సాక్షి, రాజమండ్రి :డీఎస్సీలో డీఈడీ అభ్యర్థులకు మళ్లీ అన్యాయం జరిగింది. ప్రభుత్వ విధానాల కారణంగా 2008లో డీఎస్సీ రాయలేక పోయిన డీఈడీ అభ్యర్థులకు వయసు మీరిపోయినా కోర్టు మూడేళ్ల వరకూ అవకాశం కల్పించింది. దీంతో అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకునేందుకు వెళ్లగా వయసు సడలింపును వెబ్‌సైట్లు అనుమతించలేదు. దీంతో ఆన్‌లైన్‌లో సవరణ చేయాలని ముగ్గురు అభ్యర్థులు మళ్లీ కోర్టుకు వెళ్లారు. కోర్టు వారికి నేరుగా దరఖాస్తు చేసుకునే వీలు కల్పించాలని ఆదేశించింది. బుధవారంతో దరఖాస్తు గడువు ముగుస్తుండగా.. ఆన్‌లైన్‌లో, ఈ సేవా కేంద్రాల్లో ఫీజు చెల్లించేందుకు వెళితే సాఫ్ట్‌వేర్ తీసుకోవడం లేదంటున్నారని అభ్యర్థులు వాపోతున్నారు.
పూర్వాపరాలు ఇవీ..
డీఎస్సీ ద్వారా నియమించే సెకండరీ గ్రేడ్ టీచర్లకు డీఈడీ అభ్యర్థుల్ని అనుమతించాలన్న జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి నిబంధనను 2008 డీఎస్సీలో ప్రభుత్వం పాటించలేదు. దీంతో అర్హత ఉన్న అభ్యర్థులు కూడా డీఎస్సీలో పాల్గొనలేకపోయారు. వారిలో వయో పరిమితి దాటిన వారు గత ఏడాది నాటికి రాష్ట్రంలో 2000 మంది ఉన్నారని అంచనా. వీరిలో 200 మందికి పైగా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. నష్టపోయిన అభ్యర్థులకు మూడేళ్ల వయో పరిమితి సడలింపు ఇస్తూ డీఎస్సీకి హాజరయ్యేందుకు అవకాశం ఇవ్వాలని సుప్రీంకోర్టు 2012లో ఆదేశించింది. ఈ మేరకు 2013 నుంచి 2016లోగా జరిగే డీఎస్సీల్లో పాల్గొనే అవకాశం డీఈడీ అభ్యర్థులకు కల్పిస్తామంటూ 2013 నవంబరులో రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉత్తర్వు జారీ చేసింది.
ప్రస్తుతం డీఎస్సీ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో భర్తీ చేస్తున్నందున వయసు రాయతీని సాఫ్ట్‌వేర్ అనుమతించడం లేదని జిల్లాకు చెందిన నాగేశ్వరరావు, పశ్చిమగోదావరికి చెందిన డానియేలు, విజయనగరానికి చెందిన అప్పలరాజు హైకోర్టుకు వెళ్లారు. వీరి దరఖాస్తులను తీసుకోవాలని ఆదేశాలిస్తూ ఈ నెల 8న కోర్టు తీర్పు ఇచ్చింది. ఆ ఆర్డరుతో అభ్యర్థులు డీఈఓ కార్యాలయాలకు వెళితే ఫీజు ఆన్‌లైన్‌లో చెల్లించి రశీదుతో పా టు దరఖాస్తులు సమర్పించమని చెప్పారు. తీరా ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించబోగా పుట్టిన తేదీని సాఫ్ట్‌వేర్ అంగీకరించడం లేదు. బుధవారంతో గడువు ము గుస్తున్నా నేరుగా ఫీజు కట్టే అవకాశం కల్పించనూ లేదు, ఆన్‌లైన్‌లో సవరణా చేయలేదు. కోర్టు ఆదేశించినా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించకపోవడాన్ని నిరసిస్తూ అభ్యర్థులు న్యాయ పోరాటం చేస్తామంటున్నారు.
డీఈడీలకు మళ్లీ అన్యాయం
Published Thu, Jan 22 2015 4:22 AM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM
Advertisement
Advertisement