'వారిని పట్టించుకోకుండా ఏం అభివృద్ధి?'
హైదరాబాద్: తెలంగాణలో 10 శాతం ఉన్న గిరిజనులను పట్టించుకోకుండా రాష్ట్రాభివృద్ధి ఎలా సాధ్యమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఈమేరకు ఆయన ఆదివారం లేఖ రాశారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి రెండున్నరేళ్లు దాటుతున్నా గిరిజనుల జీవితాల్లో మార్పేమీ రాలేదన్నారు. 2014లో ఎన్నికల సందర్భంగా గిరిజనులకు ఇచ్చిన హామీలు అమలుకాలేదన్నారు. జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు, పోడు భూములకు పట్టాలు, 500 జనాభా ఉన్న గిరిజన గ్రామాలను పంచాయతీలుగా మార్పు, ఉట్నూర్‌లో సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి, ఆదివాసీ గిరిజనులు సేకరించే అటవీ ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం, గిట్టుబాటు ధరలు వంటి హామీలు అమలుకు నోచుకోలేదని తమ్మినేని లేఖలో పేర్కొన్నారు.