మిథ్యా బోధన !
సమాజాన్ని ప్రభావితం చేసే సత్తా ఒక గురువుకే ఉంది. తన జీవిత కాలంలో వేల మంది విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దగల నేర్పు, ఓర్పు వీరి సొంతం. అటువంటి మహోన్నతమైన వృత్తిలోకి రాబోతున్న వారికి గుడ్డి శిక్షణ నిచ్చే కళాశాలలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. తరగతులకు డుమ్మా కొట్టే చక్కని అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఫీజుల రూపంలో వేల రూపాయలు పిండుతూ నిబంధనలకు తిలోదకాలిస్తున్నాయి. జిల్లాలో ప్రైవేట్ బీఈడీ, డీఈడీ కళాశాలల తీరు ఇది.
ఆళ్లగడ్డ టౌన్ : ఉపాధ్యాయ ఉద్యోగం సాధించాలంటే కచ్చితంగా డీఈడీ (డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్) లేదంటే బీఈడీ(బ్యాచ్‌లర్ ఆఫ్ ఎడ్యుకేషన్) చదివి ఉండాలి. ఈ కోర్సులకు డిమాండ్ బాగా ఉంది. దీంతో ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయి. రికార్డుల పరంగా ఉన్న మార్కులను వీరు వజ్రాయుధంగా వాడుకుంటున్నారు. విద్యార్థుల నుంచి వేల రూపాయల్లో అక్రమంగా ఫీజులను దండుకుంటున్నారు.
జిల్లాలో 63 సీట్లు ఉన్న ప్రైవేటు డీఎడ్ కళాశాలలు 50, వంద సీట్లు ఉన్న కళాశాలలు నాలుగు ఉన్నాయి. అలాగే ప్రైవేట్ బీఎడ్ కళాశాలలు 41 ఉన్నాయి. డైట్, ఎడ్ సెట్ అర్హత పరీక్ష రాసి కౌన్సెలింగ్‌లో సీటు సాధించిన వారికే ప్రవేశాలు ఉంటాయి. ప్రభుత్వ కళాశాలో రూ.230, ప్రైవేటు కళాశాలకు అయితే ఏడాదికి రూ. 12500 చొప్పున ఫీజు చెల్లించాలి అంతకు మించి ఒక్క రూపాయి కూడా ఎక్కువ వసూలు చేయకూడదని నిబంధనలున్నాయి. అయితే ప్రైవేట్ కళాశాలల్లో ఈ నిబంధనలు అమలు కావడం లేదు.
ఇవీ నిబంధనలు..
► నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ నిబంధనల ప్రకారం ప్రతి కళాశాలలలో పది గదులకు తక్కువ కాకుండా ఉండాలి.
► {పథమ సంవత్సరం పది, ద్వితీయ సంవత్సరం పది సబ్జెక్టులు ఉంటాయి. వీటిని బోధించేందుకు ఎంఎడ్ అర్హత కలిగిన ఒక ప్రిన్సిపాల్ సహా 14 మంది లెక్చరర్లు ఉండాలి.
► అర్హత కల్గిని లైబ్రేరియన్, ఫిజికల్ డెరైక్టర్, కంప్యూటర్ ఫ్యాకల్లీ, ల్యాబ్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, సూపరిండెంట్, స్వీపర్, వాచ్‌మెన్ తదితర సిబ్బంది ఉండాలి.
అమలు ఇలా..
► జిల్లాలోని దాదాపు అన్ని ప్రైవేట్ బీఈడీ, డీఈడీ కళాశాలల్లో ఎక్కడా వసతులు లేవు.
► ఒక్కో కళాశాలలో ఇద్దరు లేక ము గ్గురు మాత్రమే సిబ్బంది ఉంటూ అన్ని తామై విధులు దులు నిర్వహిస్తున్నారు.
► కొన్ని చోట్ల అటెండర్ నుంచి మొదులుకుని క్లర్క్, ప్రిన్సిపాల్, లెక్చరర్ అన్నీ వారే అవుతున్నారు.
► ఆళ్లగడ్డ పట్టణంలో ఒకేచోట ఉన్న ఒక బీఈడీ, రెండు డీఈడీ కళాశాల్లో మొత్తం మూడు కళాశాలలకు కలిపి ఇద్దరు సిబ్బంది ఉన్నారు.
► మరో చోట ఉన్న బీఈడీ, డీఈడీ రెండు కళాశాలకు కలుపుకొని ఒక్క రే ప్యూన్ నుంచి ప్రిన్సిపాల్ వరకు వ్యవహరిస్తున్నారు.
► కొన్ని కళాశాలల్లో కనీసం విద్యార్థులు కూర్చునేందుకు అవసరమైన బెంచీలు కూడా లేవు.
ఇవీ ఆఫర్లు
► తరగతులకు రానవసరం లేదు. రికార్డులు రాయనవసరం లేదు. ప్రయోగ పరీక్షలు మేమే చేస్తాం. అయితే ఒక్కో విద్యార్థి రూ. 40 వేల నుంచి రూ. 60 వేలు చెల్లిస్తే చాలు అంటూ కొన్ని కళాశాలలు ఆఫర్లు ఇస్తున్నాయి.
► తరగతులకు రెగ్యులర్‌గా హాజరయ్యేవారు రూ. 100 కూడా చేయని రికార్డులను రూ. 6 వేల నుంచి రూ. 8 వేల వరకు వెచ్చించి కచ్చితంగా కొనుగోలు చేయాల్సిందే.