రాష్ట్ర వక్ఫ్ బోర్డు సమావేశంలో మాట్లాడుతున్న బోర్డు చైర్మన్ మహ్మద్ సలీం. చిత్రంలో ఇతర బోర్డు సభ్యులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వక్ఫ్ బోర్డు పాలకవర్గ సమావేశం సందర్భంగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. శనివారం ఉదయం 11 గంటలకు హజ్ హౌస్‌లోని మొదటి అంతస్తులో సమావేశం ప్రారంభం కాగానే.. పలు స్వచ్ఛంద సంస్థలు, మసీదు కమిటీల సభ్యులు సమావేశ మందిరంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు.
వక్ఫ్ చట్టం ప్రకారం కాకుండా బోర్డు ఇష్టానుసారం వక్ఫ్ కమిటీలను ఏర్పాటు చేస్తోందని ఆరోపిస్తూ ఆందోళన చేసేందుకు సిద్ధమయ్యారు. కమిటీలు, వక్ఫ్ నిర్వాహకుల నియామకాలతోనే సమావేశాలు ముగుస్తున్నాయని, వక్ఫ్ ఆస్తులు, భూముల పరిరక్షణకు చర్యలు చేపట్టడం లేదని ఆరోపించారు. కాన్ఫరెన్స్ హాల్ ఎదుట బైఠాయించడానికి ప్రయత్నం చేశారు. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో వక్ఫ్ బోర్డు చైర్మన్ మహ్మద్ సలీం పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగప్రవేశం చేసిన పోలీసులు.. సమావేశం జరుగుతున్న ప్రదేశానికి ఎవరినీ అనుమతించలేదు. హజ్ హౌస్‌లో రాష్ట్ర వక్ఫ్ బోర్డు కార్యాలయంతో పాటు మైనార్టీ సంక్షేమ శాఖకు సంబంధించినఇతర కార్యాలయాలు ఉన్నాయి. దీంతో వాటికి వచ్చే వారికి ఇబ్బందులు ఎదురయ్యాయి. చివరికి ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకోకుండానే సమావేశం వాయిదా పడింది.
మొక్కుబడిగా సమావేశం..
సమావేశం అనంతరం బోర్డు చైర్మన్ సలీం మీడియాతో మాట్లాడుతూ.. కొన్ని మసీదు, పలు సంస్థల పాలకవర్గ కమిటీలకు అనుమతులు ఇచ్చామన్నారు. ముస్లింల మ్యారేజ్ సర్టిఫికెట్ల ఆన్‌లైన్ ప్రక్రియ వాయిదా పడిందన్నారు. వక్ఫ్ కార్యకలాపాలు వేగవంతం చేయడానికి 50 మంది యువకులను ఔట్‌సోర్సింగ్ విధానంలో నియామకంపై వచ్చే పాలకవర్గ సమావేశంలో చర్చిస్తామ న్నారు. 2018కి బడ్జెట్ నివేదిక ఇంకా సిద్ధం కాలేదని, దీన్ని వచ్చే సమావేశంలో ప్రవేశపెడతామని చెప్పారు. వచ్చే నెల 10న మళ్లీ పాలకవర్గ సమావేశం నిర్వహిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment