ఆ కాలేజీలకు అనుబంధ గుర్తింపునివ్వండి
రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్‌సీటీఈ) గుర్తింపు ఉన్న బీఈడీ కాలేజీలకు అనుబంధ గుర్తింపునివ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అనుబంధ గుర్తింపు ఇవ్వకపోవడాన్ని సవాలు చేస్తూ పలు బీఈడీ కాలేజీలు హైకోర్టును ఆశ్రయించాయి. వ్యాజ్యాలపై విచారణ చేపట్టిన జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు తీర్పు వెలువరించారు.
కాలేజీల ఆర్థిక వనరులు, ఉన్న సౌకర్యాలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకునే ఎన్‌సీటీఈ గుర్తింపునిచ్చిందని న్యాయమూర్తి తెలిపారు. నిర్దిష్ట విధానంలో శిక్షణ పొందిన బోధన సిబ్బంది లేరన్న కారణంతో అనుబంధ గుర్తింపు తిరస్కరించడం సరికాదన్నారు. ఈ విద్యా సంవత్సరం జరిగే కౌన్సెలింగ్‌లో సంబంధిత కాలేజీలకు విద్యార్థులను కేటాయించాలని ఉన్నత విద్యా మండలిని న్యాయమూర్తి ఆదేశించారు.