CM YS Jagan Calls for Protection of Wakf Lands in Andhra Pradesh - Sakshi
Sakshi News home page

వక్ఫ్‌ భూములకు భద్రత

Published Tue, Aug 10 2021 2:02 AM | Last Updated on Tue, Aug 10 2021 1:00 PM

CM YS Jagan Decision High Level Review on Minority Welfare Department - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వక్ఫ్‌ భూముల పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. వక్ఫ్‌ భూములపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేయడంతో పాటు స్థలాల చుట్టూ ప్రహరీ గోడల నిర్మాణాన్ని చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ పనులను ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేసే అవకాశాలను పరిశీలించాలన్నారు. మైనారిటీలకూ సబ్‌ ప్లాన్‌ అమలుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లో హజ్‌హౌస్‌ నిర్మాణానికి ముఖ్యమంత్రి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. కర్నూలులో వక్ఫ్‌ ట్రిబ్యునల్‌ ఏర్పాటు దిశగా చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు.  మైనార్టీల సంక్షేమంపై సీఎం జగన్‌ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆ వివరాలివీ..

వక్ఫ్‌ ఆస్తుల రక్షణకు హోంగార్డులు
వక్ఫ్‌ ఆస్తుల పరిరక్షణలో భాగంగా భూముల చుట్టూ కాంపౌండ్‌ వాల్‌ నిర్మాణం చేపట్టి  అనంతరం హోంగార్డులను వాటి రక్షణ కోసం నియమించేలా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వైఎస్సార్‌ జగనన్న సమగ్ర భూ సర్వేతో పాటు వక్ఫ్‌ ఆస్తులు కూడా సర్వే చేయాలని ఆదేశించారు.

కొత్త శ్మశానవాటికలు
మైనార్టీల కోసం కొత్త శ్మశానవాటికల ఏర్పాటుకు ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది ప్రాధాన్యతాంశంగా తీసుకుని వీటి నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. అవసరాలకు తగినట్టుగా కొత్త శ్మశానాలు ఏర్పాటు చేయాలని సూచించారు.
సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌. చిత్రంలో డిప్యూటీ సీఎం అంజాద్‌ తదితరులు 

సకాలంలో గౌరవ వేతనాలు
ఇమామ్‌లు, మౌజంలు, ఫాస్టర్లకు సకాలంలో గౌరవ వేతనాల చెల్లింపులు జరగాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. గౌరవ వేతనాల కోసం అందిన కొత్త దరఖాస్తులను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

మైనార్టీలకూ సబ్‌ ప్లాన్‌
మైనార్టీలకూ సబ్‌ప్లాన్‌ కోసం అధికారులు అందచేసిన ప్రతిపాదనలపై సీఎం స్పందిస్తూ దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించారు. మైనార్టీలకు సబ్‌ప్లాన్‌ అమలైతే నిధులు కూడా మరింత పెరుగుతాయని ముఖ్యమంత్రి తెలిపారు.

ప్రాధాన్యత క్రమంలో పనులు 
మైనారిటీ విద్యార్ధుల వసతి గృహాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. నిర్మాణంలో ఉన్న భవనాల ప్రగతిని సీఎంకు వివరించారు. ఐదు గురుకుల పాఠశాలలు, 2 వసతి గృహాలకు సంబంధించి రూ.75 కోట్లతో చేపడుతున్న పనుల పురోగతిని తెలియచేశారు. పెండింగ్‌ బిల్లుల బకాయిలు చెల్లించడంతోపాటు ఇప్పటికే ప్రారంభమైన అన్ని ప్రాజెక్టులు, అభివృద్ధి పనులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని సీఎం సూచించారు. మైనార్టీ శాఖలో పెండింగ్‌ సమస్యలపై పూర్తి స్ధాయి నివేదిక అందచేయాలని అధికారులను ఆదేశించారు.

విద్యార్థుల నైపుణ్యాభివృద్ధిపై దృష్టి 
మైనార్టీ విద్యార్ధుల్లో నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్ల సేవలను వినియోగించుకోవడం ద్వారా మైనార్టీ వర్గాల విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందించేలా చర్యలు చేపట్టాలన్నారు. కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీ పనుల వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. ప్రాధాన్యత కింద యూనివర్సిటీ పనులను నాడు – నేడు తరహాలో చేపట్టాలని అధికారులకు నిర్దేశించారు. ఉర్దూ అకాడమీని మరింత మెరుగ్గా తీర్చిదిద్దాల్సిందిగా సూచనలు చేశారు. అకాడమీ అభివృద్ధిపై ప్రణాళికలు సిద్ధం చేయాలని, షాదీఖానాల నిర్వహణను మైనారిటీశాఖకు బదిలీ చేయాలని సీఎం ఆదేశించారు.

క్రిస్టియన్‌ భవన్‌ పనులు పూర్తవ్వాలి..
మైనారిటీశాఖలో ఖాళీ పోస్టుల వివరాలను సమీక్ష సందర్భంగా అధికారులు వెల్లడించారు. ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఆర్ధికశాఖ అధికారులతో సమావేశమై నిర్ణయం తీసుకోవాలని సీఎం సూచించారు. విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లో హజ్‌హౌస్‌ నిర్మాణ ప్రతిపాదనకు ముఖ్యమంత్రి జగన్‌ ఆమోదం తెలిపారు. హజ్, వక్ఫ్‌ కమిటీల ఏర్పాటును త్వరగా పూర్తి చేయాలని సూచించారు. గుంటూరు జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో ప్రారంభమై అర్ధాంతరంగా నిలిచిపోయిన క్రిస్టియన్‌ భవన్‌ నిర్మాణ పనులను పూర్తి చేయాలని ఆదేశించారు.
– సమీక్షలో ఉప ముఖ్యమంత్రి (మైనార్టీ సంక్షేమశాఖ) అంజద్‌ బాషా, మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శి గంధం చంద్రుడు, మైనార్టీ సంక్షేమశాఖ కమిషనర్‌ కె.శారదాదేవి, ఏపీ సెంటర్‌ ఫర్‌ సిస్టమ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ సీఈవో పి.రవి సుభాష్, ఏపీ స్టేట్‌ మైనార్టీస్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ వీసీ అండ్‌ ఎండీ అలీం బాషా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో ఆక్రమణలకు గురైన సుమారు 500 ఎకరాలకుపైగా వక్ఫ్‌ బోర్డు  భూములను ఈ రెండేళ్ల వ్యవధిలో తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు సమీక్షలో అధికారులు తెలిపారు. ఆ వివరాలు ఇవీ.. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement