బీఈడీ కళాశాలల దందా | BEd colleges danda | Sakshi
Sakshi News home page

బీఈడీ కళాశాలల దందా

Published Thu, Aug 27 2015 3:39 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

బీఈడీ కళాశాలల దందా - Sakshi

బీఈడీ కళాశాలల దందా

- పాస్ గ్యారంటీ స్కీమ్
- రూ.కోట్లలో వ్యాపారం
- ఇతర రాష్ట్రాల విద్యార్థులకు వల
ఒంగోలు వన్‌టౌన్ :
జిల్లాలో బీఈడీ విద్యావ్యాపారం మూడు పువ్వులు..ఆరు కాయలు అన్న చందంగా సాగుతోంది. ముఖ్యంగా బీఈడీ కళాశాలల యాజమాన్యాలు దందా చేస్తున్నాయి. విద్యార్థుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేస్తూ కోట్ల రూపాయల్లో వ్యాపారం చేస్తున్నాయి. పాస్ గ్యారంటీ స్కీమ్‌తో విద్యార్థులను ఆకర్షిస్తూ వారి నుంచి భారీ మొత్తాన్ని దోచుకుంటున్నాయి. దళారులను రంగంలోకి దింపి ఇతర రాష్ట్రాల విద్యార్థులకు కూడా వలేసి తమ కళాశాలల్లో చేర్పించుకుంటున్నాయి. కళాశాలలో పట్టుమని 10 రోజులు కూడా తరగతులకు హాజరుకాకున్నప్పటికీ విద్యార్థులు నేరుగా పరీక్షలు రాస్తున్నారు.

ప్రధానంగా జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో కొన్ని బీఈడీ కళాశాలల్లో అక్రమాలకు అంతులేకుండా పోతోంది. విద్యార్థుల నుంచి భారీ మొత్తంలో వసూలు చేసి వారిని పాస్ చేయించేందుకు ఆ కళాశాలల యాజమాన్యాలు మాస్ కాపీయింగ్‌కు తెరతీశాయి. కొన్ని కళాశాలల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి అధిక మొత్తంలో డిమాండ్ చేసి ఇతర రాష్ట్రాల విద్యార్థులకు హాల్‌టికెట్లు ఇచ్చేందుకు నిరాకరించడంతో వారు రోడ్డెక్కి ధర్నా చేశారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
 
ఒక విద్యార్థిని చేర్పిస్తే రూ.10 వేలు...
జిల్లాలో మొత్తం 50 బీఈడీ కళాశాలలున్నాయి. వాటిలో సుమారు 7 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. మంగళవారం నుంచి విద్యార్థులకు పరీక్షలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో బీఈడీ కళాశాలలకు డిమాండ్ పెరగడంతో కళాశాలల యాజమాన్యాలు ఇతర రాష్ట్రాల విద్యార్థులపై దృష్టి కేంద్రీకరించాయి. దళారులను రంగంలోకి దింపి తమ కళాశాలలో విద్యార్థులను చేర్పిస్తే ఒక్కో విద్యార్థికి రూ.10 వేలు చొప్పున చెల్లించేలా ఒప్పందాలు చేసుకున్నాయి. దీంతో దళారులు రంగంలోకి దిగి రాష్ట్రంలోని ఉభయగోదావరి జిల్లాలు, శ్రీకాకుళం, పశ్చిమబెంగాల్, మిజోరం, చత్తీస్‌ఘడ్, ఒరిస్సా తదితర రాష్ట్రాల నుంచి జిల్లాలోని పశ్చిమ ప్రాంత బీఈడీ కళాశాలల్లో విద్యార్థులను చేర్పించారు.

గతంలో ఇతర జిల్లాల నుంచి విద్యార్థులు వచ్చి జిల్లాలోని పశ్చిమప్రాంతంలో 10వ తరగతి, ఇంటర్మీడియెట్ పరీక్షలు రాసేవారు. తాజాగా ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశాలకు యాజమాన్యాలు పీఆర్‌ఓలను రంగంలోకి దించాయి. అదే తరహాలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది బీఈడీ కళాశాలల యాజమాన్యాలు దళారులను రంగంలోకి దింపి తమ కళాశాలలో సీట్లు భర్తీ చేసుకుని కోట్ల రూపాయల్లో వ్యాపారం చేస్తున్నాయి.
 
