కర్నూలు(అగ్రికల్చర్): వక్ఫ్ ఆస్తులను పరిరక్షించడం, తద్వారా ఆర్థికాభివృద్ధి సాధించి ముస్లింల అభ్యున్నతికి, సాధికారతకు జిల్లా యంత్రాంగం, జిల్లా వక్ఫ్ కమిటీ చిత్తశుద్ధితో కృషి చేయాలని మైనార్టీ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రిన్సిపల్ కార్యదర్శి షేక్ మహ్మద్ ఇక్బాల్ సాహెబ్ సూచించారు. గురువారం ఆయన వక్ఫ్ పరిరక్షణ కమిటీ సభ్యులు, సంబంధిత అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ వక్ఫ్ చట్టాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మైనార్టీ సంక్షేమ శాఖ 2014 అక్టోబర్ 10న జారీ చేసిన జీఓ ఎంఎస్.నం18ను పకడ్బందీగా అమలు చేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 22599 ఎకరాల వక్ఫ్ భూము లు ఉన్నాయని.. అయితే 16381 భూము లు మాత్రమే వక్ఫ్‌బోర్డు ఆధీనంలో ఉన్నాయని.. 6వేల ఎకరాలు కోర్టులు, లిటిగేషన్స్ ఆక్రమణల్లో ఉన్నట్లు తమ పరిశీలనలో వెల్లడైందన్నారు. ఆక్రమణదారులపై ఎలాంటి నోటీసులు లేకుండా కేసులు పెట్టాలని తెలిపారు.
వక్ఫ్ భూములను ఆక్రమించిన ముస్లిం అధికారులు, ముతవల్లీలను శిక్షిస్తే వారి మనోభావాలు దెబ్బతింటాయనే అపోహ ఉందన్నారు. వక్ఫ్ భూములను ఆక్రమించిన వారెవరినీ వదిలే ప్రసక్తే లేదన్నారు. అందరూ కలిసికట్టుగా వక్ఫ్ ఆస్తులను ముస్లిం అభివృద్ధికి సహకరించాలని తెలిపారు. వక్ఫ్ ఆస్తుల నుండి వచ్చే ఆదాయంలో 7 శాతం వక్ఫ్ పన్ను చెల్లించాలని, మిగిలిన 93 శాతం సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించవచ్చన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మైనార్టీ వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉన్నారని.. ముస్లిం యువతుల సామూహిక వివాహాలకు ఒక్కో యువతికి రూ.50 వేలు అందజేసే యోచనలో ఉన్నట్లు తెలిపారు. అదే విధంగా రోహిణి, దుకాన్, మకాన్ వంటి పథకాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు.
సమావేశంలో జిల్లా కలెక్టర్ విజయమోహన్, జేసీ హరికిరణ్, ఏజేసీ రామస్వామి, అదనపు ఎస్పీ శివకోటిబాబురావు, మైనార్టీ సంక్షేమ అధికారి షేక్షావలి, వక్ఫ్ బోర్డు ఇన్‌స్పెక్టర్లు.. వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం విలేకరుల సమావేశం కూడా నిర్వహించి వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. వక్ఫ్ ఆస్తులపై క్రయ, విక్రయాలు జరిపే హక్కు ఎవ్వరికీ లేదని.. ఇందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవన్నారను. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు పోలీసు, రెవెన్యూ యంత్రాంగం సమన్వయంతో పని చేయాలన్నారు.
ముస్లింల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
Published Fri, Apr 24 2015 2:56 AM | Last Updated on Sun, Sep 3 2017 12:45 AM
Advertisement
Advertisement