సాక్షి, హైదరాబాద్: బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్) అభ్యర్థులకు మళ్లీ మంచి రోజులు వచ్చాయి. ఎనిమిదేళ్లుగా సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులకు దూరమైన బీఎడ్ అభ్యర్థులకు మళ్లీ ఎస్జీటీ అవకాశాలు లభించనున్నాయి. ఈ మేరకు జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్‌సీటీఈ) గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో రాష్ట్రంలోని దాదాపు 4 లక్షల మంది బీఎడ్ అభ్యర్థులు స్కూల్ అసిస్టెంట్ పోస్టులతోపాటు ఎస్జీటీ పోస్టులకూ అర్హులు కానున్నారు. అయితే ఒకటి నుంచి 5వ తరగతి వరకూ బోధించేందుకు టీచర్‌గా ఎంపికయ్యే బీఎడ్ అభ్యర్థి తాను నియామకం అయిన తేదీ నుంచి రెండేళ్లలోగా తాము గుర్తించిన విద్యా సంస్థ నుంచి ఎలిమెంటరీ విద్యలో ఆరు నెలల బ్రిడ్జి కోర్సు పూర్తి చేయాలని ఎన్‌సీటీఈ నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది.
అసలేం జరిగిందంటే..
బీఎడ్‌లో చైల్డ్ సైకాలజీ లేదని, చిన్న పిల్లలకు వారు బోధించేందుకు అర్హులు కాదని, 1 నుంచి 5వ తరగతి వరకు ఉన్న ఎస్జీటీ పోస్టులకు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(డీఎడ్) అభ్యర్థులే అర్హులంటూ 2008లో డీఎడ్ అభ్యర్థుల సంఘం సుప్రీంకోర్టును ఆశ్రయిం చింది. వాదోపవాదాల తర్వాత 2010లో ఎస్జీటీ పోస్టులకు డీఎడ్ అభ్యర్థులే అర్హులని, బీఎడ్ అభ్యర్థులు అర్హులు కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. కోర్టు ఆదేశాల మేరకు 1 నుంచి 5వ తరగతి వరకు బోధించేందుకు బీఎడ్ వారు అర్హులు కాదని 2010 ఆగస్టు 23న ఎన్‌సీటీఈ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అప్పటి నుంచి రాష్ట్రంలో చేపట్టిన నియామకాల్లో ఎస్జీటీ పోస్టులకు బీఎడ్ అభ్యర్థులను తీసుకోలేదు. వారిని స్కూల్ అసిస్టెంట్ పోస్టులకే పరిమితం చేసింది. ఎస్జీటీ పోస్టులను డీఎడ్ అభ్యర్థులతోనే భర్తీ చేస్తూ వచ్చాయి.
బీఎడ్ అభ్యర్థుల అభ్యర్థనతో..
1 నుంచి 5వ తరగతి వరకు బోధించేందుకు తమకు అవకాశం ఇవ్వాలని, చైల్డ్ సైకాలజీ సబ్జెక్టును ప్రత్యేకంగా చదువుకుంటామని అనేకసార్లు బీఎడ్ అభ్యర్థులు ఎన్‌సీటీఈని, కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. దీంతో కేంద్రం ఆ దిశగా చర్యలు చేపట్టింది. 50 శాతం మార్కులతో డిగ్రీ, బీఎడ్ పూర్తి చేసిన వారు 1 నుంచి 5వ తరగతి వరకు బోధించేందుకు అర్హులేనని గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఎస్జీటీగా నియమితులైన రెండేళ్లలోగా ఎలిమెంటరీ విద్యలో 6 నెలల బ్రిడ్జి కోర్సును పూర్తి చేయాల్సి ఉంటుందని పేర్కొంది. అయితే ప్రస్తుతం ఎలిమెంటరీ విద్యలో బ్రిడ్జి కోర్సు లేదు. దానిని ఎన్‌సీటీఈ ప్రవేశ పెడుతుందని అధికారులు పేర్కొంటున్నారు. మరోవైపు డీఎడ్ అభ్యర్థులకు ఇప్పటివరకు ఎస్జీటీ పోస్టుల్లో ఉన్న పూర్తి అవకాశం తగ్గిపోనుంది. డీఎడ్, బీఎడ్ అభ్యర్థులు ఇద్దరికి వాటిల్లో అవకాశం ఉండనుంది.
మళ్లీ పూర్వవైభవం వస్తుందా?
ఒకప్పుడు ఏడాది కోర్సుగానే ఉన్న బీఎడ్‌ను ఎన్‌సీటీఈ 2014లో రెండేళ్ల కోర్సుగా మార్పు చేయడం, బీఎడ్ వారికి ఎస్జీటీ పోస్టుల్లో అవకాశం తొలగించడంతో బీఎడ్‌కు డిమాండ్ తగ్గిపోయింది. గతంలో బీఎడ్‌లో చేరేందుకు ఏటా లక్ష మందికిపైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా అది క్రమంగా తగ్గుతూ వచ్చింది. 2018–19లో బీఎడ్‌లో ప్రవేశాల కోసం ఎడ్‌సెట్‌కు 38 వేల మంది మాత్రమే హాజరయ్యారు. ఎన్‌సీటీఈ తాజా నిర్ణయంతో బీఎడ్‌కు మళ్లీ పూర్వ వైభవం వచ్చే అవకాశం ఉందని, ప్రైవేటు పాఠశాలల్లోనూ అవకాశాలు విస్తృతం అవుతాయని అధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment