చింతూరు, న్యూస్‌లైన్: ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టు తెలంగాణ కమిటీ పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆంధ్రా, ఛత్తీస్‌గఢ్, ఒడిశా సరిహద్దుల్లో పోలీసు బలగాలు ముమ్మరంగా కూంబింగ్ సాగిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అగ్ర నేత ఒకరు ఇటీవల ఆంధ్రా, ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో సమావేశం నిర్వహించినట్టు ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారమందింది. ఎన్నికల బహిష్కరణకు మావోయిస్టుల పిలుపు, పోలీసుల ముమ్మర కూంబింగ్‌తో ఎప్పుడేం జరుగుతుందోనని సరిహద్దుల్లోని పల్లెలు బిక్కుబిక్కుమంటున్నాయి.
గత నెల 10న సరిహద్దునగల చత్తీస్‌గఢ్‌లోని బస్తర్ లోక్‌సభ ఎన్నికల సమయంలో మావోయిస్టులు భారీ దాడులకు పాల్పడ్డారు. బీజాపూర్ జిల్లాలో జరిగిన మావోయిస్టుల దాడిలో ఏడుగురు ఎన్నికల సిబ్బంది మృతిచెందారు. బస్తర్ జిల్లాలో జరిగిన దాడిలో ఎనిమిదిమంది పోలీసులు బలయ్యారు.
ఇటువంటి దాడులే తెలంగాణ ఎన్నికల్లో కూడా జరగవచ్చని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి.
స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు మావోయిస్టులు చింతూరు మండలంలో హల్‌చల్ సృష్టించారు. శబరి ఏరియా కమిటీ ఆధ్వర్యంలో మండలంలోని తుమ్మల గ్రామానికి చెందిన సీపీఎం నాయకుడు పట్రా ముత్యంను హత్య చేశారు. బుర్కనకోట వద్ద రహదారి పనుల కోసం ఉంచిన తారు డ్రమ్ములను ధ్వంసం చేశారు.
చింతూరు మండలంలోని నారకొండ, అల్లిగూడెం, పేగ, ఏడుగురాళ్లపల్లి, తుమ్మల, సరివెల, చిడుమూరు, సుద్దగూడెం పోలింగ్ కేంద్రాలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో ఉన్నాయి. దీనిలో, నారకొండ పోలింగ్ కేంద్రాన్ని అధికారులు ఇప్పటికే అల్లిగూడెం గ్రామానికి మార్చారు. నారకొండ, అల్లిగూడెం, పేగ పోలింగ్ కేంద్రాలకు వెళ్లాల్సిన సిబ్బందిని మంగళవారం రాత్రి ఏడుగురాళ్లపల్లిలోనే నిలిపేసినట్టు తెలిసింది. వీరిని బుధవారం ఉదయం పోలింగ్ సమయానికి ఆయా కేంద్రాలకు చేర్చే అవకాశముంది.
పోలింగు కేంద్రాలపై డేగ కన్ను
దుమ్ముగూడెం: నేటి ఎన్నికలకు మావోయిస్టుల నుంచి ఎటువంటి ఆటంకాలు ఎదురవకుండా చూసేందుకు ఆంధ్రా-చత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో సీఆర్‌పీఎఫ్, కోబ్రా, గ్రేహౌండ్స్, ప్రత్యేక పోలీసు బలగాలు మోహరించాయి. ‘బూటకపు ఎన్నికలను బహిష్కరించా’లని మావోయిస్టులు పదే పదే హెచ్చరించడంతో సరిహద్దుల్లోని పోలింగ్ కేంద్రాలపై పోలీసులు డేగ కన్ను వేశారు, గిరిజన గ్రామాల్లో పోలింగ్ శాతం పెంచడం ద్వారా మావోయిస్టుల హెచ్చరికలను తిప్పికొట్టేందుకు పోలీసులు యత్నిస్తున్నారు.
నాలుగు రోజుల కిందట.. దుమ్ముగూడెం మండలానికి ఆనుకుని ఉన్న చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుకుమా జిల్లా కుంట బ్లాక్ పరిధిలోగల గొల్లపల్లి పోలీస్ స్టేషన్ అటవీ ప్రాంతంలో ఎడ్లపాడు వద్ద పదిమందితో కూడిన సంతోష్ దళం ఉందన్న సమాచారంతో పోలీసులు దాడికి యత్నించారు. ఆ దళం తప్పించుకుని పరారైంది. సంతోష్‌కు చెందిన 9 ఎంఎం పిస్టల్, మందులు, ఇతర సామగ్రిని పోలీసులు స్వాధీనపర్చుకున్నారు.
ఎన్నికల బహిష్కరణ పిలుపుతో విధ్వంసానికి దిగేందుకే సంతోష్ దళం ఈ ప్రాంతానికి వచ్చినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. మావోయిస్టులు ఈ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తుండవచ్చని భావించిన పోలీసులు కూంబింగ్ సాగిస్తున్నారు.
మావోయిస్టుల కొరియర్లు, సానుభూతిపరులుగా భావిస్తున్న వారిపై పోలీసులు ఓ కన్నేశారు. మంగళ, బుధవారాలలో చత్తీస్‌గఢ్ వారపు సంతలను నిలిపేశారు. కొందరు సంత వ్యాపారులను, మావోయిస్టుల కొరియర్లగా అనుమానిస్తున్న వారిని సరిహద్దుల్లోగల పోలింగ్ కేంద్రాల వద్ద ‘పహారా’ కాసేందుకు నియమించారు. వారి కదలికలపై పోలీసులు డేగ కన్ను వేశారు.
సరిహద్దుల్లో టెన్షన్, టెన్షన్
Published Wed, Apr 30 2014 2:19 AM | Last Updated on Tue, Oct 9 2018 2:47 PM
Advertisement