ఇండోనేషియా బాలీలో అగ్నిపర్వతం బద్దలవ్వడంతో బూడిద కమ్ముకుని పలు విమానాలు రద్దయ్యాయి. బాలీలోని ‘మౌంట్ లెవోటోబి లకీ-లకీ’ అనే అగ్నిపర్వతం రెండోసారి పేలడంతో దాదాపు 10 కిలోమీటర్ల(32,808 అడుగులు) ఎత్తులో దట్టంగా బూడిద కమ్ముకుందని అధికారులు తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో విమాన ప్రయాణాలు ప్రమాదకరమని చెప్పారు. దాంతో కొన్ని సంస్థలు తమ సర్వీసులను తాత్కాలికంగా నిలిపేసినట్లు పేర్కొన్నారు.
బాలీలోని ఈస్ట్ నుసా టెంగ్‌గారా ప్రావిన్స్‌లో ఉన్న మౌంట్ లెవోటోబి లకీ-లకీ అగ్నిపర్వతం నవంబర్ 3న మొదట విస్ఫోటనం చెందింది. తిరిగి మంగళవారం పలుమార్లు భారీ స్థాయిలో బద్దలవ్వడంతో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ వేదికగా ఇండిగో ప్రకటన విడుదల చేసింది. ‘బాలీలో ఇటీవలి అగ్నిపర్వతం విస్ఫోటనం చెందింది. దాంతో వాతావరణంలో భారీగా బూడిద మేఘాలు ఏర్పడ్డాయి. దానివల్ల ఆ ప్రాంతానికి వచ్చిపోయే విమానాలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నాం. ప్రయాణికుల అసౌకర్యానికి చింతిస్తున్నాం’ అని తెలిపింది. ఇండిగో సంస్థ బెంగళూరు నుంచి ఇండోనేషియా బాలీకి రోజువారీ సర్వీసు నడుపుతోంది.
ఢిల్లీ-ఇండోనేషియా మధ్య ప్రయాణించే రోజువారీ విమానాలను రద్దు చేస్తున్నట్లు ఎయిరిండియా ధ్రువీకరించింది. అంతర్జాతీయ విమానయాన సంస్థలు కూడా బుధవారం ఇండోనేషియాకు ప్రయాణించే విమాన ప్రయాణాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి.
ఇదీ చదవండి: గుడ్‌బై విస్తారా! విమాన సిబ్బంది భావోద్వేగ ప్రకటన
బాలీ నుంచి దాదాపు 800 కి.మీ దూరంలో ఈస్ట్ నుసా టెంగ్‌గారా ప్రావిన్స్‌లో నవంబర్ 3న లెవోటోబి లకీ-లకీ అగ్నిపర్వతం మొదట విస్ఫోటనం చెందింది. దానివల్ల తొమ్మిది మంది మరణించారు. తాజాగా మంగళవారం మళ్లీ పలుమార్లు విస్ఫోటనం చెందింది. మొదటిసారి ఘటన జరిగిన సమయంలో నవంబర్ 4 నుంచి 12 వరకు సింగపూర్, హాంకాంగ్, కొన్ని ఆస్ట్రేలియన్ నగరాల నుంచి బాలీకి ప్రయాణించే 80 విమానాలు రద్దు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment