కొత్తగా ‘బీఈఎల్‌ఈడీ’ కోర్సు!
ఉపాధ్యాయ విద్యలో మరిన్ని
సంస్కరణలు చేపట్టనున్న ఎన్‌సీటీఈ
వచ్చే ఏడాది నుంచి అమల్లోకి.. ఎస్జీటీ పోస్టులకు ఈ కోర్సుతో అర్హత
డీఎడ్ అభ్యర్థులకు ‘నాలుగేళ్ల బీఎడ్’ లోకి లేటరల్ ఎంట్రీ.. నేరుగా మూడో సంవత్సరంలో చేరే అవకాశం
హైదరాబాద్: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఎల్‌ఈడీ.. గతంలో డీఎడ్) అభ్యర్థులకు నాలుగేళ్ల ‘బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్)’ కోర్సులో లేటరల్ ఎంట్రీకి అవకాశం కల్పించేందుకు జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్‌సీటీఈ) కసరత్తు చేస్తోంది. రెండేళ్ల డీఈఎల్‌ఈడీ కోర్సు చదివే విద్యార్థులు... నేరుగా నాలుగేళ్ల బీఎడ్ కోర్సులోని మూడో సంవత్సరంలో చేరే అవకాశం కల్పించనుంది. ఉపాధ్యాయ విద్యలో సంస్కరణల్లో భాగంగా.. ఇప్పటివరకూ కాలమే ఉన్న బీఎడ్, మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (ఎంఎడ్) కోర్సులను రెండేళ్ల కాల వ్యవధిగల కోర్సులుగా ఎన్‌సీటీఈ మార్పు చేసింది. దీంతోపాటు బీఎడ్, డీఈఎల్‌ఈడీలో 30 శాతం మార్కులను ఇంటర్నల్స్‌కు కేటాయించే విధానాన్ని అమలు పరచనుంది. వచ్చే ఏడాది నుంచి ఈ సంస్కరణలు అమల్లోకి రాబోతున్నాయి. వీటితోపాటు నాలుగేళ్ల బీఎడ్ కోర్సును కూడా యూనివర్సిటీ కాలేజీల్లో ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో చేరే అభ్యర్థులు డీఈఎల్‌ఈడీ కోర్సును పూర్తి చేయడమే కాకుండా.. డిగ్రీతో కూడిన బీఎడ్ కోర్సును కూడా పూర్తి చేసినట్లు అవుతుంది. దీంతో ఆ అభ్యర్థులకు రెండు రకాల ప్రయోజనం చేకూరనుంది. డీఈఎల్‌ఈడీ అర్హతతో ఎస్జీటీ పోస్టులకు, బీఎడ్ అర్హతతో స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు వారు దరఖాస్తు చేసుకునేందుకు వీలు ఏర్పడనుంది.
నాలుగేళ్ల బీఈఎల్‌ఈడీ..
జస్టిస్ వర్మ కమిటీ సిఫారసుల మేరకు చేపట్టిన ఉపాధ్యాయ విద్య సంస్కరణల్లో భాగంగా సమీకృత (ఇంటిగ్రేటెడ్) విద్యా కోర్సులకు ఎన్‌సీటీఈ ప్రాధాన్యం ఇస్తోంది. అందులో భాగంగా నాలుగేళ్ల ‘బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (బీఈఎల్‌ఈడీ)’ కోర్సును ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. దీనిపై ఇప్పటికే ఢిల్లీలోని రీజినల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ (ఆర్‌ఐఈ)కి చెందిన ప్రొఫెసర్ పూనమ్ బాత్రా కసరత్తు చేస్తున్నారు. వీలైతే ఈ కోర్సును వచ్చే విద్యా సంవత్సరంలో అమల్లోకి తేవాలని ఎన్‌సీటీఈ భావిస్తోంది. ప్రస్తుతం డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (ఇంతకుముందటి డీఎడ్) అభ్యర్థులకే పరిమితమైన ఎస్జీటీ పోస్టుల్లో ఇకపై ‘బీఈఎల్‌ఈడీ’ అభ్యర్థులకు కూడా అవకాశం ఉంటుంది. అంతేగాకుండా ఈ కోర్సు చేసినవారు 6, 7, 8 తరగతుల్లో స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందని విద్యాశాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. దీనిని మొదట యూనివర్సిటీ కాలేజీల్లో ప్రారంభించే అవకాశం ఉందని తెలిపారు.
డీఈఎల్‌ఈడీ, బీఎడ్ సిలబ స్‌లోనూ మార్పులు..
రాష్ట్రంలో విద్యార్థులు బట్టీపట్టే విధానానికి స్వస్తిచెప్పేందుకు ఒకటి నుంచి పదో తరగతి వరకు పాఠ్య పుస్తకాలను మార్పు చేసిన సంగతి తెలిసిందే. తరగతుల్లో చేసిన ఈ మార్పులకు అనుగుణంగా డీఈఎల్‌ఈడీ, బీఎడ్ కోర్సుల్లోనూ సిలబస్‌ను మార్పు చేయాలని రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) భావిస్తోంది. ప్రస్తుతం పనిచేస్తున్న టీచర్లకు కొత్త పాఠ్య పుస్తకాల ప్రకారం శిక్షణ ఇవ్వడంతోపాటు ఉపాధ్యాయ విద్య చదివే అభ్యర్థులకు కూడా ఈ కొత్త విధానంలో బోధన పద్ధతులు నేర్పించేందుకు సిద్ధమవుతోంది. త్వరలోనే దీనిపై నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని భావిస్తోంది.