- గణనీయంగా తగ్గిన దరఖాస్తుల సంఖ్య
- రేపటితో ముగియనున్న గడువు
- ఇప్పటివరకు దరఖాస్తు చేసుకున్నది 44 వేల మందే...
- మరికొన్ని రోజులు గడువు పెంచే యోచన
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ విద్యా కోర్సు అయిన బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఈడీ)పై విద్యార్థుల్లో ఆసక్తి తగ్గిపోతోంది. బీఈడీ కోర్సును రెండేళ్లకు పెంచడం, సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులకు బీఈడీ అభ్యర్థులను అనర్హులుగా తేల్చడం వంటివి ఈ కోర్సుకు ఆదరణ తగ్గడానికి ప్రధాన కారణం కాగా.. ప్రభుత్వాలు రెగ్యులర్‌గా డీఎస్సీ నోటిఫికేషన్లు విడుదల చేయకపోవడం కూడా బీఈడీ ప్రవేశాలపై ప్రభావం చూపుతోంది. ఇప్పటివరకు తెలంగాణ ఎడ్‌సెట్-2015కు 44 వేల మంది మాత్రమే దరఖాస్తు చేసుకోవడం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఎడ్‌సెట్‌కు ఉమ్మడి రాష్ట్రంలో ఏటా 2.50 లక్షల వరకు దరఖాస్తులు అందేవి. తెలంగాణ ఏర్పడ్డాక గతేడాది రాష్ట్రంలోని పది జిల్లాల నుంచి 1.11 లక్షల దరఖాస్తులు వచ్చాయి. కానీ ఈసారి అందులో సగం కూడా వచ్చే అవకాశం కనిపించడం లేదు.
‘రెండేళ్ల’ దెబ్బ..: 2014-15 విద్యా సంవత్సరం వరకు బీఈడీ కోర్సు కాల వ్యవధి ఏడాదే. అయితే ఉపాధ్యాయ విద్యలో ప్రమాణాలు, నాణ్యత మెరుగుపరచడం, బోధనలో మరిన్ని మెలకువలు జోడించాలన్న ప్రతిపాదనల నేపథ్యంలో.. బీఈడీని రెండేళ్ల కోర్సుగా తీర్చిదిద్దాలనే అభిప్రాయం వచ్చింది. దీనిపై అన్ని వర్సిటీల వీసీలు, కమిటీలతో ఎన్‌సీటీఈ అధికారులు సమావేశమయ్యారు. వారి నుంచి కూడా అదే అభిప్రాయం రావడంతో.. 2015-16 నుంచి బీఈడీని రెండేళ్ల కోర్సుగా మార్చారు.
అంచనాలు తారుమారు
రాష్ట్రంలోని 250 ప్రభుత్వ, మైనారిటీ, ప్రైవేట్ బీఈడీ కాలేజీల్లో కలిపి 25 వేల సీట్లున్నాయి. త్వరలో ప్రారంభం కానున్న ఐదు కొత్త కాలేజీలతో మరో 500 సీట్లు పెరుగుతాయి. మార్చి 12న ఎడ్‌సెట్ నోటిఫికేషన్ విడుదల కాగా.. అదేనెల 16వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తులకు ఈనెల 9వ తేదీ ఆఖరు. రూ.1,000 ఆలస్య రుసుముతో ఈనెల 21 తుది గడువు.
ఈ ఏడాది నుంచి బీఈ, బీటెక్ విద్యార్థులు కూడా బీఈడీ చేసేందుకు అవకాశం కల్పించడంతో.. దాదాపు లక్ష దరఖాస్తులు వస్తాయని అధికారులు అంచనా వేశారు. కానీ ఇప్పటివరకు అందినవి 44 వేలు మాత్రమే. ఆలస్య రుసుముతో సహ గడువు ముగిసే సరికి మరో 15 వేల దరఖాస్తులు రావొచ్చని.. మొత్తంగా 60 వేలకే పరిమితం కావొచ్చని అధికారులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు గడువు పొడిగించాలన్న యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
బీఈడీకి ఆ క్రేజ్ ఏదీ!
Published Sat, May 9 2015 12:01 AM | Last Updated on Sun, Sep 3 2017 1:40 AM
Advertisement
Advertisement