ఉపాధ్యాయ విద్యలో కొత్త డిప్లొమాలొద్దు
- ఎన్‌సీటీఈకి రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ లేఖ
- కోర్సులకు మార్గదర్శకాల రూపకల్పన పూర్తికాలేదని వెల్లడి
- రెండేళ్లపాటు నోటిఫికేషన్ ఇవ్వొద్దని విజ్ఞప్తి
- సానుకూలంగా స్పందించిన ఎన్‌సీటీఈ
- 2016-17 వరకూ ఆ కోర్సులపై నిషేధం విధిస్తూ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ విద్యలో సంస్కరణల్లో భాగంగా జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్‌సీటీఈ) 2015-16 విద్యా సంవ త్సరం నుంచి ప్రారంభించేందుకు ప్రవేశపెట్టిన కొత్త డిప్లొమా కోర్సులు రెండేళ్ల వరకు రాష్ట్రంలో అమల్లోకి రావు. ఆయా కోర్సుల ప్రారంభానికి సంబంధించిన మార్గదర్శకాల రూపకల్పన ఇంకా పూర్తి కానందున వాటి అమలుకు నోటిఫికేషన్ ఇవ్వొద్దంటూ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఇటీవల ఎన్‌సీటీఈలకు లేఖలు రాసింది. మార్గదర్శకాల రూపకల్పన పూర్తయ్యేందుకు ఇంకా సమయం పడుతుందని పేర్కొంది.
ముఖ్యంగా డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (ఓపెన్ డిస్టెన్స్ లర్నింగ్), డిప్లొమా ఇన్ ఫైన్ ఆర్ట్స్, డిప్లొమా ఇన్ విజువల్ ఆర్ట్స్, డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (డీపీఈడీ) వంటి రెండేళ్ల కాలవ్యవధిగల కోర్సుల ప్రారంభానికి నోటిఫికేషన్ ఇవ్వొద్దని పేర్కొంది. అప్పటివరకు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఎల్‌ఈడీ) కోర్సునే కొనసాగిస్తామని వివరించింది. మిగితా కోర్సులపై నిషేధం విధించాలని కోరింది. ఇందుకు అంగీకరించిన ఎన్‌సీటీఈ 2016-17 వరకూ ఆ కోర్సులపై నిషేధం విధిస్తూ నోటీసులు జారీ చేసింది.
కోర్సులు వద్దనడానికి కారణాలు...
కొత్త డిప్లొమా కోర్సులను విద్యాశాఖ వ్యతిరేకించడానికి కారణాలు ఏమిటంటే... ముందుగా ఏ కోర్సులో చేరితే ఏ ఉద్యోగానికి అర్హులన్నది రాష్ట్ర ప్రభుత్వం తేల్చాల్సి ఉండటం. ఉదాహరణకు రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో ఇంతవరకు ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ విధానమే లేదు. ఆ కోర్సును ప్రారంభిస్తే వారికి భవిష్యత్తులో అవకాశాలు ఏంటనేది సర్కారు నిర్ణయించాలి. కేజీ టు పీజీలో ఆ కోర్సుల అవసరంపై ప్రభుత్వ స్థాయిలో నిర్ణయం జరగాలి. డిప్లొమా ఇన్ ఆర్ట్, డిప్లొమా ఇన్ విజువల్ ఆర్ట్ వంటి కోర్సులు చేస్తే ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉంటాయనేది తేల్చాలి. ఇప్పటికే క్రాఫ్ట్, డ్రాయింగ్ టీచర్ల భర్తీని నిలిపేసిన ప్రభుత్వం భవిష్యత్తులో వాటిని భర్తీ చేస్తుందో లేదో స్పష్టం చేయాలి. అలాగే డిస్టెన్స్ విధానంలో డిప్లొమా కోర్సును అనుమతిస్తుందో లేదో పేర్కొనాలి.
బ్యాచిలర్ కోర్సులపై దృష్టి లేదు..
బ్యాచిలర్ డిగ్రీలో కొత్తగా ప్రవేశపెట్టిన వివిధ కోర్సులకు సంబంధించిన అంశాలపై రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఇంతవరకు దృష్టి సారించలేదు. వాటికి సంబంధించిన విధి విధానాల రూపకల్పన, ఆయా కోర్సులను 2015-16 విద్యా సంవత్సరంలో ప్రారంభిస్తారా? లేదా అన్న అంశాలపై యూనివర్సిటీలు, ఉన్నత విద్యా మండలి పట్టించుకోకపోవడంతో గందరగోళం నెలకొంది. ఎన్‌సీటీఈ ఆదేశాల మేరకు బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్), మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (ఎంఎడ్) కోర్సులను రెండేళ్లు చేయాలన్న నిబంధ నను, బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (బీపీఎడ్) కోర్సును కొనసాగించే నిబంధనల అమలుకు విద్యా మండలి చర్యలు చేపట్టింది. వాటికి సంబంధించిన ప్రవేశాలు చేపట్టేందుకు వీలుగా నోటిఫికేషన్ల జారీకి చర్యలు చేపట్టింది.
ప్రారంభిస్తారా.. లేదా.. తేల్చని కోర్సులు
బీఈఎల్‌ఈడీ: బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. నాలుగేళ్ల ప్రొఫెషనల్ డిగ్రీ.
బీఎస్సీ-బీఎడ్/బీఏ-బీఎడ్: నాలుగేళ్ల కోర్సు
ఇంటిగ్రేటెడ్ బీఎడ్‌ఎంఎడ్: మూడేళ్ల కోర్సు.
బీఎడ్ పార్ట్ టైం: మూడేళ్ల కోర్సు.
డిస్టెన్స్ బీఎడ్: రెండేళ్ల కోర్సు.
యూజీ డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్: ఏడాది కోర్సు
కాలపరిమితి పెంపు కోర్సులు
డీఈఎల్‌ఈడీ: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. రెండేళ్ల కోర్సు.
బీఎడ్: ఏడాది కోర్సుగా ఉన్న బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇకపై రెండేళ్ల కోర్సు.
ఎంఎడ్: ఏడాది మాత్రమే ఉన్న మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్‌ను ఇకపై రెండేళ్ల కోర్సు.
బీపీఈడీ: ఏడాది మాత్రమే ఉన్న బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇకపై రెండేళ్ల కోర్సు.
ఎంపీఈడీ: ఏడాది కోర్సుగానే ఉన్న మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇకపై రెండేళ్ల కోర్సు.