూపర్‌వైజర్లు, సిబ్బందికి ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు విధానం, నిబంధనలు, మార్గదర్శకాలను వివరించారు. గ్రాడ్యుయేట్‌ నియోజకవర్గంలో 3.55 లక్షల ఓట్లు, టీచర్‌ నియోజకవర్గంలో 27,088 ఓట్లు ఉన్నాయి. 

ఈ క్రమంలో టీచర్ల లెక్కింపు సాయంత్రానికి వెలువడే అవకాశాలు ఉండగా.. గ్రాడ్యుయేట్‌ మాత్రం మరునాటికి పూర్తయ్యే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. గ్రాడ్యుయేట్‌ స్థానంలో 56 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా, టీచర్‌ ఎమ్మెల్సీ బరిలో 15 మంది తలపడుతున్నారు.  

వరంగల్‌–ఖమ్మం–నల్లగొండ టీచర్‌ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపునకు నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలోని ఆర్జాలబావి సమీపంలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాములో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 19 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా, 24,139 మంది ఓట్లు పోలయ్యాయి.   

నేటి నుంచి ఎమ్మెల్సీ నామినేషన్ల స్వీకరణ 
ఎమ్మెల్యే కోటాలో ఐదు స్థానాలకు ఏర్పాట్లు చేసిన అసెంబ్లీ వర్గాలు
సాక్షి, హైదరాబాద్‌: ఎమ్మెల్యే కోటాలో ఐదు ఎమ్మె ల్సీ స్థానాలకు నేటి నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. గత నెల 24వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్‌ ప్రకారం సోమవా రం నోటిఫికేషన్‌ జారీ కానుంది. ఈ నోటిఫికేషన్‌ ప్రకారం ఈనెల 10వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. దీనికోసం అసెంబ్లీ వర్గాలు అన్ని ఏర్పాట్లు చేశాయి. ఈనెల 11వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 

13వ తేదీ వరకు ఉపసంహరణకు అవకాశముంటుంది. పోలింగ్‌ ఈనెల 20వ తేదీన ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది. వెంటనే కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఎమ్మెల్సీలుగా ఉన్న సత్యవతి రాథోడ్, మహమూద్‌ అలీ, శేరి సుభాశ్‌రెడ్డి, ఎగ్గె మల్లేశం, మీర్జా రియాజుల్‌ హసన్‌ల పదవీకాలం మార్చినెలాఖరుతో ముగియనుంది. 

శాసనసభలో పార్టీల బలాబలాల ప్రకారం మూడు స్థానాలు కాంగ్రెస్‌ పార్టీకి, ఒకటి బీఆర్‌ఎస్‌కు దక్కనున్నాయి. మరో స్థానం ఎవరికి వస్తుందన్న దాని పై స్పష్టత లేదు. అయితే, కాంగ్రెస్‌ నాలుగు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను నిలపాలని యోచిస్తోంది. ఈ నాలుగింటిలో ఒకటి తమకివ్వాలని ఎంఐఎం అడుగుతోంది. ఈ నేపథ్యంలో త్వరలోనే కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయం తీసుకోనుంది. ఇక, బీఆర్‌ఎస్‌ నుంచి ఎవరిని బరిలో నిలపాలన్న దానిపై ఆ పార్టీ వర్గాలు ఇంకా కసరత్తు చేస్తున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement