
సాక్షి, అమరావతి: డీఈడీ కాలేజీల్లో ప్రవేశాలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించడం లేదంటూ యాజమాన్యాలు దాఖలు చేసిన అప్పీళ్లపై తదుపరి విచారణను హైకోర్టు అక్టోబర్ 16వ తేదీకి వాయిదా వేసింది. కాలేజీల తరఫు న్యాయవాదులు గడువు కోరడంతో విచారణను వాయిదా వేస్తూ న్యాయమూర్తులు జస్టిస్ రాకేష్‌కుమార్, జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులిచ్చింది. ఈ సందర్భంగా ఓ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. కరోనాతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి చేతికి సెలైన్, ఆక్సీమీటర్ తదితరాలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణలో పాల్గొనడంతో అంతా షాక్‌కు గురయ్యారు.
► కరోనాతో మరణశయ్యపై ఉన్నానని, బహుశా ఈ కేసే తాను వాదనలు వినిపించే చివరి కేసు కావచ్చని, తన మొర ఆలకించాలంటూ ధర్మాసనాన్ని సుధాకర్‌రెడ్డి అభ్యర్థించారు. మీ ధర్మాసనం ముందే తాను వాదనలు వినిపించాలనుకుంటున్నానని, బహుశా తనకు మరోసారి అలాంటి అవకాశం వస్తుందో రాదో తెలియదన్నారు. అందువల్ల తన పట్ల దయ చూపాలని వేడుకున్నారు.
► పొన్నవోలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కరోనా తగ్గుముఖంపడుతోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కరోనా నుంచి కోలుకుంటారని, ఆయన తిరిగి తమ ముందు వాదనలు వినిపిస్తారని ధైర్యం చెప్పింది. పొన్నవోలు ధర్మాసనానికి కృతజ్ఞతలు తెలియచేస్తూ అది నిజం కావాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.