DEd College
-
దిక్కుతోచని స్థితిలో డీఎడ్ కాలేజీలు
ఒకప్పుడు డీఈడీ చదివేందుకు పిల్లలు పోటీ పడేవారు. డీసెట్‌లో ర్యాంకు వచ్చినా రాకపోయినా ఏదో కళాశాలల్లో చేరి కోర్సు పూర్తిచేసేవారు. నేడు ఆ పరిస్థితి లేదు. ఈ ఏడాది నుంచి ప్రభుత్వం డీఈడీ కళాశాలల్లో ప్రవేశం పొందాలంటే డీసెట్‌లో క్వాలిఫైడ్ మార్కులు రావాలని నిబంధన పెట్టింది. చాలా మంది విద్యార్థులు క్వాలిఫై కాకపోవడంతో సీట్లన్నీ మిగిలిపోయాయి. సాక్షి, కడప ఎడ్యుకేషన్: యువత చాలామంది ఉపాధ్యాయ వృత్తిపై ఆసక్తి పెంచుకుంటున్నారు. బీఈడీ చేసిన వారు స్కూల్ అసిస్టెంట్‌గా( 6 నుంచి 10వ తగరతి వరకు) డీఎడ్, టీటీసీ చేసిన వారు ఎస్జీటీ పోస్టులకు(1 నుంచి 5వ తరగతి వరకు) అర్హులు. ప్రస్తుతం ఇంటర్ ఉత్తీర్ణులైన విద్యార్థులు పాఠశాలల్లో ఉపాధ్యాయ వృత్తి చేపట్టేందుకు రెండేళ్ల డిప్లమో ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(డీఎడ్)( 1నుంచి 8వ తరగతి వరకు) కోర్సు తప్పని సరి చేసింది. ప్రభుత్వ డైట్ కళాశాలల్లో కన్వీనర్ కోటాలో అవకాశం రాని వారు ప్రైవేటు డీఎడ్ కళాశాలల్లో మేనేజ్మెంట్ కోటా కింద రూ.లక్షలు చెల్లించి డీఎడ్ కోర్సులో చేరేవారు. గత ఏడాది వరకు డీఎడ్ కోర్సుల్లో చేరాలంటే గగనం. ప్రస్తుత పరిస్థితి మారింది. బీఈడీ చేసిన అభ్యర్థులు సైతం ఎస్జీటీ పోస్టులకు అర్హులేనంటూ 2018 కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇదే విషయాన్ని జాతీయ ఉపాధ్యాయ మండలి(ఎన్సీటీ) సైతం స్పష్టం చేసింది. ఫలితంగా డీఎడ్ కోర్సులకు ఆదరణ తగ్గింది. దీంతోపాటు డీసెట్‌లో క్వాలిఫై అయితేనే కళాశాలల్లో సీటు అని కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఫలితంగా అడ్మిషన్లు పూర్తిగా పడిపోయాయి. ఫలితంగా జిల్లాలో 89 కళాశాలలకు కేవలం 13 కాలేజీల్లో విద్యార్థులు చేరారు. అది కూడా అరకొరే. ఫలితంగా పలు కళాశాలలు మూతపడే దిశగా అడుగులు పడుతున్నాయి. కౌన్సెలింగ్ ముగిసినా... డీఈడీ కళాశాలల్లో తుది కౌన్సెలింగ్ ముగిసినా జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో కలిపి ఇప్పటికి 3 వందల అడ్మిషన్లు మాత్రమే జరిగాయంటే పరిస్థితి ఉహించుకోవచ్చు. జిల్లాలో ఒక ప్రభుత్వ, 89 ప్రైవేటు డీఈడీ కళాశాలలు ఉన్నాయి. వీటిలో ప్రభుత్వ డైట్లో తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూ మీడియం కలుపుకుని ఒక్కో మీడియానికి 50 సీట్ల చొప్పున 150 సీట్లు ఉండగా కేవలం 130 మాత్రమే భర్తీ అయ్యాయి. 89 ప్రైవేటు కళాశాలలకుగాను 170 సీట్లు భర్తీ అయ్యాయి. మొత్తంగా జిల్లాలో ప్రైవేటు, ప్రభుత్వానికి సంబంధించిన 90 డీఈడీ కళాశాలలకు కలుపుకుని మొత్తంగా 6600 సీట్లు ఉండగా మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి 1300 సీట్లకు కేవలం 9 సీట్లు, కన్వీనర్ కోటాకు సంబంధించి 5300 సీట్లకు కేవలం 170 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. మిగతావి ఖాళీగా ఉండటంతో యాజమాన్యం లబోదిబోమంటున్నాయి.2018 తర్వాత బీఈడీ అభ్యర్థులు కూడా ఎస్జీటీ పోస్టులకు అర్హులేనని ప్రభుత్వం ప్రకటించడంతో డీఎడ్ కోర్సులకు మరింత గండంగా మారింది. ప్రస్తుతం జిల్లాలో పదిశాతం సీట్లు కూడా భర్తీకాక డీఎడ్ కోర్సు అంపశయ్యపైకి చేరింది. జిల్లాలో కళాశాలల పరిస్థితి ఇలా... జిల్లాలో ఒక ప్రభుత్వ, 89 ప్రైవేటు డీఈడీ కళాశాలలు ఉన్నాయి.రాయచోటిలో ప్రభుత్వ డైట్ కళాశాల ఉంది. ఇక్కడ ప్రవేట్‌కు సంబంధించి 9 కాలేజీలు ఉండగా ఇందులో 6 మూతపడినట్లు తెలిసింది. మిగతా మూడింటిలో కేవలం ఐదుగురు విద్యార్థులు చేరినట్లు సమాచారం. కడపలో 19 కాలేజీలు ఉండగా కేవలం 4, బద్వేల్లో 5కు గాను మూడు, రాజంపేటలో 5కు గాను రెండు, రైల్వేకోడూరులో 5 కాలేజీలకు రెండు, పొద్దుటూరులో 13కు మూడు, పులివెందుల్లో మూడింటికి రెండు మాత్రమే యాక్టివ్‌లో ఉన్నట్లు తెలిసింది. పరిస్థితి కష్టంగా ఉంది.. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ కళాశాల కాకుండా 89 డీఈడీ కళాశాలలు ఉన్నాయి. వీటిల్లో 6 వేలకు పైగా సీట్లు ఉన్నాయి.ఇప్పటి వరకు కేవలం 3 వందలు మాత్రమే భర్తీ అయ్యాయి.మున్ముందు భర్తీ అయ్యే అవకాశం కనిపించడం లేదు.పరిస్థితి కష్టంగా ఉంది. – చంద్రయ్య, డైట్ ప్రిన్సిపాల్, రాయచోటి పర్యవేక్షిస్తాం... జిల్లాలోని డీఈడీ కళాశాలల స్థితిగతులపై పర్యవేక్షిస్తాం. ఏయే కళాశాలల్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు. వారి పరిస్థితి ఏమిటి అనే విషయాల గురించి కూడా తెలుసుకుంటాం. ఉన్న విద్యార్థులకు బోధన ఎలా జరుగుతుందనే విషయాన్ని పరిశీలిస్తాం. నిబంధనలకు వ్యతిరేకండా ఉంటే చర్యలు తీసుకుంటాం. – మార్తాల వెంకటకృష్ణారెడ్డి, ఆర్జేడీ, పాఠశాల విద్య జిల్లాలో ప్రభుత్వ డైట్ కళాశాలలు: 1 ప్రైవేటు కళాశాలలు: 89 మొత్తం కేటాయించిన సీట్లు: 6600 2019లో భర్తీ అయిన సీట్లు ప్రైవేట్ కళాశాలల్లో: 170 ప్రభుత్వ కళాశాలలో : 130 మేనేజ్మెంట్ కోటా: 09 కన్వీనర్ కోటా: 170 -
ఉపాధ్యాయుడు సామాజిక నిర్మాత
కడప ఎడ్యుకేషన్: ఉపాధ్యాయుడు సామాజిక నిర్మాత అని ఉపాధ్యాయ వత్తిని ఉద్యోగంగా చేయకూడదని పవన్ విద్యాసంస్థల అధినేత లెక్కల జోగిరామిరెడ్డి పేర్కొన్నారు. స్థానిక అక్కాయపల్లెలోని పవన్ డీఎడ్ కళాశాలలో బుధవారం ద్వితీయ సంవత్సర విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయుడు సామాజిక వైద్యుడని, సమాజంలోని సమస్యలపై కూడా పోరాడాలన్నారు. ఉపాధ్యాయులుగా బయటకు వెళ్లిన మీరు సమ సమాజాన్ని నెలకొల్పాలని పిలుపునిచ్చారు. సాయిరాం జూనియర్ కళాశాల కరస్పాండెంట్ రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ సమాజంలో అవినీతి రహిత సమాజాన్ని నిర్మానించడంలో ఉపాధ్యాయులు కీలక పాత్రను పోషించాలన్నారు. ప్రథమ సంవత్సరంలో ఉత్తమ ్రçపతిభను కనబరిచిన శ్రావణి అనే విద్యార్థికి జోగిరామిరెడ్డి బహుమతిని అందజేశారు. కళాశాల ప్రిన్సిపల్ ,అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
కన్వీనరు కోటా.. నిబంధనలకు టాటా
► డీఎడ్ కళాశాలల యాజమాన్యాల ఫీజుల దందా ► కన్వీనర్ కోటాలో సీటొచ్చినా చెల్లించాల్సిందే ► కాలేజి యాజమాన్యాల అనధికార వసూళ్లు ► చెల్లించకుంటే డీఎడ్ అడ్మిషన్ లేనట్టే.. ► ముడుపులతో పట్టించుకోని అధికారులు తిరుపతి: డీఎడ్ కాలేజీల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. ప్రభుత్వం నిర్దేశించిన రుసుం కంటే ఎక్కువ వసూలు చేస్తున్నా ఉన్నత విద్యాశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఫలితంగా విద్యార్థులు న ష్టపోతున్నారు. కాలేజీల నుంచి ఏటా ముడుపులు అందుతున్నందువల్లే అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అనధికారికంగా వసూలు చేస్తున్న ఈ ఫీజులకు కనీసం రశీదు కూడా ఇవ్వకపోవడం గమనార్హం. అనధికార ఫీజులతో డీఎడ్ విద్యార్థులు బెంబేలెత్తుతున్నారు. కన్వీనరు కోటాలో సీటొచ్చినా భారీగా చెల్లించకతప్పడం లేదు. జిల్లాలో 70 డీఎడ్ కాలేజీలున్నాయి. వీటిలో ఒకటి మినహా అన్నీ ప్రైవేట్ కళాశాలలే. ఈ కాలేజీల్లో 4,850 మంది విద్యార్థులున్నారు. ఈ ఏడాది కన్వీనర్ కోటాలో 2,250 మంది చేరారు. ఈ కోటాలో సీటొస్తే ప్రభుత్వానికి కౌన్సెలింగ్సమయంలో రూ.2500 చెల్లించి ఇష్టమైన కాలేజీలో జాయిన్ కావొచ్చు. కాలేజీలో రిపోర్టు చేసే సమయంలో ఎలాంటి ఫీజు చెల్లించాల్సినవసరం లేదు. అయితే కాలేజీ యాజమాన్యాలు మాత్రం కనీసం రూ.15 నుంచి 20 వేలు లైబ్రరీ, బిల్డింగ్, తదితర ఫీజులు చెల్లిస్తేనే చేర్చుకుంటామని తెగేసి చెబుతున్నాయని తెలిసింది. దీంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు షాకవుతున్నారు. కన్వీనర్ కోటాలో కూడా ఈ దోపిడీ ఏమిటని ఆవేదన వ్యక్తంచేస్తున్నా రు. కోర్సు మధ్యలో చెల్లిస్తామన్నా యాజ మాన్యాలు వినిపించుకోవడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు చెప్పారు. ప్రభుత్వమిచ్చే స్కాలర్షిప్ రూ.12 వేలు, అనధికారికంగా మరో 20 వేలు వసూలు చేసుకుం టున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏటా విద్యార్థుల నుంచి అనధికారికంగా రూ.15 నుంచి 20 వేలు వంతున వసూలు చేస్తున్నట్లు భోగట్టా. రూ.5.2 కోట్ల మేర యాజమాన్యాలు ఆర్జిస్తున్నాయి. కఠిన చర్యలు తప్పవు అనధికార ఫీజులు వసూలు చేయడానికి నిబంధనలు అనుమతించవు. దీనిపై రెండు, మూడు జిల్లాల నుంచి ఫిర్యాదులొచ్చాయి. కళాశాలలపై చర్యలు తీసుకునే అధికారం జిల్లా కలెక్టర్, డీఈవో, డైట్ ప్రిన్సిపాల్‌కు ఉంటుంది. ఎవరైనా వారికి ఫిర్యాదు లు చేస్తే ఆ కళాశాలలపై చర్యలు తీసుకుంటాం. - రాజ్యలక్ష్మి, రాష్ట్ర ఎస్సీఈఆర్టీ (రాష్ట్ర పరిశోధన శిక్షణా కౌన్సిల్) డెరైక్టర్ -
డీఎడ్ కాలేజీల్లో అన్నీ లోపాలే..!
* అరకొర వసతులు.. నైపుణ్యం లేని అధ్యాపకులు సాక్షి, హైదరాబాద్: విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాల్సిన కాబోయే ఉపాధ్యాయులకే నాణ్యమైన విద్య అందడంలేదు. సరిగ్గా బోధించలేని అధ్యాపకులు, అరకొర వసతులు వారిని వెక్కిరిస్తున్నాయి. రాష్ట్రం లోని ప్రైవేటు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్) కాలేజీలన్నీ లోపాల పుట్టలే. చాలా కాలేజీల్లో సరిపడా అధ్యాపకులు లేరు. అధ్యాపకులుంటే ల్యాబ్‌లు, లైబ్రరీలు లేవు. అవి ఉన్నవాటిలో సరిపడా తరగతి గదుల్లేవు. కొన్ని డీఎడ్ కాలేజీలైతే ఇంజనీరింగ్, బీఎడ్ కళాశాలల ఆవరణలోనే కొనసాగుతున్నాయి. ఇక కాలేజీల్లో పనిచేస్తున్న కొద్దిపాటి సిబ్బందిదీ వెట్టిచాకిరే. నెలకు ఆరేడు వేల రూపాయల వేతనంతోనే పని చేయించుకుంటున్నారు. పైగా ఒకే అధ్యాపకుడ్ని రెండు మూడు కాలేజీల్లో చూపించేసి అఫిలియేషన్లు పొందడానికి సిద్ధమయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 259 ప్రైవేటు డీఎడ్ కాలేజీలు ఉన్నాయి. వాటిలో 20 కాలేజీలు కొత్తగా ఏర్పడినవే. కనీసం కొత్త కాలేజీల్లోనైనా అన్ని వసతులు ఉన్నాయా? అంటే అదీ లేదు. అయినా అఫిలియేషన్ల కోసం దరఖాస్తు చేశాయి. వాటిన్నింటినీ పరిశీలించిన విద్యాశాఖ.. లోపాలు సవరించుకోవాలని నోటీసులు ఇస్తూ, ఈ ఒక్క ఏడాదికి అఫిలియేషన్లు ఇచ్చేద్దామని ప్రభుత్వానికి నివేదించడం గమనార్హం. 199 కాలేజీల్లో ఏదో ఒక లోపం 259 ప్రైవేటు డీఎడ్ కాలేజీల్లో నిబంధనల ప్రకారం అగ్నిమాపక చర్యలు ఏ ఒక్క కళాశాలలోనూ లేవు. ఇది కాకుండా 199 కాలేజీల్లో ఏదో ఒక లోపం ఉన్నట్లు విద్యాశాఖ గుర్తించింది. వీటిలోని 55 కాలేజీల్లో బోధన, బోధనేతర సిబ్బంది నిబంధనల మేరకు లేరని తేల్చింది. కేవలం 40 కాలేజీలు మాత్రమే నిబంధనల ప్రకారం ఉన్నట్లు నిర్ధారించింది. 10 కాలేజీల్లో ల్యాబ్ సదుపాయమే లేదని, మరో పది కాలేజీల్లో సరిపడా తరగతి గదులే లేవని, ఇంకో పది కాలేజీల్లో లైబ్రరీలు కూడా లేవని తేలింది. లైబ్రరీ గదులు ఉన్నా వాటిలో పుస్తకాలు లేవని అధికారులు గుర్తించారు. చాలా కాలేజీల్లో సరిపడా అధ్యాపకులే లేకపోగా, ఒకే అధ్యాపకుడు రెండు మూడు కాలేజీల్లో పనిచేస్తున్నట్టు కనుగొన్నారు. వారికి కూడా నిబంధనల ప్రకారం వేతనాలు ఇవ్వడం లేదని తేలింది. నాలుగేళ్లకు అనుమతులిస్తే అంతే.. ఇలాంటి కాలేజీలు నాలుగేళ్లకు ఒకేసారి అఫిలియేషన్లు పొందేందుకు ప్రభుత్వమే అవకాశం కల్పించింది. ఏటా తనిఖీల పేరుతో అధికారులు ముడుపులు వసూళ్లు చేసుకుంటున్నారు తప్ప.. లోపాలు ఉన్న ఏ ఒక్క కాలేజీపైనా చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో నాలుగేళ్లకు ఒకేసారి అఫిలియేషన్లు ఇచ్చేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విచిత్రం ఏమిటంటే, గత ప్రభుత్వంలోని ఓ మంత్రి నాలుగేళ్లకు ఒకసారి అఫిలియేషన్ ఇచ్చేందుకు రూపొందించిన ఫైలుపై సంతకం చేసేందుకు కూడా యాజమాన్యాల నుంచి ముడుపులు పుచ్చుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. మొత్తానికి జీఓ వచ్చింది. దానిని ఉపయోగించుకొని ప్రస్తుతం రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలిలో పనిచేసే సిబ్బంది భారీగా ముడుపులు వసూలు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఐదు నెలలుగా ఈ తతంగం కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఒక్కో కాలేజీ నుంచి లోపాలను బట్టి రూ.50 వేల నుంచి రూ.80 వేల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. తాము ఎలాగూ ముడుపులు ముట్టజెప్పామనే ఉద్దేశంతో నాలుగేళ్లకు ఒకేసారి అఫిలియేషన్ పొందేందుకు యాజమాన్యాలు అధికారులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయి. ఏళ్ల తరబడి అక్రమాలే.. డీఎడ్ అఫిలియేషన్ల వ్యవహారంలో ఏళ్ల తరబడి ఇదే తంతు కొనసాగుతోంది. గతంలో ముడుపులకు అలవాటు పడిన అధికారులు, ప్రభుత్వ పెద్దలు చూసీ చూడనట్లు వ్యవహరించారు. తద్వారా ఉపాధ్యాయ విద్యార్థులకు నాసిరకం చదువులే అందించారు. ముందస్తుగా కాలేజీల్లో వసతుల కల్పనకు చర్యలు చేపట్టలేని ప్రభుత్వ పెద్దలు.. ముడుపుల కోసం రెండుమూడు సార్లు తనిఖీల పేరుతో విద్యాసంవత్సరాన్నే ఆలస్యం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. పోనీ తనిఖీలు చేసి ఏ ఒక్క కాలేజీపై అయినా చర్యలు చేపట్టారా? అంటే అదీ లేదు. 2012 జూలైలో ప్రారంభం కావాల్సిన తరగతులను 2013 ఫిబ్రవరిలో ప్రారంభించే స్థితికి తెచ్చారు. ఇదంతా కేవలం కాలేజీల నుంచి ముడుపుల కోసమే చేశారన్న ఆరోపణలు అప్పట్లో పెద్ద ఎత్తున వెల్లువెత్తాయి.