-ఇంజనీరింగ్ అధ్యాపకులకు శిక్షణ
-ఏటా నాలుగు వేల మందికి
-ఐదు రాష్ట్రాల అధ్యాపకులకు ఇక్కడే
వరంగల్ : ప్రతిష్టాత్మక వరంగల్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్) మరో గుర్తింపు పొందింది. ఇంజనీరింగ్ బోధనను మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో విద్య నాణ్యతా ప్రమాణలు పెంచేందుకు ప్రత్యేక శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ అకాడమిక్ పేరుతో దేశవ్యాప్తంగా ఏడు కేంద్రాల్లో ఈ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ప్రతి ఏటా నాలుగు వేల మంది అధ్యాపకులకు శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ), ఎలక్ట్రానిక్స్ రంగంలో ప్రసిద్ధిగాంచిన ఐబీఎం, సీడాక్, టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి సంస్థలు ఈ శిక్షణలో భాగస్వాములవుతున్నాయి. వరంగల్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ దీంట్లో ఒకటిగా ఉంది. వరంగల్‌లో నిట్‌లో తొలివిడతలో ఇప్పటికే 750 మంది అధ్యాపకులకు ఇటీవలే శిక్షణ పూర్తి చేశారు. శిక్షణ కోసం ప్రతి అధ్యాపకుడికి రూ.15 వేల ఖర్చవుతోంది. కేంద్ర ప్రభుత్వం ఒక్కో అధ్యాపకుడి కోసం రూ.12,500 కేటాయిస్తుండగా ఐదేళ్ల శిక్షణ కోసం వరంగల్ నిట్‌కు రూ.25 కోట్ల గ్రాంట్ అందనుంది.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో నిత్యం కొత్త సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తోంది. కమ్యూనికేషన్ రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వీటిపై ప్రైవేటు కాలేజీల అధ్యాపకులకు పూర్తి స్థాయిలో అవగాహన ఉండడం లేదు. ప్రథమశ్రేణి నగరాలను మినహాయించి.. మిగిలిన ప్రాంతాల్లోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల నుంచి ఏటా లక్షల మంది విద్యార్థులు ఉత్తీర్ణులవుతున్నారు. వీరిలో 80 శాతం మంది నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారని మానవవనరుల శాఖ అధ్యయనంలో తేలింది.
అకడమిక్ అంశాల్లో పట్టులేకపోవడం, మార్కెట్ అవసరాలకు తగినట్లుగా నైపుణ్యం లోపించడం వంటి కారాణాలతో ఉద్యోగాలు పొందలేకపోతున్నారని ఈ అధ్యయనం పేర్కొంది. ఈ సమస్యను అధిగమించేందుకు కేంద్ర సమాచార సాంకేతిక శాఖ చర్యలు చేపట్టింది. ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లోని అధ్యాపకుల్లో బోధన నైపుణ్యం పెంచే విధంగా ప్రణాళిక రూపొందించింది. ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ అకాడమిక్ టెక్నాలజీ (ఐసీటీ) పేరుతో అధ్యాపకులకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. దీని కోసం దేశ వ్యాప్తంగా ఏడు కేంద్రాలను ఎంపిక చేసింది. దక్షిణ భారతదేశంలోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, గోవా, అండమాన్‌నికోబార్‌లకు చెందిన అధ్యాపకులకు వరంగల్ నిట్‌లో శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసింది.
ఐదేళ్లపాటు శిక్షణ..
ఇంజనీరింగ్ కాలేజీల అధ్యాపకులకు శిక్షణ ఇచ్చే కార్యక్రమం వరంగల్ నిట్‌లో ఐదేళ్లపాటు కొనసాగుతుందని నిట్ డైరెక్టర్ ఫ్రొపెసర్ టి.శ్రీనివాసరావు తెలిపారు. ఎలక్ట్రానిక్స్, ఐటీ రంగాల్లో వస్తున్న మార్పులు, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు అనువైన బోధన పద్ధతులపై శిక్షణ ఇస్తారు. సెమినార్లు, కాన్ఫరెన్సులు, వర్క్‌షాపులు నిర్వహిస్తారని పేర్కొన్నారు.
నిట్ ఇక శిక్షణాలయం కూడా...
Published Thu, May 26 2016 8:19 PM | Last Updated on Mon, Sep 4 2017 12:59 AM
Advertisement
Advertisement