చింతూరు,న్యూస్‌లైన్: పోలవరం ముంపు ప్రాంతాలను ఆంధ్రాలో కలిపే విషయంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన సంకేతాలు ఇవ్వకపోవడంతో ఏజెన్సీలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఏ ప్రాంతం ఏ వైపునకు వెళుతుందో తెలియని అయోమయ పరిస్థితి ఉండడంతో ప్రజలతో పాటు అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ముంపు గ్రామాలను ఎక్కడికి తరలిస్తారనే విషయంపై కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు స్పష్టత ఇవ్వకపోవడం మరింత అయోమయానికి దారితీస్తోంది.
పోలవరం ముంపు గ్రామాలు మా త్రమే ఆంధ్రాలో చేర్చుతామని కేంద్రం చెబుతోంది. ముంపు గ్రామాలనే పరిశీలిస్తే... మధ్య ప్రాంతం ఆంధ్రాలోకి వెళితే దానికి కుడి, ఎడమ ప్రాంతాలు యథావిధిగా తెలంగాణలోనే ఉండే పరిస్థితులు ఉన్నాయి. చింతూరు మండలంలోని గ్రామాలే ఇందుకు నిదర్శనం. ఇక్కడ శబరినదిపరివాహక గ్రామాలైన కుయిగూరు, కల్లేరు, చింతూరు, చూటూరు, ముకునూరు, నర్శింగపేట, తిమ్మిరిగూడెం, ఏజీకొడేరు, వులుమూరు, మల్లెతోట, చిడుమూరు, వీరాపురం, చట్టి, కుమ్మూరు గ్రామాలు ముంపు ప్రాంతం లో ఉండడంతో ఇవన్నీ ఆంధ్రాలో కలుస్తాయి.
ఈ గ్రామాలకు ఎడమ వైపున ముంపులో లేని తుమ్మల, సరివెల, ఏడుగురాళ్లపల్లి వంటి గ్రామాలు తెలంగాణలో ఉంటాయి...వీటికి ఎలాంటి ఇబ్బంది రాదు. అయితే చిక్కల్లా కుడివైపు గ్రామాలకే. ముంపులో లేని ఎర్రంపేట, తులసిపాక, మోతుగూడెం వంటి గ్రామాలు యథావిధిగా తెలంగాణలో ఉంటాయి. ఈగ్రామాలకు కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.
ప్రభుత్వ కార్యాలయాల సంగతేంటి?
మండల కేంద్రమైన చింతూరు గ్రామాన్ని పరిశీలిస్తే... ముంపులో వుంది కాబట్టి చింతూరును ఆంధ్రాలో కలుపుతారు. దీనికి కుడి వైపున కేవలం అరకిలోమీటరు దూరంలో వున్న ఎర్రంపేట ముంపు ప్రాంతంలో లేదు కాబట్టి దీనిని తెలంగాణలో ఉంచుతారు. మండలకేంద్రం ఆంధ్రాలోకి వెళితే ఇక్కడి ప్రభుత్వ కార్యాలయాలు కూడా మండల కేంద్రానికే చెందుతాయి. అయితే చింతూరుకు సంబంధించి ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఎర్రంపేట గ్రామంలోనే వున్నాయి. రెవెన్యూ, మండల పరిషత్, ఐకేపీ, ఎంఈవో, ఏపీఆర్‌ఎస్, ప్రభుత్వ కళాశాల, జీసీసీ వంటి కార్యాలయాలన్నీ ఎర్రంపేటలోనే వున్నాయి. దీనివలన పరిపాలనా పరంగా మున్ముందు చాలా ఇబ్బందులు తలెత్తుతాయని అధికారులు వాపోతున్నారు.
రవాణాకు కూడా ఇబ్బందే:
మరోవైపు రవాణా పరంగా చూసుకుంటే ఆంధ్రాలోని రాజమండ్రి నుంచి చింతూరుకు రావాలంటే.... చింతూరుకు ముందు భాగంలో వున్న తెలంగాణకు చెందిన తులసిపాక, ఎర్రంపేటలను దాటుకుని ఆంధ్రాకు చెందిన చింతూరుకు రావాల్సి వుంటుంది. ఈ గ్రామాలకు చెందిన ప్రజలు భద్రాచలం వంటి పట్టణాలకు వెళ్లాలంటే ఆంధ్రాలో కలిసిన చింతూరు, చట్టిని దాటుకుని ప్రయాణించాల్సి వుంటుంది.
మరోవైపు ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల సరిహద్దులను ఆనుకుని వున్న చింతూరు మండలం పోలవరం ముంపునకు గురైతే ఆయా రాష్ట్రాలకు వెళ్లేందుకు కూడా రవాణాపరంగా ఇబ్బందులు తప్పవు. మధ్య ప్రాంతంలో వున్న గ్రామాలు ముంపునకు గురైతే ముంపునకు గురికాని గ్రామాల నుంచి రవాణా సౌకర్యం కోసం రహదారులు ఎలా నిర్మిస్తారనేది ప్రభుత్వం ఇంతవరకు స్పష్టం చేయలేదు.
గ్రామాలను ఎక్కడికి తరలిస్తారు:
పోలవరం ముంపునకు గురవుతున్న చింతూరు మండలంలోని గ్రామాలను ఎక్కడికి తరలిస్తారనే విషయంపై కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు స్పష్టం చేయకపోవడంతో ముంపు గ్రామాల ప్రజల్లో ఆందోళన నెలకొంది. దశాబ్దాలుగా ఇక్కడి ప్రకృతితో మమేకమై జీవిస్తున్న తమను వేరే ప్రాంతాలకు తరలిస్తే అక్కడి వాతావరణానికి అలవాటు పడాలంటే చాలా కష్టమని, పూర్తిస్థాయిలో అన్ని రకాల మౌళిక సౌకర్యాలు కల్పిస్తారో లేదోనని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ ఎలా ఇస్తారనే విషయమై చింతూరు మండలంలోని ముంపు గ్రామాలకు చెందిన సుమారు 13 వేల మందిలో ఆందోళన రేకెత్తిస్తోంది.
అంతా తికమక...
Published Sat, Feb 15 2014 2:24 AM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM
Advertisement