Bachelor of Education
-
డిగ్రీ కాలేజీలు, వర్సిటీల్లోనే నాలుగేళ్ల బీఎడ్
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ విద్యలో అనేక సంస్కరణలు తీసుకువస్తున్న జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్) కోర్సును ప్రవేశ పెట్టేందుకు చర్యలు చేపట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బెస్ట్ ప్రాక్టీసెస్‌ను పరిగణనలోకి తీసుకొని దేశంలో ఇంటిగ్రేటెడ్ కోర్సులను ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా రెండు కొత్త కోర్సులను 2020–21 విద్యాసంవత్సరం నుంచి అమల్లోకి తేవాలని భావిస్తోంది. అందులో నాలుగేళ్ల బీఎడ్ కోర్సును, సైన్స్, హ్యుమానిటీస్‌లో డిగ్రీ కోర్సును ప్రవేశపెట్టేందుకు వివిధ రాష్ట్రాల అభిప్రాయాలను స్వీకరిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోనూ ఆ కోర్సులను నిర్వహిస్తారా? లేదా? అన్నదానిపై రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయం తెలియజేయాలని ఎన్సీటీఈ కోరింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషికి ఎన్సీటీఈ చైర్పర్సన్ డాక్టర్ సత్బిర్ బేడీ లేఖ రాశారు. ఈనెల 16వ తేదీలోగా రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని తెలియజేయాలని అందులో కోరారు. దీంతో ఆ దిశగా ఉన్నత విద్యా శాఖ కసరత్తు ప్రారంభించింది. ఈనెల 15వ తేదీన ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి తమ అభిప్రాయాన్ని తెలియజేయాలన్న నిర్ణయానికి వచ్చింది. ఇప్పటికే అధికంగా కాలేజీలు.. రాష్ట్రంలో ఉపాధ్యాయ విద్యా కళాశాలలు ఇప్పటికే అధికంగా ఉన్నాయని, కొత్తగా కాలేజీలకు అనుమతులు ఇవ్వవద్దని రాష్ట్ర ప్రభుత్వం 2015లోనే ఎన్‌సీటీఈకి తెలియజేసింది. రాష్ట్రంలో దాదాపు 6 లక్షల మంది బీఎడ్, డీఎడ్ వంటి ఉపాధ్యాయ విద్యా కోర్సులు పూర్తి చేసిన నిరుద్యోగులు ఉన్నారని, కొత్త కాలేజీల నుంచి వచ్చే వారితో నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోతుందని పేర్కొంది. అంతేకాదు రాష్ట్రానికి కావాల్సిన మేరకు శిక్షణ పూర్తి చేసిన వారు ఉన్నారని, అయితే ఇకపై నాణ్యత ప్రమాణాలపై దృష్టి సారించాల్సి ఉన్నందున కొత్త కాలేజీలకు అనుమతులు ఇవ్వవద్దని అప్పట్లో లేఖ రాశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఈ కొత్త కోర్సులకు అనుమతి ఇవ్వాలా? వద్దా? వాటిని నిర్వహిస్తామంటూ దరఖాస్తు చేసుకునే కాలేజీల నుంచి దరఖాస్తులను స్వీకరించాలా? వద్దా? అన్న దానిపై స్పష్టత ఇవ్వాలని కోరింది. యూనివర్సిటీలు, డిగ్రీ కాలేజీల్లోనే.. ఉపాధ్యాయ విద్యా బోధనలో నాలుగేళ్ల బీఎడ్ ద్వారా మెరుగైన శిక్షణ, నాణ్యమైన విద్యా బోధనకు చర్యలు చేపట్టవచ్చన్న ఆలోచనతో వీటిని ప్రవేశ పెట్టేందుకు ఎన్సీటీఈ చర్యలు చేపట్టింది. వాటికోసం కొత్తగా కాలేజీలు ఏర్పాటు చేస్తామంటే ఇవ్వమని పేర్కొంది. -
చేతిలో బీఈడీ.. చెల్లని పట్టా
అశోక్... టీచర్ కొలువు సాధించాలన్న పట్టుదలతో బీఈడీ చేశాడు. కానీ డిగ్రీలో నిర్ణీత మార్కులు(50%) ఉండాలన్న నిబంధనతో టీచర్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అర్హతను కోల్పోయాడు. చేసేదిలేక నిరాశలో కూరుకుపోయి తన బీఎడ్ సర్టిఫికెట్‌ను ఫేస్బుక్లో ఇలా అమ్మకానికి పెట్టాడు. స్వాతి.. టీచర్ కావాలన్న ఆశతో అప్పులు చేసి మరీ నాలుగేళ్లుగా హైదరాబాద్‌లో శిక్షణ తీసుకుంది. ఈమెది అదే సమస్య. డిగ్రీలో నిర్ణీత మార్కులు లేకపోవడంతో దరఖాస్తుకు కూడా దూరమైంది. తీవ్ర ఆవేదనతో ఊరెళ్లిపోయింది. సాక్షి, హైదరాబాద్ : ..ఇలా బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్) చేసి, ఉపాధ్యాయ అర్హత పరీక్షలో (టెట్) అర్హత సాధించిన వేలాది మంది అభ్యర్థులు ఇంటిబాట పట్టారు!! ఉద్యోగం మాట దేవుడెరుగు.. కనీసం టీచర్ పోస్టు కోసం దర ఖాస్తు చేసుకునే అవకాశం కూడా లేక కన్నీళ్ల పర్యంతం అవుతున్నారు. హైదరాబాద్‌కు వచ్చి కోచింగ్‌లు తీసుకున్నవారంతా ప్రస్తుత నిబంధనలతో ఆవేదన చెందుతున్నారు. 8,792 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకునే వీల్లేకుండా చేసి తమను విద్యాశాఖ రోడ్డు పాల్జేసిందని వాపోతున్నారు. రాష్ట్రంలో బీఎడ్ పూర్తి చేసినవారు 3.5 లక్షల మంది ఉంటే.. అందులో వేలాది మంది ఇలా టీచర్ పోస్టులకు అర్హత లేక ఆందోళన చెందుతున్నారు. 2012 తర్వాత ఇన్నాళ్లకు ఇచ్చిన అవకాశాన్ని నిబంధనల పేరిట దూరం చేస్తున్నారని అభ్యర్థులు వాపోతున్నారు. విద్యాశాఖ నిబంధనలివీ.. ఆరు నుంచి పదో తరగతి వరకు బోధించే ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే జనరల్ అభ్యర్థి బీఎడ్ చేసి, టెట్‌లో అర్హత సాధించి ఉండాలి. డిగ్రీలో 50% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాల్సిందే. బీసీ, ఎస్సీ, ఎస్టీలైతే డిగ్రీలో 45% మార్కులు సాధించాలి. అలా ఉంటేనే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. విద్యాశాఖ రూపొందించిన ఈ నిబంధనలు అభ్యర్థుల పాలిట శాపంగా మారాయి. జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) నిబంధనల మేరకే ఈ రూల్స్ రూపొందించామని చెబుతున్న విద్యాశాఖ.. అవే ఎన్సీటీఈ నిబంధనల్లో ఇతర అంశాలను విస్మరించింది. ఎన్సీటీఈ ఏం చెబుతోంది..? ఉపాధ్యాయులకు ఉండాల్సిన కనీస అర్హతలను ఎన్సీటీఈ నిర్ణయిస్తుంది. 2001, 2002, 2007, 2010, 2014లో అర్హతలను ప్రకటించింది. 2014లో ప్రకటించిన తాజా మార్గదర్శకాల ప్రకారం.. ఎస్జీటీ పోస్టులకు (1 నుంచి 5 వరకు బోధించేవారు) జనరల్ అభ్యర్థులు ఇంటర్లో 50% (ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 45 %) మార్కులుండాలి. డీఎడ్ చేసి ఉండాలి. టెట్‌లో అర్హత సాధించాలి. లేదా డీఎడ్‌లో చేరేందుకు 2002, 2007లో జారీ చేసిన ఎన్సీటీఈ నిబంధనల ప్రకారం.. ఇంటర్లో జనరల్ అభ్యర్థులకు 45% మార్కులున్నా సరిపోతుంది. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 40 శాతం మార్కులున్నా చాలు. వాటితోపాటు డీఎడ్ చేసి ఉండాలి. టెట్‌లో అర్హత సాధించి ఉండాలి. 6,7,8,9,10 తరగతులకు బోధించే స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే జనరల్ అభ్యర్థులకు డిగ్రీ/పీజీలో 50 శాతం(ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 45 శాతం) మార్కులు ఉండాలి. అలాగే బీఎడ్‌తోపాటు టెట్‌లో అర్హత సాధించి ఉండాలి. లేదా బీఎడ్‌లో చేరేందుకు 2002, 2007లో ఎన్సీటీఈ జారీ చేసిన నిబంధనల ప్రకారం.. డిగ్రీలో జనరల్ అభ్యర్థులకు 45% మార్కులుంటే చాళు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 40% మార్కులున్నా చాలు. లేదా 6,7,8 క్లాసుల టీచర్లకు రెండేళ్ల బీఎడ్‌తోపాటు డిగ్రీలో నిర్ణీత మార్కులు సాధించి ఉండాలి. నిబంధనలు బేఖాతరు 2014 నవంబర్ 12న ఎన్సీటీఈ జారీ చేసిన ‘ఎన్సీటీఈ (డిటర్మినేషన్ ఆఫ్ మినిమమ్ క్వాలిఫికేషన్ ఫర్ పర్సన్స్ టు బి రిక్రూటెడ్ యాజ్ ఎడ్యుకేషన్ టీచర్స్) రెగ్యులేషన్స్‌లోని అన్ని నిబంధనలను పరిగణన లోకి తీసుకోకుండానే విద్యాశాఖ అర్హతలను నిర్ణయించింది. దీంతో చాలామంది టీచరు పోస్టులకు అనర్హులవుతున్నారు. డిగ్రీలో 50% మార్కులు (ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 45 శాతం) లేవన్న సాకుతో వేల మంది అభ్యర్థులకు అర్హత లేకుండా పోయింది. డిగ్రీ చదివి, రెండేళ్ల డీఎడ్ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులు 6, 7, 8 తరగతులకు బోధించే అవకాశం కల్పించాలని ఎన్సీటీఈ నిబంధనలు న్నాయి. కానీ 6, 7, 8 తరగతులకు బోధించే టీచర్ల విషయంలో డిగ్రీ, డీఎడ్ వారికి విద్యాశాఖ అవకాశం ఇవ్వలేదు. పీజీలో 50% మార్కులు వచ్చినా దరఖాస్తుకు అవకాశం ఇవ్వడం లేదు. ఈ ప్రశ్నలకు బదులేదీ? ఎన్సీటీఈ జారీ చేసిన నిబంధనల్లో డిగ్రీలో 50 శాతం మార్కులు ఉండాలని పేర్కొన్న నిబంధన ఇప్పుడు కొత్తగా తెచ్చిందేమీ కాదు. 2010 ఆగస్టు 23న జారీ చేసిన ఎన్సీటీఈ మార్గదర్శకాల్లోనూ ఉంది. అలాగే 45 శాతం మార్కుల నిబంధన కూడా ఉంది. 2002లో జారీ చేసిన ఎన్సీటీఈ నిబంధనలు వర్తిస్తాయని పేర్కొంది. అంటే 2002 నుంచి 50 శాతం మార్కుల నిబంధన ఉందని అనుకుందాం.. మరి అప్పుడే అభ్యర్థులు బీఎడ్‌లో చేరేప్పుడు 50 శాతం మార్కులు లేవు కాబట్టి మీకు ప్రవేశం కల్పించబోమని విద్యాశాఖ ఎందుకు ప్రకటించలేదు. పైగా 50 శాతం మార్కులు లేకుండానే బీఎడ్ పూర్తి చేసిన వారికి 2010లో టెట్ అమల్లోకి వచ్చాక టెట్‌కు హాజరయ్యేందుకు ఎందుకు అనుమతి ఇచ్చారు? అన్నది అధికారులే చెప్పాలి. డిగ్రీ లేదా పీజీలో 50 శాతం మార్కులున్నా సరిపోతుందన్నారు. నిబంధనల ప్రకారం డిగ్రీలో 50 శాతం లేదని తిరస్కరిస్తున్నారు సరే.. మరి పీజీలో 50 శాతం కంటే ఎక్కువ మార్కులున్నా ఎందుకు పరిగణనలోకి తీసుకోవడం లేదని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. -
12 నుంచి ఎడ్‌సెట్ దరఖాస్తులు
ఎడ్‌సెట్–2017 షెడ్యూలు జారీ సాక్షి, హైదరాబాద్: బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో (బీఎడ్) ప్రవేశాలకు జూలై 16న నిర్వహించనున్న ఎడ్‌సెట్– 2017 షెడ్యూల్‌ను సెట్ కమిటీ గురువారం జారీ చేసింది. ఎడ్‌సెట్ నోటిఫికేషన్‌ను ఈ నెల 11న విడుదల చేయాలని నిర్ణ యించింది. అభ్యర్థులు ఈ నెల 12 నుంచి ఆన్లైన్లో (్ఛఛీఛ్ఛ్టి.్టటఛిజ్ఛి.్చఛి.జీn) దరఖాస్తు చేసుకునేలా చర్యలు చేపట్టింది. గురువారం ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొ. తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన జరిగిన సెట్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఎస్సీ, ఎస్టీలకు రూ.200, ఇతరులకు రూ.400 రిజిస్ట్రేషన్ ఫీజుగా నిర్ణయించింది. జూలై 6లోగా ఆలస్య రుసుము లేకుండా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకొని, దరఖాస్తులను సమర్పించాలని సూచించిం ది. రూ.500 ఆలస్య రుసుముతో జూలై 7, 8వ తేదీల్లో రిజిస్ట్రేషన్ చేసుకో వచ్చని చెప్పింది. ఎడ్‌సెట్ పరీక్షను జూలై 16న 11 నుంచి ఒంటిగంట వరకు 14 కేంద్రాల్లో నిర్వహించనుంది. ఫలితాలను జూలై 28న ప్రకటించనుంది. నేడు లాసెట్ ఫలితాలు..!: ఈ నెల 9వ తేదీన లాసెట్ ఫలితాలు విడుదల అయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. -
బీఈడీ రెండో దశ కౌన్సెలింగ్ లేనట్టే
హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంతో ప్రవేశాలు కష్టమే 8 వేల మంది విద్యార్థులకు తప్పని నిరాశ సాక్షి, హైదరాబాద్: బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఈడీ) కోర్సులో ప్రవేశాల కోసం ఎడ్‌సెట్–2016 రెండో దశ కౌన్సెలింగ్‌ను నిర్వహించాల్సిందేనన్న హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంతో రాష్ట్రంలోని బీఈడీ కాలేజీల్లో రెండో దశ ప్రవేశాలు చేపట్టే అవకాశం లేకుండాపోయింది. దీంతో బీఎడ్‌లో చేరాలనుకుంటున్న దాదాపు 8 వేల మంది విద్యా ర్థుల ఆశ నిరాశగానే మిగిలిపోయే పరిస్థితి నెలకొంది. 2016–17 విద్యా సంవత్సరంలో బీఈడీలో ప్రవేశాల కోసం గత జూన్‌లో నిర్వ హించిన ఎడ్‌సెట్ రాసేం దుకు 44,485 మంది దర ఖాస్తు చేసుకోగా అందులో 40,826 మంది అర్హత సాధించారు. వారికి గతే డాది సెప్టెంబర్ 8 నుంచి 11 వరకు వెబ్ ఆప్షన్లకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. అందులో 21,883 మంది ఆప్షన్లు ఇచ్చుకోగా అదే నెల 14న సీట్ల కేటా యింపు పూర్తయింది. రాష్ట్రంలోని 184 బీఈడీ కాలేజీల్లో కన్వీనర్ కోటా కింద 12,532 సీట్లుండగా అందులో 9,887 మందికి సీట్లు లభించాయి. అయితే కోరుకున్న కాలేజీల్లో సీట్లు దొరక్కపోవడంతో 5,131 మంది విద్యార్థులు కాలేజీల్లో చేరలేదు. మిగిలిన 4,756 మంది విద్యార్థులు మాత్రమే కాలేజీల్లో చేరారు. దీంతో మిగిలిన సీట్లకు ఆ తరువాత రెండో దశ కౌన్సెలింగ్ నిర్వహించాల్సి ఉంది. అదే సమయంలో మరో 11 కొత్త కాలేజీలకు జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) అనుమతి ఇవ్వడం వల్ల వాటిల్లోని సీట్లతోపాటు పాత కాలేజీల్లోని మిగిలిన సీట్లు కలుపుకొని 7,958 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. కానీ ప్రభుత్వం మాత్రం మిగిలిపోయిన సీట్లకు రెండో దశ కౌన్సెలింగ్ చేపట్టేందుకు నిరాకరించడంతో కొందరు విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు. నిబంధనల ప్రకారం రెండో దశ కౌన్సెలింగ్ నిర్వహించాలని హైకోర్టు గత నెలలో ఆదేశించగా ఈ ఉత్తర్వులను సవాల్‌చేస్తూ ఉన్నత విద్యాశాఖ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు తాజాగా స్టే విధించింది. -
బీఎడ్ ప్రవేశాలు అనుమానమే!
2016 రెండో దశ బీఎడ్ కౌన్సెలింగ్‌కు ససేమిరా అంటున్న అధికారులు 2017లోనూ ఎడ్‌సెట్ కష్టమంటున్న ఉన్నత విద్యాశాఖ వర్గాలు ఎడ్‌సెట్ తేదీ ఖరారు చేసినా, కన్వీనర్‌ను ఎంపిక చేయని ఉన్నత విద్యామండలి సాక్షి, హైదరాబాద్: బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్)లో ప్రవేశాల కోసం ప్రస్తుత (2016–17) విద్యా సంవత్సరంలో రెండో దశ కౌన్సెలింగ్‌కు ప్రభుత్వం ససేమిరా అంటున్న నేపథ్యంలో 2017–18లో బీఎడ్ ప్రవేశాల విషయంలో అధికారుల్లోనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో ఉపాధ్యాయ విద్యా కోర్సులు పూర్తి చేసినా, విద్యాపరంగా నాణ్యత ఉండటం లేదని, ప్రైవేటు బీఎడ్ కాలేజీలు సర్టిఫికెట్లు ఇచ్చే కేంద్రాలుగా తయారయ్యాయనే ఆరోపణలతో వచ్చే విద్యా సంవత్సరంలో బీఎడ్‌లో ప్రవేశాలను ప్రభుత్వం చేపడుతుందా, లేదా, అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. స్వయంగా అసెంబ్లీలోనే బీఎడ్ కాలేజీల తీరుపై సీఎం కేసీఆర్ అసహనం వ్యక్తం చేసిన నేపథ్యంలో 2017–18లో బీఎడ్ ప్రవేశాలపై యాజమాన్యాల్లో ఆందోళన నెలకొంది. ఇటీవల రాష్ట్రంలో వివిధ ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలను తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఖరారు చేసింది. వచ్చే మే 28వ తేదీన బీఎడ్‌లో ప్రవేశాల కోసం ఎడ్‌సెట్–2017ను నిర్వహిస్తామని ప్రకటించింది. ఉస్మానియా వర్సిటీ ఆధ్వర్యంలో పరీక్ష జరుగుతుందని పేర్కొంది. కానీ కన్వీనర్ ఎంపిక విషయాన్ని మాత్రం పక్కన పెట్టింది. ప్రభుత్వం నుంచి ఎడ్‌సెట్ కన్వీనర్ నియామకానికి గ్రీన్‌సిగ్నల్ రాకపోవడంతో ప్రకటన చేయలేదు. అన్ని ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు కన్వీనర్లను ప్రకటించిన మండలి ఎడ్‌సెట్ కన్వీనర్‌ను ప్రకటించలేదు. రాష్ట్రం లో బీఎడ్ కాలేజీల్లోని 13 వేల సీట్లలో ప్రస్తుతం రెండో దశ కౌన్సెలింగ్ లేకపోవడం వల్లే 8 వేలకు పైగా సీట్లు మిగిలిపోయాయి. -
బీఎడ్‌లో సీట్లన్నీ ఖాళీ
- కోర్సుపై రెండేళ్లుగా తగ్గిపోతున్న ఆసక్తి - సీట్లు పొందినా కాలేజీల్లో చేరని సగం మంది - 17 నుంచి చివరి దశ కౌన్సెలింగ్! సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్) కోర్సుపై ఆసక్తి ఏడాదికేడాది తగ్గిపోతోంది. రెండేళ్లుగా ఈ కోర్సులో చేరుతున్న వారి సంఖ్య గణనీయంగా పడిపోతోంది. సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులకు అర్హులు కాకపోవడం, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకే పరిమితం కావాల్సి రావడం, దీన్ని రెండేళ్ల కోర్సుగా చేయడంతో విద్యార్థులు బీఎడ్ పట్ల విముఖత చూపుతున్నారు. తాజాగా నిర్వహించిన బీఎడ్ కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన విద్యార్థుల్లో సగం మంది కూడా కాలేజీల్లో చేరకపోవడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. 2016-17 విద్యా సంవత్సరంలో ప్రవేశాల కోసం గత నెలలో నిర్వహించిన తొలి దశ కౌన్సెలింగ్‌లో 10 వేల మందికి సీట్లు కేటాయించగా..అందులో సగం మంది కూడా కాలేజీల్లో చేరలేదు. రాష్ట్రంలోని 184 కళాశాలల్లో 15,500 బీఎడ్ సీట్లు అందుబాటులో ఉండగా.. కన్వీనర్ కోటాలో 12,532 సీట్ల భర్తీకి చర్యలు చేపట్టారు. తొలిదశ కౌన్సెలింగ్‌లో 21,937 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నారు. అందులో 9,887 మందికి సీట్లు కేటాయించగా.. 4,756 మంది మాత్రమే కాలేజీల్లో చేరారు. చివరి దశ కౌన్సెలింగ్‌లో వందల మంది విద్యార్థులైనా కాలేజీల్లో చేరుతారా, లేదా? అన్న పరిస్థితి నెలకొంది. అదనంగా మరిన్ని సీట్లు: తొలి దశ కౌన్సెలింగ్‌లో 184 కాలేజీల్లోని సీట్ల భర్తీకే దిక్కులేదు. మరోవైపు మరిన్ని కళాశాలలకు వర్సిటీలు అనుబంధ గుర్తింపు ఇచ్చాయి. అద్దె భవనాల నుంచి సొంత భవనాలకు మారడంతో మరో 10 కాలేజీలకు గుర్తింపు లభించింది. వీటిలో 1,000 సీట్లు ఉన్నాయి. ఇక జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) మరో 12 కాలేజీలకు అనుమతి ఇచ్చింది. వీటిలో ప్రవేశాలకు అనుమతించబోమని ప్రభుత్వం స్పష్టం చేయడంతో.. యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించాయి. వీటికి అనుమతి వస్తే..1,200 సీట్లు అందుబాటులోకి వస్తాయి. తొలిదశ కౌన్సెలింగ్‌లో సీట్లు వచ్చినా, విద్యార్థులు చేరకపోవడంతో మిగిలి పోయినవి 5,131 సీట్లున్నాయి. వీటితోపాటు తొలి దశలో కేటాయించని 2,645 సీట్లు, కొత్తగా వచ్చే సీట్లు కలిపి చివరి దశ కౌన్సెలింగ్‌లో 10 వేల సీట్లు అందుబాటులోకి రానున్నాయి. తొలి దశలోనే సగం సీట్లు భర్తీ కాని నేపథ్యంలో.. చివరి దశలో ఎన్ని భర్తీ అవుతాయోననే సందేహం నెల కొంది. 2015-16లో 60వేల మందికిపైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. ఈ సారి 44 వేల మందే దరఖాస్తు చేశారు. 17 నుంచి చివరి దశ కౌన్సెలింగ్!: మిగిలిన సీట్ల భర్తీకి ఈ నెల 17 నుంచి చివరి దశ కౌన్సెలింగ్ నిర్వహించే అవకాశముంది. 20వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు కల్పించి, 22లోగా సీట్ల కేటాయింపు ప్రకటించనున్నట్లు తెలిసింది. -
బీఈడీకి అప్పటి క్రేజ్ ఏదీ..
గణనీయంగా తగ్గిన దరఖాస్తుల సంఖ్య ఇప్పటివరకు దరఖాస్తు చేసుకున్నది 44 వేల మందే హైదరాబాద్: ఉపాధ్యాయ విద్యా కోర్సు అయిన బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఈడీ)పై విద్యార్థుల్లో ఆసక్తి తగ్గిపోతోంది. బీఈడీ కోర్సును రెండేళ్లకు పెంచడం, ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను అనర్హులుగా తేల్చడం వంటివి ఈ కోర్సుకు ఆదరణ తగ్గడానికి ప్రధాన కారణం కాగా.. ప్రభుత్వాలు రెగ్యులర్‌గా డీఎస్సీ నోటిఫికేషన్లు విడుదల చేయకపోవడం కూడా బీఈడీ ప్రవేశాలపై ప్రభా వం చూపుతోంది. ఇప్పటివరకు తెలంగాణ ఎడ్‌సెట్-2015కు 44 వేల మం ది మాత్రమే దరఖాస్తు చేసుకోవడం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఎడ్‌సెట్‌కు ఉమ్మడి రాష్ట్రంలో ఏటా 2.50 లక్షల వరకు దరఖాస్తులు అందేవి. తెలంగాణ ఏర్పడ్డాక గతేడాది రాష్ట్రంలోని పది జిల్లాల నుంచి 1.11 లక్షల దరఖాస్తులు వచ్చాయి. కానీ ఈసారి అందులో సగం కూడా వచ్చే అవకాశం కని పించడం లేదు. ‘రెండేళ్ల’ దెబ్బ.. 2014-15 విద్యా సంవత్సరం వరకు బీఈడీ కోర్సు కాల వ్యవధి ఏడాదే. అయితే ఉపాధ్యాయ విద్యలో ప్రమాణాలు, నాణ్యత మెరుగుపరచడం, బోధన లో మెలకువలు జోడించాలన్న ప్రతిపాదనల నేపథ్యంలో.. బీఈడీని రెండేళ్ల కోర్సుగా తీర్చిదిద్దాలనే అభిప్రాయం వచ్చింది. దీనిపై అన్ని వర్సిటీల వీసీ లు, కమిటీలతో ఎన్సీటీఈ అధికారులు సమావేశమై 2015-16 నుంచి రెండేళ్ల కోర్సుగా మార్చారు. అంచనాలు తారుమారు రాష్ట్రంలోని 250 ప్రభుత్వ, మైనారిటీ, ప్రైవేట్ బీఈడీ కాలేజీల్లో కలిపి 25 వేల సీట్లున్నాయి. త్వరలో ప్రారంభం కానున్న ఐదు కొత్త కాలేజీలతో మరో 500 సీట్లు పెరుగుతాయి. మార్చి 12న ఎడ్‌సెట్ నోటిఫికేషన్ విడుదల కాగా.. అదేనెల 16వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తులకు ఈనెల 9వ తేదీ ఆఖరు. రూ.1,000 ఆలస్య రుసుముతో ఈనెల 21 తుది గడువు. ఈ ఏడాది నుంచి బీఈ, బీటెక్ విద్యార్థులు కూడా బీఈడీ చేసేందుకు అవకాశం కల్పించడంతో.. దాదాపు లక్ష దరఖాస్తులు వస్తాయని అధికారులు అంచనా వేశారు. కానీ ఇప్పటివరకు అందినవి 44 వేలు మాత్రమే. ఆలస్య రుసుముతో సహ గడువు ముగిసే సరికి మరో 15 వేల దరఖాస్తులు రావొచ్చని.. మొత్తంగా 60 వేలకే పరిమితం కావొచ్చని అధికారులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు గడువు పొడిగించాలన్న యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. -
బీఈడీకి ఆ క్రేజ్ ఏదీ!
- గణనీయంగా తగ్గిన దరఖాస్తుల సంఖ్య - రేపటితో ముగియనున్న గడువు - ఇప్పటివరకు దరఖాస్తు చేసుకున్నది 44 వేల మందే... - మరికొన్ని రోజులు గడువు పెంచే యోచన సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ విద్యా కోర్సు అయిన బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఈడీ)పై విద్యార్థుల్లో ఆసక్తి తగ్గిపోతోంది. బీఈడీ కోర్సును రెండేళ్లకు పెంచడం, సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులకు బీఈడీ అభ్యర్థులను అనర్హులుగా తేల్చడం వంటివి ఈ కోర్సుకు ఆదరణ తగ్గడానికి ప్రధాన కారణం కాగా.. ప్రభుత్వాలు రెగ్యులర్‌గా డీఎస్సీ నోటిఫికేషన్లు విడుదల చేయకపోవడం కూడా బీఈడీ ప్రవేశాలపై ప్రభావం చూపుతోంది. ఇప్పటివరకు తెలంగాణ ఎడ్‌సెట్-2015కు 44 వేల మంది మాత్రమే దరఖాస్తు చేసుకోవడం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఎడ్‌సెట్‌కు ఉమ్మడి రాష్ట్రంలో ఏటా 2.50 లక్షల వరకు దరఖాస్తులు అందేవి. తెలంగాణ ఏర్పడ్డాక గతేడాది రాష్ట్రంలోని పది జిల్లాల నుంచి 1.11 లక్షల దరఖాస్తులు వచ్చాయి. కానీ ఈసారి అందులో సగం కూడా వచ్చే అవకాశం కనిపించడం లేదు. ‘రెండేళ్ల’ దెబ్బ..: 2014-15 విద్యా సంవత్సరం వరకు బీఈడీ కోర్సు కాల వ్యవధి ఏడాదే. అయితే ఉపాధ్యాయ విద్యలో ప్రమాణాలు, నాణ్యత మెరుగుపరచడం, బోధనలో మరిన్ని మెలకువలు జోడించాలన్న ప్రతిపాదనల నేపథ్యంలో.. బీఈడీని రెండేళ్ల కోర్సుగా తీర్చిదిద్దాలనే అభిప్రాయం వచ్చింది. దీనిపై అన్ని వర్సిటీల వీసీలు, కమిటీలతో ఎన్సీటీఈ అధికారులు సమావేశమయ్యారు. వారి నుంచి కూడా అదే అభిప్రాయం రావడంతో.. 2015-16 నుంచి బీఈడీని రెండేళ్ల కోర్సుగా మార్చారు. అంచనాలు తారుమారు రాష్ట్రంలోని 250 ప్రభుత్వ, మైనారిటీ, ప్రైవేట్ బీఈడీ కాలేజీల్లో కలిపి 25 వేల సీట్లున్నాయి. త్వరలో ప్రారంభం కానున్న ఐదు కొత్త కాలేజీలతో మరో 500 సీట్లు పెరుగుతాయి. మార్చి 12న ఎడ్‌సెట్ నోటిఫికేషన్ విడుదల కాగా.. అదేనెల 16వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తులకు ఈనెల 9వ తేదీ ఆఖరు. రూ.1,000 ఆలస్య రుసుముతో ఈనెల 21 తుది గడువు. ఈ ఏడాది నుంచి బీఈ, బీటెక్ విద్యార్థులు కూడా బీఈడీ చేసేందుకు అవకాశం కల్పించడంతో.. దాదాపు లక్ష దరఖాస్తులు వస్తాయని అధికారులు అంచనా వేశారు. కానీ ఇప్పటివరకు అందినవి 44 వేలు మాత్రమే. ఆలస్య రుసుముతో సహ గడువు ముగిసే సరికి మరో 15 వేల దరఖాస్తులు రావొచ్చని.. మొత్తంగా 60 వేలకే పరిమితం కావొచ్చని అధికారులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు గడువు పొడిగించాలన్న యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. -
బీఎడ్‌లో ఇకపై 12 పేపర్లు
