సారూ..ఇదేమి తీరు! | Government Teachers Submitted Fake Certificates For Promotion In Anantapur | Sakshi
Sakshi News home page

సారూ..ఇదేమి తీరు!

Published Thu, Jul 15 2021 9:31 AM | Last Updated on Thu, Jul 15 2021 9:34 AM

Government Teachers Submitted Fake Certificates For Promotion In Anantapur - Sakshi

వారిది సమాజంలో ఉన్నత స్థానం. భావిభారత పౌరులను తయారు చేసే బాధ్యత గల ఉద్యోగం. అలాంటి స్థానంలో ఉన్న కొందరు అడ్డదారులు తొక్కారు. పదోన్నతి కోసం ఏకంగా నకిలీ సర్టిఫికెట్లు సమర్పించారు. తద్వారా ప్రభుత్వాన్ని కూడా తప్పుదోవ పట్టించారు. 2009 ఫిబ్రవరి నుంచి ఈ దందా సాగింది.   

సాక్షి,అనంతపురం: ఉపాధ్యాయుల నియామకం కోసం 2009 సంవత్సరంలో మెగా డీఎస్సీ నిర్వహించారు. ఆ సమయంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల్లో 70 శాతం పదోన్నతుల ద్వారా, 30 శాతం నేరుగా భర్తీ చేశారు. భారీ స్థాయిలో పదోన్నతులకు అవకాశం కల్పించడంతో కొందరు పోస్టు గ్రాడ్యుయేషన్‌ (పీజీ) చదవకపోయినా.. నకిలీ సర్టిఫికెట్లు సమర్పించి  సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్జీటీ) నుంచి స్కూల్‌ అసిస్టెంట్‌గా పదోన్నతి పొందారు. అప్పట్లో స్కూల్‌ అసిస్టెంట్‌ ఇంగ్లిష్‌లో 380, ఫిజికల్‌ సైన్స్‌లో 398, మేథమేటిక్స్‌లో 412, బయలాజికల్‌ సైన్స్‌లో 370, సోషల్‌ స్టడీస్‌లో 450 మందికి పదోన్నతులు దక్కాయి.  

ఇంగ్లిష్‌లో అక్రమాలు అత్యధికం.. 
స్కూల్‌ అసిస్టెంట్‌గా పదోన్నతి దక్కాలంటే బీఈడీలో సంబంధిత సబ్జెక్టు (మెథడాలజీ) చదివి ఉండాలి. అయితే ఇంగ్లిష్‌ సబ్జెక్టుకు మాత్రం బీఈడీలో సంబంధిత మెథడాలజీతో పాటు డిగ్రీలో ఇంగ్లిష్‌ లిటరేచర్‌ లేదా ఎంఏ ఇంగ్లిష్‌ చదివి ఉండాలి. ఒకే దఫా 380 మందికి ఇంగ్లిష్‌ ఎస్‌ఏలుగా పదోన్నతులు వచ్చాయి. దీంతో పీజీ పూర్తి చేయని వారు కూడా నకిలీ సర్టిఫికెట్లు సమర్పించి పదోన్నతులు పొందారు. 52 మంది ఇలా అక్రమ మార్గంలో పదోన్నతులు తీసుకున్నట్లు తెలుస్తోంది. నకిలీ సర్టిఫికెట్ల అంశంపై  ఫిర్యాదులు వెళ్లడంతో అప్పటి విద్యాశాఖ కమిషనర్‌ పూనం మాలకొండయ్య విచారణకు ఆదేశించారు. సీబీసీఐడీ దర్యాప్తు కూడా చేయించారు. అయితే సీబీసీఐడీ దర్యాప్తునకు అప్పటి విద్యాశాఖ అధికారులు తగిన సహకారం అందించలేదు. కమిషనర్‌ నేరుగా చర్యలు తీసుకోవడానికి సిద్ధమైనప్పటికీ ఉద్దేశపూర్వకంగానే వివరాలివ్వకుండా జాప్యం చేశారు.  

ఇద్దరిని సస్పెండ్‌ చేసి.. 
భారీఎత్తున సాగిన అక్రమ పదోన్నతుల వ్యవహారాన్ని మరుగున పరిచేందుకు అప్పటి విద్యాశాఖ అధికారులు తెలివిగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఇతర రాష్ట్రాల్లోని గుర్తింపు లేని యూనివర్సిటీల పేరిట ఎంఏ ఇంగ్లిష్‌ పీజీ సర్టిఫికెట్లు సమర్పించిన ఇద్దరు ఉపాధ్యాయులను సస్పెండ్‌ చేసి మొత్తం వ్యవహారాన్ని మరుగున పడేలా చేశారు. ఈ రెండు మాత్రమే నకిలీ సర్టిఫికెట్లు అని పదేపదే  ప్రచారం చేయడం ద్వారా మిగిలిన వారి గుట్టురట్టు కాకుండా జాగ్రత్త పడ్డారు. 

నిబంధనలకు విరుద్ధంగా వ్యవహారం.. 
ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు దూరవిద్య విధానంలో పీజీ చేయాలంటే ముందస్తుగా అధికారుల అనుమతి తీసుకోవాలి.  వారాంతాల్లో జరిగే దూరవిద్య తరగతులకు హాజరుకావాలి. పరీక్షలు జరిగినప్పుడు.. అందుకు సంబంధించిన పూర్వానుమతి తీసుకోవాలి. కానీ ఇవేవీ లేకుండానే యూజీసీ నిషేధం విధించిన అలగప్ప, వినాయక మిషన్స్, మధురై కామరాజ్, భారతీయార్‌ వంటి వర్సిటీల పేరిట ఎంఏ ఇంగ్లిష్‌ సర్టిఫికెట్లు తెచ్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని యూనివర్సిటీల పేర్లతోనూ సర్టిఫికెట్లు తెచ్చినప్పటికీ ..నిబంధనలు పాటించలేదని పూనం మాలకొండయ్య ఇచ్చిన నివేదికలో స్పష్టం చేశారు.

2009లోనే కాకుండా ఆ తర్వాత చేపట్టిన పదోన్నతుల్లోనూ ఇంగ్లిష్‌తో పాటు మరికొన్ని సబ్జెక్టుల్లో కొందరు అక్రమ మార్గాలు అనుసరించినట్లు తెలుస్తోంది. అక్రమ పదోన్నతుల వ్యవహారం ఉపాధ్యాయ వర్గాల్లో తరచూ చర్చకు వస్తోంది. ఇటీవల కూడా ఏసీబీకి, విద్యాశాఖ కమిషనర్‌కు కొందరు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో ఈ అంశం మరోసారి చర్చనీయాంశమైంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement