ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, అమరావతి: కోవిడ్ మార్గదర్శకాలను, నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. కోవిడ్ మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు 40.68 లక్షల మందికి రూ.32.25 కోట్ల జరిమానా విధించినట్లు తెలిపింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో రూ.6.09 కోట్లు, అనంతపురం జిల్లాలో రూ.5.07 కోట్లు, నెల్లూరు జిల్లాలో రూ.3.85 కోట్లను జరిమానాగా వసూలు చేసినట్లు వివరించింది. ప్రభుత్వ చర్యల వల్ల కోవిడ్ పాజిటివిటీ రేటు బాగా తగ్గిందని, ప్రస్తుతం 1.10 శాతంగా ఉందని తెలిపింది. కోవిడ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతున్నాయనేందుకు ఇది ఓ మంచి సంకేతమని పేర్కొంది. వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ఉధృతంగా సాగుతోందని, 45 ఏళ్లు పైబడిన వారిలో 71.80 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తయిందని వివరించింది.
హెల్త్‌కేర్ వర్కర్లలో 99.42 శాతం మందికి మొదటి డోసు, 94.89 శాతం మందికి రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయిందని తెలిపింది. ఫ్రంట్‌లైన్ వర్కర్లలో 98.89 శాతం మందికి మొదటి డోసు, 85.42 శాతం మందికి పూర్తి వ్యాక్సినేషన్ జరిగిందని తెలిపింది. 18–45 మధ్య వయస్కుల్లో 69.19 శాతం మందికి మొదటి డోసు, 24.09 శాతం మందికి రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయిందని వివరించింది. కోవిడ్‌తో బాధపడుతూ ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య గణనీయంగా తగ్గిందని తెలిపింది. కొన్ని ఆస్పత్రులను డీనోటిఫై చేసినట్లు తెలిపింది.
ఈ వివరాలను పరిశీలించిన ధర్మాసనం.. కోవిడ్ కనిష్ట స్థాయికి చేరుకుందని, ఇప్పుడు వ్యాక్సినేషన్ మాత్రమే మిగిలి ఉందని వ్యాఖ్యానించింది. అందరూ దానిపై దృష్టి సారించాలని సూచించింది. తదుపరి విచారణ అవసరం లేదని, ఈ వ్యాజ్యాలను మూసివేస్తామని తెలిపింది. కోర్టు సహాయకారిగా వ్యవహరిస్తున్న సీనియర్ న్యాయవాది వైవీ రవిప్రసాద్ జోక్యం చేసుకుంటూ.. కోర్టు పర్యవేక్షణ వల్ల కోవిడ్ పరిస్థితులు మెరుగుపడ్డాయని, అందువల్ల మరికొంత కాలం ప్రభుత్వ చర్యలను పర్యవేక్షించాలని కోరారు. ఇందుకు హైకోర్టు అంగీకరిస్తూ తదుపరి విచారణను జనవరి 24కి వాయిదా వేసింది.
ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. కోవిడ్‌కు సంబంధించి ప్రభుత్వానికి పలు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలైన విషయం తెలిసిందే. వీటిపై గత ఏడాది నుంచి విచారణ జరుపుతున్న ధర్మాసనం బుధవారం మరోసారి విచారించింది. ధర్మాసనం ఆదేశాల మేరకు కోవిడ్ విషయంలో తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ మెమో దాఖలు చేశామని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది చింతల సుమన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment