బీఈడీ రెండో దశ కౌన్సెలింగ్ లేనట్టే
- హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంతో ప్రవేశాలు కష్టమే
- 8 వేల మంది విద్యార్థులకు తప్పని నిరాశ
సాక్షి, హైదరాబాద్: బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఈడీ) కోర్సులో ప్రవేశాల కోసం ఎడ్‌సెట్–2016 రెండో దశ కౌన్సెలింగ్‌ను నిర్వహించాల్సిందేనన్న హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంతో రాష్ట్రంలోని బీఈడీ కాలేజీల్లో రెండో దశ ప్రవేశాలు చేపట్టే అవకాశం లేకుండాపోయింది. దీంతో బీఎడ్‌లో చేరాలనుకుంటున్న దాదాపు 8 వేల మంది విద్యా ర్థుల ఆశ నిరాశగానే మిగిలిపోయే పరిస్థితి నెలకొంది. 2016–17 విద్యా సంవత్సరంలో బీఈడీలో ప్రవేశాల కోసం గత జూన్‌లో నిర్వ హించిన ఎడ్‌సెట్ రాసేం దుకు 44,485 మంది దర ఖాస్తు చేసుకోగా అందులో 40,826 మంది అర్హత సాధించారు.
వారికి గతే డాది సెప్టెంబర్ 8 నుంచి 11 వరకు వెబ్ ఆప్షన్లకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. అందులో 21,883 మంది ఆప్షన్లు ఇచ్చుకోగా అదే నెల 14న సీట్ల కేటా యింపు పూర్తయింది. రాష్ట్రంలోని 184 బీఈడీ కాలేజీల్లో కన్వీనర్ కోటా కింద 12,532 సీట్లుండగా అందులో 9,887 మందికి సీట్లు లభించాయి. అయితే కోరుకున్న కాలేజీల్లో సీట్లు దొరక్కపోవడంతో 5,131 మంది విద్యార్థులు కాలేజీల్లో చేరలేదు. మిగిలిన 4,756 మంది విద్యార్థులు మాత్రమే కాలేజీల్లో చేరారు. దీంతో మిగిలిన సీట్లకు ఆ తరువాత రెండో దశ కౌన్సెలింగ్ నిర్వహించాల్సి ఉంది.
అదే సమయంలో మరో 11 కొత్త కాలేజీలకు జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్‌సీటీఈ) అనుమతి ఇవ్వడం వల్ల వాటిల్లోని సీట్లతోపాటు పాత కాలేజీల్లోని మిగిలిన సీట్లు కలుపుకొని 7,958 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. కానీ ప్రభుత్వం మాత్రం మిగిలిపోయిన సీట్లకు రెండో దశ కౌన్సెలింగ్ చేపట్టేందుకు నిరాకరించడంతో కొందరు విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు. నిబంధనల ప్రకారం రెండో దశ కౌన్సెలింగ్ నిర్వహించాలని హైకోర్టు గత నెలలో ఆదేశించగా ఈ ఉత్తర్వులను సవాల్‌చేస్తూ ఉన్నత విద్యాశాఖ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు తాజాగా స్టే విధించింది.