సాక్షి, అనంతపురం : బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఈడీ)... ఒకప్పుడు ఈ పేరు చెబితే డిగ్రీ, పీజీలు పూర్తి చేసిన విద్యార్థులు సీట్ల కోసం క్యూ కట్టేవారు. రాష్ట్రంలో సీట్లు దొరకని పక్షంలో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు వెళ్లి మరీ బీఈడీ పూర్తి చేసేవారు. ఆ కోర్సు పూర్తి చేస్తే ప్రభుత్వ టీచర్ ఉద్యోగం గ్యారంటీ అన్న నమ్మకం విద్యార్థుల్లో ఉండేది. ప్రస్తుతం అంతా తలకిందులైంది. విద్యాహక్కు చట్టం ప్రకారం రెండేళ్లు ఉపాధ్యాయ శిక్షణ పొందిన వారే సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులకు అర్హులని రెండేళ్ల క్రితం రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరించడంతో బీఈడీ కళాశాలలు ఒక్కసారిగా సంక్షోభంలో కూరుకుపోయాయి.
ఇదే క్రమంలో డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (డీఈడీ) కళాశాలలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. ప్రతి డీఎస్సీలోనూ వేల సంఖ్యలో ఎస్జీటీ పోస్టులు భర్తీ చేస్తున్నారు. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మాత్రం పదుల సంఖ్యలోనే ఉంటున్నాయి. దీంతో బీఈడీలో చేరే వారి సంఖ్య క్రమేణా తగ్గిపోతోంది. విద్యార్థులు లేక రాష్ట్రవ్యాప్తంగా అనేక కళాశాలలు మూసివేత దిశగా పయనిస్తున్నాయి. జిల్లాలోనూ ఇదే పరిస్థితి ఉంది.
జిల్లాలో ఎస్కేయూ క్యాంపస్ కళాశాల, 24 ప్రైవేటు బీఈడీ కళాశాలలు ఉన్నాయి. సరస్వతి బీఈడీ కళాశాల (అనంతపురం)లో 160 సీట్లు, ఎస్కేయూతో పాటు మరో మూడు కళాశాలల్లో 120 చొప్పున సీట్లు ఉన్నాయి. మిగిలిన 20 కళాశాలల్లో వంద సీట్ల చొప్పున ఉన్నాయి. జిల్లాలోని మొత్తం 25 కళాశాలల్లో 2,640 సీట్లు ఉండగా.. ఇందులో కన్వీనర్ కోటా కింద 75 శాతం, యాజమాన్య కోటా ద్వారా 25 శాతం భర్తీ చేస్తున్నారు. 2014-15 విద్యా సంవత్సరానికి గానూ బీఈడీ ప్రవేశపరీక్ష (ఎడ్‌సెట్)ను ఈ నెల 30న ఆంధ్ర యూనివర్సిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తం (తెలంగాణ, సీమాంధ్ర)గా నిర్వహిస్తున్నారు. ఇందుకోసం 1.20 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎస్కేయూ పరిధిలో 4,300 దరఖాస్తులు వచ్చాయి. డిగ్రీ, పీజీ పూర్తి చేసిన వారితో పాటు ప్రస్తుతం డిగ్రీ తృతీయ సంవత్సరం పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో దాదాపు 1,500 మంది ఇతర కోర్సులకు మళ్లే అవకాశముంది. అప్పుడు జిల్లాలోని 2,640 బీఈడీ సీట్లకు 2,800 మంది మాత్రమే పోటీ పడతారు. అంటే సీటుకు ఇద్దరు కూడా పోటీలో ఉండరు. ఈ పరిస్థితిని గమనించిన ప్రైవేటు బీఈడీ కళాశాలల యాజమాన్యాలు దరఖాస్తుల ఆధారంగా విద్యార్థుల సెల్, ల్యాండ్ ఫోన్ నంబర్లు కునుక్కుని ముందుగానే గాలం వేస్తున్నాయి.
కన్వీనర్ కోటా కింద సీటు పొందే విద్యార్థి రూ.6,500 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అయితే..ఈ ఫీజుకు రికార్డుల ఫీజుతో కలిపి రూ.10 వేలు చెల్లిస్తే చాలు యాజమాన్యపు కోటా కింద సీటు ఇస్తామని ఆఫర్లు ఇస్తున్నాయి. పైగా అటెండెన్స్ మొదలుకుని రికార్డులు రాయించడం వరకు అన్నీ చూసుకుంటామని భరోసా ఇస్తున్నాయి. అయినప్పటికీ విద్యార్థులు ముందుకు రావడం లేదు. గత ఏడాది కూడా ఒక్కో కళాశాలలో 40 నుంచి 50 సీట్లు మిగిలిపోయాయి. దీంతో పలు కళాశాలల యాజమాన్యాలు తీవ్రంగా నష్టపోయాయి. సిబ్బందికి వేతనాల కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి ఎదురైంది. ఈ సారీ అదే పరిస్థితి పునరావృతమైతే కళాశాలలను మూసివేయడమే శరణ్యమని భావిస్తున్నాయి.
డీఈడీకి పరుగు :
ప్రస్తుతం డీఈడీకి డిమాండ్ పెరిగిపోవడంతో ఇప్పటి నుంచే యాజమాన్యపు కోటా కింద సీటు రిజర్వ్ చేసుకోవడానికి విద్యార్థులు పరుగులు పెడుతున్నారు. వారి ఆత్రుతను గుర్తిస్తున్న యాజమాన్యాలు సీటు రేటును అమాంతం పెంచేశాయి. రూ.2 లక్షలకు పైమాటేనని చెబుతున్నాయి. దీంతో కొందరు విద్యార్థులు రాజకీయ నాయకులు, ఉన్నతస్థాయి అధికారులతో సిఫారసులు కూడా చేయిస్తున్నారు.
బీఈడీకి గడ్డుకాలం
Published Wed, May 21 2014 2:03 AM | Last Updated on Fri, Jun 1 2018 8:47 PM
Advertisement
Advertisement