నిర్లక్ష్యానికి బాలింత బలి | doctors | Sakshi
Sakshi News home page

నిర్లక్ష్యానికి బాలింత బలి

Published Mon, Sep 12 2016 11:47 PM | Last Updated on Mon, Sep 4 2017 1:13 PM

నిర్లక్ష్యానికి బాలింత బలి

నిర్లక్ష్యానికి బాలింత బలి

  • చింతూరు ప్రభుత్వాస్పత్రిలో సంఘటన
  • టేకులూరు (వీఆర్‌పురం) :
    ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాలు శ్రేయస్కరమంటూ ఓ వైపు సర్కారు ప్రచారం చేస్తుంటే, అదే ఆస్పత్రిలో పురుడు పోయించుకున్న మహిళ.. వైద్య సిబ్బంది నిర్లక్ష్యానికి బలైపోయింది. చింతూరు ప్రభుత్వాస్పత్రిలో ఈ సంఘటన చోటుచేసుకుంది. మృతురాలి భర్త చాందల బుచ్చిరెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
    వీఆర్‌పురం మండలం కుందులూరు పంచాయతీ టేకులూరు గ్రామానికి చెందిన బుచ్చిరెడ్డికి, అదే గ్రామానికి చెందిన నాగమణి(28)కు 14 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరు వ్యవసాయ కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. పెళ్లయిన ఇన్నాళ్లకు ఆమె గర్భం దాల్చడంతో, ఆమె భర్తతో పాటు కుటుంబ సభ్యులు ఆనందపడ్డారు. నిండు గర్భిణి అయిన ఆమెకు ఆదివారం ఉదయం 5.30కు పురిటినొప్పులు వస్తుండడంతో, ఆమె భర్త 108కు సమాచారం అందించాడు. గ్రామానికి మధ్యలో రహదారి నిర్మిస్తుండడంతో, అంబులె¯Œæ్స గ్రామానికి 4 కి.మీ. దూరంలో ఉన్న కుందులూరు వద్ద నిలిచిపోయింది. అతికష్టంపై బంధువులు ఆమెను ఆటోలో అంబులె¯Œæ్స వరకూ తీసుకువెళ్లారు. అక్కడి నుంచి చింతూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఉదయం 7.30 సమయంలో ఆమె బిడ్డకు జన్మనిచ్చింది. అరగంట తర్వాత ఆమెకు తీవ్ర రక్తస్రావం కావడంతో, ఆందోళన చెందిన ఆమె భర్త ఈ విషయాన్ని ఆస్పత్రి సిబ్బందితో చెప్పాడు. ఏమీ కాదని, తర్వాత తగ్గిపోతుందని చెప్పి.. సాయంత్రం 4 వరకూ ఆమెను అక్కడే ఉంచేశారు. అనంతరం పరిస్థితి విషమంగా ఉందంటూ, ఆమెను మెరుగైన చికిత్సకు 108లో భద్రాచలం ఆస్పత్రికి పంపేశారు. అక్కడి ఆస్పత్రికి వెళ్లిన కొద్ది సమయానికే ఆమె మరణించింది. ఆమె మృతదేహాన్ని సోమవారం స్వగ్రామమైన టేకులూరుకు తరలించి, అంత్యక్రియలు నిర్వహించారు. కాగా తల్లి పాల కోసం ఆ పసిపాప గుక్కపెట్టి ఏడవడం చూపరులను కంటతడి పెట్టించింది.
     
    సిబ్బంది నిర్లక్ష్యం వల్లే..
    నా భార్య ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే చనిపోయింది. ప్రసవం అనంతరం తీవ్ర రక్తస్రావం అవుతోందని, చూడమని నర్సును అడిగితే,  పదేపదే నావెంట తిరుగుతావేంటి? రక్తస్రావం దానికదే తగ్గిపోతుందని చెప్పి పంపేసింది. మందులు ఆస్పత్రిలో లేకపోతే, బయటకు వెళ్లి కొనుక్కొస్తానని చెప్పినా ఆమె నా మాటలను పట్టించుకోలేదు.  – చాందల బుచ్చిరెడ్డి, మృతురాలి భర్త
     
    విచారణ చేపడతాం
    రక్తస్రావంతో బాలింత మరణించిన విషయమై విచారణ చేపడతాం. సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఇలా జరిగిఉంటే మాత్రం బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. – పవన్‌కుమార్, అడిషనల్‌ డీఎంహెచ్‌ఓ
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement