
భాయ్ చెప్పిన వారికే రుణాలు
మైనార్టీ సంక్షేమశాఖ అధికారుల వింత పోకడ
నాయకుడి చుట్టూతిరుగుతున్న ఆ శాఖ ఈడీ
మైనార్టీ సంక్షేమ శాఖ కార్యాలయంలో అధికారులు, సిబ్బంది వింత పోకడ అవలంబిస్తున్నారు. రుణాల మంజూరు తదితర పనుల కోసం కార్యాలయానికి వచ్చేమైనార్టీలకు అక్కడ సిబ్బంది చుక్కలు చూపిస్తున్నారు. ‘భాయ్’ సిఫార్సు ఉంటేనే పనులు చేస్తామనిఅంటున్నారని బాధితులు వాపోతున్నారు.
నెల్లూరు(సెంట్రల్): మైనార్టీ సంక్షేమ శాఖ కార్యాలయంలో ఈడీ ఎప్పుడు ఉంటారో తెలియని పరిస్థితి నెలకొంది. ఎప్పుడు చూసినా కార్పొరేషన్ కార్యాలయంలోని ‘భాయ్’చుట్టూ తిరుగుతుంటారని లేక పోతే హరనాథపురంలోని ‘భాయ్’ కార్యాలయంలో లేక ఇంటి వద్ద ఉంటారనే ఆరోపణలున్నాయి. ఏ పని అడిగినా ఆ నాయకుడి సిఫార్సు ఉందా అనే ప్రశ్నలు ముందు వస్తున్నాయని పలువురు వాపోతున్నారు. ఏ ఒక్క పార్టీకి అనుకూలంగా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారులు పనిచేయకూడదని, అర్హులైన అందరికీ రుణాలు మంజూరు చేయాలని అంటున్నారు.
దుకాన్-మకాన్ సంగతి మరిచారు
మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అర్హులైన పేద ముస్లింలకు ప్రభుత్వం దుకాన్, మకాన్ (సొంత ఇలు, అంగడి పెట్టుకునే విధానం)అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ప్రవేశపెట్టి ఏడాది దాటుతున్నా ఇంత వరకు ఏ ఒక్కరూ లబ్ధిపొందింది లేదు. అసలు ఈ పథకం ఏ స్థాయిలో ఉందనే విషయం కూడా అక్కడ అధికారులు చెప్పకపోవడం విమర్శలకు తావిస్తోంది.
రుణాల మంజూరులోనూ ఏకపక్షం
మైనార్టీలకు సంబంధించి 2015-16ఏడాదికి గాను మైనార్టీ శాఖ ద్వారా పేదలకు సబ్సిడీతో కూడిన రుణాలను మంజూరు చేయాల్సి ఉంది. ఈ ఏడాది కూడా పలువురు దరఖాస్తు చేసుకున్నారు. అర్హులైన వారి కి ఎక్కడా రుణాల మంజూరుకు అం గీకారం తెలిపినట్లు లేదు. అంతా ‘భాయ్’ చెప్పినవారికి కార్యాలయంలోనే ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు చేసి, కార్పొరేషన్ అధికారుల సంతకాలు పెట్టించి బ్యాంకులకు పంపినట్లు పెద్ద ఎత్తున విమర్శలున్నాయి. అసలు రుణాల మంజూరుకు ఎప్పుడు చివరి తేదీ అనేది కూడా అక్కడ పనిచేసే అధికారులు చెప్పడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు.
అంతా గుట్టుగా చేసుకుని వారి మనుషులకే అన్ని పథకాలు ఇస్తున్నారని పలువురు పేద మైనార్టీలు వాపోతున్నా రు. రుణాల మంజూరు విషయంలో మైనార్టీ సంక్షేమ శాఖ అధికారులు తీరు మార్చుకోకపోతే కార్యాలయం ఎదుట ధర్నా చేయాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఈడీ ఏ ఒక్క పార్టీకి సంబంధించి అధికారి కాదని అందరినీ సమానంగా చూసుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ఆయన తీరు మార్చుకోవాలని కోరుతున్నారు.