ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్
హైదరాబాద్: తెలంగాణలో స్థానిక సంస్థల కోటా కింద ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ముగిసింది. హైదరాబాద్ మినహా 9 జిల్లాల్లో 12 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. వీటిలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలు టిఆర్ఎస్ పార్టీ ఏకగ్రీవంగా కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. మిగిలిన ఆరు స్థానాలకు ఆదివారం పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని ఎన్నికల కమిషనర్ భన్వర్ లాల్ తెలిపారు. రంగారెడ్డి 99.7, మహబూబ్ నగర్ 99.7, నల్గొండ 97, ఖమ్మం 95 శాతం పోలింగ్ నమోదైందని ఆయన తెలిపారు.
ఎవరి ధీమాలో వారు
స్థానిక సంస్థల్లో తమకున్న ఓట్ల సంఖ్యను బట్టి పోటీలో ఉన్న ఆయా పార్టీల అభ్యర్ధులు తమ విజయంపై ఎవరికీ వారు గట్టి నమ్మకంతో ఉన్నారు. కాంగ్రెస్, టీడీపీల నుంచి టీఆర్‌ఎస్‌లోకి వలసలు జోరుగా సాగాయి. దీంతో ఆయా పార్టీలకు ఉన్న వాస్తవ ఓట్ల సంఖ్యలో భారీగా తేడాలు వచ్చాయి. దీంతో రెండేసీ స్థానాలున్న మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో కాంగ్రెస్, టీడీపీలు ఒక్కో జిల్లాలో ఒక్కో స్థానంలో పోటీ చేసి పరస్పర సహకారంపై అంగీకారానికి వచ్చాయి.
కాగా, నల్లగొండలో మాత్రం కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లు ఢీ అంటే ఢీ అన్నాయి. చివరకు పోలింగ్ ముగిశాక ఏ పార్టీకి ఆ పార్టీ సొంత అంచనాల్లో మునిగిపోయాయి. గెలుపు తమదే అంటూ లెక్కలు చెబుతున్నాయి. డబ్బులు ప్రధాన పాత్ర పోషించిన స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయా పార్టీలకు క్రాస్ ఓటింగ్ భయమూ వెంటాడుతోంది. నల్లగొండ జిల్లాలో పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారినట్లు ప్రచారం జరుగుతోంది. ఓటర్లకు డబ్బులు పంపిణీ చేసే వ్యవహారంలో తమ పార్టీకి చెందిన ఓటర్ల కంటే ఇతర పార్టీల వారికే టీఆర్‌ఎస్ ప్రాధాన్యం ఇచ్చిందని, దీంతో టీఆర్‌ఎస్‌కు చెందిన కొందరు ఓటర్లు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమైంది.
ఈనెల 30 ఫలితాలు
స్థానిక ఎమ్మెల్సీ ఫలితాలపై ఇప్పటికే ఆయా పార్టీలకు ఓ అంచనాకు వచ్చాయి. కాగా, 30వ తేదీన ఆరు స్థానాల ఓట్ల లెక్కింపు జరగనుంది. నాలుగు జిల్లాల్లో ఆరు స్థానాల పరిధిలోని 3893 ఓట్లకు గాను 3817 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా 98శాతం పోలింగ్ జరిగింది.
పోలింగ్ జరిగిన స్థానాల వివరాలు
మహబూబ్ నగర్ - 2
రంగారెడ్డి - 2
ఖమ్మం - 1
నల్గొండ - 1