నాలుగు సెమిస్టర్లుగా కోర్సు 20 వారాలపాటు ఇంటర్న్‌షిప్ జూలై నుంచి రెండేళ్ల కోర్సుగా బీఎడ్ సిలబస్‌లో మార్పులు చేస్తున్న విద్యాశాఖ సాక్షి, హైదరాబాద్: బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో (బీఎడ్) ఇకపై 12 పేపర్ల (ప్రశ్నాపత్రాలు) విధా నం అమల్లోకి రానుంది. సెమిస్టర్ విధానం, ఐదు నెలలపాటు(20 వారాలు) ఇంటర్న్‌షిప్ విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు విద్యాశాఖ కసరత్తు చేపట్టింది. బీఎడ్‌ను రెండేళ్ల కోర్సుగా మార్చిన నేపథ్యంలో రాష్ట్రంలో మార్పు చేసిన పాఠశాల విద్యా విధానం, పరీక్షల సంస్కరణలు, సిలబస్‌లో మార్పులకు అనుగుణంగా బీఎడ్ సిలబస్‌ను రూపొందించేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా శుక్రవారం రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలకు చెందిన విద్యావిభాగం అధిపతులు, ప్రభుత్వ, ప్రైవేటు బీఎడ్ కాలేజీల ప్రతినిధులతో సిలబస్ రూపకల్పనపై విద్యాశాఖ చర్చించింది. పాఠశాల విద్యా డెరైక్టర్ టి.చిరంజీవులు నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో వివిధ అంశాలపై చర్చించారు. యూనివర్సిటీలు, ఉన్నత విద్యాశాఖ, పాఠశాల విద్యాశాఖ పర స్పర సహకారంతో పనిచేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా సిలబస్‌లో తీసుకురావాల్సిన మార్పులను రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) డెరైక్టర్ జగన్నాథరెడ్డి, పరీక్షల సంస్కరణల కన్సల్టెంట్ ఉపేందర్‌రెడ్డి యూనివర్సిటీలు, కళాశాలల ప్రతినిధులకు తెలియజేశారు. కొత్త నిబంధనలను వివరించారు. గతంలో ఏడాది కోర్సుగా ఉన్న బీఎడ్‌లో 6 ప్రశ్నాపత్రాల విధానం అమల్లో ఉం డగా వచ్చే విద్యా సంవ త్సరంలో(జూలై నుంచి) అమల్లోకి రానున్న రెండేళ్ల బీఎడ్ కోర్సులో స్కూల్ ఇంటర్న్‌షిప్ కాకుండా 12 ప్రశ్నాపత్రాల విధానం అమలు చేసేందుకు ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలి మెంటరీ ఎడ్యుకేషన్(డీఈఎల్ఈడీ) కోర్సు సిల బస్‌లోనూ మార్పులు తెస్తున్నట్లు వెల్లడించారు. ఇవీ బీఎడ్‌లో రానున్న ప్రధాన మార్పులు... ఇప్పటివరకూ 8 వారాలే ఉన్న స్కూల్ ఇంటర్న్‌షిప్ (పాఠశాలల్లో ప్రాక్టికల్ తరగతులు) ఇకపై 20 వారాలపాటు ఉంటుంది. ఇందులో కమ్యూనిటీ భాగస్వామ్యం, జ్ఞానం, సమాచారం, కరి క్యులమ్కు ప్రాధాన్యం ఉంటుంది. ఇవన్నీ కలిపి ఒక పేపరుగా ప్రవేశ పెడతారు. ఉపాధ్యాయ విద్యార్థులు ఏం నేర్చుకోవాలి? పిల్లలకు వారేం చెప్పాలి? బోధన పద్ధతులు, అనుసరించాల్సిన నిబంధనలు, ప్రజలతో మ మేకం ఎలా కావాలన్న అంశాలకు ప్రాధాన్యం ఉంటుంది. దీనికి 250 మార్కులు ఉంటాయి. కంప్యూటర్ ఎడ్యుకేషన్, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్‌పై ప్రత్యేక ప్రశ్నాపత్రాలు ఉంటాయి. ఏడాది కోర్సులో ఉన్న 6 పేపర్ల స్థానంలో రెండేళ్ల కోర్సులో 12 పేపర్ల విధానం అమల్లోకి తెస్తున్నందునా, ఇలాంటి వివిధ అంశాలకు సంబంధించిన అంశాలపై సిలబస్‌ను సిద్ధం చేశారు. ఆప్షనల్ కోర్సులుగా వొకేషనల్ ఎడ్యుకేషన్, వర్క్ ఎడ్యుకేషన్, హెల్త్, ఫిజికల్ ఎడ్యుకేషన్, గెడైన్స్ అండ్ కౌన్సెలింగ్ ఉంటాయి. వృత్తి సం బంధ సామర్థ్యాల పెంపునకు (ఎన్హాన్సింగ్ ప్రొఫెషనల్ కెపాసిటీస్) ప్రాధాన్యం ఇస్తారు. -
కళాశాలల్లో టాస్క్‌ఫోర్స్ తనిఖీలు
నాణ్యత ప్రమాణాలకు పెద్దపీట వేసేందుకు ఉన్నత విద్యా మండలి చర్యలు హైదరాబాద్: రాష్ట్రంలోని ఉన్నత, వృత్తి విద్య కాలేజీల్లో నాణ్యత ప్రమాణాలకే పెద్దపీట వేయాలని తెలంగాణ ఉన్నత విద్యా మండలి భావిస్తోంది. పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన కాలేజీల్లో నాణ్యత ప్రమాణాలు పాటించని కాలేజీలపై కఠిన వైఖరి అవలంభించాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా గ్రాడ్యుయేషన్ (డిగ్రీ), పోస్టు గ్రాడ్యుయేషన్ (పీజీ), బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్) తదితర అన్ని ఉన్నత విద్యా కోర్సులను నిర్వహించే కాలేజీల్లో టాస్క్‌ఫోర్స్ తనిఖీలు చేపట్టాలనే ఆలోచనలు చేస్తోంది. దీనిపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో చర్చించాక త్వరలోనే టాస్క్‌ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేయనుంది. ఆ కమిటీల నేతృత్వంలో తనిఖీలు చేపట్టి నాణ్యత, ప్రమాణాలు పాటించే కాలేజీలనే కొనసాగించాలనే యోచన చేస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో 726 ప్రైవేటు డిగ్రీ కాలేజీలు ఉండగా, ఈ ఏడాది మరో 150 కాలేజీలకు ఉన్నత విద్యా మండలి అనుమతి ఇచ్చింది. అయితే అవసరం లేని చోట కాలేజీలకు అనుమతులు పొందారని, రాజకీయ పరపతితో అనుమతులు తెచ్చుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వాటిపై తెలంగాణ ఉన్నత విద్యా మండలికి ఫిర్యాదులు కూడా అందాయి. నిబంధనల ప్రకారం నాలుగైదు జూనియర్ కాలేజీలున్న మండలంలో ఒక డిగ్రీ కాలేజీకి మాత్రమే అనుమతి ఇవ్వాల్సి ఉండగా... ఒకట్రెండు జూనియర్ కాలేజీలు ఉంటే.. నాలుగైదు డిగ్రీ కాలేజీలకు అనుమతులు ఇచ్చినట్లు ఫిర్యాదులు అందాయి. యూనివర్సిటీల నుంచి తనిఖీలకు వెళ్లిన బృందాలు అలాంటి ప్రాంతాల్లో కొత్త కాలేజీల అనుమతులకు ఎలా సిఫారసు చేశారన్న అంశాలపైనా విచారణ జరిపి, చర్యలు చేపట్టాలనే ఆలోచనలు చేస్తోంది. తద్వారా భవిష్యత్తులో ఇష్టారాజ్యంగా కాలేజీల ఏర్పాటుకు తప్పుడు నివేదికలు ఇవ్వకుండా చూడాలని భావిస్తోంది. ఇప్పటికే మూడు నాలుగు కాలేజీలున్న చోట వాస్తవ అవసరాలను బట్టి ఎన్ని కాలేజీలను కొనసాగించాలనే విషయాలపై అధ్యయనం చేయాలని యోచిస్తోంది. ఇందుకు నాణ్యత ప్రమాణాలు పాటించని కాలేజీల అఫిలియేషన్లను రద్దు చేసే యోచన కూడా చేస్తోంది. మరోవైపు అనేక బీఎడ్ కాలేజీల్లో అధ్యాపకులే లేరు. తరగతులూ కొనసాగడం లేదు. అవి సర్టిఫికెట్లు ఇచ్చే కేంద్రాలుగా మారినట్లు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో వీటితోపాటు పోస్టు గ్రాడ్యుయేషన్ తదితర ఉన్నత విద్యా కాలేజీలు అన్నింట్లో తనిఖీలు చేపట్టి తగిన చర్యలు చేపట్టాలని భావిస్తోంది. -
కొత్తగా ‘బీఈఎల్ఈడీ’ కోర్సు!
ఉపాధ్యాయ విద్యలో మరిన్ని సంస్కరణలు చేపట్టనున్న ఎన్సీటీఈ వచ్చే ఏడాది నుంచి అమల్లోకి.. ఎస్జీటీ పోస్టులకు ఈ కోర్సుతో అర్హత డీఎడ్ అభ్యర్థులకు ‘నాలుగేళ్ల బీఎడ్’ లోకి లేటరల్ ఎంట్రీ.. నేరుగా మూడో సంవత్సరంలో చేరే అవకాశం హైదరాబాద్: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఎల్ఈడీ.. గతంలో డీఎడ్) అభ్యర్థులకు నాలుగేళ్ల ‘బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్)’ కోర్సులో లేటరల్ ఎంట్రీకి అవకాశం కల్పించేందుకు జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) కసరత్తు చేస్తోంది. రెండేళ్ల డీఈఎల్ఈడీ కోర్సు చదివే విద్యార్థులు... నేరుగా నాలుగేళ్ల బీఎడ్ కోర్సులోని మూడో సంవత్సరంలో చేరే అవకాశం కల్పించనుంది. ఉపాధ్యాయ విద్యలో సంస్కరణల్లో భాగంగా.. ఇప్పటివరకూ కాలమే ఉన్న బీఎడ్, మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (ఎంఎడ్) కోర్సులను రెండేళ్ల కాల వ్యవధిగల కోర్సులుగా ఎన్సీటీఈ మార్పు చేసింది. దీంతోపాటు బీఎడ్, డీఈఎల్‌ఈడీలో 30 శాతం మార్కులను ఇంటర్నల్స్‌కు కేటాయించే విధానాన్ని అమలు పరచనుంది. వచ్చే ఏడాది నుంచి ఈ సంస్కరణలు అమల్లోకి రాబోతున్నాయి. వీటితోపాటు నాలుగేళ్ల బీఎడ్ కోర్సును కూడా యూనివర్సిటీ కాలేజీల్లో ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో చేరే అభ్యర్థులు డీఈఎల్ఈడీ కోర్సును పూర్తి చేయడమే కాకుండా.. డిగ్రీతో కూడిన బీఎడ్ కోర్సును కూడా పూర్తి చేసినట్లు అవుతుంది. దీంతో ఆ అభ్యర్థులకు రెండు రకాల ప్రయోజనం చేకూరనుంది. డీఈఎల్ఈడీ అర్హతతో ఎస్జీటీ పోస్టులకు, బీఎడ్ అర్హతతో స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు వారు దరఖాస్తు చేసుకునేందుకు వీలు ఏర్పడనుంది. నాలుగేళ్ల బీఈఎల్ఈడీ.. జస్టిస్ వర్మ కమిటీ సిఫారసుల మేరకు చేపట్టిన ఉపాధ్యాయ విద్య సంస్కరణల్లో భాగంగా సమీకృత (ఇంటిగ్రేటెడ్) విద్యా కోర్సులకు ఎన్సీటీఈ ప్రాధాన్యం ఇస్తోంది. అందులో భాగంగా నాలుగేళ్ల ‘బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (బీఈఎల్ఈడీ)’ కోర్సును ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. దీనిపై ఇప్పటికే ఢిల్లీలోని రీజినల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ (ఆర్ఐఈ)కి చెందిన ప్రొఫెసర్ పూనమ్ బాత్రా కసరత్తు చేస్తున్నారు. వీలైతే ఈ కోర్సును వచ్చే విద్యా సంవత్సరంలో అమల్లోకి తేవాలని ఎన్సీటీఈ భావిస్తోంది. ప్రస్తుతం డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (ఇంతకుముందటి డీఎడ్) అభ్యర్థులకే పరిమితమైన ఎస్జీటీ పోస్టుల్లో ఇకపై ‘బీఈఎల్ఈడీ’ అభ్యర్థులకు కూడా అవకాశం ఉంటుంది. అంతేగాకుండా ఈ కోర్సు చేసినవారు 6, 7, 8 తరగతుల్లో స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందని విద్యాశాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. దీనిని మొదట యూనివర్సిటీ కాలేజీల్లో ప్రారంభించే అవకాశం ఉందని తెలిపారు. డీఈఎల్ఈడీ, బీఎడ్ సిలబ స్లోనూ మార్పులు.. రాష్ట్రంలో విద్యార్థులు బట్టీపట్టే విధానానికి స్వస్తిచెప్పేందుకు ఒకటి నుంచి పదో తరగతి వరకు పాఠ్య పుస్తకాలను మార్పు చేసిన సంగతి తెలిసిందే. తరగతుల్లో చేసిన ఈ మార్పులకు అనుగుణంగా డీఈఎల్ఈడీ, బీఎడ్ కోర్సుల్లోనూ సిలబస్‌ను మార్పు చేయాలని రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) భావిస్తోంది. ప్రస్తుతం పనిచేస్తున్న టీచర్లకు కొత్త పాఠ్య పుస్తకాల ప్రకారం శిక్షణ ఇవ్వడంతోపాటు ఉపాధ్యాయ విద్య చదివే అభ్యర్థులకు కూడా ఈ కొత్త విధానంలో బోధన పద్ధతులు నేర్పించేందుకు సిద్ధమవుతోంది. త్వరలోనే దీనిపై నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని భావిస్తోంది. -
బీఈడీ కోర్సుపై బెంగ!
అనర్హులే అధ్యాపకులు - తరగతుల నిర్వహణ మృగ్యం - శిక్షణకు నోచుకోని ఛాత్రోపాధ్యాయులు - వసూళ్లకే యాజమాన్యాలు పరిమితం! శాతవాహన యూనివర్సిటీ: కర్ణుడి చావుకు కారణాలనేకం అన్నట్లుగా మారింది బీఈడీ(బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యూకేషన్) విద్య పరిస్థితి. ఛాత్రోపాధ్యాయులకు నాణ్యమైన శిక్షణ అందని స్థితి. యూనివర్సిటీ అధికారుల పర్యవేక్షణ లోపంతోనే ఈ దుస్థితి. ఈ రెగ్యూలర్ కోర్సు కాస్తా దూరవిద్యా విధానాన్ని తలపిస్తోంది. ప్రవేశం పొందిన సగం మంది ఉద్యోగాలు చేస్తూ, ఏదో ఒక వంకతో డుమ్మా కొడుతున్నారు. తరగతి గదులు వెలవెలబోతున్నాయి. ఇదే అదనుగా కళాశాలల యాజమాన్యాలు సైతం తక్కువ విద్యార్హతలున్న అధ్యాపకులను నియమిస్తూ సొమ్ము ఆదా చేసుకుంటున్నాయి. జిల్లాలో చాలాచోట్ల ఇదే పరిస్థితి ఉంది. కోర్సు తీరుతెన్నులివీ.. యూనివర్సిటీ ప్రకారం పని దినాల సంఖ్య 200. ఛాత్రోపాధ్యాయుల హాజరు కనీసం 80 శాతం ఉండాలనేది నిబంధన. కమ్యూనిటీ స్టడీస్, కేస్ స్టడీ అండ్ లైఫ్ స్కిల్స్, స్కూల్ స్టడీ అండ్ యాక్షన్ రీసెర్చ్, ఐసీటీ, మెథడ్-1,2 రికార్డులు రాసి కళాశాలలో అప్పగించాలి. వీటితోపాటు మైక్రో టీచింగ్ రికార్డ్స్‌ను ఛాత్రోపాధ్యాయులు రాయాలి. క్షేత్రస్థాయిలో మాక్రో టీచింగ్ కోసం కళాశాల కేటాయించిన ప్రభుత్వ, ప్రయివేట్ పాఠశాలలో ఛాత్రోపాధ్యాయులు బోధన చేయాలి. ఇవన్నీ చేస్తే గాని శిక్షణ పూర్తికాదు. కానీ కొన్ని కళాశాలలు వసూళ్లకు తెరతీస్తూ ఛాత్రోపాధ్యాయులను తరగతులకు హాజరుకాకుండా పరోక్షంగా ప్రోత్సహిస్తున్నాయనే ఆరోపణలున్నాయి. సెప్టెంబర్‌లో పరీక్షల నేపథ్యంలో వర్సిటీ పరిధిలోని బీఈడీ కళాశాలల్లో ఛాత్రోపాధ్యాయుల నుంచి ఫీజు తీసుకోవాలని కళాశాలల ప్రిన్సిపాల్స్‌కు ఆదేశాలు అందాయి. కళాశాలకు రాని, వచ్చినా రికార్డ్సు రాయలేని వారిపై వీరు ‘ఫిక్స్డ్’ ఫీజులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. కళాశాలకు మొత్తానికే రాకుంటే రూ.10 నుంచి రూ. 20 వేలు, రికార్డులు రాయకుంటే రూ.5 వేలు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. నిబంధనల ప్రకారం ఫీజు.. బీఈడీ పరీక్ష ఫీజును యూనివర్సిటీ అధికారులు విడుదల చేశారు. పరీక్ష ఫీజు రూ.1050, ప్రొవిజనల్ సర్టిఫికెట్ ఫీజు రూ.300, ఆన్లైన్ రుసుము రూ. 30, స్టూడెంట్ రిజిస్ట్రేషన్ రూ.240, స్టూడెంట్ రిగ్ననైజేషన్ రూ.600, ప్రొసెసింగ్ రుసుము రూ.250, వెల్ఫేర్ ఫీజు రూ. 20, ఇంటర్యూనివర్సిటీ స్పోర్ట్స్ ఫీజు రూ. 40.. మొత్తంగా రూ.2530 చెల్లించాలి. లేని వసతులకు ఫీజులెందుకు.. రికార్డులెందుకు.. జిల్లాలోని అనేక కళాశాల్లో కంప్యూటర్ ల్యాబ్‌లు లేవు, ఉన్నా వినియోగంలోకి రావడం లేదని ఛాత్రోపాధ్యాయులే పేర్కొంటున్నారు. మరి కంప్యూటర్ రికార్డ్స్ ఎందుకనే ప్రశ్న తలెత్తుతోంది. ఇంటర్ యూనివర్సిటీ కింద వసూలు చేసే రూ. 40 సైతం వర్సిటీకి ఎందుకు కట్టాలనే ప్రశ్నా సహేతుకమే. వర్సిటీ పర్యవేక్షణ ఉంటే బోధన సరిగా జరిగేదని ఛాత్రోపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, అన్ని వసతులు కల్పించిన కళాశాలలు, కల్పించని కళాశాలలకు ఒకేలా ఫీజు రీయింబర్స్మెంట్, పరీక్షలకు హాజరయ్యే అవకాశం కల్పిస్తున్నారు. దీంతో మెరుగైన నిబంధనలు పాటించే యాజమాన్యాలు పెదవి విరుస్తున్నాయి. అధ్యాపకులేరి? జిల్లాలోని 20 బీఈడీ కళాశాలల్లో 2000 మంది ఛాత్రోపాధ్యాయులున్నారు. కళాశాలలో అన్ని మెథడ్స్ బోధించే అధ్యాపకులు దాదాపుగా లేరనే చెప్పాలి. ప్రభుత్వానికి ఏవో పేర్లు చూపి కళాశాల యాజమాన్యాలు గుర్తింపు కాపాడుకుంటున్నాయి. అధ్యాపకులుగా ఎంఈడీ వారే ఉండాలి. కానీ అర్హతల విషయంలో యాజమాన్యాలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయి. కోర్సు ఇంత లోపభూయిష్టంగా ఉండడం వల్లే అనేక మంది బీఈడీ చేసిన వారు ఉపాధి లేకుండా ఉంటున్నారనే అభిప్రాయం ఉంది. -
ఇక అన్నీ ఇంటిగ్రేటెడ్ కోర్సులే!
' ఇంటర్‌తోనే ప్రవేశపెట్టేందుకు ఎన్సీటీఈ కసరత్తు ' ఐదారు రకాల కోర్సులపై అధ్యయనం ' నేడు బెంగళూరులో దక్షిణాది రాష్ట్రాల సమావేశం సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్‌తోనే ఉపాధ్యాయ విద్యలో ఇంటిగ్రేటెడ్ కోర్సులు ప్రవేశపెట్టేందుకు జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి(ఎన్సీటీఈ) కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం ఏడాది కోర్సులుగా ఉన్న బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్), మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్(ఎంఈడీ) కోర్సులను వచ్చే విద్యా సంవత్సరంలో రెండేళ్ల కోర్సులుగా మార్పు చేయాలని ఇప్పటికే నిర్ణయించింది. మరోవైపు భవిష్యత్తులోనూ ఉపాధ్యాయ విద్యలో ఇంటిగ్రేటెడ్ కోర్సులనే ప్రవేశపెట్టే అంశంపైనా దృష్టి సారించింది. అంతేకాదు పక్కాగా కళాశాలల నియంత్రణకు చర్యలు చేపట్టాలని నిర్ణయిం చింది. ఈ అంశాలన్నింటిపై శనివారం బెంగళూరులో దక్షిణాది రాష్ట్రాల్లోని విద్యాశాఖ అధికారులు, కళాశాలల యాజమాన్యాలతో సమావేశం నిర్వహిస్తోంది. ఉపాధ్యాయ విద్యను బలోపేతం చేయాల్సిందేనన్న జస్టిస్ వర్మ కమిటీ సిఫారసులపై మరింత లోతుగా అధ్యయనం చేసేందుకు ఎన్సీటీఈ పలు కమిటీలను ఏర్పాటు చేసింది. అందులో ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ పూనమ్ బాత్రా, ప్రొఫెసన్ ఎన్కే జాన్గిరా నేతృత్వంలో ఏర్పాటైన కమిటీలు తమ నివేదికలను రెండు నెలల కిందట ఎన్‌సీటీఈకి అందజేశాయి. ఆ కమిటీలు ఉపాధ్యా య విద్య ప్రాధాన్యం, విద్యార్థులను తీర్చిదిద్దడంతో క్రియాశీల ంగా వ్యవహరించే ఉపాధ్యాయ పాత్ర, వారికి ఇచ్చే శిక్షణ ఎలా ఉండాలన్న వివిధ అంశాలను చర్చించారు. పలు సూచనలు, సలహాల కోసం దేశవ్యాప్తంగా విద్యావేత్తలు, అధికారులు కళాశాలల యాజమాన్యాలతో ఎన్సీటీఈ సమావేశాలు నిర్వహిస్తోంది. కళాశాలలను కూడా పటిష్టం చేసే అంశాలపై కసరత్తు ప్రారంభించింది. ప్రతి కళాశాలలో 100 సీట్లు ఉంటే 50 సీట్లకు ఒక సెక్షన్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తోం ది. 1:15 రేషియోలో రెగ్యులర్ అధ్యాపకులను నియమించాలని పేర్కొంది. ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు బోధించేందుకు ప్రస్తుతం డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్సు ఉండగా నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్సు అవసరమా? లేదా? అనే అంశాలపైనా చర్చించనుంది. ఎన్సీటీఈ ప్రణాళిక .. వివరాలు - రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ + గ్రాడ్యుయేషన్ + రెండేళ్ల మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (2+3+2) - నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ + రెండేళ్ల మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (4+2) - గ్రాడ్యుయేషన్ + రెండేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ + రెండేళ్ల మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (3+2+2) - గ్రాడ్యుయేషన్ + మూడేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (3+3) - నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ సెకండరీ ఎడ్యుకేషన్ (బీఏ/బీఎస్సీ బీఈడీ) + రెండేళ్ల మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (4+2) -
బీఈడీకి గడ్డుకాలం
సాక్షి, అనంతపురం : బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఈడీ)... ఒకప్పుడు ఈ పేరు చెబితే డిగ్రీ, పీజీలు పూర్తి చేసిన విద్యార్థులు సీట్ల కోసం క్యూ కట్టేవారు. రాష్ట్రంలో సీట్లు దొరకని పక్షంలో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు వెళ్లి మరీ బీఈడీ పూర్తి చేసేవారు. ఆ కోర్సు పూర్తి చేస్తే ప్రభుత్వ టీచర్ ఉద్యోగం గ్యారంటీ అన్న నమ్మకం విద్యార్థుల్లో ఉండేది. ప్రస్తుతం అంతా తలకిందులైంది. విద్యాహక్కు చట్టం ప్రకారం రెండేళ్లు ఉపాధ్యాయ శిక్షణ పొందిన వారే సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులకు అర్హులని రెండేళ్ల క్రితం రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరించడంతో బీఈడీ కళాశాలలు ఒక్కసారిగా సంక్షోభంలో కూరుకుపోయాయి. ఇదే క్రమంలో డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (డీఈడీ) కళాశాలలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. ప్రతి డీఎస్సీలోనూ వేల సంఖ్యలో ఎస్జీటీ పోస్టులు భర్తీ చేస్తున్నారు. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మాత్రం పదుల సంఖ్యలోనే ఉంటున్నాయి. దీంతో బీఈడీలో చేరే వారి సంఖ్య క్రమేణా తగ్గిపోతోంది. విద్యార్థులు లేక రాష్ట్రవ్యాప్తంగా అనేక కళాశాలలు మూసివేత దిశగా పయనిస్తున్నాయి. జిల్లాలోనూ ఇదే పరిస్థితి ఉంది. జిల్లాలో ఎస్కేయూ క్యాంపస్ కళాశాల, 24 ప్రైవేటు బీఈడీ కళాశాలలు ఉన్నాయి. సరస్వతి బీఈడీ కళాశాల (అనంతపురం)లో 160 సీట్లు, ఎస్కేయూతో పాటు మరో మూడు కళాశాలల్లో 120 చొప్పున సీట్లు ఉన్నాయి. మిగిలిన 20 కళాశాలల్లో వంద సీట్ల చొప్పున ఉన్నాయి. జిల్లాలోని మొత్తం 25 కళాశాలల్లో 2,640 సీట్లు ఉండగా.. ఇందులో కన్వీనర్ కోటా కింద 75 శాతం, యాజమాన్య కోటా ద్వారా 25 శాతం భర్తీ చేస్తున్నారు. 2014-15 విద్యా సంవత్సరానికి గానూ బీఈడీ ప్రవేశపరీక్ష (ఎడ్‌సెట్)ను ఈ నెల 30న ఆంధ్ర యూనివర్సిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తం (తెలంగాణ, సీమాంధ్ర)గా నిర్వహిస్తున్నారు. ఇందుకోసం 1.20 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎస్కేయూ పరిధిలో 4,300 దరఖాస్తులు వచ్చాయి. డిగ్రీ, పీజీ పూర్తి చేసిన వారితో పాటు ప్రస్తుతం డిగ్రీ తృతీయ సంవత్సరం పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో దాదాపు 1,500 మంది ఇతర కోర్సులకు మళ్లే అవకాశముంది. అప్పుడు జిల్లాలోని 2,640 బీఈడీ సీట్లకు 2,800 మంది మాత్రమే పోటీ పడతారు. అంటే సీటుకు ఇద్దరు కూడా పోటీలో ఉండరు. ఈ పరిస్థితిని గమనించిన ప్రైవేటు బీఈడీ కళాశాలల యాజమాన్యాలు దరఖాస్తుల ఆధారంగా విద్యార్థుల సెల్, ల్యాండ్ ఫోన్ నంబర్లు కునుక్కుని ముందుగానే గాలం వేస్తున్నాయి. కన్వీనర్ కోటా కింద సీటు పొందే విద్యార్థి రూ.6,500 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అయితే..ఈ ఫీజుకు రికార్డుల ఫీజుతో కలిపి రూ.10 వేలు చెల్లిస్తే చాలు యాజమాన్యపు కోటా కింద సీటు ఇస్తామని ఆఫర్లు ఇస్తున్నాయి. పైగా అటెండెన్స్ మొదలుకుని రికార్డులు రాయించడం వరకు అన్నీ చూసుకుంటామని భరోసా ఇస్తున్నాయి. అయినప్పటికీ విద్యార్థులు ముందుకు రావడం లేదు. గత ఏడాది కూడా ఒక్కో కళాశాలలో 40 నుంచి 50 సీట్లు మిగిలిపోయాయి. దీంతో పలు కళాశాలల యాజమాన్యాలు తీవ్రంగా నష్టపోయాయి. సిబ్బందికి వేతనాల కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి ఎదురైంది. ఈ సారీ అదే పరిస్థితి పునరావృతమైతే కళాశాలలను మూసివేయడమే శరణ్యమని భావిస్తున్నాయి. డీఈడీకి పరుగు : ప్రస్తుతం డీఈడీకి డిమాండ్ పెరిగిపోవడంతో ఇప్పటి నుంచే యాజమాన్యపు కోటా కింద సీటు రిజర్వ్ చేసుకోవడానికి విద్యార్థులు పరుగులు పెడుతున్నారు. వారి ఆత్రుతను గుర్తిస్తున్న యాజమాన్యాలు సీటు రేటును అమాంతం పెంచేశాయి. రూ.2 లక్షలకు పైమాటేనని చెబుతున్నాయి. దీంతో కొందరు విద్యార్థులు రాజకీయ నాయకులు, ఉన్నతస్థాయి అధికారులతో సిఫారసులు కూడా చేయిస్తున్నారు.