వరంగల్ లోక్‌సభ ఎన్నికల ఓట్ల కౌంటింగ్‌కు గడువు
ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ముగియడంతో అందరి చూపు అటువైపే
లెక్కింపునకు ఏర్పాట్లు చేస్తున్న అధికారులు
స్ట్రాంగ్ రూంలను సందర్శిస్తున్న కలెక్టర్ ప్రావీణ్య, సీపీ అంబర్‌కిషోర్‌ఝా
సాక్షి, వరంగల్: వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ముగియడంతో ఇప్పుడు అందరితోపాటు అధికారుల చూపు లోక్‌సభ ఎన్నికల ఫలితాల వైపు మళ్లింది. వరంగల్ ఏనుమాముల మార్కెట్‌యార్డులోని 17, 18, 19 నంబర్ల గోడౌన్ల స్ట్రాంగ్ రూంలలో భద్రపరిచిన ఈవీఎంలో నిక్షిప్తమైన వరంగల్ ఎంపీ అభ్యర్థుల భవితవ్యం మరో ఆరు రోజుల్లో తేలనుంది. ఈ కౌంటింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏం పనులు చేయాలి, రోజువారీగా ఏఏ అంశాలపై సమీక్షలు నిర్వహించాలనే దానిపై రిటర్నింగ్ అధికారులు సిద్ధమయ్యారు.
ఈవీఎంలలో ఓట్లు, పోస్టల్ బ్యాలెట్లలో ఓట్లను కంప్యూటర్లలో ఎలా నమోదు చేయాలో సిబ్బందికి వివరించారు. అదేసమయంలో స్ట్రాంగ్ రూంల వద్ద మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటుచేసి పర్యవేక్షిస్తున్నారు. సాయుధ బలగాల పహారాతో పాటు పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే 144 సెక్షన్ విధించారు. తరచూ కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి పి.ప్రావీణ్యతో పాటు వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్‌కిషోర్‌ఝా స్ట్రాంగ్ రూంలను సందర్శిస్తున్నారు. ఎన్నికల సిబ్బంది, భద్రతా సిబ్బందికి దిశానిర్దేశం చేస్తున్నారు.
కౌంటింగ్ సజావుగా సాగేలా..
న్యూఢిల్లీ నుంచి భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్‌కుమార్, ఎన్నికల కమిషనర్లు జ్ఞానేశ్‌కుమార్, డాక్టర్ సుక్‌భీర్‌సింగ్‌సంధుతో కలిసి ఎన్నికల కౌంటింగ్ నిర్వహణ, సన్నద్ధతపై సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వారి ఆదేశాలకు అనుగుణంగా కలెక్టర్ ప్రావీణ్య ఏర్పాట్లు చేస్తున్నారు. జూన్ 4న పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు ప్రకటించే కౌంటింగ్ ప్రక్రియ ఏర్పాట్లపై దృష్టి సారించారు. కౌంటింగ్ కేంద్రం వద్ద పటిష్ట భద్రతతోపాటు కౌంటింగ్ కేంద్రంలో ఫలితాలు వెల్లడించేందుకు మీడియాకు ప్రత్యేక పాయింట్ ఏర్పాటు చేయాలని కిందిస్థాయి సిబ్బందిని ఆదేశించారు.
కౌంటింగ్ కేంద్రం వద్ద ఇంటర్నెట్ కనెక్షన్, ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌కు ప్రత్యేక కౌంటింగ్‌హాల్ ఉండేలా ఏర్పాట్లు ఉండాలని ఎన్నికల సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. స్ట్రాంగ్‌రూం నుంచి కౌంటింగ్‌హాల్‌కు ఈవీఎంల తరలింపునకు అవసరమైన మేర సిబ్బంది ఉండేలా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. కౌంటింగ్ విధులు నిర్వర్తించే సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నారు. ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్న దష్ట్యా ఉదయం 6 గంటలకే టేబుళ్లు సిద్ధంగా ఉంచాలని సూచించారు.
పోలింగ్ శాతం ఆధారంగా ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 28 టేబుళ్లు, కనిష్టంగా 14 టేబుళ్లను ఏర్పాటుచేశారు. పోలైన ఓట్లు, ఈవీఎంల ఆధారంగా టేబుళ్ల సంఖ్య పెంచనున్నారు. వరంగల్ పార్లమెంట్ స్థానం పరిధిలో వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, స్టేషన్‌ఘన్‌పూర్, పాలకుర్తి, పరకాల, భూపాలపల్లి, వర్ధన్నపేట నియోజకవర్గాలు ఉన్నాయి.
కౌంటింగ్‌కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు..
ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రావీణ్య
కాళోజీ సెంటర్: వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం ఎన్నికల ఓట్ల లెక్కింపు నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు ఎన్నికల అధికారి, కలెక్టర్ పి.ప్రావీణ్య తెలిపారు. కౌంటింగ్ నిర్వహణపై హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ రిటర్నింగ్ అధికారులు, జిల్లా ఎన్నికల అధికారులతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీపీ అంబర్ కిషోర్ ఝా, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్వినితానాజీ వాకడే, అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొని మాట్లాడారు.
ఏనుమాముల మార్కెట్ యార్డులో నిర్వహించే వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్ల కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత, ఫలితాలు వెల్లడించేందుకు మీడియాకు ప్రత్యేక పాయింట్ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతీ కౌంటింగ్ హాల్‌లో అవసరమైన మేరకు టేబుళ్లు, సిబ్బందిని నియమించనున్నట్లు వివరించారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు.
జూన్ 4న ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభమతుందని, అనంతరం ఈవీఎంలలోని ఓట్లు లెక్కించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ సూచించారు. ఎన్నికల ఫలి తాలు ప్రకటించిన తర్వాత శాంతిభద్రతల పరిరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. సమావేశంలో ఆర్డీఓ, ఎన్నికల నోడల్ అధి కారులు, కలెక్టరేట్ పర్యవేక్షకులు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్ ప్రావీణ్య, సీపీ అంబర్ కిషోర్ ఝా
అభ్యర్థుల్లో గుబులు..
ఈ నెల 13న ఎన్నికలు ముగిసినా ఎంపీ అభ్యర్థుల్లో మాత్రం లోలోన గుబులు ఉంది. పైకి గెలుస్తామని అందరూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా రోజుకో యుగంలా ఫీలవుతున్నారు. మధ్యలో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక వచ్చేసరికి కాస్త మనస్సు అటువైపు మళ్లింది. సోమవారం ఆ ఎన్నిక కూడా ముగియడంతో తమ భవితవ్యం ఏమిటి అనే దిశగా ఆలోచన చేస్తున్నారు.
ఒత్తిడి నుంచి బయటపడేందుకు కుటుంబ సభ్యులతో కలిసి కాలక్షేపం చేస్తున్నారు. అయినా ఫలితం ఎలా ఉంటుందనేది మాత్రం వారిని వెంటాడుతూనే ఉంది. ఇంకోవైపు ఆయా స్ట్రాంగ్ రూంల వద్ద తమకు నమ్మకమైన అనుచరులను పంపించారు. సీసీటీవీ కెమెరాల ద్వారా అక్కడి దృశ్యాలను తిలకిస్తూ షిఫ్ట్‌ల వారీగా అక్కడే ఉంటున్నారు. ఏదేమైనా మరో ఆరు రోజుల్లో వీరి భవితవ్యం తేలనుంది.
Comments
Please login to add a commentAdd a comment