ఒకప్పుడు డీఈడీ చదివేందుకు పిల్లలు పోటీ పడేవారు. డీసెట్‌లో ర్యాంకు వచ్చినా రాకపోయినా ఏదో కళాశాలల్లో చేరి కోర్సు పూర్తిచేసేవారు. నేడు ఆ పరిస్థితి లేదు. ఈ ఏడాది నుంచి ప్రభుత్వం డీఈడీ కళాశాలల్లో ప్రవేశం పొందాలంటే డీసెట్‌లో క్వాలిఫైడ్ మార్కులు రావాలని నిబంధన పెట్టింది. చాలా మంది విద్యార్థులు క్వాలిఫై కాకపోవడంతో సీట్లన్నీ మిగిలిపోయాయి.
సాక్షి, కడప ఎడ్యుకేషన్: యువత చాలామంది ఉపాధ్యాయ వృత్తిపై ఆసక్తి పెంచుకుంటున్నారు. బీఈడీ చేసిన వారు స్కూల్ అసిస్టెంట్‌గా( 6 నుంచి 10వ తగరతి వరకు) డీఎడ్, టీటీసీ చేసిన వారు ఎస్‌జీటీ పోస్టులకు(1 నుంచి 5వ తరగతి వరకు) అర్హులు. ప్రస్తుతం ఇంటర్ ఉత్తీర్ణులైన విద్యార్థులు పాఠశాలల్లో ఉపాధ్యాయ వృత్తి చేపట్టేందుకు రెండేళ్ల డిప్లమో ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(డీఎడ్)( 1నుంచి 8వ తరగతి వరకు) కోర్సు తప్పని సరి చేసింది. ప్రభుత్వ డైట్ కళాశాలల్లో కన్వీనర్ కోటాలో అవకాశం రాని వారు ప్రైవేటు డీఎడ్ కళాశాలల్లో మేనేజ్‌మెంట్ కోటా కింద రూ.లక్షలు చెల్లించి డీఎడ్ కోర్సులో చేరేవారు. గత ఏడాది వరకు డీఎడ్ కోర్సుల్లో చేరాలంటే గగనం.
ప్రస్తుత పరిస్థితి మారింది. బీఈడీ చేసిన అభ్యర్థులు సైతం ఎస్జీటీ పోస్టులకు అర్హులేనంటూ 2018 కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇదే విషయాన్ని జాతీయ ఉపాధ్యాయ మండలి(ఎన్‌సీటీ) సైతం స్పష్టం చేసింది. ఫలితంగా డీఎడ్ కోర్సులకు ఆదరణ తగ్గింది. దీంతోపాటు డీసెట్‌లో క్వాలిఫై అయితేనే కళాశాలల్లో సీటు అని కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఫలితంగా అడ్మిషన్లు పూర్తిగా పడిపోయాయి. ఫలితంగా జిల్లాలో 89 కళాశాలలకు కేవలం 13 కాలేజీల్లో విద్యార్థులు చేరారు. అది కూడా అరకొరే. ఫలితంగా పలు కళాశాలలు మూతపడే దిశగా అడుగులు పడుతున్నాయి.
కౌన్సెలింగ్ ముగిసినా...
డీఈడీ కళాశాలల్లో తుది కౌన్సెలింగ్ ముగిసినా జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో కలిపి ఇప్పటికి 3 వందల అడ్మిషన్లు మాత్రమే జరిగాయంటే పరిస్థితి ఉహించుకోవచ్చు. జిల్లాలో ఒక ప్రభుత్వ, 89 ప్రైవేటు డీఈడీ కళాశాలలు ఉన్నాయి. వీటిలో ప్రభుత్వ డైట్‌లో తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూ మీడియం కలుపుకుని ఒక్కో మీడియానికి 50 సీట్ల చొప్పున 150 సీట్లు ఉండగా కేవలం 130 మాత్రమే భర్తీ అయ్యాయి. 89 ప్రైవేటు కళాశాలలకుగాను 170 సీట్లు భర్తీ అయ్యాయి. మొత్తంగా జిల్లాలో ప్రైవేటు, ప్రభుత్వానికి సంబంధించిన 90 డీఈడీ కళాశాలలకు కలుపుకుని మొత్తంగా 6600 సీట్లు ఉండగా మేనేజ్‌మెంట్ కోటాకు సంబంధించి 1300 సీట్లకు కేవలం 9 సీట్లు, కన్వీనర్ కోటాకు సంబంధించి 5300 సీట్లకు కేవలం 170 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. మిగతావి ఖాళీగా ఉండటంతో యాజమాన్యం లబోదిబోమంటున్నాయి.2018 తర్వాత బీఈడీ అభ్యర్థులు కూడా ఎస్‌జీటీ పోస్టులకు అర్హులేనని ప్రభుత్వం ప్రకటించడంతో డీఎడ్ కోర్సులకు మరింత గండంగా మారింది. ప్రస్తుతం జిల్లాలో పదిశాతం సీట్లు కూడా భర్తీకాక డీఎడ్ కోర్సు అంపశయ్యపైకి చేరింది.
జిల్లాలో కళాశాలల పరిస్థితి ఇలా...
జిల్లాలో ఒక ప్రభుత్వ, 89 ప్రైవేటు డీఈడీ కళాశాలలు ఉన్నాయి.రాయచోటిలో ప్రభుత్వ డైట్ కళాశాల ఉంది. ఇక్కడ ప్రవేట్‌కు సంబంధించి 9 కాలేజీలు ఉండగా ఇందులో 6 మూతపడినట్లు తెలిసింది. మిగతా మూడింటిలో కేవలం ఐదుగురు విద్యార్థులు చేరినట్లు సమాచారం. కడపలో 19 కాలేజీలు ఉండగా కేవలం 4, బద్వేల్‌లో 5కు గాను మూడు, రాజంపేటలో 5కు గాను రెండు, రైల్వేకోడూరులో 5 కాలేజీలకు రెండు, పొద్దుటూరులో 13కు మూడు, పులివెందుల్లో మూడింటికి రెండు మాత్రమే యాక్టివ్‌లో ఉన్నట్లు తెలిసింది.
పరిస్థితి కష్టంగా ఉంది..
జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ కళాశాల కాకుండా 89 డీఈడీ కళాశాలలు ఉన్నాయి. వీటిల్లో 6 వేలకు పైగా సీట్లు ఉన్నాయి.ఇప్పటి వరకు కేవలం 3 వందలు మాత్రమే భర్తీ అయ్యాయి.మున్ముందు భర్తీ అయ్యే అవకాశం కనిపించడం లేదు.పరిస్థితి కష్టంగా ఉంది.
– చంద్రయ్య, డైట్ ప్రిన్సిపాల్, రాయచోటి
పర్యవేక్షిస్తాం...
జిల్లాలోని డీఈడీ కళాశాలల స్థితిగతులపై పర్యవేక్షిస్తాం. ఏయే కళాశాలల్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు. వారి పరిస్థితి ఏమిటి అనే విషయాల గురించి కూడా తెలుసుకుంటాం. ఉన్న విద్యార్థులకు బోధన ఎలా జరుగుతుందనే విషయాన్ని పరిశీలిస్తాం. నిబంధనలకు వ్యతిరేకండా ఉంటే చర్యలు తీసుకుంటాం.
– మార్తాల వెంకటకృష్ణారెడ్డి, ఆర్‌జేడీ, పాఠశాల విద్య
జిల్లాలో ప్రభుత్వ డైట్ కళాశాలలు: 1
ప్రైవేటు కళాశాలలు: 89
మొత్తం కేటాయించిన సీట్లు: 6600
2019లో భర్తీ అయిన సీట్లు
ప్రైవేట్ కళాశాలల్లో: 170
ప్రభుత్వ కళాశాలలో : 130
మేనేజ్‌మెంట్ కోటా: 09
కన్వీనర్ కోటా: 170
Comments
Please login to add a commentAdd a comment