టీచర్ కోర్సుల్లో సమూల మార్పులు | Radical changes in teacher education courses, says santosh panda | Sakshi
Sakshi News home page

టీచర్ కోర్సుల్లో సమూల మార్పులు

Published Fri, Dec 27 2013 2:56 AM | Last Updated on Sat, Sep 2 2017 1:59 AM

టీచర్ కోర్సుల్లో సమూల మార్పులు

టీచర్ కోర్సుల్లో సమూల మార్పులు

* ‘సాక్షి’తో ఎన్‌సీటీఈ చైర్‌పర్సన్ సంతోష్ పండా
 
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ కోర్సుల స్వరూపం పూర్తిగా మారిపోనుందని, ప్రాథమిక విద్యకు, ప్రాథమికోన్నత విద్యకు, సెకండరీ స్కూల్ విద్యకు వేర్వేరు కోర్సులు రానున్నాయని జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి(ఎన్‌సీటీఈ) చైర్‌పర్సన్ సంతోష్ పండా తెలిపారు. జస్టిస్ వర్మ కమిటీ సిఫారసుల మేరకు కేంద్రం ఈ సంస్కరణలు తేనుందని వివరించారు. అయితే ఈ అంశం కోర్టు పరిధిలో ఉందని, కోర్టు ఆదేశాలను బట్టి వీటి అమలు ఉంటుందని తెలిపారు. గురువారం రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల ఉపకులపతులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు.

‘ప్రస్తుతం అమలులో ఉన్న డీఈడీ కోర్సుకు బదులుగా పన్నెండో తరగతి అనంతరం రెండు సమీకృత కోర్సులు ఉంటాయని, ఒకటి డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(డీఈఎల్‌ఈడీ) కాగా మరొకటి బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(బీఈఎల్‌ఈడీ) కోర్సు. డీఈఎల్‌ఈడీ కోర్సు పన్నెండో తరగతి అనంతరం నాలుగేళ్లపాటు ఉండే సమీకృత డిగ్రీ కోర్సు. అంటే డిగ్రీతో పాటు ఉపాధ్యాయ విద్యలో శిక్షణ ఉంటుంది. అయితే ఇది కేవలం ప్రాథమిక విద్యార్థులకు బోధించేందుకు ఉద్దేశించిన శిక్షణ కోర్సు. అంటే ఐదోతరగతి వరకు బోధించవచ్చు.

అలాగే బీఈఎల్‌ఈడీ కోర్సు కూడా పన్నెండో తరగతి అనంతరం నాలుగేళ్ల పాటు చదవాల్సి ఉంటుంది. ఇది కూడా సమీకృత డిగ్రీ కోర్సు. డిగ్రీతోపాటు ఉపాధ్యాయ విద్యలో శిక్షణ ఉంటుంది. ఈ శిక్షణ పొందిన వారు 8వ తరగతి వరకు బోధించవచ్చు. ఇక డిగ్రీ అనంతరం ఉండే బీఈడీ రెండేళ్లపాటు ఉంటుంది. ఇది సెకండరీ విద్యకు సంబంధించింది..’ అని పేర్కొన్నారు.

రాష్ట్రంలో గత ఏడాది ఒకే సంవత్సరం 600 డీఈడీ కళాశాలలకు అనుమతి ఇచ్చారని, వచ్చే ఏడాది కూడా ఇంకా కొత్త కళాశాలలకు అనుమతి ఇవ్వనున్నారా అని ‘సాక్షి’ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ ‘రాష్ట్రంలో ఇప్పటికే అవసరానికి మించి ఉపాధ్యాయ విద్య కళాశాలలు అందుబాటులో ఉన్నాయి. డిమాండ్‌ను బట్టే సరఫరా ఉండాలి. అయితే ఉపాధ్యాయ విద్యలో నాణ్యత మాత్రం చాలా అవసరం. అవసరానికి మించి కళాశాలలు, సీట్ల సంఖ్య ఉంటే కళాశాలలు సంక్షోభంలో కూరుకుపోతాయి..’ అని పేర్కొన్నారు.

వర్మ సిఫార్సుల అమలుకు వర్సిటీలు సిద్ధం కావాలి
దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ విద్యాకోర్సుల్లో సంస్కరణలు తేవాలని సూచించిన జస్టిస్ వర్మ కమిటీ సిఫారసుల అమలుకు విశ్వవిద్యాలయాలు సన్నద్ధం కావాలని కేంద్రం సూచించింది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఆర్.భట్టాచార్య, సహాయక కార్యదర్శి డాక్టర్ అమర్‌జిత్ సింగ్, ఉపాధ్యాయ విద్య జాతీయ మండలి(ఎన్‌సీటీఈ) చైర్మన్ సంతోష్ పండా గురువారం సచివాలయం నుంచి ఉపకులపతులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

బీఈడీ కరికులం, సిలబస్‌లో మార్పుల తీరుపై చర్చించారు. ఉపాధ్యాయ కోర్సుల్లో జస్టిస్ వర్మ కమిటీ చేసిన సిఫారసులను వివరించారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచే ఈ సిఫారసులు అమలుకావాల్సిన ఆవశ్యకతను గుర్తుచేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement