అనర్హులే అధ్యాపకులు
- తరగతుల నిర్వహణ మృగ్యం
- శిక్షణకు నోచుకోని ఛాత్రోపాధ్యాయులు
- వసూళ్లకే యాజమాన్యాలు పరిమితం!
శాతవాహన యూనివర్సిటీ: కర్ణుడి చావుకు కారణాలనేకం అన్నట్లుగా మారింది బీఈడీ(బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యూకేషన్) విద్య పరిస్థితి. ఛాత్రోపాధ్యాయులకు నాణ్యమైన శిక్షణ అందని స్థితి. యూనివర్సిటీ అధికారుల పర్యవేక్షణ లోపంతోనే ఈ దుస్థితి. ఈ రెగ్యూలర్ కోర్సు కాస్తా దూరవిద్యా విధానాన్ని తలపిస్తోంది. ప్రవేశం పొందిన సగం మంది ఉద్యోగాలు చేస్తూ, ఏదో ఒక వంకతో డుమ్మా కొడుతున్నారు. తరగతి గదులు వెలవెలబోతున్నాయి. ఇదే అదనుగా కళాశాలల యాజమాన్యాలు సైతం తక్కువ విద్యార్హతలున్న అధ్యాపకులను నియమిస్తూ సొమ్ము ఆదా చేసుకుంటున్నాయి. జిల్లాలో చాలాచోట్ల ఇదే పరిస్థితి ఉంది.
కోర్సు తీరుతెన్నులివీ..
యూనివర్సిటీ ప్రకారం పని దినాల సంఖ్య 200. ఛాత్రోపాధ్యాయుల హాజరు కనీసం 80 శాతం ఉండాలనేది నిబంధన. కమ్యూనిటీ స్టడీస్, కేస్ స్టడీ అండ్ లైఫ్ స్కిల్స్, స్కూల్ స్టడీ అండ్ యాక్షన్ రీసెర్చ్, ఐసీటీ, మెథడ్-1,2 రికార్డులు రాసి కళాశాలలో అప్పగించాలి. వీటితోపాటు మైక్రో టీచింగ్ రికార్డ్స్‌ను ఛాత్రోపాధ్యాయులు రాయాలి. క్షేత్రస్థాయిలో మాక్రో టీచింగ్ కోసం కళాశాల కేటాయించిన ప్రభుత్వ, ప్రయివేట్ పాఠశాలలో ఛాత్రోపాధ్యాయులు బోధన చేయాలి. ఇవన్నీ చేస్తే గాని శిక్షణ పూర్తికాదు. కానీ కొన్ని కళాశాలలు వసూళ్లకు తెరతీస్తూ ఛాత్రోపాధ్యాయులను తరగతులకు హాజరుకాకుండా పరోక్షంగా ప్రోత్సహిస్తున్నాయనే ఆరోపణలున్నాయి.
సెప్టెంబర్‌లో పరీక్షల నేపథ్యంలో వర్సిటీ పరిధిలోని బీఈడీ కళాశాలల్లో ఛాత్రోపాధ్యాయుల నుంచి ఫీజు తీసుకోవాలని కళాశాలల ప్రిన్సిపాల్స్‌కు ఆదేశాలు అందాయి. కళాశాలకు రాని, వచ్చినా రికార్డ్సు రాయలేని వారిపై వీరు ‘ఫిక్స్‌డ్’ ఫీజులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. కళాశాలకు మొత్తానికే రాకుంటే రూ.10 నుంచి రూ. 20 వేలు, రికార్డులు రాయకుంటే రూ.5 వేలు వసూలు చేస్తున్నట్లు తెలిసింది.
నిబంధనల ప్రకారం ఫీజు..
బీఈడీ పరీక్ష ఫీజును యూనివర్సిటీ అధికారులు విడుదల చేశారు. పరీక్ష ఫీజు రూ.1050, ప్రొవిజనల్ సర్టిఫికెట్ ఫీజు రూ.300, ఆన్‌లైన్ రుసుము రూ. 30, స్టూడెంట్ రిజిస్ట్రేషన్ రూ.240, స్టూడెంట్ రిగ్ననైజేషన్ రూ.600, ప్రొసెసింగ్ రుసుము రూ.250, వెల్ఫేర్ ఫీజు రూ. 20, ఇంటర్‌యూనివర్సిటీ స్పోర్ట్స్ ఫీజు రూ. 40.. మొత్తంగా రూ.2530 చెల్లించాలి.
లేని వసతులకు ఫీజులెందుకు.. రికార్డులెందుకు..
జిల్లాలోని అనేక కళాశాల్లో కంప్యూటర్ ల్యాబ్‌లు లేవు, ఉన్నా వినియోగంలోకి రావడం లేదని ఛాత్రోపాధ్యాయులే పేర్కొంటున్నారు. మరి కంప్యూటర్ రికార్డ్స్ ఎందుకనే ప్రశ్న తలెత్తుతోంది. ఇంటర్ యూనివర్సిటీ కింద వసూలు చేసే రూ. 40 సైతం వర్సిటీకి ఎందుకు కట్టాలనే ప్రశ్నా సహేతుకమే. వర్సిటీ పర్యవేక్షణ ఉంటే బోధన సరిగా జరిగేదని ఛాత్రోపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, అన్ని వసతులు కల్పించిన కళాశాలలు, కల్పించని కళాశాలలకు ఒకేలా ఫీజు రీయింబర్స్‌మెంట్, పరీక్షలకు హాజరయ్యే అవకాశం కల్పిస్తున్నారు. దీంతో మెరుగైన నిబంధనలు పాటించే యాజమాన్యాలు పెదవి విరుస్తున్నాయి.
అధ్యాపకులేరి?
జిల్లాలోని 20 బీఈడీ కళాశాలల్లో 2000 మంది ఛాత్రోపాధ్యాయులున్నారు. కళాశాలలో అన్ని మెథడ్స్ బోధించే అధ్యాపకులు దాదాపుగా లేరనే చెప్పాలి. ప్రభుత్వానికి ఏవో పేర్లు చూపి కళాశాల యాజమాన్యాలు గుర్తింపు కాపాడుకుంటున్నాయి. అధ్యాపకులుగా ఎంఈడీ వారే ఉండాలి. కానీ అర్హతల విషయంలో యాజమాన్యాలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయి. కోర్సు ఇంత లోపభూయిష్టంగా ఉండడం వల్లే అనేక మంది బీఈడీ చేసిన వారు ఉపాధి లేకుండా ఉంటున్నారనే అభిప్రాయం ఉంది.
బీఈడీ కోర్సుపై బెంగ!
Published Tue, Aug 5 2014 1:44 AM | Last Updated on Thu, Jul 11 2019 5:31 PM
Advertisement
Advertisement