అధికారుల నిర్లక్ష్యం...
బీఈడీ కళాశాలల యాజమాన్యాలను అదుపు చేయడంలో అధికారులు ఘోరంగా విఫలమయ్యారు. పశ్చిమప్రాంతంలోని కొన్ని కళాశాలల్లో అసలు తరగతులే నిర్వహించడంలేదనేది బహిరంగ రహస్యం. వాటిని ఆకస్మికంగా తనిఖీ చేసి తగిన చర్యలు తీసుకోవాల్సిన అధికారులు.. ఆ దిశగా ప్రయత్నించిన దాఖలాలు లేవు. దీంతో కళాశాలల యాజమాన్యాలు సంబంధిత అధికారులను సైతం కొనేశాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారులైనా స్పందించి జిల్లాలో బీఈడీ కళాశాలలపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం చాలా ఉంది.
 
అడ్డగోలుగా మాస్ కాపీయింగ్...
బీఈడీ కళాశాలల్లో జోరుగా మాస్ కాపీయింగ్ జరుగుతోంది. కొన్ని పరీక్ష కేంద్రాల్లో ముందుగానే ప్రశ్నపత్రాలు విద్యార్థులకు లీకవుతున్నాయి. కేవలం 15 నిమిషాల ముందు మాత్రమే ప్రశ్నపత్రాల బండిళ్లు ఓపెన్ చేయాల్సి ఉండగా, కొన్నిచోట్ల అరగంట ముందుగానే విడుదలచేస్తున్నారు. ప్రశ్నపత్రంలో ఏయే ప్రశ్నలు వచ్చాయో విద్యార్థులకు ముందుగానే చెబుతున్నారు. దీంతో విద్యార్థులు ఆయా ప్రశ్నలకు సంబంధించిన జవాబులను సిద్ధం చేసుకుని నేరుగా పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లి మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతున్నారు.
 
రూ.75 వేల నుంచి రూ.లక్ష వరకూ ఫీజులు...
బీఈడీ కోర్సు వచ్చే విద్యాసంవత్సరం నుంచి రెండు సంవత్సరాలు చదవాల్సి ఉంటుంది. ప్రస్తుత విద్యాసంవత్సరంంలో మాత్రమే ఒక సంవత్సరం కావడంతో విద్యార్థులు ఈ ఏడాది అధిక సంఖ్యలో చేరారు. రాష్ట్రంలో 2008 నుంచి సెకండరీ గ్రేడ్ పోస్టులకు కేవలం డీఈడీ అభ్యర్థులను మాత్రమే అనుమతిస్తుండగా, బీఈడీ అభ్యర్థులు కేవలం స్కూలు అసిస్టెంట్ పోస్టులకు మాత్రమే పరిమితమయ్యారు. స్కూలు అసిస్టెంట్ పోస్టుల సంఖ్య పరిమితంగా ఉండటంతో విద్యార్థులు డీఈడీ కళాశాలల్లో చేరేందుకు మొగ్గుచూపుతున్నారు. దీంతో బీఈడీ కళాశాలలు విద్యార్థుల్లేక వెలవెలబోతున్నాయి.

అయితే వచ్చే విద్యాసంవత్సరం నుంచి బీఈడీ కోర్సు రెండేళ్లుగా ఎన్‌సీటీఈ ప్రకటించింది. దీనికితోడు ఉత్తరాది రాష్ట్రాల్లో బీఈడీ కోర్సు చేసిన వారు సైతం సెకండరీ గ్రేడ్ టీచరు పోస్టులకు అర్హులు. దీంతో డబ్బు పోయినా ఏడాదికి కోర్సు పూర్తవుతుందన్న ఆశతో ఇతర రాష్ట్రాల విద్యార్థులు ఇక్కడి కళాశాలల్లో చేరారు. దళారులు ముందుగానే అభ్యర్థులకు పాస్ గ్యారంటీపై హామీ ఇచ్చారు. ఇక్కడి కళాశాలల్లో చేరితే బ్లాక్ టీచింగ్, రికార్డులన్నీ తామే చూసుకుంటామని నమ్మబలికారు. కేవలం కళాశాలలో అడ్మిషన్ సమయంలో కనిపిస్తే చాలని, అనంతరం నేరుగా వచ్చి పరీక్షలు రాయవచ్చని వారికి హామీ ఇచ్చారు. అందుకుగానూ ఒక్కో అభ్యర్థి వద్ద రూ.75 వేల నుంచి లక్ష రూపాయల వరకు ఫీజులు వసూలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement