చంద్రబాబును అరెస్టు చేయాలి
* వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి అంబటి డిమాండ్
* చంద్రబాబును ఏ1 నిందితుడిగా పరిగణించాలి
సాక్షి , హైదరాబాద్: తెలంగాణలో నామినేటెడ్ ఎమ్మెల్యేను ప్రలోభ పెట్టిన వ్యవహారంలో సూత్రధారి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే కాబట్టి ఆయన్ను ప్రథమ నిందితునిగా అరెస్టు చేయాలని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. సోమవారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ, ఎమ్మెల్యే కొనుగోలులో రేవంత్‌రెడ్డి కేవలం పాత్రధారేనని ఆయన ‘బాస్’ చంద్రబాబే తెరవెనుక కథ నడిపించారన్నారు.
ఏసీబీ ఇందులో రేవంత్‌రెడ్డిని ఏ1గా చే సింది కానీ, అసలు ఏ1గా చేయాల్సింది చంద్రబాబునని రాంబాబు అన్నారు. అధికారాన్ని నిలుపుకోవడం కోసం, ఎన్నికల్లో గెలవడం కోసం చంద్రబాబు ఎంత నీచానికైనా దిగజారతాడని చెప్పడానికి ఆదివారం జరిగిన వ్యవహారం నిదర్శనమన్నారు.
లంచాల డబ్బు ఎక్కడిది?
ఎమ్మెల్యేలకు లంచాలు ఇవ్వడానికి అన్ని కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి? పట్టిసీమ ప్రాజెక్టు ముడుపులా? లేక తుళ్లూరులో రైతుల నుంచి బలవంతంగా లాక్కున్న భూములను సింగపూర్ సంస్థలకు ఇస్తే వచ్చాయా? అని రాంబాబు ప్రశ్నించారు. ఇటీవలి మహానాడులో ఎమ్మెల్యేలను పశువుల్లా కొంటున్నారని ఇతర పార్టీలను నిందించి తనను తాను నీతిమంతుడిగా కీర్తించుకున్న చంద్రబాబు నిజస్వరూపం ఎలాంటిదో 30 ఏళ్ల లోపు యువ ఓటర్లు గ్రహించాలని రాంబాబు అన్నారు. ఎందుకంటే వారికి ఆయనెలాంటి వాడనేది సరిగ్గా తెలియదని చెప్పారు.
అవినీతి ప్రతిపక్షంతో పోరాడాలంటేనే సిగ్గుగా ఉందని చంద్రబాబు చెప్పడాన్ని అంబటి ఎద్దేవా చేశారు. ‘మీరెంత నీతిమంతులో ఎమ్మెల్యేను ప్రలోభ పెట్టిన వ్యవహారంలోనే తెలుస్తోంది. మీరు చెప్పేవన్నీ శ్రీరంగనీతులు’ అంటూ చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్న ఆంధ్రాలో చంద్రబాబు దోచుకున్న డబ్బును తెలంగాణలో పంచుతున్నారని విమర్శించారు.
‘వీడియో దృశ్యాలు నిజం కాక పోతే కాదని టీడీపీ నేతలు చెప్పమనండి!’ అని సవాలు విసిరారు. ఎమ్మెల్యేకు డబ్బు ఇస్తున్న సందర్భంగా ‘బాస్’ ఆదేశిస్తేనే వచ్చానని రేవంత్ పదే పదే చెప్పారని ఆ బాస్ ఎవరో ఏసీబీ దర్యాప్తు చేయాలన్నారు. సంఘటన జరిగి 24 గంటలు కావస్తున్నా చంద్రబాబు ఇంత వరకూ ఎందుకు మాట్లాడ లేదని అంబటి ప్రశ్నించారు.