పట్టుబడిన గంజాయి, నిందితుడిని చూపిస్తున్న డీఎస్పీ, పోలీసులు
సాక్షి, చింతూరు (రంపచోడవరం) : ఆంధ్రా నుంచి కర్నాటకకు అక్రమంగా తరలిస్తున్న 900 కిలోల గంజాయిని గురువారం చింతూరు పోలీసులు పట్టుకున్నారు.చింతూరు మండలం చట్టిలో ఏర్పాటు చేసిన ఎన్నికల చెక్ పోస్టు వద్ద తనిఖీల్లో భాగంగా ఈ గంజాయి పట్టుబడింది. దీనిపై చింతూరు డీఎస్పీ దిలీప్‌కిరణ్ మీడియాకు వివరాలు వెల్ల డించారు.
లారీలో గంజాయి అక్రమ రవాణా జరుగుతుందనే సమాచారం మేరకు చింతూరు సీఐ వెంకటేశ్వరరావు, ఎస్‌ఐ శ్రీనివాస్‌కుమార్ చట్టిలో చెక్‌పోస్టు వద్ద తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో చింతూరు వైపు నుంచి భద్రాచలం వైపునకు వెళుతున్న మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ కలిగిన ఓ లారీని తనిఖీ చేయగా 25 కేజీల చొప్పున ప్యాక్ చేసి ఉన్న 36 ప్లాస్టిక్ సంచుల్లోని 900 కిలోల గంజాయి లభ్యమైందని డీఎస్పీ వివరించారు.
ఈ సందర్భంగా కర్నాటక రాష్ట్రం బీదర్ జిల్లాకు చెందిన లారీ డ్రైవర్ మహ్మద్ రియాజ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా రాజు అనే వ్యక్తి వద్ద తాను డ్రైవర్‌గా పనిచేస్తున్నానని తెలిపాడు. తాను, రాజు కలసి విశాఖ జిల్లా దారకొండలో గంజాయిని కొనుగోలు చేసి జిప్సమ్ అడుగున లారీలో లోడ్ చేశామని తెలిపాడు. గంజాయి లోడు లారీని కర్నాటకకు తీసుకురావాలని చెప్పి తన ఓనర్ రాజు బస్సులో వస్తానని చెప్పాడని డ్రైవర్‌లో విచారణలో వెల్లడించాడని డీఎస్పీ తెలిపారు.
పట్టుబడిన గంజాయి విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.27 లక్షలు ఉంటుందని, దానికి పంచనామా నిర్వహించి లారీని సీజ్ చేసి డ్రైవర్ రియాజ్‌ను అరెస్టు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఆర్పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ పోలినాయుడు, మోతుగూడెం రేంజర్ ఉషారాణి, చెక్‌పోస్టు ఇన్‌చార్జి భాస్కర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment