డీఎడ్ కాలేజీల్లో అన్నీ లోపాలే..! | Corruption in Telangana DEd Colleges | Sakshi
Sakshi News home page

డీఎడ్ కాలేజీల్లో అన్నీ లోపాలే..!

Published Wed, Sep 10 2014 1:31 AM | Last Updated on Sat, Sep 2 2017 1:07 PM

డీఎడ్ కాలేజీల్లో అన్నీ లోపాలే..!

డీఎడ్ కాలేజీల్లో అన్నీ లోపాలే..!

* అరకొర వసతులు.. నైపుణ్యం లేని అధ్యాపకులు
 
సాక్షి, హైదరాబాద్: విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాల్సిన కాబోయే ఉపాధ్యాయులకే నాణ్యమైన విద్య అందడంలేదు. సరిగ్గా బోధించలేని అధ్యాపకులు, అరకొర వసతులు వారిని వెక్కిరిస్తున్నాయి. రాష్ట్రం లోని ప్రైవేటు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్) కాలేజీలన్నీ లోపాల పుట్టలే. చాలా కాలేజీల్లో సరిపడా అధ్యాపకులు లేరు. అధ్యాపకులుంటే ల్యాబ్‌లు, లైబ్రరీలు లేవు. అవి ఉన్నవాటిలో సరిపడా తరగతి గదుల్లేవు. కొన్ని డీఎడ్ కాలేజీలైతే ఇంజనీరింగ్, బీఎడ్ కళాశాలల ఆవరణలోనే కొనసాగుతున్నాయి.

ఇక కాలేజీల్లో పనిచేస్తున్న కొద్దిపాటి సిబ్బందిదీ వెట్టిచాకిరే. నెలకు ఆరేడు వేల రూపాయల వేతనంతోనే పని చేయించుకుంటున్నారు. పైగా ఒకే అధ్యాపకుడ్ని రెండు మూడు కాలేజీల్లో చూపించేసి అఫిలియేషన్లు పొందడానికి సిద్ధమయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 259 ప్రైవేటు డీఎడ్ కాలేజీలు ఉన్నాయి. వాటిలో 20 కాలేజీలు కొత్తగా ఏర్పడినవే. కనీసం కొత్త కాలేజీల్లోనైనా అన్ని వసతులు ఉన్నాయా? అంటే అదీ లేదు. అయినా అఫిలియేషన్ల కోసం దరఖాస్తు చేశాయి. వాటిన్నింటినీ పరిశీలించిన విద్యాశాఖ.. లోపాలు సవరించుకోవాలని నోటీసులు ఇస్తూ, ఈ ఒక్క ఏడాదికి అఫిలియేషన్లు ఇచ్చేద్దామని ప్రభుత్వానికి నివేదించడం గమనార్హం.

199 కాలేజీల్లో ఏదో ఒక లోపం
259 ప్రైవేటు డీఎడ్ కాలేజీల్లో నిబంధనల ప్రకారం అగ్నిమాపక చర్యలు ఏ ఒక్క కళాశాలలోనూ లేవు. ఇది కాకుండా 199 కాలేజీల్లో ఏదో ఒక లోపం ఉన్నట్లు విద్యాశాఖ గుర్తించింది. వీటిలోని 55 కాలేజీల్లో బోధన, బోధనేతర సిబ్బంది నిబంధనల మేరకు లేరని తేల్చింది. కేవలం 40 కాలేజీలు మాత్రమే నిబంధనల ప్రకారం ఉన్నట్లు నిర్ధారించింది. 10 కాలేజీల్లో ల్యాబ్ సదుపాయమే లేదని, మరో పది కాలేజీల్లో సరిపడా తరగతి గదులే లేవని, ఇంకో పది కాలేజీల్లో లైబ్రరీలు కూడా లేవని తేలింది. లైబ్రరీ గదులు ఉన్నా వాటిలో పుస్తకాలు లేవని అధికారులు గుర్తించారు. చాలా కాలేజీల్లో సరిపడా అధ్యాపకులే లేకపోగా, ఒకే అధ్యాపకుడు రెండు మూడు కాలేజీల్లో పనిచేస్తున్నట్టు కనుగొన్నారు. వారికి కూడా నిబంధనల ప్రకారం వేతనాలు ఇవ్వడం లేదని తేలింది.

నాలుగేళ్లకు అనుమతులిస్తే అంతే..
ఇలాంటి కాలేజీలు నాలుగేళ్లకు ఒకేసారి అఫిలియేషన్లు పొందేందుకు ప్రభుత్వమే అవకాశం కల్పించింది. ఏటా తనిఖీల పేరుతో అధికారులు ముడుపులు వసూళ్లు చేసుకుంటున్నారు తప్ప.. లోపాలు ఉన్న ఏ ఒక్క కాలేజీపైనా చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో నాలుగేళ్లకు ఒకేసారి అఫిలియేషన్లు ఇచ్చేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విచిత్రం ఏమిటంటే, గత ప్రభుత్వంలోని ఓ మంత్రి నాలుగేళ్లకు ఒకసారి అఫిలియేషన్ ఇచ్చేందుకు రూపొందించిన ఫైలుపై సంతకం చేసేందుకు కూడా యాజమాన్యాల నుంచి ముడుపులు పుచ్చుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.

మొత్తానికి జీఓ వచ్చింది. దానిని ఉపయోగించుకొని ప్రస్తుతం రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలిలో పనిచేసే సిబ్బంది భారీగా ముడుపులు వసూలు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఐదు నెలలుగా ఈ తతంగం కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఒక్కో కాలేజీ నుంచి లోపాలను బట్టి రూ.50 వేల నుంచి రూ.80 వేల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. తాము ఎలాగూ ముడుపులు ముట్టజెప్పామనే ఉద్దేశంతో నాలుగేళ్లకు ఒకేసారి అఫిలియేషన్ పొందేందుకు యాజమాన్యాలు అధికారులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయి.
 
ఏళ్ల తరబడి అక్రమాలే..
డీఎడ్ అఫిలియేషన్ల వ్యవహారంలో ఏళ్ల తరబడి ఇదే తంతు కొనసాగుతోంది. గతంలో ముడుపులకు అలవాటు పడిన అధికారులు, ప్రభుత్వ పెద్దలు చూసీ చూడనట్లు వ్యవహరించారు. తద్వారా ఉపాధ్యాయ విద్యార్థులకు నాసిరకం చదువులే అందించారు. ముందస్తుగా కాలేజీల్లో వసతుల కల్పనకు చర్యలు చేపట్టలేని ప్రభుత్వ పెద్దలు.. ముడుపుల కోసం రెండుమూడు సార్లు తనిఖీల పేరుతో విద్యాసంవత్సరాన్నే ఆలస్యం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. పోనీ తనిఖీలు చేసి ఏ ఒక్క కాలేజీపై అయినా చర్యలు చేపట్టారా? అంటే అదీ లేదు. 2012 జూలైలో ప్రారంభం కావాల్సిన తరగతులను 2013 ఫిబ్రవరిలో ప్రారంభించే స్థితికి తెచ్చారు. ఇదంతా కేవలం కాలేజీల నుంచి ముడుపుల కోసమే చేశారన్న ఆరోపణలు అప్పట్లో పెద్ద ఎత్తున వెల్లువెత్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement